Devotional

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరీ దర్శనం

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శాకంబరీ దర్శనం

ఇంద్రకీలాద్రిపై వైభవంగా ఆషాఢం ఉత్సవాలు-శాకంబరీగా అమ్మవారి దర్శనం
ఇంద్రకీలాద్రిపై వెలిసిన కనకదుర్గమ్మకు ఆషాఢమాసంలో నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు నేటి నుంచి ప్రారంభమయ్యాయి. పెద్ద సంఖ్యలో భక్తులు శాకంబరీ రూపంలో దర్శనమిస్తున్న అమ్మవారిని దర్శించుకుని తరిస్తుననారు. దాదాపు 12 టన్నుల పండ్లు, కూరగాయాలతో అమ్మవారితో పాటు ఆలయాన్ని అందంగా అలంకరించడం ఆకట్టుకున్నది.విజయవాడ కనకదుర్గమ్మకు ఏటా నిర్వహించే శాకంబరీ ఉత్సవాలు కన్నులపండువగా సోమవారం నుంచి మొదలయ్యాయి. ఏటా ఆషాఢమాసంలో ఈ ఉత్సవాలను నిర్వహిస్తుంటారు. మూడు రోజుల పాటు ఈ ఉత్సవాలు జరుగుతాయి. ఈ సందర్భంగా శ్రీదుర్గామల్లేశ్వరస్వామి వార్లను, ఆలయాన్ని 12 టన్నుల తాజా పండ్లు , కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు. తొలుత దాతలు అందజేసిన నిమ్మకాయలు, కూరగాయలకు వైదిక కమిటీ సభ్యుల పర్యవేక్షణలో రుత్వికులు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం మూలవిరాట్ దుర్గమ్మను వివిధ రకాల పండ్లు, కూరగాయలు, ఆకుకూరలతో అలంకరించారు.శాకంబరీ ఉత్సవాల తొలిరోజు సోమవారం నాడు విఘ్నేశ్వర పూజ, రుత్విక్‌ వరుణ, పుణ్యవచనం, అఖండ దీపారాధన, వాస్తు హోమం, కలశ స్థాపన పూజలు నిర్వహించనున్నట్లు ఆయల స్థానాచార్యుడు శివప్రసాద శర్మ వెల్లడించారు. శాకంబరీని పూజించడం వల్ల ప్రకృతి వైపరీత్యాలు తొలిగిపోయి సమృద్ధిగా వర్షాలు కురుస్తాయని భక్తులు విశ్వసిస్తారు. మూడు రోజులపాటు శాంకబరీ దేవిగా దర్శనవ్వనున్న అమ్మవారిని కరుణకటాక్షాల కోసం ఉభయ తెలుగు రాష్ట్రాలు సహా వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఇంద్రకీలాద్రికి చేరుకున్నారు. ఈ సీజన్‌లో దాదాపు లక్షకు పైగా భక్తులు అమ్మవారిని దర్శించుకుంటారని ఆలయ అధికారులు అంచనా వేస్తున్నారు.
Shakambari-ustavams-at-Vija-V-jpg-816x480-4g

*13 నుంచి శారదా పీఠాధిపతి చాతుర్మాస దీక్ష
ఈనెల 13 నుంచి పవిత్ర చాతుర్మాస దీక్షను విశాఖ శ్రీశారదా పీఠాధిపతి స్వరూపానందేంద్ర సరస్వతి స్వామీజీ, ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి స్వామీజీ చేపట్టనున్నారు. రుషికేష్‌లోని పవిత్ర గంగానదీ తీరాన శ్రీశారదాపీఠం శాఖలో గురుపూర్ణిమ సందర్భంగా స్వామీజీలు ఈ దీక్షను ఆచరించనున్నారు. గురు పూర్ణిమ పర్వదినం రోజున వ్యాస పూజతో దీక్షకు అంకురార్పణ జరుగుతుంది.స్వామీజీకి ఇది 26వ చాతుర్మాస దీక్ష కాగా.. ఉత్తరాధికారి స్వాత్మానందేంద్ర సరస్వతి నాలుగోసారి దీక్ష చేపట్టనున్నారు. దీక్షా కాలంలో పరివ్రాజ్యలు(పర్యటనలు) చేయరు. మొదటి నెలలో కూరలు, రెండో నెలలో పెరుగు, మూడో నెలలో పాలు, నాలుగో నెలలో పప్పుదినుసులను స్వీకరించరు. ఈ సమయంలో సాధువులకు, సన్యాసులకు భండారా (అన్నదానం) నిర్వహించి దక్షిణలు సమర్పిస్తారు.గమ్మతల్లికి నిత్య పూజలు చేసిన తరువాత శ్రీశారదా పీఠం అధిష్టాన దేవత శారదా స్వరూప రాజశ్యామల అమ్మవారికి, చంద్రమౌళీశ్వరులకు నిత్య పీఠార్చన చేపడతారు. వేద విద్యార్థులకు స్వామీజీ ధార్మిక అంశాలను బోధిస్తారు. దీక్షా కాలంలో స్వామీజీని కలిసి ఆశీస్సులు తీసుకునేందుకు తెలుగు రాష్ట్రాలతో పాటు దేశం నలుమూలల నుంచి ప్రముఖులు రుషికేష్‌కు వెళ్తుంటారు.

