NRI-NRT

డాలర్‌.. రన్‌ రాజా రన్‌!

Auto Draft

51 ఏళ్ల కిందట అమెరికా ఆర్థిక మంత్రి జాన్‌ కొనల్లీ చేసిన ఈ వ్యాఖ్యల్ని… ప్రపంచ మానవాళిపై వేసిన పచ్చబొట్టుగా చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికీ డాలర్‌ అమెరికాకు కరెన్సీనే. ప్రపంచానికి మాత్రం అన్నీ డాలరే. డాలర్‌ విలువ పెరిగినా… తగ్గినా… ప్రపంచంలోని ప్రతి కుటుంబంపైనా దాని ప్రభావం పడక తప్పదు. అలాంటి డాలర్‌ ఇçప్పుడు అడ్డూఅదుపూ లేకుండా పెరుగుతోంది. ప్రపంచంలో ప్రధాన కరెన్సీలుగా భావించే యూరప్‌ యూరో, యూకే పౌండ్, జపాన్‌ యెన్, చైనీస్‌ యువాన్‌… ఇవన్నీ డాలర్‌తో పోలిస్తే దారుణంగా క్షీణిస్తున్నాయి. అన్నిటికన్నా ఘోరంగా జపాన్‌ యెన్‌ గడిచిన ఏడాది కాలంలో ఏకంగా 20.57 శాతం మేర క్షీణించింది. ఏడాది కిందట డాలర్‌కు 110 యెన్‌లు కాగా… ఇప్పుడు 138.5 యెన్‌లు పెడితే తప్ప ఒక డాలర్‌ రావటం లేదు. యూకే పౌండ్‌ కూడా అంతే. ఏడాది కాలంలో ఏకంగా 15.5 శాతం పతనం కాగా… యూరో అదే స్థాయిలో 14 శాతం క్షీణించింది. ఆసియా దిగ్గజాలు చైనా, భారత్‌ మరీ అంత క్షీణించకుండా తమ కరెన్సీలను కాపాడుకున్నాయి. యువాన్‌ 4.5 శాతం, రూపాయి 6.25 శాతం మాత్రమే పతనమయ్యాయి.

కరెన్సీలెందుకు పతనమవుతున్నాయి?
అందరూ చెప్పే ప్రధాన కారణాలు రెండు. మొదటిది కోవిడ్‌ సంక్షోభం. దాదాపు రెండున్నరేళ్లు ప్రపంచపటంలో ఒక్కదేశాన్నీ వదలకుండా చుట్టేసిన ఈ మహమ్మారి ఇంకా తన ప్రభావాన్ని చూపిస్తూనే ఉంది. ఫలితంగా ప్రపంచం మొత్తం మునుపెన్నడూ చూడని వైపరీత్యాల్ని చూసింది. లాక్‌డౌన్‌లతో జీవితం అస్తవ్యస్తమయింది. కొనుగోలు శక్తి సన్నగిల్లి… ఉత్పాదకత ఘోరంగా పడిపోయింది. దీన్ని పెంచడానికి… అమెరికా లక్షల కోట్ల కరెన్సీని ముద్రించి బ్యాంకింగ్‌లోకి ప్రవేశపెట్టింది. వినియోగం పెంచడానికి నేరుగా జనం ఖాతాల్లోకీ నగదు వేసింది. మిగిలిన దేశాలు కూడా బ్యాంకింగ్‌ వ్యవస్థలోకి నగదు ప్రవాహాన్ని పెంచాయి. అది జనం చేతుల్లోకి రావటం కోసం వడ్డీ రేట్లు తగ్గించాయి. అలా… ప్రపంచమంతా వినియోగాన్ని పెంచే పనిలో పడింది.

ఇక్కడి వరకూ బాగానే ఉన్నా… నగదు లభ్యత పెరగటంతో అసలే తక్కువగా ఉన్న వస్తువులకు డిమాండు… ఆ వెనకే ధరలూ పెరిగాయి. దిగుమతులపై ఆధారపడ్డ దేశాలు మరింత ఇబ్బందికి గురయ్యాయి. ఫలితంగా… ద్రవ్యోల్బణం రయ్యిమంది. కాకపోతే చాలా దేశాలు కొంతవరకూ దీన్ని తట్టుకుని మనగలిగాయి. అందుకే కరెన్సీలు కూడా ఆరేడు నెలల కిందటిదాకా కాస్తంత స్థిరంగానే కనిపించాయి. ఇదిగో… అప్పుడు మొదలయింది ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం. ఐదు నెలల కిందట మొదలయిన ఈ యుద్ధానికి ముగింపు దొరక్కపోవటం… ఎప్పటికి ముగుస్తుందో కూడా తెలియకపోవటంతో అసలే దెబ్బతిని ఉన్న సప్లయ్‌ వ్యవస్థలు మరింత కునారిల్లాయి.

