Devotional

షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు

షిర్డీ ఆలయానికి భారీగా ఆదాయం.. మూడు రోజుల్లోనే రూ. 5 కోట్లు

*బంగారం, వెండి, చెక్కుల రూపంలో రూ. 5.57 కోట్లు

ప్రముఖ పుణ్యక్షేత్రం షిర్డీలో ఇటీవల మూడు రోజులపాటు జరిగిన గురుపౌర్ణమి ఉత్సవాల్లో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా భక్తులు హుండీలో నగదు, బంగారు, వెండి వస్తువులు, కౌంటర్లవద్ద చెక్కులు, వివిధ రకాల చెల్లింపుల ద్వారా బాబా ఆలయ సంస్ధాన్‌కు ఏకంగా రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చాయి. ఏటా షిర్డీ పుణ్యక్షేత్రంలో గురుపౌర్ణమి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయి. కరోనా కారణంగా గత రెండేళ్లుగా ప్రభుత్వం విధించిన లాక్‌డౌన్‌వల్ల ఆలయం మూసి ఉంచడంతో వివిధ పండుగలకు, ఉత్సవాలకు భక్తులు రాలేకపోయారు. ఈ ఏడాది కరోనా వైరస్‌ నియంత్రణలోకి రావడంతో ప్రభుత్వం లాక్‌డౌన్‌ అంక్షలన్నీ ఎత్తివేసింది.

ఆ తరువాత గురుపౌర్ణమి ఉత్సవాలు జరగడంతో భక్తులు పోటీపడుతూ షిర్డీకి చేరుకున్నారు. మహారాష్ట్ర, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌సహా దేశంలోని వివిధ ప్రాంతాలు, నలుమూలల నుంచి సుమారు మూడు లక్షలకుపైగా భక్తులు వచ్చి బాబా సమాధిని దర్శించుకున్నారు. మూడు రోజులపాటు షిర్డీ పుణ్యక్షేత్రం భక్తులతో పులకించిపోయింది. ఈ సందర్భంగా బాబా సమాధి ఆలయంలో, పరిసరాల్లో ఏర్పాటు చేసిన హుండీలలో భక్తులు భారీగా విరాళాలు సమర్పించుకున్నా రు. గురుపౌర్ణమి ఉత్సవాలు ముగిసిన తరువాత హుండీలలో సమర్పించిన నగదు, బంగారు, వెండి వస్తువుల రూపంలో సమర్పించిన కానుకలు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద భక్తులు చెల్లింపులను లెక్కించారు.

అందులో సుమారు రూ.5.57 కోట్లు విరాళాలు వచ్చినట్లు బాబా సంస్ధాన్‌ తెలిపింది. ఇందులో హుండీలలో రూ.2,16,84,939 నగదు, విరాళాలు సేకరించే కౌంటర్లవద్ద రూ.1,59, 18,974 నగదు, అదేవిధంగా చెక్, డీ.డీ., మనీ అర్డర్, డెబిట్, క్రెడిట్‌ కార్డు, ఆన్‌లైన్‌ చెల్లింపుల ద్వారా రూ.1,36,38,000 మేర వచ్చాయి. విదేశీ కరెన్సీ రూపంలో రూ.19,80,094 వచ్చాయి. అలాగే రూ.22.14 లక్షల విలువచేసే 479.500 గ్రాముల బంగారం, రూ.3.22 లక్షలు విలువ చేసే 8,067.800 గ్రాముల వెండి వస్తువులున్నాయి.