Devotional

భద్రకాళి ఒక్కో అలంకరణకు ఒక్కో ప్రత్యేకత

భద్రకాళి ఒక్కో అలంకరణకు ఒక్కో ప్రత్యేకత

జగజ్జనని.. తల్లిలా లాలిస్తుంది.. దుష్టశిక్షణలో ఉగ్రరూపం ధరిస్తుంది… శిష్ట రక్షణలో మాతృ స్వరూపిణిగా కనిపిస్తుంది.. ఆమే భద్రకాళి.. ఏటా పదిహేను రోజుల పాటు జరిగే శాకాంబరి వేడుకలు మంగళవారం నుంచి మొదలయ్యాయి… ఈ సందర్భంగా అమ్మవారు రోజుకో రూపంలో దర్శనం ఇస్తారు.. ఈ రూపాల వెనుక ఉన్న చరిత్ర, విశేషాలు, అలంకరణల గురించి..
**శాకాంబరి అంటే?
ఒకానొక సమయంలో కనీసం వంద సంవత్సరాల కాలం నీటి కొరత ఏర్పడింది. ప్రజలు తాగు నీటికి ఇబ్బంది పడ్డారు. అప్పుడు భూమ్మీద ఉన్న తపో సంపన్నులు కాళిని స్తుతించారు. ఆమెను ప్రసన్నం చేసుకున్నారు. మానవాళి సమస్యను తీర్చేందుకు భద్రకాళి అయోనిజయై అవతరించి నూరు నయనాలతో లోకాన్ని కాపాడింది. ఆ సమయాన ఆమెను మునీశ్వరులు ‘శతాక్షిదేవి’ అని కీర్తించారు. అనంతరం తల్లి దేహం నుంచి శాకములు పుట్టి జనుల ఆకలి తీర్చుతూ వర్షాలు కురిపిస్తూ సకల ప్రాణులను రక్షించాయి. అందువల్ల ఆమె శాకాంబరి దేవిగా ప్రసిద్ధి పొందింది.
**కాళికావతరం..
మొదటి రోజు అమ్మవారు కాళికావతారంలో భక్తులకు కనువిందు చేస్తారు. కామేశ్వరీ నిత్యాక్రమంలో అలంకరిస్తారు. సంప్రదాయాలు, ఆచారాలు, పద్ధతులకు భిన్నంగా వ్యవహరించకుండా ఉండాలనే ధ్యేయంతో తొలిరోజు అమ్మవారికి సహస్ర కలశాభిషేకం జరుగుతుంది. మొదటి రోజు కావడంతో అమ్మవారిని కూరగాయలు, కందమూలాలతో తీర్చిదిద్దుతారు. పాడ్యమి తిథి చంద్ర దర్శనానికి ఆరంభం మాత్రమేనని ఇది మొదలుగా చంద్ర కాంతులు పదిహేను రోజుల పాటు దినదినప్రవర్థమానమై భాసిల్లుతాయని ,అలాగే మానవ జీవితమూ నిత్యనూతనంగా వెలుగులు చిమ్మాలని భావన కలిగించే విధంగా పూజాధికాలు చేస్తారు.
**కపాలిని..
రెండో రోజు అమ్మవారిని ‘కపాలిని’ రూపంలో అలంకరిస్తారు. భూగర్భంలో విరగకాసిన దుంపలతో అమ్మవారిని తీర్చిదిద్దుతారు. కపాలిని రూపంలో అమ్మవారు రాక్షసులను సంహరించి.. వారి తలలను మాలలుగా ధరించి అసుర శక్తుల నుంచి కాళి భక్తులను కాపాడారని పురాణాలు చెబుతున్నాయి. మానవుడిలోని మేధ బయటకు కనిపించకుండా తీగజాతి మొక్కలలోని కంద రూపంలో ఎదగాలని ఎంత ఎదిగినా మరింత ఒదిగి ఉండాలన్న సంకేతంతో కందమూలాలతో అమ్మవారిని అలంకరిస్తారు.
