Politics

ఆంధ్రాను అనాధగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది – TNI రాజకీయ వార్తలు

ఆంధ్రాను అనాధగా మార్చిన ఘనత జగన్‌కే దక్కుతుంది – TNI  రాజకీయ వార్తలు

*అన్నపూర్ణగా పేరు గడించిన ఆంధ్ర రాష్ట్రాన్ని అనాధగా మార్చిన ఘనత సీఎం జగన్ మోహన్ రెడ్డి కి దక్కుతుందని మాజీ మంత్రి, టీడీపీ(TDP) పోలీట్ బ్యూరో మెంబర్ కొల్లు రవీంద్ర విమర్శించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… ప్రభుత్వం అవలంభిస్తున్న రైతు వ్యతిరేక విధానాలను నిరసిస్తూ మచిలీపట్నంలోని కలెక్టరేట్ ధర్నా‌చౌక్ వద్ద టీడీపీ కృష్ణా జిల్లా శాఖ ఆధ్వర్యంలో రైతు దినోత్సవం నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో కొల్లు రవీంద్రతో పాటు మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గం టీడీపీ అధ్యక్షులు కొనకళ్ళ నారాయణరావు , ప్రధాన కార్యదర్శి బోడే ప్రసాద్ , రైతు విభాగం జిల్లాలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల టీడీపీ ఇన్చార్జిలు, రైతు విభాగం ప్రతినిధులుహాజరయ్యారు. ధర్నా అనంతరం కలెక్టరేట్‌లో డీఆర్ఓ వెంకటేశ్వర్లుకు టీడీపీ నేతలు వినతి పత్రం అందజేశారు.

* విజయమ్మది రెండుకళ్ల సిద్ధాంతం
ఆంధ్రప్రదేశ్‌ వైసీపీలో తాజా రాజకీయ పరిణామాలపై వైసీపీ రెబెల్‌ ఎంపీ రఘురామ రాజు స్పందించారు. గుంటూరులో జరుగుతున్న వైసీపీ ప్లీనరీ వేదికలో వైసీపీ గౌరవ అధ్యక్షురాలు విజయమ్మ రాజీనామా ప్రకటనపై ఆయన మాట్లాడారు. జగన్ స్క్రిప్ట్‌ను విజయమ్మ చదివిందని విమర్శించారు. ‘విజయమ్మతో రాజీనామా కూడా కరెక్టే , అమ్మ రాజీనామా కూడా కరెక్టే న ’ని ఎద్దేవా చేశారు. అమ్మ రాజీనామా జగన్‌లో బాధ పడినట్లుగా తనకు కనిపించిందని అన్నారు.ఆమె రాజీనామా రెండుకళ్ల సిద్ధాంతం చెప్పకనే చెప్పిందని విమర్శించారు. వీడ్కోలు సమావేశంలోనైనా ఆమెను గౌరవంగా పంపాల్సిఉండేదని అన్నారు. వైసీపీ పార్టీ గౌరవ అధ్యక్షురాలికి చిన్న కూర్చీ వేసి అవమానించారని ఆయన పేర్కొన్నారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేసితే జగన్ గౌరవం పెరిగేదని అన్నారు. షర్మిల పక్షం వహించేందుకు విజయమ్మ రాజీనామా చేస్తారని తాను ముందుగానే చెప్పానని గుర్తు చేశారు. రాష్ట్రంలో ప్రజలకిచ్చిన హామీలు జగన్‌ నెరవేర్చ లేదని విజయమ్మను నేరుగా కలిసి వివరిస్తానని, లేనిపక్షంలో లేఖ ద్వారానైనా తెలియజేస్తానని వివరించారు.గత ప్రభుత్వ హయాంలో కట్టిన ఇండ్లకే వైసీపీ రంగులు వేస్తున్నారని పేర్నొన్నారు. రాష్ట్రంలో ప్రజా ప్రతినిధులు బెదిరింపులు, అరాచకాలకు ఐఏఎస్‌, ఐపీఎస్‌ అధికారులు భయపడుతున్నారని తెలిపారు.

*త‌క్ష‌ణ‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాలి.. ఏక్‌నాథ్‌కు థాక‌రే స‌వాల్
సీఎం ప‌ద‌వి నుంచి వైదొలిగిన‌ త‌ర్వాత తొలిసారిగా ఉద్ధ‌వ్ థాక‌రే త‌న మ‌ద్ద‌తుదారులు ఏర్పాటు చేసిన బ‌హిరంగ స‌భ‌లో పాల్గొని ప్ర‌సంగించారు. మ‌హారాష్ట్ర‌లో త‌క్ష‌ణ‌మే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని డిమాండ్ చేశారు. శివ‌సేన పార్టీ సింబ‌ల్‌ను రెబెల్స్ ఉప‌యోగించుకునే ప్ర‌స‌క్తే లేద‌ని తేల్చిచెప్పారు.ఇవాళే అసెంబ్లీ ఎన్నిక‌లు నిర్వ‌హించాల‌ని అధికారంలో ఉన్న నాయ‌కుల‌కు స‌వాల్ విసురుతున్నానని థాక‌రే పేర్కొన్నారు. ఒక వేళ తాము త‌ప్పు చేస్తే ప్ర‌జ‌లు త‌మ‌ను ఇంటికి పంపిస్తారు. ఒక వేళ వారు త‌ప్పు చేస్తే వారిని ఇంటికి పంపించేస్తార‌ని పేర్కొన్నారు. ఇక శివ‌సేన నుంచి పార్టీ గుర్తును రెబెల్స్ తీసుకోలేర‌ని చెప్పారు. ఏదేమైన‌ప్ప‌టికీ ప్ర‌జ‌లు సింబ‌ల్‌ను చూడ‌ర‌ని, నాయ‌కుల వ్య‌క్తిత్వాన్ని చూస్తార‌ని తెలిపారు. గ‌త రెండున్న‌రేండ్ల నుంచి త‌న‌ను, త‌న కుటుంబాన్ని బీజేపీ టార్గెట్ చేసిన‌ప్పుడు.. ఇప్ప‌టి రెబెల్స్ సైలెంట్‌గా ఉన్నార‌ని ఉద్ధ‌వ్ థాక‌రే గుర్తు చేశారు. శివ‌సేన‌లో ఉంటూ సొంత పార్టీ నాయ‌కుల‌కు ద్రోహం చేస్తార‌ని ఊహించ‌లేద‌ని థాక‌రే అన్నారు.