ముడిచమురు ఉత్పత్తిలో ప్రధాన వాటాదారైన రష్యాపై ఆంక్షల కారణంగా ముడి చమురు ఉత్పత్తి తగ్గి… ధర విపరీతంగా పెరిగింది. అన్ని దేశాల్లోనూ ద్రవ్యోల్బణం రికార్డులు తిరగ రాస్తోంది. దీన్ని కట్టడి చేయటానికి అమెరికాతో సహా… ప్రభుత్వాలన్నీ మళ్లీ వడ్డీ రేట్లు పెంచటం మొదలు పెట్టాయి. అమెరికా సైతం వడ్డీ రేట్లు పెంచుతూ అంతకు ముందు వ్యవస్థలోకి వదిలిన నగదును వెనక్కి తీసుకోవటం మొదలెట్టింది. వడ్డీ రేట్లు పెరిగితే… కరెన్సీ విలువ పతనం కావటమన్నది సహజం.

డాలర్‌… ఎప్పుడూ పెరగటమేనా?
కాకపోతే ఇక్కడ గమనించాల్సిన విషయం ఒకటుంది. వడ్డీరేట్లు తగ్గుతున్నపుడు కూడా డాలర్‌తో పోల్చినప్పుడు మన కరెన్సీలు ఎంతో కొంత క్షీణిస్తూనూ వచ్చాయి. వడ్డీ రేట్లు పెరుగుతున్నప్పుడు ఈ క్షీణత ఇంకాస్త ఎక్కువగా ఉంది. రెండు సందర్భాల్లోనూ డాలర్‌ మాత్రం పెరుగుతూనే వచ్చింది. ఎందుకలా? ఎందుకంటే వడ్డీ రేట్లు తగ్గుతున్నప్పుడు ప్రపంచమంతా సంక్షోభ పరిస్థితుల్లో ఉంది.

అన్నిచోట్లా డిమాండ్‌ పడిపోయింది. దీంతో ఏమవుతుందోనన్న భయం కొద్దీ ప్రపంచమంతా సురక్షితమైన ఇన్వెస్ట్‌మెంట్‌ మార్గాలవైపు పరుగులెత్తింది. ఫలితంగా డాలర్‌ పెరిగి… ఇతర కరెన్సీలు క్షీణత నమోదు చేశాయి. ఇప్పుడు కూడా అంతే. అన్నిచోట్లా వడ్డీ రేట్లు పెరుగుతున్నాయి. వడ్డీ రేట్లు పెరిగితే మళ్లీ వ్యవస్థలో నగదు తగ్గి… మళ్లీ అది మందగమనానికి దారితీస్తుంది. మాంద్యమూ వచ్చు. ఇలాంటి పరిస్థితుల్లోనూ డాలర్‌ ఇన్వెస్ట్‌మెంట్లే సురక్షితం. కాబట్టి డాలర్‌కే డిమాండ్‌. అందుకే అది పెరుగుతోంది. దీన్ని బట్టి అర్థమయ్యేది ఒకటే! జాన్‌ కొనల్లీ 51 ఏళ్ల కిందట జీ10 సదస్సులో చేసిన వ్యాఖ్యలు… అక్షర సత్యాలని!!.

ఎవరికి లాభం… ఎవరికి నష్టం
లాభనష్టాల విషయానికొస్తే డాలర్‌ బలోపేతమై స్థానిక కరెన్సీలు బలహీనమవున్నప్పుడు అది దేశ ప్రజలందరికీ నష్టమేనని చెప్పాలి. నేరుగా డాలర్‌తో అవసరం లేకున్నా… డాలర్‌ బలపడితే ఏ దేశమైనా దిగుమతులకు ఎక్కువ వెచ్చించాల్సి వస్తుంది. భారత్‌ విషయానికొస్తే మన మొత్తం జీడీపీలో 21 శాతం వరకూ దిగుమతులే. అదే సమయంలో ఎగుమతులు 18.5 శాతం వరకూ ఉంటాయి. దిగుమతుల్లో అత్యధికం ముడిచమురు వాటాయే. ఈ రెండింటికీ మరీ దారుణమైన తేడా లేదు కనకే మన కరెన్సీ కొంతైనా ఈ పరిస్థితులను తట్టుకోగలుగుతోందన్నది వాస్తవం. అయితే అమెరికాలో వడ్డీ రేట్లు పెరుగుతూ పోతే మాత్రం ఆ ప్రభావం మన రూపాయిపై కాస్త తీవ్రంగానే పడుతుంది.

