Sports

‘దాదా’కు అరుదైన గౌరవం.. గంగూలీని సత్కరించిన బ్రిటిష్ పార్లమెంట్

‘దాదా’కు అరుదైన గౌరవం.. గంగూలీని సత్కరించిన బ్రిటిష్ పార్లమెంట్

టీమిండియా మాజీ సారథి, బీసీసీఐ బాస్ సౌరవ్ గంగూలీకి ఇంగ్లండ్‌లో అరుదైన గౌరవం లభించింది. గంగూలీని బుధవారం బ్రిటిష్ పార్లమెంటు సత్కరించింది. ఈ విషయాన్ని గంగూలీ స్వయంగా వెల్లడించాడు. ఓ బెంగాలీగా బ్రిటిష్ పార్లమెంట్ తనను సత్కరించినందుకు చాలా ఆనందంగా ఉందని పేర్కొన్నాడు. ఇందుకోసం వారు తనను ఆరు నెలల క్రితమే సంప్రదించారని, బ్రిటన్ పార్లమెంట్ ప్రతి సంవత్సరం ఇలా ఒకరిని సత్కరిస్తుందని, ఈసారి ఆ అవకాశం తనకు దక్కిందని చెప్పుకొచ్చాడు. 20 సంవత్సరాల క్రితం 2002లో జులై 13న జరిగిన నాట్‌వెస్ట్ ట్రోఫీ ఫైనల్‌లో గంగూలీ నేతృత్వంలోని భారత జట్టు ఇంగ్లండ్‌ను ఓడించి విజేతగా నిలిచింది. ఇది జరిగిన సరిగ్గా 20 ఏళ్లకు అదే రోజున అదే గడ్డపై గంగూలీకి సన్మానం జరగడం గమనార్హం. ఇదే విషయాన్ని గంగూలీ గుర్తు చేసుకున్నాడు. ‘‘అవును, ఇది చాలా గొప్ప విషయం’’ అని పేర్కొన్నాడు. ఇంగ్లండ్‌ను వారి గడ్డపై ఓడించడానికి మించి గొప్ప విషయం ఏముంటుందన్నాడు. ఇప్పుడు ఇక్కడే భారత జట్టు దానిని పునరావృతం చేస్తోందని పేర్కొన్నాడు. ఇప్పటికే టీ20 సిరీస్‌ను గెలుచుకున్నామని, వన్డే సిరీస్‌లోనూ 1-0తో ఆధిక్యంలో ఉన్నామని గంగూలీ పేర్కొన్నాడు