**కుల్లా..
మూడో రోజు అమ్మవారు ‘కుల్లాక్రమం’ రూపంలో కనిపిస్తారు. అభయప్రదాయినిగా ఈ రూపాన్ని భావించవచ్చు. విభూతిని ఆరాధించడం ప్రధాన ధ్యేయం. ఇక్కడ మరో పరమార్థం ఏంటంటే.. మంచి సంకల్పంతో ఎవరి విధులు, బాధ్యతలు వారు నిర్వర్తిస్తే సమాజ హితాన్ని ఆకాంక్షిస్తే జాతి క్షేమంగా ఉంటుంది. ఏ ఒక్కరు తేడాగా ఉన్నా సమాజ ప్రగతి కుంటుపడుతుంది. అందుకే మంచి చేస్తూ పోతుంటే అదే మనల్ని కాపాడుతుంది. గాల్లో తేలిపోయే స్వభావం విభూతికి ఉన్నా ఎంతో శక్తిమంతమైనది. అలాగే సమాజానికి అమ్మవారు కంటికి కనిపించినా, కనిపించకపోయినా సర్వమానవాళిని ,పశుపక్ష్యాదులను తన ఒడిలో పెట్టుకుని కాపాడుతుంది.
**కురుకుల్లా…
నాలుగో రోజు ‘కురుకుల్లా’ క్రమంలో అమ్మవారు దర్శనమిస్తారు. అమ్మవారి శాకాంబరి ఉత్సవాలలో ఇది తొలి శుక్రవారం కావడంతో సర్వాలంకార శోభితయైన అమ్మవారిని ఉదయమే దర్శించడానికి భక్తులు పోటీ పడతారు. సంసార జీవిత వ్యామోహంలో పడి ధర్మాధర్మాలు మరిచి విధులు, బాధ్యతలు విస్మరించిన వారు సాగరంలో కొట్టుకుపోయినట్లుంటారు. ఆకర్షణీయమైన జీవనంలో యుక్తాయుక్తాలు విస్మరించిన వారి గతి సాగరంలో కొట్టుకుపోయిన రీతిగా ఉంటుందని అందుకే ధర్మాధర్మాలు కొంతైనా పాటించాలని ఈ రూపం వివరిస్తుంది. వ్యామోహం ఎంత మాత్రం పనికిరాదని అతిగా దేన్నీ ఆశించరాదని ఈ రూపం హెచ్చరిస్తుంది.
**విరోధిని..
ఐదో రోజు భద్రకాళి విరోధినీ రూపంలో కనిపిస్తారు. మనలోని అంతర్లీనంగా ఉన్న విరోధ భావనలు తొలగించుకుంటే తప్ప సుఖమయ జీవనం గడపలేమని చెప్పకనే చెప్పే రూపమిది. శమీ శత్రు విరోధిని అన్నట్లు తోటి వారినుంచే కాకుండా మనలో పేరుకుపోయిన అసూయ ద్వేషం, కోపం పగ , తెంపరితనం లాంటి విరోధ భావనలు ఎంత త్వరగా విసర్జిస్తే అంత సుఖంగా హాయిగా ఉంటామని చెబుతుంటుంది. నిండు మనసులో నిష్కామ కోరికలతో అమ్మను ఆరాధిస్తే చాలు సమస్త విరోధాలు తొలగిపోతాయని దీని పరమార్థం. పక్కవాడి ఎదుగుదలను ఎంత కాంక్షిస్తే మనకు అంత మానసిక ప్రశాంతత ఉంటుందన్నది ఈ రూపం ప్రత్యేకం.
**విప్రచిత్రా…
ఆరో రోజు అమ్మవారు విప్రచిత్రాక్రమంలో దర్శనమిస్తారు. భద్రకాళి విప్రుల చిత్తంలో ప్రవేశించి వారిని సమాజాభ్యుదయానికి పాల్పడే విధంగా పాఠం చెప్పే రూపం. ఈ రూపంలో అమ్మవారు నాలుగు ముఖాలతో, ఆరు చేతులతో భక్తులకు దర్శనమిస్తారు. ఎవరైనా సరే ధర్మాన్ని త్రికరణ శుద్ధిగా ఆచరించి సర్వేజనా సుఖినోభవంతూ అన్న మాటలను ఆచరిస్తూ జీవితాన్ని సుఖమయం చేసుకోవాలన్నది ఈ రూపం విశిష్ఠత. తన హితం స్థానే పరహితం కోరే విధంగా ప్రతి జీవి మనుగడ సాగించాలని బోధిస్తుంది. యజ్ఞయాగాదులతో వేదాధ్యయనంతో జ్ఞానం సంపాదించాలి. అలా పొందిన విద్యను జాతి హితం కోసం ఖర్చు చేయాలి జ్ఞానం పంచే కొద్దీ పెరుగుతుందని ఈ రూపం తత్వం.
