Uncategorized

దానకర్ణుడు..! రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసేశాడు..!

దానకర్ణుడు..! రూ.600 కోట్ల ఆస్తిని దానం చేసేశాడు..!

ప్రస్తుత సమాజంలో పక్క వాడికి పది రూపాయలు దానం చేయడమే గగనమైపోయింది. అలాంటి రోజుల్లో 600 కోట్ల రూపాయల ఆస్తిని పేదవాళ్లకు పంచిపెట్టడం అంటే మాములు విషయం కాదు. ఉత్తరప్రదేశ్‌లోని మొరదాబాద్‌‌‌కు చెందిన వ్యాపారవేత్త, డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్అ దే పనిచేశారు. ఒక్క ఇంటిని మాత్రమే తన వద్ద ఉంచుకుని 50 ఏళ్లు కష్టపడి సంపాదించిన ఆస్తినంతటినీ తృణప్రాయంగా పేదవారి కోసం దానం చేశారు. తన ఆస్తినంతా పేదవారి కోసం ఖర్చుపెట్టమని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి అందించారు. పేదవారికి సేవలందించే నిమిత్తం దాదాపు వందకు పైగా విద్యా సంస్థలను, వృద్ధాశ్రమాలను, ఆసుపత్రులను ఉత్తరప్రదేశ్‌తో పాటు రాజస్తాన్, మహారాష్ట్రల్లో గోయల్ నెలకొల్పారు. కరోనా కారణంగా విధించిన లాక్‌డౌన్ సమయంలో మొరదాబాద్‌లోని 50 గ్రామాలను దత్తత తీసుకుని ఫ్రీ ఫుడ్, మెడిసిన్‌ను అందించారు. డాక్టర్ గోయల్ కుటుంబంలో ఆయన భార్య రేణు, కుమార్తె, ఇద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లి కావడంతో కుమార్తె బరేలిలో ఉంటోంది. పెద్ద కొడుకు మధుర్ గోయల్ ముంబైలో ఉంటున్నారు. చిన్న కొడుకు శుభమ్ ప్రకాష్ గోయల్ మొరదాబాద్‌లోనే ఉంటూ తండ్రికి వ్యాపారంలో చేదోడువాదోడుగా ఉంటున్నారు.

డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ తన ఆస్తినంతటినీ పేదవారికి పంచివ్వాలన్న నిర్ణయాన్ని ఆయన కుటుంబం కూడా స్వాగతించింది. గత సోమవారం రాత్రి ఆస్తిని దానం చేయాలని నిర్ణయించుకున్నట్లు డాక్టర్ గోయల్ బహిర్గతం చేశారు. ఆ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పాతికేళ్ల క్రితం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా ఆయన తన జీవితంలో జరిగిన ఒక ఘటనను గుర్తుచేసుకున్నారు. ‘‘ అది డిసెంబర్ నెల. నేను రైలెక్కుతున్నాను. పేదవాడైన ఒక వ్యక్తి చలికి వణుకుతూ కనిపించాడు. చలి నుంచి కాపాడుకోవడానికి ఒంటిపై చద్దర్ (కప్పుకునే వస్త్రం) కూడా లేదు. కాళ్లకు చెప్పులు కూడా లేవు. అతనిని చూసి నేను దిగ్భ్రాంతి చెందాను. నాకెందుకు అనుకోకుండా నా షూస్ తీసి అతనికి ఇచ్చి తొడుక్కోమని చెప్పాను. కొంతసేపు అతనితోనే ఉన్నాను. ఆ చలి వల్ల నేనూ అతనితో ఎక్కువసేపు ఉండలేకపోయాను’’ అని డాక్టర్ గోయల్ చెప్పారు.
07212022171416n13
ఇలా ఎంతమంది పేదవాళ్లు చలికి తట్టుకునేందుకు కనీసం ఒంటిపై కప్పుకునేందుకు వస్త్రం కూడా లేక ఇబ్బంది పడుతున్నారో అనే ఆలోచన వచ్చిందని.. అప్పటి నుంచి పేదవారికి తన వంతుగా సేవ చేయాలని నిర్ణయించుకున్నానని తెలిపారు. అందుకే ఇన్నాళ్లు తన వంతుగా సేవ చేశానని, ప్రస్తుతం తన ఆస్తిని దానం చేస్తున్నట్లు జిల్లా అధికార యంత్రాంగానికి లేఖ రాశానని చెప్పారు. తన ఆస్తిని పేద వారికి మెరుగైన విద్య, వైద్యాన్ని అందించేందుకు ఖర్చు పెట్టాలని డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ ప్రభుత్వాన్ని కోరారు. డాక్టర్ గోయల్ ప్రాపర్టీకి సరైన ధరను నిర్ణయించేందుకు ఐదుగురితో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వారిలో ముగ్గురిని గోయల్ చెప్పిన వ్యక్తులనే తీసుకుంది. మిగిలిన ఇద్దరినీ ప్రభుత్వం నియమించింది. మొరదాబాద్‌లో డాక్టర్ గోయల్ జన్మించారు. ఆయన తండ్రి ప్రమోద్ కుమార్, తల్లి శకుంతలా దేవి ఇద్దరూ దేశ స్వాంతంత్ర్యం కోసం పోరాడిన వారే. గోయల్ Brother-in-law సుశీల్ చంద్ర దేశ ఎన్నికల ప్రధానాధికారిగా పనిచేశారు. డాక్టర్ అర్వింద్ కుమార్ గోయల్ చేసిన సేవలకు గానూ ఆయనను ప్రస్తుత రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌తో పాటు దేశ రాష్ట్రపతులుగా పనిచేసిన ప్రణబ్ ముఖర్జీ, ప్రతిభా పాటిల్, డాక్టర్. ఏపీజే అబ్దుల్ కలాం కొనియాడి గౌరవించారు.