DailyDose

“తెదేపా శ్రేణులను హింసిస్తున్నారు..” డీజీపీకి చంద్రబాబు లేఖ -TNI తాజా వార్తలు

“తెదేపా శ్రేణులను హింసిస్తున్నారు..” డీజీపీకి చంద్రబాబు లేఖ  -TNI  తాజా వార్తలు

*సామాజిక మాధ్యమాల్లో పోస్టులు పెడుతున్న వారిపై సీఐడీ వేధింపులను ఖండిస్తూ డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డికి తెలుగుదేశం అధినేత చంద్రబాబు లేఖ రాశారు. గార్లపాటి వెంకటేశ్వరరావు, మోకర్ల సాంబశివరావులను అక్రమంగా అదుపులోకి తీసుకుని సీఐడీ వేధించిందని లేఖలో పేర్కొన్నారు. అర్ధరాత్రి గోడలు దూకి.. తలుపులు పగలగొట్టి .. నోటీసుల పేరుతో బెదిరించారని మండిపడ్డారు. కుటుంబ సభ్యులను భయబ్రాంతులకు గురిచేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి స్టేషన్‍లో బట్టలు లేకుండా కూర్చోబెట్టి బాధితులపై దాడికి పాల్పడం దారుణమని ఆక్షేపించారు. విచారణ సమయంలో సుప్రీంకోర్టు తీర్పునకు విరుద్ధంగా సీఐడీ వ్యవహరించిందన్నారు.

*విజయవాడలో జనవాణి కార్యక్రమం ప్రారంభించిన పవన్.. ప్రజా సమస్యలు స్వయంగా తెలుసుకున్నారు. నేతలు అధికారం ఉంటేనే సమస్యల పరిష్కారం అంటే కుదరదన్నారు. పదవి లేకపోయినా సమాజంలో ఇబ్బందులపై దృష్టి సారిస్తామన్నారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ప్రజల నుంచి పవన్ కల్యాణ్ స్వయంగా అర్జీల స్వీకరించారు.

*హెచ్‌ఐసీసీలో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు ముగిశాయి. రెండు రోజుల పాటు సమావేశాలు సాగాయి. ఈ సమావేశాల్లో బీజేపీ జాతీయ, రాష్ట్రీయ నేతలు పాల్గొన్నారు. ప్రధాని మోదీతో పాటు కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, కేంద్రమంత్రులు, పలు రాష్ట్రాల సీఎంలు పాల్గొన్నారు. దేశ ఆర్థిక వ్యవస్థ, అభివృద్ధి, రాజకీయ తీర్మానాలపై చర్చించారు. పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. వచ్చే ఎన్నికలే లక్ష్యంగా బీజేపీ నేతలకు దిశానిర్దేశం చేసినట్లు తెలుస్తోంది. తెలంగాణలో అధికారం చేపట్టాలనే లక్ష్యంతో జాతీయ, రాష్ట్ర బీజేపీ నేతలు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగానే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించారని పలువురు రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

*ప్రముఖ పుణ్యక్షేత్రమైన కొమురవెల్లి శ్రీ మల్లికార్జున స్వామి వారి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. మల్లన్న స్వామి మమ్మేలు స్వామి అంటూ భక్తుల నామస్మరణలతో శైవక్షేత్రం పులకరించింది. మల్లన్నను సుమారు 10 వేల మంది భక్తులు దర్శించుకొని మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ వర్గాలు తెలిపాయి.శనివారం సాయంత్రం నుంచే కొమురవెల్లికి చేరుకున్న భక్తులు ఆదివారం స్వామి వారిని దర్శించుకోవడంతో పాటు అభిషేకాలు, పట్నాలు, అర్చన, ప్రత్యేక పూజలు, ఒడి బియ్యం, కేశఖండన, గంగరేగు చెట్టు వద్ద ముడుపులు కట్టడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు.

*స‌ర‌ఫ‌రాదారులు అత్యంత నాణ్యమైన వంట‌స‌రుకులు, ఇత‌ర వ‌స్తువుల‌ను టీటీడీకి స‌ర‌ఫ‌రా చేయాల‌ని ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి కోరారు. తిరుప‌తిలోని శ్వేత భ‌వ‌నంలో స‌ర‌ఫ‌రాదారుల‌తో ఈవో స‌మావేశం నిర్వహించారు.శ్రీ‌వారి ద‌ర్శనార్థం ల‌క్షలాది మంది భ‌క్తులు వస్తున్నారని, వీరి సౌక‌ర్యార్థం ల‌డ్డూ ప్రసాదం, అన్నప్రసాదాల త‌యారీకి వినియోగించే స‌రుకులు, పూజాసామ‌గ్రి త‌దిత‌ర అన్ని వ‌స్తువులు నాణ్యంగా ఉండాల‌న్నారు.

*టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సీఎం జగన్‌ను తీవ్ర స్థాయిలో విమర్శించారు. వైసీపీ కార్యకర్తలకు వలంటీర్లుగా ఉద్యోగాలిచ్చి జన ధనం వృథా చేస్తున్నారని ఆరోపించారు.

