Business

పసిడి మరింత ప్రియం

పసిడి మరింత ప్రియం

ఇప్పటికే అర లక్ష దాటిన బంగారం మరింత ప్రియమైంది. కేంద్ర ప్రభుత్వం బంగారంపై దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచడమే ఇందుకు కారణం. దేశంలోకి పెరుగుతున్న బంగారం దిగుమతులతో పాటు కరెంట్‌ ఖాతా లోటు (క్యాడ్‌)ను కట్టడి చేసేందుకు ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. పెరిగిన సుంకం జూన్‌ 30 నుంచే అమలులోకి వచ్చింది. ఇప్పటివరకు బంగారంపై బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ 7.5 శాతంగా ఉండేది. దానిపై 2.5 శాతం వ్యవసాయ మౌలిక అభివృద్ధి సెస్‌ (ఏఐడీసీ), 0.75 శాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జ్‌ కలిపి మొత్తం పన్ను భారం 10.75 శాతంగా ఉండేది. బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీని 7.5 శాతం నుంచి 12.5 శాతానికి పెంచిన కేంద్ర ప్రభుత్వం.. 0.75 శాతం సామాజిక సంక్షేమ సర్‌చార్జీని మినహాయించింది. దాంతో 12.5 శాతం బేసిక్‌ కస్టమ్స్‌ డ్యూటీ, 2.5 శాతం ఏఐడీసీతో కలిపి మొత్తం సుంకం 15 శాతానికి చేరుకుంది. మళ్లీ దీనిపై 3 శాతం జీఎ్‌సటీ అదనం. సుంకం పెంపు ప్రభావంతో దేశీయంగా తులం పసిడి ధర రూ.2,000 వరకు పెరగవచ్చని రెలిగేర్‌ బ్రోకింగ్‌ కమోడిటీ, కరెన్సీ రీసెర్చ్‌ విభాగ వైస్‌ ప్రెసిడెంట్‌ సుగంధ సచ్‌దేవ అంచనా వేశారు.
ఒక్కసారిగా పెరిగిన దిగుమతులు పసిడి దిగుమతులు పెరగడంతో విదేశీ మారక నిల్వలు తరిగిపోతున్నాయని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. దేశంలోకి పసిడి దిగుమతులు ఒక్కసారిగా పెరిగాయని గణాంకాలు చెబుతున్నాయి. మే నెలలో 107 టన్నుల బంగారం దిగుమతి కాగా.. జూన్‌లోనూ భారీగానే దిగుమతైంది. తత్ఫలితంగా రూపాయి మారకం రేటుపై ఒత్తిడి పెరగడంతో పాటు ఫారెక్స్‌ నిల్వలు తరిగిపోతుండటంతో కరెంట్‌ ఖాతా లోటు కూడా పెరుగుతోందని మంత్రి అన్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి 25 నుంచి ఆర్‌బీఐ వద్దనున్న విదేశీ మారక నిల్వలు 4,094 కోట్ల డాలర్ల మేర తరిగిపోయాయి. గడిచిన ఆర్థిక సంవత్సరానికి (2021-22) జీడీపీలో 1.2 శాతానికి పరిమితమైన క్యాడ్‌.. ఈ ఆర్థిక సంవత్సరం (2022-23)లో 3 శాతానికి పెరగవచ్చని అంచనా.బంగారం వినియోగంలో భారత్‌ నం.2ప్రపంచంలో చైనా తర్వాత భారత్‌ అతిపెద్ద బంగారం వినియోగదారు. దేశీయ అవసరాలు దాదాపు దిగుమతుల ద్వారానే సమకూరుతాయి. ఎందుకంటే, దేశీయంగా పసిడి ఉత్పత్తి చాలా తక్కువ. రీసైక్లింగ్‌ వాటా కూడా స్వల్పమే. 2021 ఏప్రిల్‌ నుంచి 2022 ఫిబ్రవరి కాలానికి దేశంలోకి 842.28 టన్నుల బంగారం దిగుమతైంది.

*గోల్డ్‌ స్మగ్లింగ్‌ పెరుగుతుంది:
ఇండస్ట్రీ వర్గాలు సుంకం పెంపుతో దేశంలోకి బంగారం అక్రమ రవాణా (స్మగ్లింగ్‌) జోరందుకుంటుందని ఆభరణ వర్తక, బులియన్‌ ఇండస్ట్రీ వర్గాలంటున్నాయి. ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని కోరాయి. రూ.లక్ష కోట్లకు ఎస్‌బీఐ గోల్డ్‌ లోన్‌ పోర్ట్‌ఫోలియో దేశీయ బ్యాంకింగ్‌ దిగ్గజం ఎస్‌బీఐ ఇప్పటివరకు జారీ చేసిన పసిడి రుణాలు తొలిసారిగా రూ.లక్ష కోట్ల మైలురాయికి చేరుకున్నాయి. గోల్డ్‌ లోన్స్‌ విషయంలో ఎస్‌బీఐ 24 శాతం మార్కెట్‌ వాటా కలిగి ఉంది. భవిష్యత్‌లో ఈ రుణాల వృద్ధిపై బ్యాంక్‌ అత్యంత ఆశావహంగా ఉంది. రూ.1,088 పెరిగిన పసిడి దిగుమతి సుంకం పెంపు కారణంగా శుక్రవారం ఢిల్లీ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి (24 క్యారెట్లు) బంగారం ధర ఏకంగా రూ.1,088 పెరిగి రూ.51,458కి చేరుకుంది. కిలో వెండి రేటు మాత్రం రూ.411 మేర తగ్గి రూ.58,159కి పరిమితమైంది. సాధారణంగా అంతర్జాతీయ మార్కెట్లో హెచ్చుతగ్గులకు అనుగుణంగానే దేశీయంగా ఈ విలువైన లోహాల ధరలు మారుతుంటాయి. ఇంటర్నేషనల్‌ మార్కెట్లో బంగారం, వెండి గణనీయంగా తగ్గినప్పటికీ, దిగుమతిత సుంకం పెరిగిన కారణంగా దేశీయంగా రేట్లు పెరిగాయని బులియన్‌ మార్కెట్‌ వర్గాలు తెలిపాయి. అంతర్జాతీయంగా ఔన్స్‌ (31.10 గ్రాములు) గోల్డ్‌ 1,795 డాలర్లు, సిల్వర్‌ 19.75 డాలర్లకు దిగివచ్చాయి.