DailyDose

పెద్ద‌ప‌ల్లిలో త‌యార‌వుతున్న ఈ రాఖీల ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా!

పెద్ద‌ప‌ల్లిలో త‌యార‌వుతున్న ఈ రాఖీల ప్ర‌త్యేక‌త ఏంటో తెలుసా!

తోబుట్టువుల బంధానికి ప్రతీక రాఖీ. శ్రావణ పౌర్ణమి రోజున రంగురంగుల రాఖీలు కట్టించుకుని అన్నలూ తమ్ముళ్లూ మురిసిపోతారు. ఎవరికి తెలుసు, ఆ రోజున మీరు ధరించే రాఖీ ‘మేడ్‌ ఇన్‌ పెద్దపల్లి’ అయినా కావచ్చు. ఎందుకంటే ఇక్కడి రాఖీలు నాలుగు రాష్ర్టాలకు ఎగుమతి అవుతాయి.
peddapalli2-V-jpg-816x480-3g-1
రాకెట్లకు శ్రీహరికోట ఎలాగో, రాఖీలకు పెద్దపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీ కేంద్రం అలాగ! దక్షిణాదిలో ఏకైక రాఖీ తయారీ కేంద్రం ఇదే. మొదట్లో పెద్దపల్లి పరిసర ప్రాంతాలకే పరిమితమైన రాఖీలను.. తెలంగాణతోపాటు ఆంధ్రప్రదేశ్‌, మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌గఢ్‌ రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు పెద్దపల్లికి చెందిన ఇల్లందుల కృష్ణమూర్తి – రజని దంపతులు. దేశంలో వేయికిపైగా రాఖీ తయారీ కేంద్రాలు ఉన్నాయి. వాటిలో, పెద్దపల్లిలోని ఎస్‌ఆర్‌ఆర్‌ రాఖీలకు ఓ ప్రత్యేక గుర్తింపు ఉంది. ఇక్కడ 30 వేల రకాల రాఖీలు తయారవుతాయి. రూపాయి మొదలు అయిదు వందల వరకూ పలుకుతాయి. ధర తక్కువ, వైవిధ్యం ఎక్కువ.. ఇక్కడి రాఖీల ప్రత్యేకత. ఆరేండ్ల క్రితం 30 మందితో ప్రారంభమైన రాఖీ తయారీ కేంద్రం ద్వారా రెండువేల మంది ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నారు. ఆన్‌లైన్‌, ఆఫ్‌లైన్‌.. మార్గాల్లో వ్యాపారం జరుగుతుంది.
peddapalli1
ఉపాధి మార్గం కూడా..
ఖాళీ సమయంలో రాఖీలు తయారు చేస్తూ ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో దాదాపు రెండువేల మంది ఉపాధి పొందుతున్నారు. సీజన్‌లో రోజుకు రూ. 100 నుంచి రూ. 500 దాకా సంపాదించే అవకాశం ఉంటుంది. నిర్వాహకులు సూరత్‌, ఢిల్లీ, ముంబై, అహ్మదాబాద్‌ తదితర ప్రాంతాల నుంచి ముడిసరుకు సేకరించి, పెద్దపల్లిలో రాఖీలు తయారు చేయిస్తారు. కొత్తవారికి శిక్షణ కూడా ఇస్తారు. ఏడాది పొడవునా పని ఉంటుంది. కొంతమంది కేంద్రంలోనే కూర్చుని రాఖీలు తయారు చేస్తుండగా, మరికొందరు మాత్రం ముడిసరుకు తీసుకెళ్లి ఖాళీ సమయంలో అదనపు ఆదాయం పొందుతున్నారు. ‘గత 35 ఏండ్లుగా నేను, మా ఆయన ఈ వ్యాపారం చేస్తున్నాం. ఏడాదంతా పని కల్పించాలనే లక్ష్యంతో తయారీ కేంద్రాన్ని ప్రారంభించాం. మేం తక్కువ ధరకే నాణ్యమైన రాఖీలు ఇస్తున్నాం. దీంతో ఇతర రాష్ర్టాల నుంచీ ఆర్డర్లు వస్తున్నాయి’ అంటారు ఇల్లందుల రజని. నవతరం అభిరుచులకు అను గుణంగా కొత్తకొత్త డిజైన్లకు ప్రాణం పోస్తారామె.