*ప్యారిస్ప ర్యటన ముగించుకొని సీఎం జగన్ మోహన్‌రెడ్డి దంపతులు గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయా నికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్‌పోర్టులో సీఎం జగన్ దంపతులకు మంత్రి జోగి రమేష్ , సీఎస్ తలశిల రఘురాం తదితరులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్‌పోర్టు నుంచి రోడ్డు మార్గాన నేరుగా తాడేపల్లి నివాసానికి సీఎం జగన్ దంపతులు బయలుదేరారు.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. అన్ని కంపార్ట్‌మెంట్లు నిండి క్యూ వెలుపలికి వచ్చింది. శనివారం శ్రీవారిని 88,026 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. శ్రీవారి సర్వదర్శనానికి 15 గంటల సమయం పడుతోంది. నిన్న స్వామివారి హుండీ ఆదాయం రూ.4.34 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం వెల్లడించింది. 50,652 మంది భక్తులు శ్రీవారికి తలనీలాలు సమర్పించారు.

*బీజేపీ ఫ్లెక్సీల కు జీహెచ్ఎంసీ భారీగా పెనాల్టీ వేస్తోంది. ఇప్పటివరకు 20 లక్షలకు పైగా జరిమానాలు విధించింది. ట్విట్టర్‌ లో వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా జీహెచ్ఎంసీ ఫైన్లు వేస్తోంది. టీఆర్ఎస్ ఫ్లెక్సీల కు మూడు లక్షల రూపాయలు పెనాల్టీలు వేసింది. జీహెచ్ఎంసీ ట్విటర్ ఖాతాకు ఫ్లెక్సీలపై ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. ఈ రోజు వచ్చిన ఫిర్యాదులపై రేపు జరిమానాలు జారీ చేస్తామని జీహెచ్ఎంసీ ఎన్ఫోర్స్‌మెంట్ వెల్లడించింది.

*ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రి యోగీ ఆదిత్యనాథ్‌ చార్మినార్‌ భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకున్నారు. హైదరాబాద్‌లో జరుగుతున్న బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొన్న సీఎం యోగీ.. ఆదివారం ఉదయం భాగ్యలక్ష్మి ఆలయానికి చేరుకున్నారు. అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గతంలో మొక్కు ఉన్నందుకు సీఎం యోగీ అమ్మవారి ఆలయానికి వచ్చారని బీజేపీ నేతలు వెల్లడించారు. కాగా, యూపీ సీఎం పర్యటన నేపథ్యంలో చార్మినార్‌ పరిసరాల్లో పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. పెద్ద సంఖ్యలో పోలీసులను మోహరించారు.

*పవిత్రమైన తిరుమల వాతావరణం కలుషితం కాకుండా చేయడం మా ధర్మం’ అని డీఆర్డీవో చైర్మన్‌ సతీ్‌షరెడ్డి అన్నారు. శనివారం ఉదయం వీఐపీ బ్రేక్‌ సమయంలో ఆయన తిరుమల శ్రీవేంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. వేదపండితులు ఆశీర్వదించగా ఈవో ధర్మారెడ్డి లడ్డూప్రసాదాలు అందజేశారు. అనంతరం ఆయన లడ్డూకౌంటర్‌ వద్ద డీఆర్డీవో ఆధ్వర్యంలో నడుస్తున్న బయోడిగ్రేడబుల్‌ కవర్ల విక్రయకేంద్రాన్ని పరిశీలించారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. గతంలో భక్తులు లడ్డూలను తీసుకెళ్లేందుకు ప్లాస్టిక్‌ బ్యాగులను వినియోగించేవారన్నారు. వీటి వల్ల వాతావరణ కాలుష్యం పెరుగుతున్న క్రమంలో టీటీడీ సహకారంతో మూడునెలల్లో వాతావరణంలో కలిసిపోయేలా డీఆర్డీవో ఆధ్వర్యంలో బయోడిగ్రేడబుల్‌ బ్యాగులను ప్రవేశపెట్టామన్నారు. ప్రస్తుతం తిరుమలలో అందరూ ఈ బ్యాగులను వినియోగిస్తున్నారని తెలిపారు. అన్నప్రసాద భవనంలో వినియోగించే ప్లేట్లు, గ్లాసులు కూడా బయోడిగ్రేడబుల్‌ చేస్తే బాగుంటుందని టీటీడీ ఈవో ధర్మారెడ్డి కోరారని, ఆ పనిలో తమ శాస్త్రవేత్తలు నిమగ్నమై ఉన్నారన్నారు. కొద్దిరోజుల్లోనే తాము తయారుచేసిన వాటిని తిరుమలకు తీసుకువచ్చి టీటీడీకి చూపిస్తామన్నారు. టీటీడీ వాటిని అంగీకరిస్తే ప్రవేశపెట్టేందుకు ప్రణాళిక రూపొందిస్తామన్నారు.

