Agriculture

ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘సచిన్‌’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం!

ఒకే చెట్టుకు 300 రకాల కాయలు.. ‘సచిన్‌’, ‘ఐశ్వర్య’లు ప్రత్యేకం!

ఒకే చెట్టుకు 300 రకాల మామడి కాయలు కాయడం సాధ్యమేనా.. అంటే అవుననే అంటున్నారు భారత మ్యాంగో మ్యాన్, ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన కలీమ్‌ ఉల్లా ఖాన్‌. తన 120 ఏళ్ల మామిడి చెట్టుకు అంటుకట్టే పద్ధతి ద్వారా 300 రకాల మామిడి కాయలు కాసేలా చేసినట్లు చెబుతున్నారు. కొత్త మామిడి రకాలను అభివృద్ధి చేయడానికి ఈ పద్ధతి ఎంతగానే ఉపయోగపడుతుందని అంటున్నారు. అది ఎలా సాధ్యమైందో తెలుసుకుందాం.

ప్రతి రోజు ఉదయం నిద్రలేచిన తర్వాత ప్రార్థనలు చేసుకుని కిలోమీటరున్నర దూరంలోని తన పొలానికి వెళ్తారు కలీమ్‌ ఉల్లా ఖాన్‌. అక‍్కడ ఉన్న మామిడి చెట్టును చూసుకుంటారు. కొమ‍్మల్లో దాగి ఉన్న మామిడి కాయలను ప్రతిరోజు పరీక్షిస్తారు. ‘దశాబ్దాలుగా మండే ఎండలో కష్టపడిన దానికి నా బహుమతి ఇది’ అని చెబుతారు 82 ఏళ్ల వృద్ధుడు. ఆయన కుటుంబం ఉత్తర్‌ప్రదేశ్‌లోని మలిహాబాద్‌లో నివాసం ఉంటోంది. ఆయన తోటలోని మామిడి చెట్టును చూస్తే మామూలుగానే కనిపిస్తుంది. కానీ, మనసుతో పరిశీలిస్తే.. అది ప్రపంచంలోనే అతిపెద్ద మామిడి కళాశాలగా తారసపడుతుంది.

చదువు మధ్యలోనే మానేసిన కలీమ్‌ ఉల్లా ఖాన్‌.. యుక్త వయసులోనే మామిడి చెట్టుపై తన తొలి ప్రయోగం చేశారు. కొత్త రకాలను తయారు చేసేందుకు వివిధ రకాల మొక్కలను అంటుకట్టారు. తొలుత ఏడు కొత్త రకాలను ఉత్పత్తి చేసేలా మార్చారు. కాని అది తుపాను ధాటికి నేలకొరిగింది. అయితే.. 1987 సంవత్సరం నుంచి తన ప్రయోగాలను కొనసాగిస్తూ.. 120 ఏళ్ల నాటి చెట్టుపై 300 రకాల మామిడి కాయలు కాసేలా చేశారు. ఒక్కోటి ఒక్కో రకమైన రుచి, రంగు, ఆకారం ఉండటం వాటి ప్రత్యేకత.

సచిన్‌, ఐశ్వర్యలు ప్రత్యేకం..
తన తొలి నాటి ప్రయోగంతో వచ్చిన కొత్త రకం మామిడి కాయలకు బాలీవుడ్‌ స్టార్‌, 1994 మిస్‌ వరల్డ్ విన్నర్‌ ఐశ్వర్య రాయ్‌ బచ్చన్‌ పేరుతో ఐశ్వర్యగా నామకరణం చేశారు కలీమ్‌. ఇప్పటికీ ఆయన అభివృద్ధి చేసిన వాటిలో అవి ప్రత్యేకంగా నిలుస్తాయి. ‘ఐశ్వర్యలాగానే ఆ మామిడి పండ్లు సైతం అందంగా ఉంటాయి. ఒక్క మామిడి కాయ కిలోకిపైగా బరువు ఉంటుంది. మందమైన తోలుతో ఎంతో తియ్యగా ఉంటుంది. ‘ అని పేర్కొన్నారు. మరికొన్నింటికి ప్రధాని నరేంద్ర మోదీ, క్రికెట్‌ హీరో సచిన్ టెండూల్కర్‌, అనార్కళీ వంటి పేర‍్లు పెట్టారు. ‘మనుషులు వస్తుంటారు పోతుంటారు. కానీ, మామిడి పండ్లు శాశ్వతం. కొన్నేళ్ల తర్వాత ఎవరైనా ఈ సచిన్‌ మ్యాంగోను తింటే.. క్రికెట్‌ హీరోను గుర్తు చేసుకుంటారు.’ అని పేర్కొన్నారు.