Politics

ప్రధాని నోటి వెంట ‘హైదరాబాద్ భాగ్యనగరం’.. మరోసారి తెరపైకి పేరు మార్పు అంశం

ప్రధాని నోటి వెంట ‘హైదరాబాద్ భాగ్యనగరం’.. మరోసారి తెరపైకి పేరు మార్పు అంశం

తెలంగాణ రాజధాని హైదరాబాద్ వేదికగా 2 రోజుల బీజేపీజాతీయస్థాయి కార్యవర్గ సమావేశాలు ఆదివారం విజయవంతంగా ముగిశాయి. ప్రధాని నరేంద్ర మోదీ, బీజేపీ అగ్రనాయకత్వం, కేంద్రమంత్రులు, బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు పలు కీలక అంశాలపై విస్తృతంగా చర్చించారు. ఈ చర్చల్లో ప్రధాని నరేంద్ర మోదీ.. ‘హైదరాబాద్‌‌ను భాగ్యనగరం’గా ప్రస్తావించారు. ‘ భాగ్యనగరం హైదరాబాద్‌‌ మనకు(బీజేపీకి) ఎంతో కీలకమైనది. ఏకీకృత భారత్‌కు సర్ధార్ వల్లభాయ్ పటేల్ పునాదులు వేశారు. శ్రేష్ట భారత్‌ను ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత బీజేపీదే’ అని మోదీ నిర్దేశనం చేశారని ఆ పార్టీ ఎంపీ రవిశంకర్ ప్రసాద్ వెల్లడించారు. హైదరాబాద్ పేరు మార్పుపై బీజేపీ కేడర్ కొంతకాలంగా వ్యాఖ్యలు చేస్తున్నా.. ఇప్పుడు స్వయానా ప్రధాని మోదీ నోటి వెంట కూడా ‘భాగ్యనగరం’ మాట వినిపించడం మరోసారి చర్చకు తెరలేపింది. హైదరాబాద్ నగరం పేరు మార్పు అంశం బీజేపీ జాతీయ నాయకత్వం దృష్టిలో కూడా ఉన్నట్టు స్పష్టమైంది. జాతీయ కార్యవర్గ సమావేశాల సందర్భంగా మరో బీజేపీ నేత దినేష్ శర్మ కూడా హైదరాబాద్ పేరు అంశాన్ని ప్రస్తావించారు. ఆదివారం మీడియాతో మాట్లాడుతూ.. ‘ భాగ్యలక్ష్మీ అమ్మవారు నెలవైన ఈ గడ్డను పూర్వకాలం నుంచి భాగ్యనగరంగా పిలిచేవారని ప్రస్తావించారు. భాగ్యనగరం మారబోతోందని, అభివృద్ధి చెందబోతోందని ఆయన పేర్కొన్నారు.

*హైదరాబాద్ పేరు మార్పు ప్రస్తావన తొలిసారేం కాదు..
హైదరాబాద్ పేరు మార్పు అంశం తెరపైకి రావడం ఇదే తొలిసారి కాదు. 2020 జీహెచ్ఎంసీ ఎన్నికల్లో భాగ్యనగరంగా పేరు మార్చుతామంటూ బీజేపీ శ్రేణులు విస్తృతంగా ప్రచారం చేశాయి. ప్రచారానికి వచ్చిన యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ఓ ఎన్నికల ర్యాలీలో మాట్లాడుతూ.. యూపీలో బీజేపీ అధికారంలోకి వచ్చాక ఫైజాబాద్‌ను అయోధ్యగా.. అలహాబాద్‌ను ప్రయాగరాజ్‌గా మార్చాం.. భాగ్యనగరంగా హైదరాబాద్ పేరును ఎందుకు మార్చకూడదంటూ యోగి ఆదిత్యనాథ్ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. గతంలో జార్ఖండ్ ముఖ్యమంత్రి, బీజేపీ నాయకుడు రఘబర్ దాస్ కూడా ఇదే అభిప్రాయాన్ని వెలిబుచ్చారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి వస్తే హైదరాబాద్ పేరు భాగ్యనగరంగా మారుతుందని విశ్వాసం వ్యక్తం చేశారు. అహ్మదాబాద్ పేరుని అదానీబాద్‌గా ఎందుకు మార్చరంటూ మంత్రి కేటీఆర్ ట్విటర్‌లో ఎద్దేవా చేసిన నేపథ్యంలో రఘబర్ దాస్ ఈ విధంగా స్పందించిన విషయం తెలిసిందే.