*సకల శుభాలు కలిగించే తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఆదివారం రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలు భక్తులతో కిటకిటలాడాయి. భక్తులు వేకువజాము నుంచే ఆలయాలకు వచ్చి పూజలు చేశారు. ప్రధానంగా అన్నవరం, సింహాచలం, అరసవిల్లి వంటి ముఖ్యమైన ఆలయాల్లో భక్తజనం పెద్దఎత్తున వచ్చారు. ఇక ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలోని దాదాపు అన్ని విభాగాలూ భక్తులతో నిండిపోయాయి.
ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రంలో రద్దీ కొనసాగింది. భజన మండళ్ల సభ్యులు కోలాట భజనలతో ఆకట్టుకున్నారు. అలాగే, ఉమ్మడి కృష్ణాజిల్లాలో కూడా ఆదివారం ఈ పర్వదినాన్ని ఘనంగా జరుపుకున్నారు. వైష్ణవాలయాల్లో ప్రత్యేక పూజలు జరిగాయి. విజయవాడ లబ్బీపేట, వన్‌టౌన్‌లోని శ్రీ వేంకటేశ్వరస్వామి వార్ల దేవస్థానంలో స్వామి వారికి పలు ప్రత్యేక పూజలు, లక్ష తులసీదళార్చన నిర్వహించారు.అభినవ మేల్కొటెగా పేరుగాంచిన కృష్ణా జిల్లా కోడూరు మండలంలోని ఉల్లిపాలెంలోని శ్రీగోదా, రాజ్యలక్ష్మీ సమేత శ్రీమన్నారాయణస్వామివారి ఆలయం ఆధ్యాత్మిక శోభతో పులకించింది. 11 అడుగుల శ్రీమన్నారాయణుడి మూలమూర్తికి అభిషేకాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు.మచిలీపట్నం చిలకలపూడి కీర పండరీపురంలో వేంచేసి ఉన్న శ్రీ పాండురంగ స్వామివారికి ఆదివారం ప్రత్యేక పూజలు జరిపించారు. అలాగే, బెజవాడ కనకదుర్గమ్మ, పట్నాడు జిల్లా కోటప్పకొండలోని త్రికోటేశ్వరస్వామి ఆలయంలో కూడా భక్తులు పోటెత్తారు. క్యూలైన్లలో పెద్దఎత్తున బారులుతీరారు.

*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శనివారం అర్ధరాత్రి వరకు 87,478 మంది స్వామివారిని దర్శించుకోగా, 48,692 మంది తలనీలాలు సమర్పించారు. శ్రీవారి హుండీలో కానుకల రూపంలో భక్తులు రూ.4.53 కోట్లు వేశారు. ప్రస్తుతం శ్రీవారి దర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్‌ పూర్తిగా నిండిపోయింది.. క్యూలైను ఆస్థాన మండపం వద్దకు చేరింది.

*తొలి ఏకాదశిని పురస్కరించుకుని ఆదివారం యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ సన్నిధిలో విద్యార్థులు నిర్వహించిన నృత్య ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. రంగారెడ్డి జిల్లా రాంపల్లిలోని సాంస్కృతిక విశ్వ కళామండలి, కళాచైతన్య వేదిక వ్యవస్థాపకుడు రాంనర్సయ్య ఆధ్వర్యంలో విజయవాడకు చెందిన కూచిపూడి నృత్య ఉపా«ధ్యాయిని హవిష సమక్షంలో 50 మంది విద్యార్థులు ఆరు గంటలపాటు కూచిపూడి నృత్యం ప్రదర్శించారు.యాదాద్రీశుడు, వెంకటేశ్వరస్వామి, విజయవాడ కనకదుర్గమ్మ, భద్రాద్రి రామచంద్రస్వామి ఆలయాలకు సంబంధించిన పాటలకు నృత్యం చేశారు. అలాగే పేరిణి నాట్యం ప్రదర్శించి భళా అనిపించుకున్నారు. ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 1.30 గంటల వరకు కూచిపూడి, మధ్యాహ్నం 3.30 నుంచి సాయంత్రం 6.30 గంటల వరకు పేరిణి నృత్యాలు చేశారు.

