NRI-NRT

మ‌న ద‌గ్గ‌రే కాదు.. అమెరికాలోనూ అండ‌మాన్ జైలు ఉంద‌ని తెలుసా

మ‌న ద‌గ్గ‌రే కాదు.. అమెరికాలోనూ అండ‌మాన్ జైలు ఉంద‌ని తెలుసా

అమెరికాలోనూ ఓ అండమాన్‌ జైలు ఉన్నది. పేరుకు చిన్నదే అయినా.. మన సెల్యులార్‌ జైలుకు ఏమాత్రం తీసిపోదు. నడిసంద్రంలో ఓ బుల్లి ద్వీపంపై నిర్మితమైన ఆ పురాతన కట్టడం.. ఒకప్పుడు ఎంతోమంది కరడుగట్టిన నేరస్థులకు ఆశ్రయమిచ్చింది. ఇప్పుడు యాత్రాస్థలంగా మారి.. పర్యాటకుల మనసు దోచేస్తున్నది. గత కాలపు వైభవాన్ని కండ్లకు కడుతున్నది. అదే.. ఆల్కట్రాజ్‌! అద్భుతమైన యాత్రాస్థలి.

శాన్‌ఫ్రాన్సిస్కో తీరంలోని ఓ చిన్న ద్వీపంలో ఉండే ‘ఆల్కట్రాజ్‌’ జైలు గురించి తెలుసుకున్నాక.. వెంటనే సందర్శించాలనే ఆసక్తి కలిగింది. ఒకరోజు ముందే ఆన్‌లైన్‌లో టికెట్స్‌ బుక్‌ చేసుకొని, మరుసటి రోజు ఉదయమే శాన్‌ ఫ్రాన్సిస్కో బే సమీపంలోని బోట్‌ దగ్గరికి చేరుకున్నాం. టికెట్స్‌ స్క్రీనింగ్‌ తర్వాత, సుమారు రెండు వందల యాభై మంది పట్టే బోట్‌ ఎక్కి కూర్చున్నాం.

alcatraz4
free photo upload
పది నిమిషాలే..
రెండు అంతస్తులున్న ఆ బోట్‌లో మేమంతా కప్పులేని పైభాగానికి ఎక్కి కూర్చున్నాం. అక్కడినుంచి చూస్తుంటే.. ‘నీలాకాశం, నీలి సంద్రం ఒక్కటై పోయాయా!’ అన్నంత అద్భుతంగా ప్రకృతి అందాలు కనువిందు చేశాయి. సుమారు రెండు కిలోమీటర్ల ప్రయాణం తర్వాత మేం దిగాల్సిన ప్రదేశం వచ్చేసింది. ‘ప్రయాణం అప్పుడే అయిపోయిందా!’ అని కాస్త నిరాశగా అనిపించినా.. ‘అసలు చూడాల్సింది ముందుంది కదా!’ అని ఉత్సాహంగా కదిలాం. కాస్త ఎత్తయిన కొండలా ఉన్న ఆ ద్వీపాన్ని ఐదంటే అయిదు నిమిషాల్లోనే నడక మార్గంలో చేరుకున్నాం. ద్వీపపు ముఖద్వారం దగ్గరికి చేరుకోగానే.. అప్పటిదాకా మదిలో నిక్షిప్తమైన శాన్‌ఫ్రాన్సిస్కో నగర అందాలు, హోటళ్లు, రంగురంగుల దుకాణాలు, గోల్డెన్‌ గేట్‌ బ్రిడ్జ్‌ సోయగాలు, కాంతులీనే నగరపు వెలుగుజిలుగులు అన్నీ క్షణకాలం పాటు మర్చిపోతాం. మునుపు చూసిన నగరపు అందమైన దృశ్యం మసకబారి.. ఒక పారవశ్యంలోకి వెళ్లిపోతాం.
alcatraz5
ఏకాంతం కరువు
ఈ జైలు నిర్మాణం ఎంతో వైవిధ్యంగా అనిపించింది. భవనాన్ని వివిధ బ్లాకులుగా విభజించారు. హాలు మొదట్లోనే మాకొక ఆడియో పరికరం ఇచ్చారు. దీనినుంచి వచ్చే వాయిస్‌ మెసేజ్‌ ద్వారా అన్ని వివరాలూ మాకు స్పష్టంగా అర్థం అయ్యాయి. ఆ స్వరాన్ని అనుసరిస్తూ.. ఒక్కో నిర్మాణం చూస్తూ.. ముందుకు కదిలాం. ఇంతలో సన్నని వరండాకు రెండు వైపులా ఖైదీలను ఉంచే గదులు కనిపించాయి. సిమెంట్‌ గోడలతో నిర్మితమైన ఆ గదుల్లో స్టీల్‌ ఫ్రేమ్‌ మంచం, దాని మీద తెల్లటి పరుపు, పక్కనే సింక్‌, సీట్‌ లేని ఒక టాయిలెట్‌ ఫ్రేమ్‌, గోడకు ఆనుకుని చిన్న టేబుల్‌ కనిపించాయి. ఆ గదిలో ఖైదీ ఒంటరిగా ఉన్నప్పటికీ.. ఎటువంటి ప్రైవసీ ఉండదు. ఎదురు సెల్‌లో ఉన్న మనిషి ఏం చేస్తున్నా కూడా కనిపిస్తుంది. ఇనుప ఊచలతో తయారైన ఆ గది తలుపులు మూయాలన్నా, తెరవాలన్నా అక్కడి గార్డుకు మాత్రమే సాధ్యం. ఖైదీలు ఏం తినాలి? ఎప్పుడు స్నానం చేయాలి? ఏ బట్టలు ధరించాలి? అనేవన్నీ జైలు అధికారులే నిర్ణయిస్తారు. నిబంధనలు కఠినంగా అమలు చేస్తారు.

