Editorials

‘అమ్మ రాజీనామా’.. అనేక సంకేతాలు, అర్థాలు!

‘అమ్మ రాజీనామా’.. అనేక సంకేతాలు, అర్థాలు!

వైఎస్ విజయమ్మ వైఎస్సార్ కాంగ్రెస్ పదవికి, సభ్యత్వానికి రాజీనామా చేశారు.‘కొడుకు కష్టాల్లో ఉన్నప్పుడు, వెంటే నిలిచాను. సుఖాల్లో ఉన్నప్పుడు విడిచి దూరం వెళ్లిపోతున్నాను’ అనే వాదన ఎందుకో ఒక పట్టాన సామాన్యుల మట్టిబుర్రలకు అర్థం కావడం లేదు. ‘తన కూతురు ఒంటరిగా పోరాడుతున్నది గనుక..’ అనే మాట కూడా తమాషాగా అనిపిస్తోంది. పార్టీ పెట్టి ఏడాది అవుతుండగా.. ‘ఇంకా ఒంటరిగా’ ఉన్న నాయకురాలు షర్మిల, మరో ఏడాదిలో ఆ పార్టీని ఎన్నికలకు ఎలా సిద్ధం చేయగలుగుతుంది. ఏదేమైనా.. పులివెందుల వంటి ఒక ప్రతిష్ఠాత్మక నియోజకవర్గానికి వైఎస్సార్ వంటి ప్రభావపూరితమైన నాయకుడి తర్వాత ప్రాతినిధ్యం వహించిన ఆయన భార్య.. ఇవాళ, యావత్తు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల ఊసునే విసర్జించినట్టు లెక్క. ఆమె కేవలం వైసీపీ గౌరవాక్ష పదవికి, ప్రాథమిక సభ్యత్వానికి మాత్రమే రాజీనామా చేసినట్లు అనుకోకూడదు. ఏపీతో రాజకీయ సంబంధాలనే తెంచుకున్నట్టు!!ఈ పరిణామాలను వైసీపీ నాయకులు ఎలాగైనా సమర్థించుకోవచ్చు.. మసిపూసి మారేడుకాయ చేయడానికి ప్రయత్నించవచ్చు. కానీ, ప్రజలందరికీ చాలా తేటతెల్లంగా అర్థమవుతోంది. తాను జైల్లో ఉండగా, దిక్కూమొక్కూ లేకుండా ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆయువుపోసి కాపాడిన చెల్లెలు షర్మిలను నిన్న, తల్లి విజయమ్మను ఇవాళ.. జగన్ వదిలించుకున్నారని!!ఈ పరిణామానికి ఎన్నివేల కోణాలున్నాయో.. ప్రజలు వాటన్నింటినీ చాలా చక్కగా అర్థం చేసుకుంటారు. జగనన్న తల్లిని మించి తమను ప్రేమిస్తాననడం నిజమేనా అని కూడా ప్రజలు సందేహిస్తారు!!
—— దాసరి కృష్ణమోహన్, సీనియర్ జర్నలిస్ట్