**ఉగ్రా..
ఏడో రోజు అమ్మవారు ఉగ్రాక్రమంలో కనిపిస్తారు. ఆషాఢ మాసం సోమవారం.. అందులోనూ తొలిసారి వచ్చేది ఎంతో విశేషమైంది. సమస్త ప్రాణకోటిని బాధించే శక్తులను తన ఉగ్ర ప్రభల నుంచి ప్రజ్వరిల్లే జ్వాలలతో సంహరిస్తుంది. ప్రతి మానవుడి ఎదుగుదలకు పెద్ద ప్రమాదకరంగా మారిన వ్యసనాలు, బద్ధకం, చెడు అలవాట్లు ,రోగాలు తదితరాలను నాశనం చేసే శక్తిగా ఉగ్రప్రభాలంకరణ చాటుతుంది. ప్రతి మానవుడికి తనలోని దుర్గుణాలే ప్రధాన శత్రువులు. వీటిని అదుపు చేయలేక బయట కనిపించే వాటి కోసం ఆందోళన పడే బదులు.. తనలో అంతర్గతంగా ఉన్న దుర్మార్గపు లక్షణాలు తొలుత తుదముట్టించాలని ఈ రూపం పరమార్థం. ఎవరి విధులు వారు నిర్వర్తిస్తూ వ్యవహరిస్తే ఎలాంటి ఇబ్బందులు ఉండవని చెబుతుంది.
**ఉగ్రప్రభా…
ఎనిమిదో రోజున భద్రకాళి ఉగ్రప్రభాలంకరణలో కనిపిస్తారు. ఈ సందర్భంగా జగన్మాతను అనేక రకాల పూలు, పండ్లు, కూరగాయలతో అలంకరిస్తారు. జాతి ఆకలి బాధ తీర్చే రైతులు ఆరుగాలం కష్టపడి పనిచేసి పండించే పంటలను ఆశించి జాతికి అన్నం దొరకకుండా చేసే కీటకాలను నాశనం చేసే రూపంలో ఈ రూపాన్ని భావిస్తారు. అతివృష్టి ,అనావృష్టి లాంటి బాధలు తొలగిపోవాలని తల్లిని ప్రార్థించగా.. ఆమె ఈ రూపంలో వచ్చిందని భక్తుల విశ్వాసం. పుడమి తల్లికి పురుడు పోసి తోటి వారి ఆకలి బాధ తీర్చే బాంధవిగా అమ్మవారు ఈ రూపంలో విచ్చేసి తనకు నచ్చిన కూరగాయలను ఆభరణాలుగా ధరించి భక్తులకు కనువిందు చేస్తుంటారు. తన హితం కన్నా పరహితం కోరే వారిలో ప్రథములు రైతులని వారికి దన్నుగా నిలిచేందుకే ఈ రూపంలో అమ్మవారు వేంచేసారని భక్తుల నమ్మకం.
**దీప్తా క్రమం..
శాకాంబరి ఉత్సవాలలో భాగంగా తొమ్మిదో రోజుకు ఎంతో విశేషముంది. ఈ దినం అమ్మవారు దీప్తాలంకరణలో కనువిందు చేస్తారు. దీప్త అంటే ప్రకాశింపచేసేదని అర్థం. సాధకుడిలో అంతర్లీనంగా ఉన్న అజ్ఞానాన్ని ,అహంభావాన్ని తొలగించి జ్ఞానాన్ని ప్రకాశింపజేసి ఇహ పర సౌఖ్యాన్ని ఇచ్చేందుకే అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారని చెబుతారు. అహం ఉంటే జ్ఞానం రాదని.. ప్రతి మానవుడు తన భౌతిక స్వరూపాన్ని ,రూపాన్ని క్షణ భంగురమైన ధనాన్ని ఎంతో గొప్పగా భావించి ఇతర జీవులతో చులకనగా ఉంటే పతనం తప్పదని జ్ఞానం ప్రధానమని నొక్కిచెబుతుందీ రూపం. నవనవోన్మేషమైన జీవనం గడపాలని ఈ భౌతిక సుఖాలు తాత్కాలికమని చివరకు మిగిలేది కేవలం మనం సంపాదించిన మంచి ,జ్ఞానం మాత్రమే నని తెలియజెప్పే రూపమిది.
