Politics

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నా

వైసీపీ గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నా

వైఎస్‌ఆర్‌ (YSR) కుటుంబానికి అండగా ఉన్న ప్రతిఒక్కరికీ వైసీపీ గౌరవాధ్యక్షురాలు విజయమ్మ ధన్యవాదాలు తెలిపారు. వైసీపీ ప్లనరీ సమావేశాల్లో విజయమ్మ మాట్లాడుతూ… జగమంతా తన కుటుంబంలా వైఎస్‌ఆర్‌ ప్రేమించారన్నారు. ప్రజల హృదయాల్లో వైఎస్‌ఆర్‌ సజీవంగా ఉన్నారని అన్నారు. ‘‘మిమ్మల్ని ఆశీర్వదించడానికి, అభినందించడానికే నేను వచ్చా’’ అని తెలిపారు. ప్రజల దీవెన నుంచే వైసీపీ పుట్టిందని, అభివృద్ధే లక్ష్యంగా ముందుకెళ్తున్నామన్నారు. జగన్‌ చాలా కష్టపడితే తప్ప ఈ పరిస్థితి రాలేదని చెప్పారు. కాంగ్రెస్‌ పొమ్మనలేక పొగబెట్టిందని విమర్శించారు. విచారణ పేరుతో జైల్లో పెట్టి..ఆస్తుల్ని సీజ్‌ చేశారన్నారు. ఎవరెన్ని కుట్రలు చేసినా జగన్‌ బెదరలేదని తెలిపారు. ప్రజల అండతో జగన్‌ అధికారంలోకి వచ్చారని విజయమ్మ అన్నారు.ఎన్టీఆర్‌ ప్రవేశపెట్టిన పథకాల్ని కూడా చంద్రబాబు పక్కన పెట్టారని వ్యాఖ్యానించారు. ప్రజలకు గత ప్రభుత్వాలు ఏం చేశాయో చెప్పాలని ప్రశ్నించారు. దుర్గగుడి ఫ్లైఓవర్‌ను కూడా చంద్రబాబు పూర్తి చేయలేకపోయారన్నారు. గత ప్రభుత్వాలు ప్రజా సమస్యలను పట్టించుకోలేదని మండిపడ్డారు. జగన్‌ ప్రజానేత..అందుకే సంక్షేమ పథకాలు తెచ్చారన్నారు. యువతకు సీఎం జగన్‌ రోల్‌ మోడల్‌ అని విజయమ్మ చెప్పుకొచ్చారు.

*****YCP గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నా..
వైసీపీ (YCP) గౌరవ అధ్యక్షురాలి పదవి నుంచి తప్పుకుంటున్నానని ప్లీనరీ సమావేశాల్లో విజయలక్ష్మి ప్రకటించారు. పార్టీ సభ్యత్వం నుంచి కూడా తప్పుకుంటున్నట్లు ఆమె చెప్పారు. తెలంగాణ లో వైఎస్ షర్మిల ఒంటరిగా పోరాటం చేస్తోందని, షర్మిలకు అండగా ఉండాల్సిన బాధ్యత తనపై ఉందని, అందుకే ఈ నిర్ణయం తీసుకుంటున్నానని తెలిపారు. అయితే తల్లిగా జగన్‌కు ఎప్పుడూ మద్దతుగానే ఉంటానని విజయలక్ష్మి స్పష్టం చేశారు. జగన్, షర్మిల వేర్వేరు రాష్ట్రాల్లో వేర్వేరు పార్టీలో ఉన్నారని, తాను రెండు పార్టీల్లోనూ కొనసాగడం సరికాదన్నారు. అందుకే రాజీనామా నిర్ణయం తీసుకుంటున్నానని విజయలక్ష్మి పేర్కొన్నారు. వక్రీకరణ, విమర్శలకు తావులేకుండా ఉండేందుకే రాజీనామా చేస్తున్నానన్నారు. ఇలాంటి రోజు వస్తుందని తాను అనుకోలేదన్నారు. వైసీపీ అభిమానులు క్షమించాలని విజయలక్ష్మి కోరారు.జగన్‌, షర్మిలకు ఎల్లప్పుడూ అండగా ఉన్నానని విజయలక్ష్మి అన్నారు. ఏపీలో తన సోదరుడు జగన్‌కు ఇబ్బంది కలగకుండా ఉండాలనే ఉద్దేశంతోనే షర్మిల తెలంగాణలో వైఎస్‌ఆర్‌టీపీ ఏర్పాటు చేసిందన్నారు. వైఎస్‌ఆర్‌ సంక్షేమ పాలన అందించడానికే షర్మిల పోరాటం చేస్తోందని విజయలక్ష్మి అన్నారు. ఆమెకు అండగా ఉండేందుకు తాను ఈ నిర్ణయం తీసుకున్నానని విజయలక్ష్మి స్పష్టం చేశారు.