Sports

ఇంగ్లండ్‌ టూ వెస్టిండీస్‌.. బీసీసీఐ ఎంత ఖర్చు పెట్టింది అంటే..?

ఇంగ్లండ్‌ టూ వెస్టిండీస్‌.. బీసీసీఐ ఎంత ఖర్చు పెట్టింది అంటే..?

ఇంగ్లండ్‌తో వన్డే సిరీస్ ముగిసిన అనంతరం భారత జట్టు నేరుగా కరీబియన్‌ దీవులకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఇంగ్లండ్‌తో అఖరి వన్డే ముగిశాక 16 మంది ఆటగాళ్లతో కూడిన భారత బృందం ప్రత్యేక విమానంలో మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్‌) చేరుకుంది. అయితే ఇంగ్లండ్‌ నుంచి విండీస్‌కు భారత ఆటగాళ్లు వెళ్లడానికి బీసీసీఐ భారీగా ఖర్చు చేసింది. భారత ఆటగాళ్లు వెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్‌కు బీసీసీఐ ఏకంగా 3.5 కోట్ల భారీ మొత్తాన్ని ఖర్చు పెట్టింది. కాగా చార్టర్డ్ ఫ్లైట్‌ను బుక్ చేయడానికి గల కారణాన్ని బీసీసీఐ అధికారి ఒకరు వెల్లడించారు.ఆటగాళ్లతో పాటు వారి భార్యలు, సహాయక సిబ్బందితో కలిపి ఎక్కువ సంఖ్య ఉండడం వల్లే చార్టర్డ్ ఫ్లైట్‌ బక్‌ చేయాల్సి వచ్చింది అని అతడు తెలిపాడు. “మాంచెస్టర్ నుంచి పోర్ట్ ఆఫ్ స్పెయిన్(ట్రినిడాడ్ అండ్‌ టొబాగో)కు భారత ఆటగాళ్లను తీసుకెళ్లిన చార్టర్డ్ ఫ్లైట్ కోసం బీసీసీఐ రూ. 3.5 కోట్లు ఖర్చు చేసింది. భారత బృందం‍లో సభ్యల సంఖ్య ఎక్కవగా ఉండడంతో చార్టర్డ్ ఫ్లైట్ బుక్‌ చేశాం.సాధారణంగా కమర్షియల్ ఫ్లైట్‌లో ఈ ఖర్చు దాదాపు రూ. 2 కోట్లు మాత్రమే అయి ఉండేది. అయితే చార్టర్డ్ ఫ్లైట్ కోసం అదనంగా మరో 1.5 కోట్లు ఖర్చు చేయాల్సి వచ్చింది” అని అతడు పేర్కొన్నాడు. ఇక వెస్టిండీస్‌ టూర్‌లో భాగంగా టీమిండియా మూడు వన్డేలతో పాటు ఐదు టీ20 మ్యాచ్‌లు ఆడనుంది. జూలై 22 నుంచి వన్డే సిరీస్‌ ఆరంభం కానుంది.