DailyDose

న్యూజిలాండ్ భామల సౌందర్య రహస్యం తెలుసా?

న్యూజిలాండ్ భామల సౌందర్య రహస్యం తెలుసా?

సుతిమెత్తని సోయగానికి కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తుంటారు న్యూజిలాండ్ భామలు. ఇలా తమ సౌందర్యంతో అందానికే సరికొత్త నిర్వచనమిచ్చే ఈ ముద్దుగుమ్మలకు మేకప్ అంటే గిట్టదట! మరి, వారికి అంతటి అపురూప లావణ్యం ఎలా సొంతమైందనేగా మీ సందేహం..? అదంతా అక్కడి ప్రకృతి సంపద వల్లే అంటున్నారీ అందాల భామలు. ఈ క్రమంలో న్యూజిలాండ్ మహిళల సహజసిద్ధమైన అందం వెనకున్న ఆ రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..

‘మనుక తేనె’తో మొటిమలు మాయం!
ఔషధ గులతో కూడిన ఎన్నో రకాల మొక్కలు, పూల మొక్కలకు ఆలవాలం న్యూజిలాండ్. అందుకే అక్కడి సౌందర్య ఉత్పత్తుల్లో వీటిని ఎక్కువగా ఉపయోగిస్తుంటారు. అలాంటి వాటిలో ‘మనుక’ మొక్క ఒకటి. ఈ చెట్టు పూల నుంచి తయారుచేసిన తేనెను తమ సౌందర్య పోషణలో భాగం చేసుకుంటుంటారు అక్కడి మగువలు. ముఖ్యంగా వాతావరణ కాలుష్యం, మనం తీసుకునే ఆహారం కారణంగా ముఖం జిడ్డుగా మారి, మొటిమలు రావడం సహజమే. తద్వారా అవి కొన్నాళ్లకు మచ్చలుగా ఏర్పడడం, ఆ ప్రదేశంలో గుంతలు పడడం.. ఇలా మొటిమలతో కలిగే దుష్ప్రభావాలెన్నో! వాటన్నింటినీ సమూలంగా తొలగించాలంటే అందుకు మనుక తేనే చక్కటి పరిష్కారం అంటున్నారు న్యూజిలాండ్ భామలు. ఇందులో ఉండే యాంటీబ్యాక్టీరియల్ గుణాలు చర్మంపై ఉండే దుమ్ము-ధూళిని తొలగించి మొటిమలను క్రమంగా తగ్గిస్తాయి. అందుకే ఈ తేనెను నేరుగా ముఖానికి, మెడకు పట్టించడం.. లేదంటే దీన్ని ఫేస్‌ప్యాక్‌లలో వాడడం.. వంటివి చేస్తుంటారు అక్కడి మహిళలు.

మృదువైన చర్మానికి ‘కివీ’!
ప్రకృతి ప్రసాదించే పండ్లు కేవలం ఆరోగ్యానికే కాదు.. అందాన్నీ ద్విగుణీకృతం చేస్తాయన్న విషయం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు. తమ విషయంలోనూ ఇది రుజువైందని చెబుతున్నారు న్యూజిలాండ్ భామలు. అక్కడ విరివిగా లభించే కివీ పండ్లను తమ సౌందర్య పరిరక్షణలో భాగం చేసుకుంటామంటున్నారు వారు. ఈ పండులో ఉండే ‘సి’, ‘కె’, ‘ఇ’ విటమిన్లతో పాటు ఖనిజాలు, అలాగే వీటి గింజల్లో దాగున్న ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు.. వంటివన్నీ చర్మ ఆరోగ్యానికి ఎంతో అవసరం. అలాగే కివీలోని యాంటీఆక్సిడెంట్లు చర్మంలో కొలాజెన్ ఉత్పత్తిని పెంచి చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. ఈ ఫలితాలన్నీ పొందడానికి వారు కివీ పండు గుజ్జును నేరుగా ముఖానికి రాసుకోవడం లేదంటే ఇంట్లో తయారుచేసుకునే ఫేస్‌ప్యాక్‌లలో ఉపయోగించడం.. వంటివి చేస్తుంటారు.