చీకటి గదులు..
ఖైదీల డైనింగ్‌ హాలు విశాలంగా ఉంది. ఇందులో ఒకేసారి మూడు వందలమంది కూర్చుని తినొచ్చు. ఆ హాల్‌లోంచి బయటికి రాగానే.. కనిపించిన చిన్నచిన్న గదుల వరుసను చూడగానే, ఒక్కసారిగా ఊపిరి ఆడనట్లుగా అనిపించింది. లోపలికి తొంగి చూసే ధైర్యం కూడా చేయలేదు. అదే కరడు గట్టిన నేరస్థులను ఉంచే స్థలం.. ‘హోల్‌ ’. ఈ గదులన్నీ సౌండ్‌ ప్రూఫ్‌. గాలి, వెలుతురు కూడా సోకని చీకటి కొట్టంలా ఉన్నాయి. ఆ గదులను చూస్తుంటేనే గగుర్పాటు కలిగింది. ఇక అందులో ఉండేవాళ్ల పరిస్థితిని ఊహించుకుంటేనే భయం వేసింది. వాటిని దాటుకుని పక్కకి వచ్చాక ఒక పెద్ద పుస్తక భాండాగారానికి చెందిన ఫొటో ఫ్రేం కనిపించింది. అందులో ప్రిజన్‌ లైబ్రరీ వివరాలు ఉన్నాయి. ఖైదీలు ఇక్కడ బందీలుగా ఉన్నా.. పుస్తకాలు చదివి మానసిక ఉల్లాసాన్ని పొందేవారు. ఇక చివరగా విజువలైజేషన్‌ పేరుతో ఉన్న గది దగ్గరికి వెళ్లాం. ఖైదీలను స్వయంగా కలిసి మాట్లాడటానికి వీలుండే గది ఇది. దుర్భేద్యమైన ఈ జైలు నుంచి కూడా తప్పించుకునేందుకు కొందరు ఖైదీలు ప్రయత్నాలు చేశారట. ఇక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని బయటపడ్డవారిని, ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారినీ తలుచుకుంటూ వెనుదిరిగాం. ఆల్కట్రాజ్‌ జైలు సందర్శన చరిత్రలోని కొత్త కోణాల్ని మాకు పరిచయం చేసింది.
alcatraz3
ఖైదీలను స్వయంగా కలిసి మాట్లాడటానికి వీలుండే గది ఒకటి ఉంది. దుర్భేద్యమైన ఈ జైలు నుంచి తప్పించుకునేందుకు కొందరు ఖైదీలు ప్రయత్నాలు చేశారట. ఇక్కడి ప్రతికూల వాతావరణాన్ని తట్టుకొని బయటపడ్డవారిని, ఆ ప్రయత్నంలో ప్రాణాలు కోల్పోయిన వారినీ తలుచుకుంటూ మేమంతా వెను దిరిగాం.