Movies

అందాన్ని అభివర్ణించడానికి అన్నమయ్య కీర్తనా?

అందాన్ని అభివర్ణించడానికి అన్నమయ్య కీర్తనా?

టాలీవుడ్‌ గాయని శ్రావణ భార్గవి వివాదంలో చిక్కుకున్నారు. అన్నమయ్యను అవమానించారంటూ ఆయన కుటుంబ సభ్యులు మండిపడుతున్నారు. తాజాగా ఆమె అన్నమయ్య కీర్తనతో ఓ ఆల్బమ్‌ చేసి యూట్యూబ్‌ ఛానల్‌లో పోస్ట్‌ చేశారు. అన్నమాచార్యులు రచించిన ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ పాటను ఒక ఫ్యూజన్‌గా చిత్రీకరించారమె. ఈ విషయం అన్నమయ్య కుటుంబీకుల దృష్టికి వెళ్లగా ‘అన్నమాచార్యుల పాటను వెలికిగా చిత్రీకరించి ఆయన్ను అవమానించారని వారు భగ్గుమంటున్నారు. అభిషేకం వేళ వెంకటేశ్వరస్వామిని స్మరిస్తూ, భక్తి పారవశ్యంలో మునిగి తేలిన అనుభూతి కలిగేలా అన్నమయ్య రాసిన ఈ పాటను శ్రావణ భార్గవి వెకిలిగా రూపొందించారంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘అన్నమాచార్యుల పెద్దకుమారులు పెదతిరుమలాచార్యులు సాక్ష్యాత్తూ స్వామివారికి అభిషేక కైంకర్యం చేస్తూ కీర్తించిన పాటను ఆమె కాళ్లు ఊపుతూ, వివిధ భంగిమల్లో కనిపిస్తూ చిత్రీకరించడం చాలా బాధగా ఉంది. ఆమె అందాన్ని వర్ణించడానికి ఆ కీర్తనను అలా ఉపయోగించడం పొరపాటు’’ అని అన్నమయ్య కుటుంబీకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విషయం గురించి ఆమెతో ఫోన్‌లో మాట్లాడగా ‘‘మీ కళ్లల్లోనే ఏదో తేడా ఉందని బాధ్యతారహితంగా సమాధానమిచ్చారని అన్నమయ్య వంశస్థులు తెలిపారు. సినీ పరిశ్రమకు చెందిన ఎవరైనా అన్నమాచార్యుల కీర్తను తీసుకుంటే ‘తిరు వేంకటా చలపతి’ అనే ముద్రతోనే ఏ కీర్తనను అయినా ఎండ్‌ చేస్తారు. శ్రావణ భార్గవి అలా చేయలేదు. ‘ఒకపరి ఒకపరి వయ్యారమే’ అన్న శృంగార కీర్తనను మేం ఎందుకు చేయకూడదు’ అని ఎదురు ప్రశ్నిస్తుంది. శోభారాజ్‌ నుంచి ఎంతోమంది ఆ పాటను యూట్యూబ్‌ నుంచి తొలగించమని కోరగా కామెంట్‌ సెక్షన్‌ను ఆమె హైడ్‌ చేసింది’’ అని తాళ్లపాక వెంకటరాఘవ అన్నమాచార్యులు తెలిపారు.