DailyDose

10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి ‘హజ్‌’ యాత్ర

10 నెలలు.. 9 దేశాలు.. 6,500 కిలోమీటర్లు నడిచి ‘హజ్‌’ యాత్ర

కోవిడ్‌ నేపథ్యంలో రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్‌ యాత్ర తిరిగి పూర్తి స్థాయిలో ప్రారంభమైంది. జీవితంలో ఒక్కసారైన హజ్‌ యాత్ర చేపట్టాలని ముస్లిం సోదరులు భావిస్తుంటారు. అయితే.. ఓ వ్యక్తి పలు దేశాలు దాటి వేల కిలోమీటర్లు నడిచి హజ్‌కు చేరుకున్నారు. ఇరాక్‌లోని కుర్దిష్‌ మూలాలనున్న బ్రిటిషనర్‌.. అడమ్‌ మొహమ్మద్‌(52) ఈ సాహసం చేసి తన కోరికను నెరవేర్చుకున్నారు. ఈ ఏడాది హజ్‌ యాత్రకు వెళ్లాలని నిర్ణయించుకున్న అడమ్‌ మొహమ్మద్‌.. ఇంగ్లాండ్‌లోని వొల్వెర్‌హంప్టన్‌ నుంచి సుమారు 6,500 కిలోమీటర్లు నడిచి మక్కాకు చేరుకున్నారు.

10 నెలలు.. 9 దేశాలు..
హజ్‌ యాత్రకు బయలుదేరిన అడమ్‌ మొహమ్మద్‌.. నెదర్లాండ్స్‌, జర్మనీ, ఆస్ట్రియా, హంగేరీ, సెర్బియా, బల్గేరియా, టర్కీ, లెబనన్‌, జోర్డన్‌ దేశాల మీదుగా సౌదీ అరేబియాకు చేరుకున్నారు. 10 నెలల 25 రోజుల్లో మొత్తం 6,500 కిలోమీటర్లు నడిచారు. తన యత్రను గత ఏడాది 2021, ఆగస్టు 1న ప్రారంభించిన అడమ్‌.. ఈ ఏడాది జూన్‌లో గమ్యాన్ని చేరుకున్నారు.

ఆల్‌ జజీరా న్యూస్‌ ప్రకారం.. అడమ్‌ రోజుకు సగటున 17.8 కిలోమీటర్లు నడిచారు. సుమారు 300 కిలోల సామగ్రితో కూడిన తోపుడు బండిని తోసుకుంటూ తన యాత్రను సాగించారు. ఆ బండికి మ్యూజిక్‌ స్పీకర్లు అమర్చి ఇస్లామిక్‌ పాటలు వింటూ నడిచినట్లు చెప్పుకొచ్చారు అడమ్‌. శాంతి, సమానత్వంపై ప్రజలకు సందేశం అందించాలనే తాను ఇలా కాలినడకన యాత్ర చేపట్టానన్నారు. ఆన్‌లైన్‌లోనూ గోఫన్‌మీ పేజ్‌ను ఏర్పాటు చేశారు. ‘ఇది నేను డబ్బు, పేరు కోసం చేయటం లేదు. ప్రపంచంలోని మనుషులంతా సమానమనే విషయాన్ని ఎత్తిచూపాలనుకుంటున్నా. ఇస్లాం బోధిస్తున్న శాంతి, సమానత్వ సందేశాన్ని విశ్వవ్యాప్తం చేయాలనుకుంటున్నా.’ అని అందులో రాసుకొచ్చారు.

కరోనా కారణంగా రెండేళ్ల తర్వాత పవిత్ర హజ్‌ యాత్ర ప్రారంభమైంది. ఈ ఏడాది సుమారు 10 లక్షల మంది ముస్లింలు హజ్‌ సందర్శించుకునేందుకు సౌదీ అరేబియా అనుమతించింది. 2020, 2021లో కేవలం సౌదీ అరేబియా పౌరులను మాత్రమే అనుమతించారు. ఈ ఏడాది జులై 7న ఈ హజ్‌ యాత్ర మొదలైంది.