DailyDosePolitics

ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేల‌కు ఎంత జీత‌మంటే?

ఏ రాష్ట్రంలో ఎమ్మెల్యేల‌కు ఎంత జీత‌మంటే?

ఢిల్లీలో సుదీర్ఘ పోరాటం త‌ర్వాత ఆమ్ ఆద్మీ పార్టీ ఎమ్మెల్యేలు త‌మ జీతాల‌ను పెంచుకోగ‌లిగారు. ఢిల్లీ అసెంబ్లీలో వేరే పార్టీల ఎమ్మెల్యేల సంఖ్య వేళ్ల మీద లెక్క‌బెట్టిన స్థాయిలో ఉంది. దీంతో ఈ జీతాల పెంపు ల‌బ్ధి ప్ర‌ధానంగా ఆమ్ ఆద్మీ పార్టీకే అనుకోవాలి.
*ఆ సంగ‌త‌లా ఉంటే.. మిగిలిన రాష్ట్రాల‌తో పోల్చినా ఢిల్లీ ఎమ్మెల్యేల వేతాల స‌వ‌ర‌ణ స్థాయి త‌క్కువ‌గానే ఉందని చెప్ప‌వ‌చ్చు. దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఎక్కువ స్థాయిలో జీతాల‌ను తీసుకుంటున్న తీరు ఇలా ఉంది.
*అత్య‌ధిక వేత‌నం పొందుతున్న‌ది తెలంగాణ ఎమ్మెల్యేలే! నూత‌నంగా ఆవిర్భ‌వించిన రాష్ట్రాల్లో ఒక‌టైన తెలంగాణ‌లో ఎమ్మెల్యేల‌కు దేశంలోనే అత్య‌ధిక వేత‌న‌భ‌త్యాలున్నాయి. తెలంగాణ‌లో ప్ర‌తి ఎమ్మెల్యే నెల‌కు రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నం ద‌క్కుతోంది. ఇలా బంగారుతెలంగాణ టాప్ పొజిష‌న్లో నిలుస్తోంది.
*తెలంగాణ త‌ర్వాత అత్య‌ధిక వేత‌నాలు మ‌హారాష్ట్ర ఎమ్మెల్యేల‌కు ఉన్నాయి. అక్క‌డ ఎమ్మెల్యేలు ప్ర‌తి నెలా 2.32 ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నం పొందుతూ ఉన్నారు. మిగిలిన విష‌యాల్లో ఏమో కానీ ఉత్త‌ర‌ప్ర‌దేశ్ లో కూడా ఎమ్మెల్యేల వేత‌నం చెప్పుకోద‌గిన స్థాయిలో ఉంది. అక్క‌డ 1.87 ల‌క్ష‌ల రూపాయ‌ల చొప్పున ఒక్కో ఎమ్మెల్యే నెల వేత‌నం పొందుతూ ఉన్నారు.
*ఇక ప్ర‌స్తుతం ఎమ్మెల్యేలు లేని జ‌మ్మూ అండ్ క‌శ్మీర్ ప‌రిధిలో కూడా వారి వేత‌నాలు మంచి స్థాయిలోనే ఉన్నాయి. అక్క‌డ 1.6 ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నం ఉంది ఎమ్మెల్యేల‌కు. ఉత్త‌రాఖండ్ లో కూడా ఇదే స్థాయిలో వేత‌నం ద‌క్కుతోంది. ఆంధ్రప్ర‌దేశ్ లో 1.3 ల‌క్ష‌ల రూపాయ‌ల మేర‌కు ఉంది ఒక్కో ఎమ్మెల్యే వేత‌నం.
*హిమాచ‌ల్, రాజ‌స్తాన్ ల‌లో 1.25 ల‌క్ష‌ల రూపాయ‌ల వేత‌నం ఉంది. గోవాలో 1.17, హ‌ర్యానా- పంజాబ్ ల‌లో 1.15 ల‌క్ష‌ల మేర జీతాలున్నాయి. కొత్త వేత‌న స‌వ‌ర‌ణ‌లో ఢిల్లీ ఎమ్మెల్యేలు నెల‌కు త‌లా 90 వేల రూపాయ‌ల విలువైన జీత‌భ‌త్యాల‌ను పొంద‌నున్నారు