*‘ఆంధ్రప్రదేశ్‌ను నట్టేట ముంచిన మోసకారి మోదీని ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి ఏపీకి ఎలా స్వాగతిస్తారు? సిగ్గుండాలి’ అని పీసీసీ అధ్యక్షుడు సాకే శైలజానాథ్‌ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అనంతపురంలోని డీసీసీ కార్యాలయంలో శనివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 4వ తేదీన ప్రధాని నరేంద్ర మోదీ భీమవరానికి వస్తున్నాడని ప్రకటించారని, ఏపీని తీవ్రంగా మోసగించిన మోదీ.. ఏ ముఖం పెట్టుకుని వస్తారని ప్రశ్నించారు. జగన్‌ తన వ్యక్తిగత అజెండాను పక్కనపెట్టి భీమవరం సభా వేదికపైనే.. ఏపీకి జరిగిన అన్యాయ్యాన్ని సీఎం జగన్‌ ప్రశ్నించాలని, న్యాయం జరిగేవరకు తిరిగి వెళ్లనివ్వకుండా మోదీని అడ్డుకోవాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్రం సర్వనాశనం కావడానికి మోదీ, జగన్‌ కారణమని ఆరోపించారు. రాష్ట్ర ప్రజలు ఈ రాజకీయ ఎత్తుగడలను గుర్తించాలని కోరారు. ప్రధాని మోదీని రాష్ట్రంలో అడుగు పెట్టనీయకుండా ఎక్కడికక్కడ అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా 4న, 7న విజయవాడలో పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపడతామన్నారు.

*అల్లూరి సీతారామరాజు 125వ జయంత్యుత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 4న పశ్చిమ గోదావరి జిల్లా కాళ్ల మండలం పెద అమిరంలో జరగనున్న ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. భద్రతా చర్యల్లో భాగంగా శనివారం మిలటరీ హెలికాఫ్టర్లు ట్రయల్‌ రన్‌ నిర్వహించాయి. పెదఅమిరంలోని నాలుగు హెలీప్యాడ్లను బాంబు స్క్వాడ్‌లు తనిఖీ చేశారు. హెలీప్యాడ్ల నుంచి సభా ప్రాంగణం వరకు, అక్కడి నుంచి భీమవరంలోని అల్లూరి విగ్రహావిష్కరణ స్థలికి వరకు ఇనుప బారికేడ్లు ఏర్పాటు చేశారు. ప్రధాన ప్రసంగించే వేదికను పది అడుగుల ఎత్తులో సుమారు 70 వేల మంది ప్రజలు కూర్చునేలా జర్మన్‌ సాంకేతికతతో ఏర్పాటు చేస్తున్నారు. దీనివల్ల వర్షం వచ్చినా సభకు ఇబ్బంది ఉండదు. ఎస్పీజీ బృందాలతోపాటు జిల్లా పోలీసులు భద్రతా విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

* రాష్ట్రంలో ఈ నెల 4 నుంచి 12 వరకు ఈఏపీ సెట్‌ పరీక్షలు జరగనున్నాయి. 4 నుంచి 8 వరకు ఇంజనీరింగ్‌ పరీక్ష.. 11 నుంచి 12 వరకు అగ్రికల్చర్‌ , ఫార్మసీ పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం రాష్ట్రంలో 120, తెలంగాణలో 2 సెంటర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 3 లక్షల 84 వేల మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. నిమిషం నిబంధన ఖచ్చితంగా అమలు చేస్తామని అధికారులు తెలిపారు.

*గొల్లపూడి నుండి ఆర్టీసీ పల్లె వెలుగులో మైలవరం వరకు మాజీ మంత్రి దేవినేని ఉమా ప్రయాణం చేశారు. జగన్ రెడ్డి రివర్స్ పాలనలో సామాన్యుడి వాహనం ధరలకు రెక్కలు పెరిగాయని ఆయన మండిపడ్డారు. ఒకవైపు ప్రజాధనం వృధా, దోపిడి మరోవైపు ధరల పెంపుతో ప్రజల జేబుకు చిల్లు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి హయంలో మూడేళ్లలో నాలుగు సార్లు ఆర్టీసీ చార్జీలు పెరిగాయన్నారు. ఆర్టీసీ చార్జీల పెంపుతో 2,175 కోట్లు ప్రజలపై భారం పడుతోందన్నారు. మూడేళ్లలో నాలుగు సార్లు పెరిగిన ఆర్టీసీ చార్జీలకు నిరసనగా విజయవాడ (గొల్లపూడి) నుండి మైలవరం వరకు పల్లె వెలుగు బస్సులో ప్రయాణిస్తూ.. జగన్ రెడ్డి బాదుడుతో ప్రయాణికుల కష్టాలను ఆయన తెలుసుకున్నారు.