*ఆ 6 కుల సంఘాల‌కు ఆత్మ‌గౌర‌వ భవ‌నాలు : మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్
తెలంగాణ‌లో వెనకబడిన వర్గాలకు సీఎం కేసీఆర్ ఆత్మ గౌరవం కల్పించారని రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ స్ప‌ష్టం చేశారు. ఏక సంఘంగా ఏర్ప‌డిన మున్నూరుకాపు, పెరిక‌, తెలంగాణ మ‌రాఠ మండ‌లి, కుమ్మ‌రి శాలివాహ‌న‌, విశ్వ‌బ్రాహ్మ‌ణ‌, ఆరేటి క్ష‌త్రియ కుల సంఘాల‌కు ఆత్మ‌గౌర‌వ భ‌వ‌న నిర్మాణ అనుమ‌తి ప‌త్రాల‌ను మంత్రులు గంగుల క‌మ‌లాక‌ర్, శ్రీనివాస్ గౌడ్ క‌లిసి అంద‌జేశారు.న‌గ‌రంలోని ఎంసీఆర్ హెచ్ఆర్‌డీలో జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి గంగుల క‌మ‌లాక‌ర్ మాట్లాడుతూ.. ఇప్పటికే 24 కుల సంఘాలు ఏక సంఘంగా ఏర్పడి అనుమతి పత్రాలు తీసుకున్నాయని తెలిపారు. మిగతా కులాలు సైతం మరో వారం రోజుల్లోపు ఏక సంఘంగా ఏర్పడాలని పిలుపునిచ్చారు. ఈ చివరి అవకాశాన్ని వినియోగించుకోవాలన్నారు. లేనిపక్షంలో వాటి నిర్మాణాలకు టెండర్లు పిలిచి వారం తర్వాత ప్రభుత్వమే చేపడుతుందని తెలియజేశారు. దేశ చరిత్రలో ఎక్కడా లేనివిధంగా 41 కులాలకు హైదరాబాద్ నడిబొడ్డున వేల కోట్లు విలువ చేసే 82.30 ఎకరాల స్థలాన్ని కేటాయించడమే కాకుండా భవన నిర్మాణాన్ని సైతం ఆయా కుల సంఘాలకే అప్పగించి నిధుల్ని సైతం ఇస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ మాత్రమే అన్నారు. ఈ అవకాశాన్ని వినియోగించుకుని వెనుకబడిన వర్గాల ఆత్మ గౌరవం సూచించేలా కులాల ఇష్ట ప్రకారం ప్రత్యేక నమూనాలతో భవనాలను నిర్మించుకోవాలన్నారు. ఈ ఆత్మగౌరవ భవనాలు హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఆయా కుల సంఘాలకు విద్యాపరంగాను, సామాజికంగానూ, సాంస్కృతికపరంగానూ, వసతిలో కూడా అత్యుత్తమ సేవలు అందిస్తాయన్నారు.మంత్రి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మహాత్మ జ్యోతిబాపూలే చేసిన రీసెర్చ్ ప్రకారం మన కులాలన్నీ ఒకే ఇంటి నుండి ఉద్భవించాయని తెలిపారు. వృత్తుల పరంగా వేరుపడి తర్వాత కులాల రూపాన్ని సంతరించుకున్నాయన్నారు. అందుచేత వెనుకబడిన వర్గాలంతా ఒక్కటే అని, ఐక్యంగా ఉండాలని పిలుపునిచ్చారు. కులంలో ఎదిగే వాళ్లకు అండగా నిలబడాలి కానీ అడ్డుపడకూడదని ఆకాంక్షించారు. కుల రహిత సమాజం కోసం పాటుపడుతూ కులాంతర వివాహాలు ప్రోత్సహించాలన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రోద్బలంతో ఒకే తాటిపైకి వచ్చిన వెనుకబడిన కులాలు ఇకముందు అదే ఆత్మగౌరవాన్ని ప్రదర్శించాలన్నారు.