విదేశాల్లో తమ పిల్లల్ని చదివించేవారికి ప్రధానంగా ఇది ఇబ్బందే. అనుకున్న బడ్జెట్లు తారుమారవుతాయి. అయితే తమ వారు విదేశాల్లో పనిచేస్తూ డాలర్లలో సంపాదించేవారికి మాత్రం ఇది చాలావరకూ ఊరటే. ఐటీ కంపెనీల వంటి ఎగుమతి ఆధారిత సంస్థలకు, అత్యధికంగా విదేశీ రెమిటెన్సులు వచ్చే కేరళ లాంటి రాష్ట్రాలకు ఈ పరిణామం కలిసొచ్చేదే. దేశం మొత్తానికి ఏటా వచ్చే 86 బిలియన్‌ డాలర్లలో 19 శాతం వరకూ కేరళ వాటాయే. కోవిడ్‌తో ఇది దెబ్బతిన్నా… మళ్లీ యథా పూర్వ స్థితికి చేరుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి.

రూపాయి… 32 ఏళ్లలో 15 నుంచి 80కి!
1990కి ముందు డాలర్‌ విలువ 15 రూపాయలే. కాకపోతే ఆ మాత్రం వెచ్చించాలన్నా సర్కారుకు చుక్కలు కనిపించేవి. దాంతో దిగుమతులపై ఆంక్షలు. కార్లు, స్కూటర్లు, ఫోన్లు, గ్యాస్‌.. ఏదైనా దిగుమతి చేసుకోవాల్సిందే. దిగుమతికి డాలర్ల కొరత కనక డబ్బులు పెట్టి కొనాలనుకున్నా ఏదీ దొరకని పరిస్థితి. అన్నింటికీ రేషనే. 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా వచ్చాక సరళీకరణ విధానాలతో కంపెనీలకు ద్వారాలు తెరిచారు. అలా తెరిచిన రెండేళ్లలోనే డాలర్‌ విలువ ఏకంగా 30 రూపాయలకు చేరింది. నాటి నుంచి.. డాలర్ల అవసరంతో పాటు విలువ కూడా పెరుగుతూనే ఉంది.

ఇప్పుడైతే ముడిచమురు, వజ్రాలు, ఎలక్ట్రానిక్‌ వస్తువులు, భారీ యంత్రాలు, ప్లాస్టిక్స్, రసాయనాలు, వంటనూనెలు, ఉక్కు భారీగా దిగుమతి చేసుకోవాల్సి వస్తోంది కనక డాలర్‌ మాదిరే వీటి ధరలూ పెరుగుతున్నాయి. ఆ మేరకు సామాన్యులపైనా ఈ ప్రభావం పడుతోంది.

మున్ముందు పరిస్థితేంటి?
కోవిడ్‌ తదనంతర పరిస్థితులు ఇంకా కొలిక్కి రాలేదు. పెద్ద ఎత్తున ఉద్యోగాలు కోల్పోయిన వారు, కుటుంబాలను కోల్పోయి ఆర్థికంగా దెబ్బతిన్నవారు కుదుటపడలేదు. అప్పట్లో డిమాండ్‌ లేక, అయినా నిర్వహించలేక మూతపడ్డ వ్యాపారాల పరిస్థితి అలానే ఉంది. ఇంతలోనే వచ్చిన ఉక్రెయిన్‌ యుద్ధం… ఇప్పుడప్పుడే ఆగేలా కనిపించటం లేదు. ఇవన్నీ చూస్తుంటే సరఫరా వ్యవస్థలు పూర్తిస్థాయిలో కుదుటపడటానికి మరికొంత సమయం పట్టేలానే ఉంది.

అప్పటి దాకా అంతా సురక్షితమైన పెట్టుబడులవైపు వెళతారు కనక డాలర్‌ మరింత బలోపేతమయ్యే అవకాశాలే ఎక్కువన్నది నిపుణుల అంచనా. ఈ లెక్కన చూస్తే రూపాయితో సహా ఇతర దేశాల కరెన్సీలు ఇంకాస్త పెరిగినా ఆశ్చర్యం లేదు. ఇక దీనితో ముడిపడి ఉన్న స్టాక్‌ మార్కెట్లలోనూ ఆటుపోట్లు తప్పవు. కాబట్టి డాలర్‌తో అవసరాలున్న వారు ఇవన్నీ గమనంలోకి తీసుకున్నాకే తగిన నిర్ణయాలు తీసుకోవాలి. అయితే ఒక్కటి మాత్రం నిజం. ఏ సంక్షోభమూ ఎక్కువకాలం ఉండదు.