*మోడల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ అడ్మిషన్ల కోసం నోటిఫికేషన్‌ వెలువడింది. రాష్ట్రంలోని మోడల్‌ స్కూళ్లలో ఇంటర్మీడియట్‌ విద్యలో భాగంగా ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ, సీఈసీ కోర్సుల్లో అడ్మిషన్ల కోసం ఈ నోటిఫికేషన్‌ను జారీ చేశారు. అడ్మిషన్ల కోసం ఈ నెల 2వ తేదీ నుంచే ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరిస్తుండగా.. 10వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. టెన్త్‌ పాసైన విద్యార్థులు ఠీఠీఠీ.్టటఝౌఛ్ఛీజూటఛిజిౌౌజూట.ఛిౌఝ వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

*కేంద్రంలో అధికారంలో కొనసాగుతున్న బీజేపీ నేతలు ప్రజా సమస్యలు పరిష్కరించకుండా రాజకీయం కోసమే చార్మినార్‌ భాగ్యలక్ష్మి మందిరానికి వెళుతున్నారని టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు, ఎమ్మెల్యే టి. జగ్గారెడ్డి ఆరోపించారు. దేవుణ్ని రాజకీయంగా వాడుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. శనివారం సీఎల్పీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. భాగ్యలక్ష్మి ఆలయం పేరు చెప్పి.. జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో ఓట్లు అడిగిన బీజేపీ నేతలు కొన్ని సీట్లు గెలిచారన్నారు. బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు వచ్చిన యూపీ సీఎం యోగి ఆదిత్యనాఽథ్‌ ఆదివారం భాగ్యలక్ష్మి ఆలయానికి వెళ్తారని చెబుతున్నారని, అమ్మవారి దర్శనానికి వెళితే అభ్యంతరం ఎవరికీ ఉండదని, కానీ రాజకీయం చేయాలని చూడటం సరికాదని విమర్శించారు. కాంగ్రెస్‌ మిత్రులతో కలిసి తాను కూడా ఆదివారం ఉదయం 9 గంటలకు భాగ్యలక్ష్మి ఆలయానికి దర్శనం కోసం వెళ్తానని ప్రకటించారు. దర్శనం తర్వాత మూడు గంటల పాటు అక్కడే ఉండి బీజేపీ నేతలకు సద్బుద్ధి ప్రసాదించాలని, మంచి పాలన అందించేలా చూడాలని అమ్మవారిని ప్రార్థిస్తూ భజన కార్యక్రమాలు చేపడతామన్నారు. రాష్ట్రంలో అధికారంలోకి రావాలని మొక్కుకోవడానికే బీజేపీ వాళ్లు భాగ్యలక్ష్మి ఆలయానికి వెళుతున్నారన్నా రని ఆయన ఆరోపించారు.

*కేవలం రైతుబంధు నిధులు మిగుల్చుకునేందుకు ఽధరణి పోర్టల్‌ నుంచి రైతుల పేర్లను తొలగిస్తారా..? అని హైకోర్టు అధికారులను ప్రశ్నించింది. ధరణి పోర్టల్‌ నుంచి పట్టాదారుల పేర్లను తొలగించడానికి చట్టపరమైన ప్రక్రియను అనుసరించాలని స్పష్టంచేసింది. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ధరణి పోర్టల్‌లో పేర్లు తొలగించారని.. రైతుబంధు నిధులు రాకుండా నిలిపేశారని పేర్కొంటూ కామారెడ్డి జిల్లా యాచారం మండలంలోని పలు తండాలకు చెందిన 76 మంది గిరిజన రైతులు హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ ధర్మాసనం విచారణ చేపట్టింది. పిటిషనర్ల తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ… ఏళ్లుగా సాగుచేసుకుంటున్న పట్టాభూములను కారణం వెల్లడించకుండా ధరణి నుంచి తొలగించడం అన్యాయమని పేర్కొన్నారు. ఏళ్లుగా సాగుచేసుకుంటున్న భూములు తమవి కాదని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. కారణాలు చూపకుండా, చట్టపరంగా ప్రొసీడింగ్స్‌ జారీచేయకుండా ధరణి పోర్టల్‌ నుంచి పట్టాదారులైన రైతుల పేర్లను ఎలా తొలగిస్తారని ధర్మాసనం ప్రభుత్వ న్యాయవాదిని ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది వాదనలు వినిపిస్తూ… గతంలో ప్రభుత్వాలు అటవీ భూములను కేటాయించాయని, కానీ అటవీ భూములను పట్టాభూములుగా మార్చడానికి సాధ్యంకాదని తెలిపారు. ప్రభుత్వ వాదనను తోసిపుచ్చిన ధర్మాసనం… నోటీసులు ఇవ్వకుండా అధికారులు ఇష్టానుసారం పేర్లను తొలిగించలేరని వ్యాఖ్యానించింది. ఈ కేసు ముగింపునకు వచ్చేవరకు పిటిషనర్లను వారివారి భూముల నుంచి ఖాళీ చేయించరాదని కామారెడ్డి జిల్లా కలెక్టర్‌కు ఆదేశాలు జారీచేసింది. ధరణి పోర్టల్‌ నుంచి పేర్ల తొలగింపు వ్యవహారంపై వివరణ సమర్పించాలని ఉత్తర్వులు జారీచేసింది. లేనిపక్షంలో కామారెడ్డి జిల్లా కలెక్టర్‌, కామారెడ్డి ఆర్డీవో ఈనెల 15న ప్రత్యక్షంగా కోర్టు విచారణకు హాజరుకావాలని ఆదేశాలు జారీచేసింది.

*జమునా హేచరీస్‌ భూవివాదానికి సంబంధించి బీజేపీ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ కుటుంబానికి హైకోర్టులో భారీ ఊరట లభించింది. మెదక్‌ జిల్లా మాసాయిపేట మండలం అచ్చంపేట్‌ గ్రామంలోని సర్వే నంబరు 130లో జమునా హేచరీ్‌సకు ఉన్న మూడు ఎకరాల భూమి విషయంలో ఆగస్టు 1 వరకు ప్రభుత్వం జోక్యం చేసుకోరాదంటూ హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీచేసింది. ఇటీవల భూములు స్వాధీనం చేసుకోవడానికి సంబంధించి వివరణ ఇవ్వాలంటూ రెవెన్యూశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, మెదక్‌ కలెక్టర్‌, స్థానిక ఆర్డీవో, మాసాయిపేట తహసీల్దార్‌ తదితరులకు ఆదేశాలు జారీచేసింది. ఈ మేరకు జస్టిస్‌ ఎం.సుధీర్‌కుమార్‌ ధర్మాసనం ఉత్తర్వులు జారీచేసింది. ఈ మూడెకరాలు ప్రభుత్వ భూములని, వాటిని ఆక్రమించడంపై వివరణ ఇవ్వాలంటూ గత నెల 25న మాసాయిపేట తహసీల్దార్‌ నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. దీన్ని సవాల్‌ చేస్తూ జమునా హేచరీస్‌, ఆ సంస్థ డైరెక్టర్‌ ఈటల నితిన్‌రెడ్డి, ఈటల జమున దాఖలు హైకోర్టును ఆశ్రయించారు. వీరి తరఫున సీనియర్‌ న్యాయవాది, మాజీ అడ్వొకేట్‌ జనరల్‌ దేశాయి ప్రకాశ్‌రెడ్డి వాదనలు వినిపించారు. గతంలో కలెక్టర్‌ ప్రాథమిక సర్వే పూర్తిచేశారని, పూర్తిస్థాయి సర్వే కొనసాగుతోందని వివరించారు. సర్వే పూర్తికాకముందే.. భూములు ఆక్రమణకు గురయ్యాయని ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుందని ప్రకాశ్‌రెడ్డి ప్రశ్నించారు. ప్రభుత్వం తరఫు న్యాయవాది ఈ వాదనతో విభేదించారు. వాదోపవాదాలను నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఆగస్టు 1 వరకు ఆ భూముల విషయంలో అధికారులు జోక్యం చేసుకోవద్దని ఆదేశిస్తూ.. విచారణను ఈ నెల 25కు వాయిదా వేసింది.

*అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షల్లో పాసైన విద్యార్థులను కూడా రెగ్యులర్‌ విద్యార్థులతో సమానంగా పరిగణిస్తామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఈ విషయాన్ని మంత్రి తమతో చెప్పారని ఆమెను కలిసిన ప్రధానోపాధ్యాయుల సంఘం ప్రతినిధులు తెలిపారు.

*రాష్ట్రంలో బదిలీలకు సంబంధించి విడుదల చేసిన 116 జీవో వల్ల ఉద్యోగులకు ఎటువంటి ప్రయోజనాలు ఉండవని ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గ్రామ రెవెన్యూ సంఘం రాష్ట్ర అధ్యక్షులు భూపతిరాజు రవీంద్రరాజు, ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ఉద్యోగుల సంఘం రాష్ట్ర కార్యదర్శి, ప్రధాన కార్యదర్శి ఎం.అప్పలనాయుడు తెలిపారు. శనివారం ఈ మేరకు వారు సంయుక్త ప్రకటన చేశారు. రాష్ట్ర రెవెన్యూ సంఘం జీవో నంబరు 122 తీసుకువచ్చిందని దానివల్ల ఉద్యోగులకు ప్రయోజనం జరుగుతుందనుకుంటే ఆ పరిస్థితి లేదన్నారు. గ్రామ, రెవెన్యూ అధికారులకు తీవ్ర నష్టం జరుగతోందని తెలిపారు. ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికన బదిలీలు నిర్వహించాలని, జిల్లాల్లో అధికారులు ఎవరూ బదిలీలలో ఆ విధానం పాటించలేదని పేర్కొన్నారు. జిల్లాలు పరిపాలన సౌలభ్యం కోసం మాత్రమే విడగొట్టారని, సర్వీస్‌ మేటర్స్‌ బదిలీలు, రాష్ట్రపతి ఆమోదం పొందేవరకు పాత 13 జిల్లాల ప్రకారం బదిలీలు జరగాలని తెలిపారు.

