Movies

అక్కినేని గొంతుకు సూట్‌ అవలేదన్నారు

అక్కినేని గొంతుకు సూట్‌ అవలేదన్నారు

అలనాటి అగ్ర కథానాయకుడు అక్కినేని నాగేశ్వరరావుకు ‘ఇద్దరు అమ్మాయిలు’ చిత్రంలో తొలిసారిగా బాలసుబ్రహ్మణ్యం ప్లేబ్యాక్‌ పాడారు. కన్నడంలో విడుదలైన ‘కప్పు బిలుపు’ చిత్రం ఆధారంగా ‘ఇద్దరు అమ్మాయిలు రూపుదిద్దుకొంది. అక్కినేని, శోభన్‌బాబు హీరోలుగా నటించిన ఈ సినిమాలో వాణిశ్రీ ద్విపాత్రాభియనం చేశారు. పుట్టన్న కణగల్‌ దర్శకుడు. ఈ సినిమా కోసం ‘నా హృదయపు కోవెలలో.. నా బంగరు లోగిలిలో’ అంటూ దాశరథి ఓ పాట రాశారు. కె.వి. మహదేవన్‌ సంగీత దర్శకుడు. ఈ పాట ఘంటసాల పాడాలి. ఆ సమయంలో ఆయనకు ఆరోగ్యం కాస్త దెబ్బ తినడంతో ఎస్పీ బాలసుబ్రహ్మణ్యంతో ట్రాక్‌ పాడించారు. తర్వాత ఘంటసాల వాయిస్‌ మిక్స్‌ చేద్దామనుకున్నారు. ఇంతలో షూటింగ్‌ డేట్‌ దగ్గర పడడంతో బాలు పాడిన పాటనే అక్కినేనిపై చిత్రీకరించారు. షూటింగ్‌ అయ్యాక కూడా ఘంటసాల వాయిస్‌ మిక్స్‌ చేయాలనుకోవడం, ఏదో ఒక అవాంతరం వచ్చి వాయిదా పడడం జరిగేది. చివరకు బాలు పాడిన పాటనే సినిమాలో ఉంచేసి రిలీజ్‌ చేశారు. ట్రాక్‌ కోసమే కదా అని మాములుగా పాడేశారు బాలు. తను పాడిన పాటనే సినిమాలో ఉంచుతారని ఆయనకు ముందే తెలిస్తే ఆయనలా పాడడానికి ప్రయత్నించేవారేమో!. అందుకే ఎలాంటి గిమ్మిక్కులు లేని ఆ పాటను విని ‘అబ్బే.. బాలు గొంతు నాగేశ్వరరావుకు సూట్‌ కాలేదు’ అనేశారు ప్రేక్షకులు. అసలు విషయం ఇదీ!