Fashion

మిసెస్‌ ప్లానెట్‌గా విజయవాడ యువతి

మిసెస్‌ ప్లానెట్‌గా విజయవాడ యువతి

విజయవాడకు చెందిన మహిళ మిసెస్‌ ప్లానెట్‌ కిరీటాన్ని దక్కించుకున్నారు. బల్గేరియాలో జరిగిన అందాల పోటీల్లో విజయవాడ యువతి బిల్లుపాటి నాగమల్లిక ఈ కిరీటాన్ని గెలుచుకున్నారు. ఈ కిరీటం కోసం 60 దేశాలకు చెందిన మహిళలు పోటీపడగా.. చివరకు విజయవాడ యువతి విజేతగా నిలిచింది. బర్గాస్ సమ్మర్ ఫెస్టివల్ అండ్ మిసెస్ ప్లానెట్ అంతర్జాతీయ అందాల పోటీలు బల్గేరియాలో ఈ నెల 6 నుంచి 15 వరకు జరిగాయి.

మిసెస్‌ ప్లానెట్‌గా కిరీటం చేజిక్కించుకుని విజయవాడ చేరుకున్న నాగమల్లికకు గన్నవరం విమానాశ్రయంలో ఘనస్వాగతం లభించింది. విజయవాడ ఆటోనగర్‌కు చెందిన నాగమల్లిక గతంలో కూడా అనేక అవార్డులను తన ఖాతాలో వేసుకున్నారు. 2019 లో మిసెస్ అమరావతి, 2020 లో మిసెస్ ఆంధ్రప్రదేశ్, 2021 లో మిసెస్ ఇండియా టైటిల్స్ గెలుచుకున్నది. ఎంబీఏ చదివిన మల్లిక భర్త జితేంద్ర బిజినెస్ మ్యాన్ కాగా.. వారికి 6వ తరగతి చదువుతున్న కుమారుడు ఉన్నాడు.

అంతర్జాతీయ స్థాయిలో సత్తా చాటి ఆంధ్రప్రదేశ్‌ పేరు నిలపడం సంతోషంగా ఉన్నదని మల్లిక గన్నవరం విమానాశ్రయంలో మీడియాతో చెప్పారు. ఈ విజయంలో కుటుంబ సభ్యులు, భర్త జితేంద్ర ప్రోత్సహం చాలా ఉన్నదని ఆమె తెలిపారు. ఇంటి పనులు చూసుకుంటూనే అందాలపోటీలకు సిద్ధమయ్యాయనని.. ఈ క్రమంలో చాలా కష్టపడినట్లు చెప్పింది.