*ప్రపంచంలోనే అతిపెద్ద ఆవిష్కరణల కేంద్రమైన టీహబ్‌ 2లో తెలంగాణ సంస్కృతికి ప్రతీకగా నిలిచే బోనాల పండుగను తెలంగాణ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ అసోసియేషన్‌ (టీటా) ఆదివారం బోనాల ఉత్సవాన్ని ఘనంగా నిర్వహించింది. ఈ సందర్బంగా టీటా గ్లోబల్‌ అధ్యక్షుడు సందీప్‌కుమార్‌ మక్తాల మట్లాడుతూ దేశీయ, విదేశీ పెట్టుబడులకు తెలంగాణ రాష్ట్రం కేరాఫ్‌ అడ్రస్‌గా నిలవాలని ఆకాంక్షిస్తూ 21 బోనాలను మాదాపూర్‌లోని చిన్నపెద్దమ్మ తల్లి దేవాలయం వద్ద సమర్పించినట్లు తెలిపారు.

*మర్‌నాథ్‌ యాత్ర పునః ప్రారంభం
జమ్మూ కశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్రను అధికారులు తిరిగి ప్రారంభించారు. గత శుక్రవారం భారీ వర్షాలకు ఆకస్మిక వరదలు వచ్చిన విషయం తెలిసిందే. పలువురు భక్తులు వరదల్లో చిక్కుకొని ప్రాణాలు కోల్పోయగా.. ఇప్పటికీ పలువురి ఆచూకీ దొరకలేదు. వరదలతో తాత్కాలికంగా యాత్రను రద్దు చేశారు. ఆ తర్వాత ఐటీబీపీ, ఆర్మీ, వైమానిక సిబ్బంది యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. గుహ వద్ద మట్టి, రాళ్లను భద్రతా సిబ్బంది తొలగించారు.ప్రస్తుతం కొంత పరిస్థితులు మెరుగుపడడంతో యాత్రను తిరిగి ప్రారంభించారు. టోకెన్లు జారీ చేసి భక్తులను దర్శనానికి పంపుతున్నారు. అమర్‌నాథ్‌కు గుహకు పంత్‌తర్నీ వైపు నుంచి వెళ్లాలని, దర్శనం అనంతరం బల్తాల్‌ మార్గంలోనే వెనక్కి రావాలని సూచిస్తున్నారు. ప్రస్తుతం 7వేలకుపైగా యాత్రికులు చండీన్వాడీ మార్గాన్ని దాటారు. వర్షాలకు ముందు 1.13లక్షల మంది యాత్రికులు అమర్‌నాథ్‌ గుహలో మంచులింగాన్ని దర్శించుకున్నారు.
*యాదాద్రి శ్రీ లక్ష్మీ స్వామివారిని మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులు కాలినడక దర్శించుకున్నారు. ఉదయం ఏడు గంటలకు యాదాద్రి పాదాల వద్దకు చేరుకున్న ఆయన మెట్ట మార్గం గుండా కాలినడకన స్వయంభు ఆలయానికి వెళ్లారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు.తన పుట్టినరోజు సందర్భంగా యాదాద్రి లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్నట్లు తెలిపారు. కరోనాతో బాధపడుతున్న తాను యాదాద్రి కృపతో ఆరోగ్యవంతంగా బయటపడ్డాను అని అందుకే స్వామివారిని దర్శించుకున్నట్లు తెలిపారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయురారోగ్యాలతో జీవించాలని, తెలంగాణ సుభిక్షంగా ఉండాలని స్వామివారిని కోరుకున్నట్టు తెలిపారు.

*తిరుమల శ్రీవారికి మహేంద్ర జీపు విరాళంగా అందింది. టీటీడీ బోర్డు సభ్యుడు నందకుమార్ రూ.10.26 లక్షల విలువైన జీపును అందజేశారు. ఈ మేరకు శ్రీవారి ఆలయం ఎదుట వాహనానికి ప్రత్యేక పూజలు నిర్వహించి తాళాలను శ్రీవారి ఆలయం డిప్యూటీ ఈవోరమేశ్‌ బాబుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీఐ జానకి రామ్ రెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు .