NRI-NRT

అమెరికాలో డాల‌ర్లు వ‌ద్ద‌ని.. హైద‌రాబాద్ వ‌చ్చి పాల వ్యాపారం చేస్తున్న‌డు

అమెరికాలో డాల‌ర్లు వ‌ద్ద‌ని.. హైద‌రాబాద్ వ‌చ్చి పాల వ్యాపారం చేస్తున్న‌డు

అమెరికాలో డాలర్ల జీతం సంతృప్తినివ్వలేదు. ఖండాలు దాటినా.. పుట్టిన ఊరిపైనా, పెరిగిన నేలపైనా మమకారం పోలేదు. ఆ బంధమే వెనక్కి వచ్చేలా చేసింది. కోటి ఆశలతో కన్ననేలపై అడుగుపెట్టినా.. బిడ్డ కోసం గుక్కెడు కల్తీలేని పాలు దొరకలేదు. అప్పుడే ‘స్వచ్ఛమైన పాల వ్యాపారం చేస్తాను’ అని తన బిడ్డకు వాగ్దానం చేశాడు. ఆ మాటకే కట్టుబడ్డాడు.. కిశోర్‌ ఇందుకూరి.

పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లాలో అయినా.. పెరిగింది, చదువుకున్నది, ఉంటున్నది మాత్రం హైదరాబాద్‌లోనే. కిశోర్‌ నాన్న మహీంద్ర బ్యాంక్‌లో 30 ఏండ్లు పనిచేశారు. ఆయన ప్రోత్సాహంతో కిశోర్‌ ఐఐటీ ఖరగ్‌పూర్‌లో చదువుకున్నాడు. ఐఐటీ తర్వాత యూఎస్‌ వెళ్లాడు. అక్కడ పీహెచ్‌డీ ముగించిఆరేండ్లకు పైగా ఉద్యోగం చేశాడు. లక్షల ప్యాకేజీ. అయితే, ఇంటిపై మమకారం అమెరికాను విడిచిపెట్టేలా చేసింది. హైదరాబాద్‌కు తిరిగొచ్చాడు. అప్పుడే ఏదైనా వ్యాపారం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో డెయిరీ ఫామ్‌ ఏర్పాటుపై మనసు మళ్లింది. ఎందుకంటే, కిశోర్‌ డెయిరీ ఫామ్‌ మొదలుపెట్టే నాటికి, స్వచ్ఛమైన పాలు దొరకడమే గగనం! తన బిడ్డకు సైతం కల్తీలేని పాలు అందించలేని పరిస్థితి. అప్పుడే, ‘సిద్స్‌ ఫామ్‌’ పేరుతో డెయిరీ ప్రారంభించాడు.

20 పశువులతో..
శంషాబాద్‌ దగ్గర్లో భూమిని లీజుకు తీసుకొని, కొయంబత్తూరు నుంచి తీసుకువచ్చిన 20 పశువులతో తన ప్రయాణం మొదలుపెట్టాడు కిశోర్‌. తొలి దశలో లాభాలు లేకపోయినా వెనకడుగు వేయలేదు. పొద్దున తీసే పాలు పొద్దున్నే.. సాయంత్రం తీసే పాలు రాత్రికే విక్రయించడం ప్రారంభించాడు. పాలు పితకడం నుంచి.. ప్రాసెస్‌, ప్యాకింగ్‌, డెలివరీ వరకూ అంతా పకడ్బందీగా నిర్వహించాడు. ఓ ప్యాకింగ్‌ యూనిట్‌ తీసుకొచ్చాడు. తర్వాత తన వ్యాపార ఆలోచనలకు టీఎస్‌ఐపాస్‌ కార్యరూపం ఇచ్చింది. 2018లో షాబాద్‌ దగ్గర ప్రాసెసింగ్‌ కేంద్రాన్ని ప్రారంభించాడు.

యాప్‌ నుంచీ బుకింగ్‌
‘సిద్స్‌ ఫామ్‌’ మొదట్లో ఆఫ్‌లైన్‌ వ్యాపారం ఎక్కువగా చేసినా.. ఇప్పుడు యాప్‌, వెబ్‌సైట్‌ వేదికగానే విక్రయాలు నిర్వహిస్తున్నది. సంస్థకు 300 మంది డెలివరీ పార్ట్‌నర్స్‌ ఉన్నారు. ప్రత్యక్షంగా 240మందికి ఉపాధి కల్పిస్తున్నారు. వచ్చే ఏడాది నాటికి డెలివరీ విభాగంలో 25శాతం మహిళలను తీసుకురావాలని అనుకుంటున్నారు. కిశోర్‌ సంస్థలో ఎక్కువ శాతం మహిళలే. పాల ఉత్పత్తుల డెలివరీలో తొలిసారిగా మహిళలను భాగస్వాములను చేసింది ‘సిద్స్‌ ఫామ్‌’. ఈ సంస్థకు యాప్‌లోనే పదివేలకు పైగా కస్టమర్లు ఉన్నారు.
kishore-Indukuri1
నాణ్యతలో.. తగ్గేదేలే
పాల నాణ్యత విషయంలో ఎక్కడా రాజీపడనని చెబుతాడు కిశోర్‌. సాధారణంగా, పాలిచ్చే పశువులకు సుస్తీ చేస్తే యాంటీబయాటిక్స్‌ ఇస్తారు యజమానులు. అయితే, అలాంటి పాలను వారం రోజుల వరకు తాగకూడదు. కొందరు తెలిసో, తెలియకో పాలు తీసి అమ్ముతుంటారు. అందుకే పశువుల యజమానులకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. కస్టమర్‌ ఆరోగ్యమే వారికి ప్రధానం కాబట్టి.. వారి దగ్గరికి వచ్చే పాలను క్షుణ్నంగా పరీక్షించిన తర్వాతే ప్రాసెసింగ్‌కి పంపిస్తారు. స్థానికంగా 1,500 మంది (7,500పైగా పశువులు) పాడి రైతులతో ఒప్పందాలు ఉన్నాయి. వనపర్తి దగ్గర 40 గేదెలతో ఓ శాఖను ప్రారంభిస్తున్నారు. దానితో పాటుగా చుట్టుపక్కల రైతుల నుంచీ పాలు సేకరిస్తారు. శ్రేష్ఠమైన పాల కోసం ఎంత దూరమైనా వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారు. అందుకే వనపర్తి, దేవరకద్ర, కోస్గి వంటి ప్రాంతాల్లో చిన్నపాటి డెయిరీ ఫామ్‌లు ఏర్పాటు చేసుకున్నారు. వివిధ నగరాలకు విస్తరించే ఆలోచన కూడా ఉందని చెబుతాడు కిశోర్‌. చేవెళ్ల దగ్గర్లోని యూనిట్‌ను బడిపిల్లలు, కస్టమర్లు సందర్శించవచ్చు. పాల ఉత్పత్తి ప్రక్రియలో ప్రతి దశనూ స్వయంగా తెలుసుకోవచ్చు.

రోజూ పాల పరీక్ష
ప్రతిరోజూ తన డెయిరీ ఫామ్‌కు వచ్చే పాలను తప్పక పరీక్షిస్తాడు కిశోర్‌ ఇందుకూరి. ప్రతి 40 లీటర్ల క్యాన్‌లో యూరియా, చక్కెర, ఉప్పు, గ్లూకోజ్‌, హైడ్రోక్లోరోథియాజైడ్‌ , వంటసోడా, కాస్టిక్‌ సోడా తదితరాల ఆనవాళ్లు ఏమాత్రం లేవని నిర్ధారణ అయిన తర్వాతే ఆ పాలను ప్యాకింగ్‌కు, ఉప ఉత్పత్తుల తయారీకి పంపుతారు. ఒకవేళ 40 లీటర్ల క్యాన్‌లో ఏ ఒక్కటి బయటపడినా నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టేస్తారు. పరీక్షలో నిలిచిన పాలను వేడిచేసి, చల్లార్చి కస్టమర్లకు డెలివరీ చేస్తారు. ఇక్కడ ఆవుపాలు, గేదెపాలు, పెరుగు, నెయ్యి, వెన్న, పనీర్‌ వంటివి విడివిడిగా అమ్ముతారు. నాణ్యత విషయంలో నేటి వరకూ తన బిడ్డకు ఇచ్చిన మాట తప్పలేదంటాడు కిశోర్‌.