*పశ్చిమ గోదావరి జిల్లా యలమంచిలి గ్రామ రైతులు సార్వా సీజన్‌కు క్రాప్‌ హాలిడే ప్రకటించారు. మురుగు కాల్వల్లో తూడు, చెత్త పేరుకుపోయి చేలల్లోని నీరు బయటకు వెళ్లకపోవడంతోపాటు ఇటీవల కురిసిన భారీ వర్షాలకు వరి నారుమడులు నీటమునిగి పోవడంతో క్రాప్‌ హాలిడే ప్రకటిస్తున్నామని రైతులు చెప్పారు. గ్రామంలో 1500 ఎకరాల ఆయకట్టు ఉండగా సుమారు 200 మంది రైతులు వరి సాగు చేస్తున్నారు. శనివారం గ్రామంలో సమావేశమైన రైతులు ముంపు సమస్యతో మూడేళ్లుగా నష్టపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు నారుమడులు ముంపు బారినపడి దెబ్బతిన్నాయని చెప్పారు. సీజన్‌ ఆరంభంలోనే నష్టాల బారినపడ్డామని.. సాగుకు ముందుకు వెళితే అప్పుల ఊబిలో కూరుకుపోతామన్నారు. ఏళ్లు గడుస్తున్నా సమస్య పరిష్కారానికి అధికారులు చర్యలు చేపట్టకపోవ డంతో క్రాప్‌ హాలిడే నిర్ణయం తీసుకున్నామన్నారు. అనంతరం అధికారులకు క్రాప్‌హాలిడే నిర్ణయ పత్రాలను అందజేశారు.

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌ కాపు రామచంద్రారెడ్డి వీరంగమేశారు. ప్రభుత్వ కరపత్రంతో ఫొటో దిగడానికి నిరాకరించిన టీడీపీ కార్యకర్తను అరెస్టు చేయించారు. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణం 8వ వార్డులో శనివారం గడప గడపకు… కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఐటీడీపీ నేత మారుతి ఇంటి వద్దకు స్థానిక ఎమ్మెల్యే, విప్‌ కాపు రామచంద్రారెడ్డి వెళ్లారు. ‘అమ్మ ఒడి కింద నీకు డబ్బులు పడ్డాయా..?’ అని మారుతిని ప్రశ్నించారు. రెండేళ్లపాటు వచ్చాయని, ఈ ఏడాది రాలేదని మారుతి ఎమ్మెల్యేకి తెలిపారు. దీంతో పక్కనే ఉన్న వార్డు వలంటీరును ఆయన కారణం అడిగారు. విద్యుత్‌ బిల్లు ఎక్కువ వచ్చిందని వలంటీరు ఎమ్మెల్యేకి తెలిపారు. ‘ఈ చిన్నపాటి గుడిసెకు అంత బిల్లు వచ్చిందా?’ అని ఎమ్మెల్యే ప్రశ్నించారు. ‘కాదు.. ఇతనికి ప్లాస్టిక్‌ బిందెల తయారీ కర్మాగారముంది’ అని వలంటీరు తెలిపారు. ఆ క్రమంలో మారుతి జోక్యం చేసుకుని… ‘టీడీపీ వాడినని మీరు ఆ ఫ్యాక్టరీని సీజ్‌ చేయించారు కదా?’ అని ఎమ్మెల్యేకి గుర్తు చేశాడు. అంతే, ఆయన ఆగ్రహంతో ఊగిపోయారు. ‘‘ఓహో..! నువ్వేనా టీడీపీ సోషల్‌ మీడియా వెధవ్వి? సోషల్‌ మీడియాలో టీడీపీని పొగుడుతూ పోస్టులు పెడతావా?’’ అంటూ చిందులు వేశారు. ప్రభుత్వ కరపత్రం తీసుకుంటూ తనతో ఫొటోదిగాలని ఒత్తిడి చేశారు. అందుకు తిరస్కరించిన మారుతి, ‘‘మీ ప్రభుత్వం గురించి చెప్పుకోండి సార్‌. నేను ఫొటో దిగను’’ అని అన్నాడు. దీంతో ఆగ్రహించిన ఎమ్మెల్యే.. వెంటనే మారుతిని అదుపులోకి తీసుకోవాలని ఆదేశించారు. వెంటనే పోలీసులు ఆ ఆదేశాలను పాటించారు. విధులకు ఆటంకం కలిగించారని వలంటీర్‌ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మారుతిపై కేసు నమోదు చేశారు.