*వంట గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోతే మ‌రో పోరాటం త‌ప్ప‌దు : మంత్రి శ్రీనివాస్ గౌడ్
ప్రపంచంలో ఎక్కడలేని విధంగా వంట గ్యాస్ ధరలు మన దేశంలోనే ఆకాశాన్నంటాయ‌ని మంత్రి శ్రీనివాస్ గౌడ్ పేర్కొన్నారు. వంట గ్యాస్ ధ‌ర‌లు త‌గ్గించ‌క‌పోతే మ‌రో పోరాటం త‌ప్ప‌ద‌ని ఆయ‌న కేంద్ర ప్ర‌భుత్వాన్ని హెచ్చ‌రించారు. ఈ ఎనిమిదేండ్ల‌లో వంట గ్యాస్ ధ‌ర‌లు నాలుగు రెట్లు పెంచి పేద‌ల న‌డ్డి విరిచార‌ని మండిప‌డ్డారు. వంట గ్యాస్ ధ‌ర‌ల పెంపున‌కు వ్య‌తిరేకంగా నిర‌స‌న‌లు చేప‌ట్టాల‌ని.. టీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇచ్చిన‌ పిలుపు మేరకు మహబూబ్ నగర్ తెలంగాణ చౌరస్తాలో నిర్వ‌హించిన ధ‌ర్నాలో మంత్రి శ్రీనివాస్ గౌడ్ పాల్గొని ప్ర‌సంగించారు.

*మాట ఇస్తే.. మాట తప్పని నేత YSR: Bhatti
మాట ఇస్తే.. మాట తప్పని నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి అని తెలంగాణ సీఎల్సీ నేత భట్టి విక్రమార్క అన్నారు. శుక్రవారం వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ చూపిన మార్గంలో తెలంగాణ కాంగ్రెస్ ముందుకు వెళ్తోందని, కష్టపడి పనిచేస్తున్నామన్నామని అన్నారు. వైఎస్ఆర్ హాయంలో అప్పటి ఏపీ అభివృద్ధి సంక్షేమంలో దేశంలోనే ముందుందన్నారు. నిరు పేదలకు ఇళ్ళు, రాజీవ్ ఆరోగ్య శ్రీ ఇచ్చిన మహా నాయకుడు వైఎస్ అని కొనియాడారు. ఫీజు రీయింబర్స్‌మెంట్, జలయజ్ఞాన్ని ప్రస్తుత పాలకులు ఆదర్శంగా తీసుకోవాలన్నారు. వైఎస్ కట్టిన ప్రాజక్ట్‌ల వలనే వ్యవసాయానికి నీళ్ళు అందుతున్నాయన్నారు. రైతుల‌ కోసం ఉచిత కరెంటు గురించి మొదట ఆలోచన చేసి.. అమలు చేసింది వైఎస్ఆర్ అని భట్టి విక్రమార్క పేర్కొన్నారు

*అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికే ఆదర్శం: Revanth
అభివృద్ధి, సంక్షేమంలో వైఎస్ఆర్ దేశానికే ఆదర్శంగా నిలిచారని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి అన్నారు. ఉమ్మడి ఏపీ మాజీ సీఎం వైఎస్ఆర్ జయంతి సందర్భంగా పంజాగుట్టలో వైఎస్ విగ్రహానికి తెలంగాణ కాంగ్రెస్ నివాళులర్పించింది. ఈ సందర్భంగా టీపీసీసీ చీఫ్ మాట్లాడుతూ… వైఎస్ చేపట్టిన నీటి ప్రాజెక్టులు దేశానికి ఆదర్శంగా నిలిచాయన్నారు. రాహుల్ ని దేశానికి ప్రధానిని చేయటం తన లక్ష్యమని వైఎస్ఆర్ చెప్పేవారని గుర్తుచేశారు. వైఎస్ఆర్ ఆలోచనల మేరకు రాహుల్‌ను ప్రధానిని చేసే వరకు విశ్రమించమని స్పష్టం చేశారు. పీవీ(PV), ఎన్టీఆర్ ), మర్రి చెన్నారెడ్డి ల మాదిరి.. హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనాన్ని ఏర్పాటు చేయాలని ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌(KCr)కు రేవంత్ రెడ్డి విజ్ఞప్తి చేశారు.కేసీఆర్ చేయకుంటే కాంగ్రెస్ అధికారంలోకి రాగానే హైదరాబాద్‌లో వైఎస్ స్ముతీవనం నిర్మిస్తామని తెలిపారు. వైఎస్ఆర్ ఆలోచనలను తెలంగాణ కాంగ్రెస్ ముందుకు తీసుకెళ్తోందన్నారు. కాంగ్రెస్ అధిష్టానానికి వైఎస్ అత్యంత విశ్వాస పాత్రడని అన్నారు. మాట ఇస్తే ఎన్ని కష్టాలొచ్చినా మడప తిప్పని నేత రాజశేఖరరెడ్డి అని అన్నారు. వైఎస్ఆర్ మన మధ్య లేకపోవడం బాధాకరమని రేవంత్ రెడ్డి ఆవేదన చెందారు

*పోలవరం నిర్వాసితుల పరిహారం పంపిణీలో భారీ అవినీతి: Devineni
పోలవరం నిర్వాసితుల పరిహారం పంపిణీలో అవకతవకలపై టీడీపీ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విరుచుకుపడ్డారు. ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ…‘‘ పోలవరం నిర్వాసితుల పరిహారం పంపిణీలో భారీ అవినీతి. కావాల్సిన వారికి అడ్డగోలుగా చెల్లింపులు. నిర్వాసితులకు మొండిచేయి చూపుతున్న సర్కార్. ఎన్నికల ముందు నిర్వాసితులకు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి?. కోట్లాది రూపాయల నిర్వాసితుల సొమ్ము కొల్లగొట్టిన మీ నేతలపై ఏం చర్యలు తీసుకుంటారు? సీఎం జగన్’’ అంటూ దేవినేని ఉమా ట్వీట్ చేశారు

* సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారు: Atchannaidu
రాష్ట్ర ప్రభుత్వం రైతాంగాన్ని మోసం చేస్తోందని, సిగ్గు, ఎగ్గూ లేకుండా రైతు దినోత్సవం నిర్వహిస్తున్నారని టీడీపీ (TDP) రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు విమర్శించారు. శుక్రవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ రైతు దినోత్సవం కంటే రైతు దగా దినోత్సవంగా మార్చుకుంటే మంచిదన్నారు. తితిలీ తుఫాన్‌లో నాలుగు మండలాలు విధ్వంసం అయ్యాయని, అప్పట్లో చంద్రబాబు బాధితులకు యుద్ధ ప్రాతిపదికన పరిహారం అందించారన్నారు. ఆ రోజు జగన్ (Jagan) ప్రక్క జిల్లాలో క్యాట్ వాక్ చేశారు తప్పా పాలకరించలేదని ఎద్దేవా చేశారు. వైసీపీ (YCP) అధికారంలోకి వచ్చిన వెంటనే తితిలీ బాధితులకు పరిహారం డబుల్ ఇస్తామన్నారు… పరిహారం వైసీపీకి చెందిన వారికే ఇస్తున్నారని ఆరోపించారు. జగన్ ఫేక్ ముఖ్యమంత్రి అని, టీడీపీ (TDP) సానుభూతి పరులను జాబితా నుంచి తప్పిస్తున్నారని మండిపడ్డారు. అవసరమైతే న్యాయస్థానానికి వెళ్లి పరిహారం ఇప్పిస్తామన్నారు. రైతు దినోత్సవం ఏమి చేశారని నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. రైతులను దగా చేసినందుకు ఉత్సవాలా? జిల్లాలో ఎక్కడా విత్తనాలు, ఎరువులు దొరకటం లేదు. ప్రభుత్వ తీరుపై విసుగు చెంది రైతులు క్రాప్ హాలిడే ప్రకటిస్తున్నారని అన్నారు. ఏపీలో రైతు ఆత్మహత్యలు పెరిగాయని కేంద్రమే చెబుతోందన్నారు. ఇన్ పుట్ సబ్సిడీ లేదు… రైతు అమ్ముకున్న పంటకు డబ్బు ఇవ్వలేని దద్దమ్మ ప్రభుత్వమని అచ్చెన్నాయుడు తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

*ప్లీనరీలో పేలవంగా సీఎం ప్రసంగం: Varla
వైసీపీ ప్లీనరీ లో ముఖ్యమంత్రి జగన్ప్ర సంగం పేలవంగా ఉందని టీడీపీ(TDP) నేత వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… తాను రాష్ట్ర ముఖ్యమంత్రినని మరచి, కేవలం ప్రతిపక్ష నేతను నిందించడానికే తన సమయాన్ని వెచ్చించారని మండిపడ్డారు. ప్రజా విశ్వాసo కోల్పోయిన విషయాన్ని ప్రస్తావించకుండా, చంద్రబాబు ను దూషిస్తూ పబ్బం గడుపుకున్నారని మండిపడ్డారు. పతనావస్థలో ఉన్న రాష్ట్ర ఆర్ధిక స్థితిగతులు ప్రస్థావించకుండా, ప్రజలను మభ్యపెట్టారన్నారు. ప్లీనరీలో ఇంకా సమయముంది కనుక, ప్రజా సమస్యలను ప్రస్థావిస్తూ, ప్రభుత్వ భవిష్యత్ ప్రణాళికను తెలియజేయవలసినదిగా గుర్తు చేస్తూన్నాను అంటూ వర్ల రామయ్య అన్నారు.

*పార్టీలో తన తల్లి అడ్డును జగన్ తొలగించుకున్నారు: Anitha
విజయలక్ష్మి ఎప్పుడూ వైసీపీ(YCP) పార్టీలో కీలక పాత్ర పోషించలేదని టీడీపీ(TDP) నేత వంగలపూడి అనిత అన్నారు. వైసీపీకి విజయలక్ష్మి రాజీనామాపై ఏబీఎన్‌తో మాట్లాడుతూ.. రాజీనామా చేశానని చెప్పడానికే విజయమ్మ ప్లీనరీకి వచ్చారని తెలిపారు. పార్టీ సమావేశాల్లోనూ ఆమె ఎప్పుడూ పాల్గొనలేదన్నారు. పార్టీలో తన తల్లి అడ్డును జగన్ తొలగించుకున్నారని విమర్శించారు. అవసరం తీరగానే.. తల్లిని, చెల్లిని జగన్ పార్టీకి దూరం పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. విజయలక్ష్మి రాజీనామాను ఓ డ్రామాగా ప్లాన్ చేశారన్నారు. విజయలక్ష్మి రాజీనామా కోసమే.. వైసీపీ ప్లీనరీని ఉపయోగించుకున్నారని అన్నారు. విజయలక్ష్మిని పార్టీ నుంచి తప్పించడానికి చేసిన ప్లీనరీ ఇది అని వ్యాఖ్యలు చేశారు. సీఎం కుర్చీలో కూర్చోడానికి జగన్ ఏమైనా చేస్తారని వంగలపూడి అనిత అన్నారు.

