Politics

యశ్వంత్ సిన్హా గెలుస్తారన్న నమ్మకం నాకు ఉంది

యశ్వంత్ సిన్హా గెలుస్తారన్న నమ్మకం నాకు ఉంది

మంచితనం, నిజాయితీతో కూడిన వ్యక్తి యశ్వంత్ సిన్హా అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. జలవిహార్‌లో యశ్వంత్ సిన్హా ప్రచార మీటింగ్‌‌లో సీఎం పాల్గొని ప్రసంగించారు. సిన్హాకు తెలంగాణ ప్రభుత్వం, ప్రజల తరపున స్వాగతం అని అన్నారు. యశ్వంత్ సిన్హా గెలుస్తారన్న నమ్మకం తనకు ఉందని ధీమా వ్యక్తం చేశారు. అన్ని రంగాల్లో యశ్వంత్‌కు విశేష అనుభవం ఉందన్నారు. ఇప్పటికే దేశానికి అత్యుత్తమ సేవలు అందించారని కొనియాడారు. ఆర్థిక, విదేశాల మంత్రిగా చేసిన అనుభవం ఉందన్నారు. ఆత్మప్రబోధానుసారం ఓటు వేయాలని కోరారు. సిన్హా లాంటి వ్యక్తి గెలిస్తే దేశ ప్రతిష్ఠ మరింత పెరుగుతుందని సీఎం చెప్పుకొచ్చారు.

***ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా మోదీ వ్యవహారం…
కేంద్రంలోని ప్రస్తుత ప్రభుత్వానివి ప్రజావ్యతిరేక విధానాలని విమర్శించారు. రైతులు, యువత, నిరుద్యోగులు మీకు ఉగ్రవాదుల్లా కనిపిస్తున్నారా అని మండిపడ్డారు. మోదీ తనను మించిన మేధావి లేరనుకుంటున్నారని అన్నారు. బీజేపీ సమావేశాల్లో విపక్షాలపై తప్పుడు ప్రచారం చేయబోతున్నారని, తమపై చీల్చి చెండాడటానికి మోదీ రెడీ అవుతున్నారని తెలిపారు. ప్రసంగాలు కాదు.. తమ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని సీఎం డిమాండ్ చేశారు. దేశంలో గుణాత్మక మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. పెట్రో సహా అన్నిటిపై ధరలు పెంచారన్నారు. సాగు చట్టాలపై రైతులు ఉద్యమించాల్సి వచ్చిందని, ఉద్యమిస్తున్న రైతులను జీపులతో తొక్కించారని అన్నారు. సాగుచట్టాలు సరైనవే అయితే ఎందుకు వెనక్కి తీసుకున్నారని ప్రశ్నించారు. ఎన్నికల హామీలను మోదీ సర్కార్ విస్మరించిందన్నారు. టార్చిలైట్ వేసుకుని చూసినా మోదీ నెరవేర్చిన హామీ కనబడదని తెలిపారు. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని మోదీ హామీ ఇచ్చారని… అయితే రైతుల ఖర్చును రెట్టింపు చేశారని విమర్శించారు. శ్రీలంక పరిస్థితులను ప్రపంచం అంతా చూస్తోందన్నారు. మోదీ ప్రధానిలా కాకుండా సేల్స్‌మెన్‌లా వ్యవహరిస్తున్నారని, కేంద్ర వ్యవస్థలను దుర్వినియోగం చేస్తున్నారని సీఎం కేసీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు.