DailyDose

ప్రియురాలితో విదేశీ టూర్‌… పాస్‌పోర్ట్‌ పేజీలు చించివేతపై అరెస్ట్‌

Auto Draft

ప్రియురాలితో కలిసి విదేశీ టూర్‌కు వెళ్లి ఎంజాయ్‌ చేసిన ఒక వ్యక్తి, భార్యకు ఈ విషయం తెలియకుండా ఉండేందుకు పాస్‌పోర్ట్‌లో పేజీలను చించివేశాడు. అయితే పాస్‌పోర్ట్‌ దుర్వినియోగం ఆరోపణలపై అతడు అరెస్టయ్యాడు. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఈ సంఘటన జరిగింది. 32 ఏళ్ల ఇంజినీర్‌ ఒక ఎంఎన్‌సీలో పని చేస్తున్నాడు. ఆఫీస్‌ పనిమీద టూర్‌కు వెళ్తున్నట్లు భార్యకు చెప్పాడు. అయితే వివాహేతర సంబంధం ఉన్న మహిళతో కలిసి అతడు మాల్దీవులకు వెళ్లాడు.

మరోవైపు భార్య ఆ వ్యక్తికి పలు మార్లు ఫోన్‌ చేసింది. అతడు మాట్లాడకపోవడంతో ఆమె అనుమానించింది. పలుసార్లు వాట్సాప్‌ కాల్స్‌ కూడా చేసింది. దీంతో ఆ వ్యక్తి తన టూర్‌ను కుదించుకున్నాడు. ఆఫీస్‌ పని మీద కాకుండా ప్రియురాలితో ఎంజాయ్‌ కోసం మాల్దీవులకు వెళ్లిన సంగతి భార్యకు తెలియకూడదని భావించాడు. పాస్‌పోర్ట్‌లో సంబంధిత స్టాంప్‌లున్న పేజీలను చించివేశాడు. విమానంలో గురువారం రాత్రి ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నాడు.

కాగా, ఆ వ్యక్తి పాస్‌పోర్ట్‌లో కొన్ని పేజీలు చించినట్లుగా ఉండటాన్ని ఇమిగ్రేషన్‌ అధికారులు గ్రహించారు. పాస్‌పోర్ట్‌ దుర్వినియోగానికి పాల్పడిన ఆ వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. దీంతో మోసం, ఫోర్జరీ కింద అతడిపై కేసు నమోదు చేసి అరెస్ట్‌ చేశారు. అయితే పాస్‌పోర్ట్‌ బుక్‌లో పేజీలు చించివేయడం నేరమన్న సంగతి తెలియక, భార్య కళ్లుగప్పేందుకు అలా చేసినట్లు అతడు చెప్పాడని పోలీసులు తెలిపారు.