Politics

రాష్ట్రపతి ఎన్నికలు.. ద్రౌపది ముర్ముకు తెదేపా మద్దతు

రాష్ట్రపతి ఎన్నికలు.. ద్రౌపది ముర్ముకు తెదేపా మద్దతు

రాష్ట్రపతి ఎన్నికల్లో ఎవరికి మద్దతు ఇవ్వాలనే అంశంపై తెదేపా తన నిర్ణయాన్ని ప్రకటించింది. ఎన్డీఏ అభ్యర్థిగా బరిలో నిలిచిన ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు వెల్లడించింది. పార్టీ ఎమ్మెల్యేలతో చర్చించిన అనంతరం చంద్రబాబు ఈ నిర్ణయాన్ని వెల్లడించారు. స్వతంత్ర భారత చరిత్రలో తొలిసారిగా ఎస్టీ మహిళకు రాష్ట్రపతిగా అవకాశం ఇవ్వడం శుభపరిణామమన్నారు. సామాజిక న్యాయానికి మొదటి నుంచి తెదేపా కట్టుబడి ఉందన్నారు.గతంలోనూ కేఆర్ నారాయణన్, అబ్దుల్ కలాంకు మద్దతు ఇచ్చినట్లు తెదేపా గుర్తు చేసింది. అలాగే తెలుగు బిడ్డ పి.వి.నరసింహారావు ప్రధాని కావడానికి నంద్యాల ఎన్నికల్లో ఆయనను తెలుగుదేశం బలపరిచిందన్నారు. తెలుగువారి కోసం, సామాజిక న్యాయం కోసం తెదేపా ముందు వరుసలో ఉంటుందన్నారు. ఇప్పటికే అధికార వైకాపా సైతం ఎన్డీఏ అభ్యర్థి ద్రౌపది ముర్ముకే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించిన విషయం తెలిసిందే. రాష్ట్రపతి పదవి కోసం ద్రౌపది ముర్ము, యశ్వంత్​ సిన్హాతో పాటు పలువురు సామాన్యులు నామినేషన్​ దాఖలు చేశారు. వీరిలో ముంబయి మురికివాడకు చెందిన ఓ వ్యక్తి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్​ యాదవ్​ పేరుతో ఉన్న మరో వ్యక్తి, తమిళనాడుకు చెందిన సామాజిక కార్యకర్త, ప్రొఫెసర్ ఉన్నారు. జులై 24తో ప్రస్తుత రాష్ట్రపతి రామ్​నాథ్​ కోవింద్​ పదవీకాలం పూర్తవుతుంది. ఈ నేపథ్యంలో జులై 18న కొత్త రాష్ట్రపతి ఎన్నిక కోసం.. ఓటింగ్ నిర్వహించనున్నారు. 21న కౌంటింగ్​ చేపట్టనున్నారు. జులై 25న కొత్త రాష్ట్రపతి ప్రమాణ స్వీకారం చేస్తారు.