*అమ్మ రాజీనామా కరెక్ట్‌… అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్: ఎంపీ Raghurama
విజయలక్ష్మివీడ్కోలు సభలా వైసీపీ ప్లీనరీ(YCP plenary) సమావేశం ఉందని ఎంపీ రఘురామకృష్ణం రాజు అన్నారు. పార్టీ గౌరవాధ్యక్షురాలి పదవితో పాటు పార్టీ సభ్యత్వానికి వైఎస్ విజయమ్మ రాజీనామా చేయడంపై ఎంపీ రఘురామ స్పందించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. అమ్మ రాజీనామానా.. అమ్మతో రాజీనామా అని అందరూ అడుగుతున్నారని అన్నారు. విజయమ్మ రాజీనామా చేస్తోందని తాను ముందే చెప్పానన్నారు. అమ్మ రాజీనామా కరెక్ట్‌… అమ్మతో రాజీనామా కూడా కరెక్ట్ అని వ్యాఖ్యలు చేశారు. ఎక్కడైనా గౌరవాధ్యక్షులకు పెద్ద పీట వేస్తారని, వైసీపీలో మాత్రం పెద్దకుర్చీలో సీఎం… చిన్న కుర్చీలో గౌరవాధ్యక్షులు ఉన్నారన్నారు. గౌరవ అధ్యక్షురాలికి పెద్ద సీటు వేస్తే గౌరవం దక్కేదని ఎంపీ తెలిపారు.జగన్ జైల్లో ఉన్నప్పుడు దేహిదేహి అంటూ విజయలక్ష్మి తిరిగారని గుర్తుచేశారు. కొడుకు బెయిల్ కోసం విజయలక్ష్మి సోనియా కాళ్లు పట్టుకున్నట్లు సమాచారం కూడా ఉందన్నారు. ప్లీనరీలో జగన్ చెప్పినవేవీ చేయలేదని విజయలక్ష్మి చెప్తానన్నారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ కుదరదని… జగన్మోహన్ రెడ్డి అయిన ఇంకెవరైనా అని చెప్పుకొచ్చారు. పార్టీ శాశ్వత అధ్యక్షుడు కాన్సెప్ట్ భారతదేశంలో ఎక్కడ ఉండదన్నారు. తాను కూడా పార్టీలో సభ్యుడిగా ఉన్నాట్లు తెలిపారు. పార్టీ అధ్యక్షుడికి ఎన్నికలు జరగాలని, ఎన్నికలు లేకపోతే పదవిలో ఐదేళ్లు మాత్రమే ఉండాలని చెప్పారు. పార్టీ శాశ్వత అధ్యక్ష ఎంపికపై కోర్టుకు వెళ్లనున్నట్లు తెలిపారు. ‘‘భోజనాల ఖర్చు ఒకరిది, బియ్యం ఖర్చు ఒకరిది ప్లీనరీ వలన మా పార్టీకి లాభమే… నష్టం లేదు’’ అంటూ ఎంపీ రఘురామకృష్ణం రాజు యెద్దేవా చేశారు.

*విజయలక్ష్మి రాజీనామా అందరూ ఊహించిందే: Varla ramaiah
వైసీపీ(YCP)కి వైఎస్ విజయలక్ష్మి రాజీనామాపై టీడీపీ నేత వర్ల రామయ్య స్పందించారు. శుక్రవారం ఏబీఎన్‌తో మాట్లాడుతూ… విజయలక్ష్మి రాజీనామా అందరూ ఊహించిందే అని అన్నారు. జగన్ ఎప్పటి నుంచో కోరుకున్నదే జరిగిందని తెలిపారు. పార్టీ గౌరవ అధ్యక్ష పదవికి అంత ప్రాధాన్యత ఉండదన్నారు. విజయలక్ష్మి ఉనికినే పార్టీకి దూరం చేశారని అన్నారు. వైఎస్ విజయలక్ష్మి సంతకంతో రాజీనామా పత్రం అనేది వైసీపీ శ్రేణుల చర్యే అని వర్ల రామయ్య తెలిపారు.

*ఫీల్డ్ అసిస్టెంట్‌లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలి: Bjp leader
రాష్ట్ర ప్రభుత్వం తొలగించిన ఫీల్డ్ అసిస్టెం లను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని బీజేవైఎం (BJYM) అధ్యక్షుడు భానుప్రకాష్ డిమాండ్ చేశారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ… రాజకీయ నాయకుల వేధింపులు తట్టుకొని ఫీల్డ్ అసిస్టెంట్లను పనిచేశారని అన్నారు. మూడేళ్ళుగా పోషణ లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. హైకోర్టు తీర్పును కూడా రాష్ట్ర ప్రభుత్వం బుట్ట దాఖలు చేసిందని మండిపడ్డారు. ముఖ్యమంత్రి అసెంబ్లీ సాక్షిగా ఫీల్డ్ అసిస్టెంట్లను విధుల్లోకి తీసుకుంటామని హామీ ఇచ్చి ఇప్పటి వరకు తీసుకోలేదన్నారు. ప్రభుత్వం వెంటనే విధుల్లోకి తీసుకుంటున్నట్లు జీవో విడుదల చేయాలని.. లేని పక్షంలో పెద్ద ఎత్తున ఉద్యమాలకు శ్రీకారం చుడుతామని భానుప్రకాష్ హెచ్చరించారు.

*సేంద్రీయ వ్యవసాయంపై ప్రభుత్వానికి అవగాహన లేదు: సోము వీర్రాజు
సేంద్రీయ వ్యవసాయంపై ఏపీ ప్రభుత్వానికి అవగాహన లేదని బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు పేర్కొన్నారు. యూనివర్సిటీ అంటూ దిశ దశ లేని అనాలోచిత నిర్ణయాలు చేస్తోందని విమర్శించారు. ఎక్కడా లేని విధంగా ఏపీకి మూడు కారిడార్లను కేంద్రం ఇచ్చిందని గుర్తు చేశారు. ఆత్మ అనే బ్రాంచ్ ద్వారా అన్ని రాష్ట్రాల్లో సేంద్రీయ వ్యవసాయం చేయాలని కేంద్రం సూచించిందని తెలిపారు.

*YSR సువర్ణ పాలనను ప్రజలు గుర్తించారు: Sharmila
టీఆర్‌ఎస్ (TRS) ప్రభుత్వాన్ని వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు షర్మిల సూటిగా ప్రశ్నించారు. లోటస్పాండ్లో వైఎస్సార్‌టీపీ (YSRTP) ఆవిర్భావ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌టీపీ పార్టీ జెండాను షర్మిల ఆవిష్కరించారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడుతూ వైఎస్ను స్మరించుకోవడానికి హైదరాబాద్లో సెంటు భూమి కూడా లేదా? అని ప్రశ్నించారు. షర్మిల వైఎస్సార్ సంక్షేమ పాలన ప్రతి గడపను… ప్రతి గుండెను తాకిందని చెప్పారు. వైఎస్సార్ సువర్ణ పాలనను ప్రజలు గుర్తించారని తెలిపారు. వైఎస్ సేవలను ప్రభుత్వాలు మాత్రం గుర్తించలేదని దుయ్యబట్టారు. హైదరాబాద్కేం ద్రంగా వైఎస్సార్ సువర్ణపాలన అందించారని షర్మిల పేర్కొన్నారు. కాంగ్రెస్, టీఆర్ఎస్ ప్రభుత్వాలు వైఎస్ సేవలను విస్మరించాయని షర్మిల మండిపడ్డారు.

*అది వైసీపీ ప్లీనరీ కాదు.. Drama గ్యాలరీ: అచ్చెన్నాయుడు
అది వైసీపీ ప్లీనరీ కాదు.. డ్రామా గ్యాలరీ అని టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ప్లీనరీ పేరుతో వైసీపీ అధికార దుర్వినియోగం పాల్పడిందని ఆరోపించారు. రెండ్రోజుల ప్లీనరీతో ఆర్టీసీకి రూ.10 కోట్లు నష్టమని, ఇప్పటికే నష్టాల్లో ఉన్న ఆర్టీసీ 3 సార్లు చార్జీలు పెంచిన విషయాన్ని గుర్తు చేశారు. ప్రతిపక్ష పార్టీల సభలకు అడ్డంకులు సృష్టించే ప్రభుత్వం, నేడు వైసీపీ ప్లీనరీకి సపర్యలు చేస్తోందన్నారు. రాజధాని రైతుల పాదయాత్రకు అనుమతి ఇవ్వని అధికారులు.. ప్లీనరీకి మాత్రం రెడ్ కార్పెట్ వేసి మరీ సేవలు చేస్తున్నారని ఆరోపించారు. డ్వాక్రా మహిళలను బెదిరించి ప్లీనరీకి తరలిస్తుండడం అన్యాయమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నాగార్జున వర్సిటీకి సెలవులిచ్చారని పేర్కొన్నారు.

* చంద్రబాబుపై పోటీకి సిద్ధం: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి
మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి కుటుంబంపై తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు నిరాధార ఆరోపణలు చేయడం హస్యాస్పదమని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. గురువారం యర్రాతివారిపల్లెలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో చంద్రబాబు తాను చేసిన అభివృద్ధిని చెప్పుకోలేక పెద్దిరెడ్డి కుటుంబాన్ని విమర్శిస్తే ప్రజాదరణ పొందలేరన్నారు. తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని.. చంద్రబాబునాయుడు కూడా రాజీనామా చేసి కుప్పంలో లేదా తంబళ్లపల్లెలో తనపై పోటీచేసి గెలవాలని సవాల్‌ విసిరారు. మహానాడుకు వెళ్లకుండా తామెవరినీ అడ్డుకోలేదని స్పష్టం చేశారు. తెదేపా జాతీయ కార్యదర్శి నల్లారి కిశోర్‌కుమార్‌రెడ్డి ఎక్కడ పోటీ చేసినా డిపాజిట్టు కూడా దక్కనీయమన్నారు. చంద్రబాబులా సొంతవారిని మోసం చేసి పైకిరాలేదని.. కష్టంతో పైకొచ్చిన కుటుంబం తమదని చెప్పారు. జడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్‌రెడ్డి, ఎంపీపీ ఎల్లప్ప, బి.కొత్తకోట ఏఎంసీ ఛైర్మన్‌ ఉమాపతిరెడ్డి, కోఆప్షన్‌ సభ్యుడు ఇమ్రాన్‌ పాల్గొన్నారు.

*జగన్ పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా : Nara Lokes
సీఎం జగన్ నాడు-నేడు పబ్లిసిటీకి.. రియాల్టీకి చాలా తేడా ఉందని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ పేర్కొన్నారు. టీచర్లు కావాలని గిరిజన పిల్లలు వేడుకోవడం దురదృష్టకరమన్నారు. విద్యావ్యవస్థను నాశనం చేసే నిరంకుశ నిర్ణయాలను సీఎం జగన్ వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పాఠశాలల్లో విద్యార్థులు- ఉపాధ్యాయుల నిబంధనలకు అనుగుణంగా ఉండాలని కోరారు.

*జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం: పట్టాభి
సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల విలీన ప్రక్రియతో ఏపీలో 8 వేల పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మారుస్తోంది స్కూళ్ల రూపురేఖలు కాదు… బడులకు బడులనే మాయం చేసేస్తున్నాడని దుయ్యబట్టారు. రూ. 2వేల కోట్ల అప్పు కోసం విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. చిన్నారుల పాలిట జగన్ కంసమామ అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాపాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలి రోజే ఆందోళనకు దిగారు. మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విలీనానికి స్వస్థి పలకాలని డిమాండ్‌ చేశారు.

*దగా కేంద్రాలుగా… రైతు భరోసా కేంద్రాలు: Nakka Anand
జగన్‌ పాలనలో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని, జగన్ అధికారం చేపట్టాక వ్యవసాయం కుదేలయ్యిందని మాజీ మంత్రి నక్కా ఆనంద్‌బాబు విమర్శించారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ.. రైతు భరోసా కేంద్రాలు.. దగా కేంద్రాలుగా మారాయన్నారు. ప్రభుత్వం రైతుల దగ్గర ధాన్యం కొనుగోలు చేసిన దాఖలాలు లేవన్నారు. కౌలు రైతుల పరిస్థితి మరీ దారుణంగా ఉందని తెలిపారు. రైతులు క్రాప్ హాలిడే ప్రకటించటం ప్రభుత్వానికి సిగ్గుచేటని నక్కా ఆనంద్‌బాబు ఆగ్రహం వ్యక్తం చేశారు.

*చంద్రబాబు పర్యటనతో వైసీపీ నేతల్లో భయం: Panabaka laxmi
రాయలసీమలో టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు పర్యటనతో వైసీపీ నేతలకు భయం పట్టుకుందని మాజీ కేంద్రమంత్రి, టీడీపీ నేత పనబాకలక్ష్మి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… తిరుపతిలో 30 యాక్ట్ అమలుకు వైసీపీ (YCP) నేతల ఒత్తిడే కారణమని మండిపడ్డారు. ప్రతిపక్ష నేత పర్యటన సమయంలో ఆంక్షలు పెట్టడమేంటి అని ప్రశ్నించారు. మదనపల్లె సభ జనసంద్రంగా మారిందన్నారు. అడుగడుగునా చంద్రబాబుకు జనం నీరాజనాలు పలుకుతున్నారని తెలిపారు. తిరుపతి జిల్లాలో చంద్రబాబు పర్యటనను విజయవంతం చేస్తామని… కేసులకు భయపడమని పనబాక లక్ష్మీ స్పష్టం చేశారు.

*రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీకి జగన్ మద్దతు: Sailajanath
రాష్ట్రానికి ద్రోహం చేసిన బీజేపీ కి సీఎం జగన్ మద్దతు ఇస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షులు శైలజానాథ్ మండిపడ్డారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, విభజన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ధర్నాలో శైలజానాథ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… రాష్ట్రపతి ఎన్నికల్లో టీడీపీ(TDP), వైసీపీ(YCP)లు బీజేపీ అభ్యర్థికి వ్యతిరేకంగా వోట్ వేయాలని డిమాండ్ చేశారు. 25 ఎంపీలు ఇస్తే హోదా తీసుకువస్తా అని చెప్పిన హామీ ఏమైందని ప్రశ్నించారు. హోదా, విభజన హామీలను మోదీ కాళ్ళ దగ్గర తాకట్టు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని స్పష్టం చేశారు. వైసీపీ ఎంపీలందరినీ కలిసి హోదా విభజన హామీలపై ఒత్తిడి తెస్తామన్నారు. రాష్ట్రానికి హోదా విభజన హామీలను అమలు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడుతుందని శైలజానాథ్ అన్నారు.

*పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానం: బొత్స
ఉపాధ్యాయుల సంఘాలు లేవనెత్తిన సమస్యలపై వారితో చర్చించానని మంత్రి బొత్స సత్యనారాయణ పేర్కొన్నారు. నేడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సానుకూల నిర్ణయం తీసుకుంటామని వారికి చెప్పానన్నారు. జీఓ 117లో ఉన్న అభ్యంతరాలపై సవరించిన ఉత్తర్వులు ఇస్తామన్నారు. పాఠశాలల్లో అంగ్ల మాద్యమం ప్రభుత్వ విధానమని… దానికి కట్టుబడి ఉన్నామని.. వెనక్కి తగ్గబోమని వెల్లడించారు. ఉపాధ్యాయ సంఘాలు ప్రభుత్వ నిర్ణయాలపై సంతోషంగా ఉన్నాయనే అనుకుంటున్నామని బొత్స వెల్లడించారు.

*అచ్చే దిన్ అంటూ.. చచ్చే ది చూపిస్తున్నారు: Tulasireddy
కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పదే పదే వంట గ్యాస్ ధర పెంచడం శోచనీయమని పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ తులసిరెడ్డి అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… గడిచిన మూడు నెలల్లో నాలుగు సార్లు పెంచిందన్నారు. కాంగ్రెస్ పాలనలో సిలిండర్ ధర రూ.410 ఉండగా, నేడు రూ.1100లు దాటిందని మండిపడ్డారు. గృహిణులు వంట గదిలోకి వెళ్ళాలంటే భయపడిపోతున్నారన్నారు. ‘‘ఒక వైపు అచ్చే దిన్ అంటూ, మరోకవైపు చచ్చే ది చూపిస్తున్నారు ప్రధాని’’ అంటూ మండిపడ్డారు. పెంచిన వంట గ్యాస్ ధర వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. వంట గ్యాస్ ధర తగ్గిస్తేనే రాష్ట్రపతి ఎన్నికలలో బీజేపీకి మద్దతు ఇస్తామని లేకుంటే వ్యతిరేకంగా ఓటు వేస్తామని వైసీపీ (TDP), టీడీపీ (TDP) పార్టీలు ప్రకటించాలని పేర్కొన్నారు. వంట గ్యాస్ ధర పెంపుపై జనసేన తన వైఖరిని స్పష్టం చేయాలని తులసిరెడ్డి తెలిపారు.