*‘‘వైసీపీలో మేము… మంత్రులు, ఎమ్మెల్యేలు, చైర్మన్లు శాశ్వతం కాదు. సీఎం జగన్‌, కార్యకర్తలే శాశ్వతం. మేము వస్తుంటాం… పోతుంటాం. మీరు మమల్ని గెలిపిస్తే సీఎంకు మాపై నమ్మకం ఉంటే మంత్రి పదవులు ఇస్తారు’’ అని మంత్రి ఆదిమూలపు సురేశ్‌ అన్నారు. శనివారం కడప మున్సిపల్‌ స్టేడియంలో జిల్లా స్థాయి ప్లీనరీ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘కార్యకర్తలు కొన్ని అభివృద్ధి పనులు చేశారు. ఆ బిల్లులు పెండింగ్‌లో ఉన్నాయి. ఎక్కడికెళ్లినా బిల్లులు ఇప్పించండి అంటూ కోరుతున్నారు. రెండు మూడు రోజుల్లో రాష్ట్ర వ్యాప్తంగా రూ.2 వేల కోట్ల పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేస్తాం’’ అని అన్నారు. జిల్లా ప్లీనరీ సమావేశానికి డ్వాక్రా మహిళలు, మెప్మా, సచివాలయ వలంటీర్లను బలవంతంగా, ప్రజలను పథకాల పేరుతో బెదిరించి తీసుకొచ్చినట్లు సమాచారం. కొంతమందికి రూ.100 నుంచి రూ.200 వరకూ చెల్లించినట్లు తెలిసింది. అయితే సమావేశం మొదలైన కాసేపటికే ఎలా వచ్చారో అలాగే ఒక్కొక్కరు మెల్లగా జారుకోవడం కనిపించింది. మంత్రి సురేశ్‌ మాట్లాడే సరికి 90 శాతం సభా ప్రాంగణం ఖాళీ అయింది. డిప్యూటీ సీఎం అంజద్‌బాషా, కడప ఎంపీ అవినాశ్‌రెడ్డి, వైసీపీ జిల్లా అధ్యక్షుడు సురేశ్‌బాబు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు పాల్గొన్నారు.
*ఆర్టీసీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా వైసీపీ ప్రభుత్వం మూడేళ్లలో బస్సుచార్జీలు పెంచి ప్రయాణికులపై రూ.2 వేల కోట్ల భారం మోపిందని ప్రతిపక్షాలు ధ్వజమెత్తాయి. ఈ మేరకు టీడీపీ, సీపీఐ, సీపీఎం తదితర పార్టీలు రాష్ట్రవాప్తంగా వివిధ జిల్లాల్లో నిరసనల హోరెత్తించాయి. పెంచిన చార్జీలను తక్షణమే తగ్గించాలని డిమాండ్‌ చేశాయి. లేదంటే పోరాటం ఆగదని హెచ్చరించాయి. సీపీఐ, సీపీఎం, ఇతర వామపక్షాల పార్టీ ఆధ్వర్యాన శనివారం విజయవాడ బస్టాండ్‌ ప్రధాన ద్వారం వద్ద జరిగిన ధర్నాలో సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ, సీపీఎం రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.మధు ప్రసంగిస్తూ.. ప్రభుత్వ తీరును ఎండగట్టారు. రామకృష్ణ మాట్లాడుతూ.. రెండున్నర నెలల కిందట డీజిల్‌ సెస్‌ పేరుతో చార్జీలు పెంచి రూ.720 కోట్ల భారం మోపారని, మళ్లీ ఇప్పుడు మరో రూ.600 కోట్ల వసూలు కోసం భారీగా చార్జీలు పెంచడం దారుణమని మండిపడ్డారు.

*విపక్షాల రాష్ట్రపతి అభ్యర్థి యశ్వంత్‌ సిన్హాతో మజ్లిస్‌ పార్టీ శాసనసభ్యుల బృందం భేటీ అయ్యింది. రాష్ట్రపతి ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం యశ్వంత్‌ సిన్హా హైదరాబాద్‌కు వచ్చారు. ఆయనను మలక్‌పేట్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ బిన్‌ అబ్దుల్‌ బలాల నేతృత్వంలో పార్టీ ఎమ్మెల్యేలు మహ్మద్‌ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌, కౌసర్‌ మొయిద్దీన్‌లు మర్యాద పూర్వకంగా కలిశారు. వారు కొద్ది ేసపు వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి ఎన్నికల్లో తనకు విజయం చేకూర్చాలని యశ్వంత్‌ సిన్హా వారికి విజ్ఞప్తి చేశారు. కాగా మజ్లిస్‌ పార్టీ అధినేత, హైదరాబాద్‌ ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ విపక్షాల తరపున రాష్ట్రపతి అభ్యర్థిగా పోటీచేస్తున్న యశ్వంత్‌ సిన్హాకు మద్దతు ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రస్తుతం మధ్యప్రదేశ్‌ స్థానిక సంస్థల ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రీతో అసదుద్దీన్‌ వెళ్లడంతో సిన్హాను కలువలేకపోయినట్టు మజ్లిస్‌వర్గాలు తెలిపాయి. రాష్ట్రపతి ఎన్నికలనాటికి ఎమ్మెల్యేలంతా హైదరాబాద్‌ చేరుకుంటారని, యశ్వంత్‌ సిన్హాకు సంపూర్ణ మద్దతు ఉంటుందని చెప్పాయి.

*బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల నేపథ్యంలో ఆదివారం మెట్రో రైళ్ల రాకపోకలపై వస్తున్న ఊహాగానాలకు హైదరాబాద్‌ మెట్రో రైలు ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి తెరదించారు. మూడు కారిడార్ల పరిధిలో రైళ్లు యథావిధిగా నడుస్తాయని, రోజూ మాదిరిగానే అన్ని స్టేషన్లలో రైళ్లు ఆగుతాయని పేర్కొన్నారు. కాగా.. కారిడార్‌-3 నాగోలు-రాయదుర్గం మార్గంలోని సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌ స్టేషన్‌ సమీపంలో ఆదివారం బీజేపీ భారీ బహిరంగ సభ నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.

