NRI-NRT

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బ..!

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌కు మరో ఎదురు దెబ్బ..!

మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ 2020 అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో చివరి వరకు తన ఓటమిని అంగీకరించని విషయం తెలిసిందే. ఎన్నికల ఫలితాలు వచ్చిన తర్వాత కూడా ఆయన అధ్యక్షపీఠం వదిలిపెట్టేందుకు ససేమీరా అన్నారు. చివరకు జనవరి 6న అగ్రరాజ్యం చరిత్రలోనే మాయనిమచ్చగా మిగిలిపోయే ఓ దారుణ సంఘటనకు కారణమయ్యారు. అదే.. క్యాపిటల్ భవనంపై దాడి . ఈ సంఘటన అనంతరం ట్రంప్‌పై విమర్శలు వెల్లువెత్తడంతో అధ్యక్షభవనం వదిలిపెట్టారు. ఈ ఘటనపై విచారణ కొనసాగుతున్న నేపథ్యంలో ట్రంప్ ఎన్నికల్లో అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలు తెరపైకి వచ్చాయి. తాజాగా 2020 సార్వత్రిక ఎన్నికల్లో నకిలీ ఓటర్లుగా పనిచేసిన 16 మంది రిపబ్లికన్‌ల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. అప్పటి అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అధ్యక్ష ఎన్నికల్లో గెలుపొందినట్లు వీరందరూ తప్పుడు ధృవీకరణ పత్రంపై సంతకం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ మేరకు డొనాల్డ్ ట్రంప్, ఇతరులు రాష్ట్రంలో జరిగిన 2020 సార్వత్రిక ఎన్నికల్లో చట్టవిరుద్ధంగా జోక్యం చేసుకున్నారా? అనే దానిపై దర్యాప్తు చేస్తున్న జార్జియా ప్రాసిక్యూటర్.. 16 మంది రిపబ్లికన్‌లకు నకిలీ ఓటర్లుగా పనిచేసినట్లు నేరారోపణలు ఎదుర్కోవచ్చని తెలియజేశారు.

జార్జీయా రాష్ట్రాన్ని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్ గెలుచుకున్నప్పటికీ, ట్రంపే గెలుపొందారని తమను తాము సక్రమంగా ఎన్నుకోబడిన, అర్హత కలిగిన ఓటర్లుగా ప్రకటించుకున్నారు. అనంతరం వారు అందరూ ఈ మేరకు తప్పుడు ధృవీకరణ పత్రంపై సంతకం కూడా చేశారు. వారిలో పదకొండు మంది అప్పుడు తాము చేసిన ఉపన్యాసాలను రద్దు చేయాలని మంగళవారం మోషన్‌ను దాఖలు చేశారు. వాటిని వారు అసమంజసమైన, అణచివేతగా పేర్కొన్నారు. ఇక ఫుల్టన్ కౌంటీ డిస్ట్రిక్ట్ అటార్నీ ఫని విల్లీస్ గతేడాది “2020 జార్జియా సాధారణ ఎన్నికల నిర్వహణను ప్రభావితం చేసే ప్రయత్నాలపై” నేర విచారణను ప్రారంభించారు. ఆమె అభ్యర్థన మేరకు మేలో సబ్‌పోనా పవర్‌తో కూడిన ప్రత్యేక గ్రాండ్ జ్యూరీని ఏర్పాటు చేశారు. ఈ నెల ప్రారంభంలో కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఆమె “నవంబర్ 2020 జార్జియా, ఇతర చోట్ల ఎన్నికల ఫలితాలను ప్రభావితం చేయడానికి ట్రంప్ క్యాంపెయిన్ ద్వారా ప్రణాళిక రంచించారు” అని ఆరోపించారు. ప్రస్తుతం ఈ వ్యవహారం విచారణ దశలో ఉంది. ఒకవేళ 16 మంది రిపబ్లికన్స్‌పై ఆరోపణలు నిజమైతే మాజీ అధ్యక్షుడు ట్రంప్‌కు ఎదురు దెబ్బ అనే చెప్పాలి.