**నీల…
పదో రోజు తల్లి నీల క్రమంలో కనువిందు చేస్తారు. సందర్భానుసారంగా రూపాలు మార్చే అమ్మవారిని నీల రూపంలో చూడడానికి భక్తులు ఎంతో ఇష్టపడతారు. మనసు నిర్మలం చేసుకుని అకుంఠిత దీక్షతో ఆరాధిస్తే సాధకుడికి ఎలాంటి విఘ్నాలు లేకుండా సర్వశక్తులు ఆపాదించి సుఖమయ జీవనం గడపడానికి అమ్మవారు స్వయంగా రక్షగా నిలుస్తారని అంటారు. నిష్కామ కోరికలతో సాధన చేయాలని ఈ రూపం వివరిస్తుంది.
**ఘనా…
పదకొండో రోజు ఘనా క్రమంలో కనిపించే అమ్మవారు మేఘాలను కరిగించి వర్షాన్ని కురిపిస్తుంది. మేఘ మథనాన్ని చేస్తుంది. నిప్పులు చెరిగే ఎండల నుంచి ఉడికిన భూమాతకు ఉపశమనం కల్గిస్తుంది. సమస్త జగత్తుకు నీరే ప్రధానమని ఈ నీటిని ప్రకృతి సిద్ధంగా కురిపించేందుకే అమ్మవారు ఈ రూపంలో దర్శనమిస్తారు. తొలి ఏకాదశి రోజు కలిసి వస్తుండడంతో భక్తులు విశేష సంఖ్యలో దర్శించుకుంటారు. ఆషాఢ మాసం శుక్ల పక్షంలో వచ్చే ఏకాదశిని తొలి ఏకాదశిగా భావించి పండుల ప్రారంభానికి సూచనగా పరిగణిస్తారు. ఈ రోజుకు అమ్మవారి శాకాంబరి వేడుకలకు ఎంతో ప్రాధాన్యం ఉంది.
**ముద్రా…
పద్నాలుగో రోజు ముద్రా క్రమంలో కనిపిస్తారు. ముద్ర అంటే సంతోషాన్ని ప్రసాదించేది. ఎవరు ఏది చెప్పినా సంతోషంగా వినాలి.. ఎలాంటి హావభావాలు ఉండకుండా సదా ఆనందంగా ఉండాలన్నది ఈ రూపం వివరిస్తుంది. శ్రీరాముడు ఎంత కష్టం ఎదురైనా చిరునవ్వుతో ఎదుర్కొన్నారని ఇదే ఆయన విజయానికి ప్రధాన హేతువని.. సర్వమానవాళీ సదా సంతోషంగా ఉండాలన్నదీ ఈ రూపం ప్రత్యేకత.
**శాకాంబరి..
పదిహేనో రోజు భద్రకాళిని శాకాంబరిగా తీర్చిదిద్దుతారు. ఇదే చివరి రోజు. ఈ సందర్భంగా అమ్మవారిని వివిధ రకాల పండ్లు, పూలు, కూరగాయలతో అలంకరిస్తారు. పదిహేను రోజుల పాటు సాగిన ఉత్సవాలు పతాక స్థాయికి చేరుకుని భక్తులకు వివిధ రూపాలలో దర్శనమిచ్చిన తల్లి… మరుసటి రోజు నుంచి మామూలు రూపంలో కనువిందు చేస్తారు.
**బలాకా…
పన్నెండో రోజు భద్రకాళిని బలాకా రూపంలో అలంకరిస్తారు. బలాకా దేవాసుర సంగ్రామంలో రాక్షసులపై పిడుగుల వర్షాన్ని కురిపించి శత్రుక్షయం కల్గించారని పురాణాలు చెబుతున్నాయి. మానవాళి నిండు మనసుతో నమ్ముకుంటే జగన్మాత అందరినీ ఆదరిస్తుంది. బలాకా మాతను ఆరాధిస్తే శుభం కలుగుతుంది. ఇంతకాలం చేసిన పాపకర్మల ఉపసంహారానికి ఈ రూపంలో అమ్మవారి దర్శనం సరిపోతుందని అంటారు.
**మాత్ర…
పదమూడో రోజు అమ్మవారిని మాత్ర రూపంలో అలంకరిస్తారు. సర్వమంగళ రూపంలో అమ్మవారిని తీర్చిదిద్దుతారు. అమ్మను దర్శించుకుంటే సర్వమంగళ ప్రదమైన ఫలితాలు కనిపిస్తాయని పురాణాలు వివరిస్తున్నాయి.