*బోనాల ఉత్సవాలు తెలంగాణ ప్రజల ఆచార వ్యవహారాలకు, సాంస్కృతిక సంబరాలకు ప్రతీకగా నిలుస్తున్నాయి.తెలంగాణ ప్రాంతంలో జరిగే ఉత్సవాలు, పండుగలు, వేడుకలు ఎంతో ప్రసిద్ధి పొందాయి. ముఖ్యమంత్రి కేసీఆర్, తెలంగాణ ప్రాంతానికి ప్రతీకగా నిలిచిన బోనాల ఉత్సవాలను రాష్ట్ర పండుగగా ప్రభుత్వమే నిర్వహిస్తోంది.తెలంగాణలో బోనాల ఉత్సవాలు ఆరంభం అయ్యాయంటే విదేశీ, దేశీ యాత్రికులకు సందడే సందడి. ముఖ్యంగా రాజధాని హైదరాబాద్ నగరంలో జరిగే బోనాల ఉత్సవాలు దేశ ప్రజలందరి దృష్టిని ఆకర్షిస్తోంది. ఈ మేరకు ప్రభుత్వం ఒక ప్రకటన విడుదల చేసింది. జూన్ 30న గోల్కొండ జగదాంబికా ఆలయంలో బోనాలను ప్రభుత్వం ఘనంగా ప్రారంభించింది.ఉత్సవాలకు సంబంధించి మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఇటీవల ఒక ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించి బోనాలు ఉత్సవాల నిర్వహణపై అధికారులకు దిశా నిర్దేశనం చేశారు.

*ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ హైదరాబాద్ చేరుకున్న వెంటనే తెలుగులో ట్వీట్‌ చేశారు.డైనమిక్‌ సిటీ హైదరాబాద్‌ చేరుకున్నానని మోదీ ట్వీట్ లో పేర్కొన్నారు.హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు జరుగుతున్నవేళ తాను హైదరాబాద్ వచ్చినట్టు పేర్కొన్నారు.పార్టీ బలోపేతంపై చర్చిస్తామని ట్విటర్‌లో ప్రధాని మోదీ పేర్కొన్నారు. కాగా ప్రధాని మోదీ ట్వీట్‌కు మంత్రి తలసాని వెంటనే స్పందించారు.హైదరాబాద్‌ను డైనమిక్‌ సిటీగా ఒప్పుకున్నందుకు ధన్యవాదాలు అంటూ ఆయన ట్వీట్ చేశారు.

*రాష్ట్రంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన రామేశ్వరం రామనాథస్వామి, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి, మదురై మీనాక్షి అమ్మవారి దేవస్థానాల్లో రోజంతా అన్నదానం చేసే పథకాన్ని త్వరలోనే ప్రారంభిస్తామని దేవాదాయ శాఖామంత్రి పి.శేఖర్‌బాబు తెలిపారు. నుంగంబాక్కంలోని దేవాదాయ శాఖ ప్రధాన కార్యాలయంలో శనివారం ఉదయం ఆ శాఖ ఉన్నతాధికారుల సమీక్షా సమావేశం ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, 2021-22లో అసెంబ్లీలో తమ శాఖ తరఫున ప్రకటించిన పథకాలకు సంబంధించి 90 శాతం పనులు పూర్తి చేసినట్టు వెల్లడించారు. అదేవిధంగా 2022-23 ఆర్థిక సంవత్సరం బడ్జెట్‌ ప్రసంగం సమయంలో 165 ప్రకటనలు చేశామని, వాటిలో చాలామేరకు ఇప్పటికే అమలు చేస్తున్నట్టు తెలిపారు. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ఐదు దేవాలయాల్లో రోజంతా అన్నదానం చేసే కార్యక్రమం కొనసాగుతోందన్నారు. ఈ పథకం విస్తరణ చర్యల్లో భాగంగా, రామేశ్వరం రామనాథస్వామి ఆలయం, తిరువణ్ణామలై అరుణాచలేశ్వర స్వామి ఆలయం, మదురై మీనాక్షి ఆలయాల్లో త్వరలోనే అమలు చేయనున్నట్టు వెల్లడించారు. మరో పది ఆలయాల్లో అక్కడికి వచ్చే భక్తులకు ప్రసాదాలు అందజేస్తున్నామని, ఈ పథకాన్ని ఈ ఏడాది మరో ఐదు ఆలయాలకు విస్తరించనున్నట్లు తెలిపారు. 121 ఆలయాల్లో పెంచుతున్న గోవులను రూ.20 కోట్లతో సంరక్షిస్తామని మంత్రి శేఖర్‌బాబు తెలిపారు.

*ఖమ్మం: జిల్లా వ్యాప్తంగా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణిలో బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడింది. ఆదివారం తెల్లవారుజాము నుంచి సత్తుపల్లిలో ఆగకుండా వర్షం కురుస్తున్నది. దీంతో సింగరేణి ఓపెన్‌కాస్ట్‌ గనుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. బొగ్గు బావుల్లో నీల్లు నిలిచిపోవడంతో 10 వేల టన్నుల బొగ్గు, 40 వేల క్యూబిక్‌ మీటర్ల పనులకు ఆటంకం ఏర్పడింది.