*జగన్‌ పబ్లిసిటీకి.. రియాలిటీకి ఎంతో తేడా: లోకేశ్‌
పాడేరు మండలం సలుగు పంచాయతీలోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు ఉపాధ్యాయుడిని పంపాలని గిరిజన చిన్నారులు వేడుకోవాల్సిన పరిస్థితి రావడం బాధాకరమని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్‌ అన్నారు. కంస మామ జగన్‌రెడ్డి ‘నాడు-నేడు’ పేరుతో చేస్తున్న పబ్లిసిటీకి, రియాలిటీకి ఎంత తేడా ఉందో గమనించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. విద్యా వ్యవస్థను నాశనం చేస్తూ ప్రభుత్వం తీసుకుంటున్న నిరంకుశ నిర్ణయాలను వెనక్కి తీసుకోవాలని, అన్ని పాఠశాలల్లో విద్యార్థులు – ఉపాధ్యాయుల నిష్పత్తిని పాటించాలని లోకేశ్‌ డిమాండ్‌ చేశారు.

*బీసీల కులగణన కోసం ఉద్యమం: కేసన
జాతీయ జనగణనలో భాగంగా బీసీల కులగణనను చేపట్టాలని.. లేని పక్షంలో దేశవ్యాప్తంగా పెద్దఎత్తున ఉద్యమం చేపడతానికి సిద్ధమవుతున్నామని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు జాజుల శ్రీనివా్‌సగౌడ్‌, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకర్‌రావు వెల్లడించారు. అందులో భాగంగా ఆగస్టు 7న వేలాది మందితో ఢిల్లీలోని కలకటోరా స్టేడీయంలో ఓబీసీ జాతీయ మహాసభను నిర్వహించి, 8న పార్లమెంటును ముట్టడిస్తామని ప్రకటించారు. గురువారం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ బీసీ సంక్షేమ సంఘాల కోర్‌కమిటీ సమావేశం బీసీ కుల సంఘాల జేఏసీ చైౖర్మన్‌ కుందారం గణే్‌షచారి అధ్యక్షతన జరిగింది.

*పారిశ్రామికవాడల్లో 5.5 లక్షల ఉద్యోగాలు: మంత్రి అమర్‌నాథ్‌
జాతీయ పారిశ్రామికవాడల అభివృద్ధి కార్యక్రమం ద్వారా చెన్నై-బెంగళూరు, విశాఖపట్నం-చెన్నై, హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక కారిడార్లను అభివృద్ధి చేస్తున్నట్లు రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌ తెలిపారు. ఇవి పూర్తయితే 2040 నాటికి 5.50 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించవచ్చని చెప్పారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అధ్యక్షతన గురువారం ఢిల్లీలో నిర్వహించిన అపెక్స్‌ మానిటరింగ్‌ అథారిటీ సమావేశంలో మంత్రి వర్చువల్‌గా పాల్గొన్నారు. రాష్ట్రంలోని అన్ని జిల్లాలను కలుపుతూ మొత్తం 25 వేల ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటవుతున్న పారిశ్రామిక కారిడార్ల ద్వారా రూ.లక్ష కోట్లకుపైగా పెట్టుబడులు వస్తాయని ఆయన అన్నారు. దేశంలోనే మూడు పారిశ్రామిక కారిడార్‌లను అభివృద్ధి చేస్తున్న రాష్ట్రం ఏపీ ఒక్కటేనని చెప్పారు.

*జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం: పట్టాభి
సీఎం జగన్‌ అనాలోచిత నిర్ణయాలతో విద్యా వ్యవస్థ సర్వనాశనం అవుతోందని టీడీపీ నేత పట్టాభి ధ్వజమెత్తారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పాఠశాలల విలీన ప్రక్రియతో ఏపీలో 8 వేల పాఠశాలలు కనుమరుగయ్యే పరిస్థితి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. జగన్ మారుస్తోంది స్కూళ్ల రూపురేఖలు కాదు… బడులకు బడులనే మాయం చేసేస్తున్నాడని దుయ్యబట్టారు. రూ. 2వేల కోట్ల అప్పు కోసం విద్యా వ్యవస్థను తాకట్టు పెట్టిన ఘనుడు జగన్ అని మండిపడ్డారు. చిన్నారుల పాలిట జగన్ కంసమామ అని పట్టాభి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలోని ప్రాథమిక పాఠశాలలను ప్రాథమికోన్నత, ఉన్నత విద్యాపాఠశాలల్లో విలీనం చేస్తూ రాష్ట్రం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై విద్యార్థులు, తల్లిదండ్రులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలి రోజే ఆందోళనకు దిగారు. మా పాఠశాలను వేరే పాఠశాలలో విలీనం చేయవద్దంటూ విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆందోళన చేశారు. విలీనానికి స్వస్థి పలకాలని డిమాండ్‌ చేశారు.