చర్మాన్ని పునరుత్తేజితం చేసే మట్టి!
కాలమేదైనా అందం విషయంలో మనం చేసే నిర్లక్ష్యం వల్ల చర్మం తేమను కోల్పోయి నిర్జీవంగా మారుతుంది. తిరిగి దాన్ని పునరుత్తేజితం చేయాలంటే అది కొన్ని సహజసిద్ధమైన పదార్థాలతోనే సాధ్యమంటున్నారు న్యూజిలాండ్ భామలు. అలా తమ నిర్జీవమైన చర్మానికి తిరిగి ప్రాణం పోయడానికి అక్కడి రొటోరా థర్మల్ పూల్స్‌లో లభించే మట్టిని ఉపయోగిస్తుంటారట వారు! ఎప్పుడూ సలసలా మరుగుతూ ఉండే ఆ పూల్స్‌లోని మట్టిలో చర్మానికి మేలు చేసే ఎన్నో ఔషధ గుణాలుంటాయట. తద్వారా అవి నిర్జీవమైన చర్మాన్ని తిరిగి రిపేర్ చేస్తాయని వారి నమ్మకం. ఇందుకోసం వారు ఆ మట్టిని చర్మానికి పట్టించుకోవడం లేదంటే ఫేస్‌ప్యాక్‌లలో భాగంగా వాడడం.. వంటివి చేస్తుంటారట.

తేమ కోసం ‘వూల్ వ్యాక్స్!’
కొంతమందికి కాలంతో సంబంధం లేకుండా తరచూ చర్మం పొడిబారిపోవడం, పగుళ్లు రావడం మనకు తెలిసిందే. ఈ సమస్యను అధిగమించడానికే రోజూ చర్మానికి మాయిశ్చరైజర్ రాసుకుంటూ ఉంటాం. అయితే ఇందుకోసం న్యూజిలాండ్ మగువలు ఏం చేస్తారో తెలుసా? మైనాన్ని రాసుకుంటారు. అది కూడా గొర్రెల ఉన్నిలో ఉండే ఆయిల్స్ నుంచి తయారుచేసిన మైనాన్ని వారు మాయిశ్చరైజర్‌గా ఉపయోగిస్తారట. విటమిన్ ‘ఇ’ పుష్కలంగా లభించే ఈ వ్యాక్స్ చర్మానికి పోషణనందించి చర్మాన్ని మృదువుగా, నవయవ్వనంగా మార్చడంలో దోహదం చేస్తుంది.

అలర్జీలను తొలగించే ఆకులు!
సూర్యతాపం వల్ల చర్మం కందిపోవడం, అలర్జీలు, దురద.. వంటి చర్మ సంబంధిత సమస్యలు ఎదురైనప్పుడు ఈ చిట్కాను ఉపయోగిస్తుంటారట కివీస్‌ భామలు. అక్కడి అడవుల్లో విరివిగా లభించే ‘కవాకవా’ మొక్క ఆకుల్ని వేడి నీటిలో మరిగించి.. గోరువెచ్చగా మారిన తర్వాత ఆ నీటితో స్నానం చేస్తారట. తద్వారా ఆ ఆకులోని ఔషధ గుణాలు అలర్జీలను దూరం చేయడమే కాదు.. శారీరక నొప్పుల నుంచి కూడా ఉపశమనం కలిగిస్తాయట. మన దేశంలో కూడా కొంతమంది ఇలాంటి అలర్జీలను దూరం చేసుకోవడానికి నీలగిరి.. వంటి ఆకుల్ని నీటిలో మరిగించి ఆ నీటితో స్నానం చేయడం తెలిసిందే.. పైగా పాత కాలం వారు ఈ పద్ధతిని ఎక్కువగా ఉపయోగించేవారు. ఇప్పుడు కూడా ఇలాంటి సహజ పద్ధతులను కొనసాగిస్తే న్యాచురల్‌గానే అలర్జీ వంటి చర్మ సమస్యలను దూరం చేసుకోవచ్చు.