Business

యూరప్‌కూ మాంద్యం భయాలు!

యూరప్‌కూ మాంద్యం భయాలు!

యూరోపియన్‌ యూనియన్‌ (ఈయూ) దేశాలకూ ఆర్థిక మాంద్యం భయం పట్టుకుంది. ఈ దేశాల్లోనూ జూన్‌ నెల రిటైల్‌ ద్రవ్యోల్బణం గత 40 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా 8.6 శాతానికి చేరింది. దీంతో ధరల సెగ తగ్గించేందుకు అమెరికా ఫెడ్‌ రిజర్వ్‌ బాటలోనే యూరోపియన్‌ కేంద్ర బ్యాంక్‌ (ఈసీబీ) చర్యలు చేపట్టింది. కీలక వడ్డీ రేట్లను ఒక్కసారిగా అర శాతం (0.5ు) పెంచింది. ఈసీబీ వడ్డీ రేట్లు పెంచడం గత 11 ఏళ్లలో ఇదే మొదటిసారి. వచ్చే సెప్టెంబరులో మరో అర శాతం వడ్డీ రేట్లు పెంచే అవకాశం ఉందని భావిస్తున్నారు. రష్యా-ఉక్రెయిన్‌ యుద్ధ ప్రభావంతో ఈయూ దేశాల్లోనూ రిటైల్‌ ద్రవ్యోల్బణం సెగలు కక్కుతోంది. దీంతో జర్మనీ, పోలెండ్‌ వంటి దేశాలు వెంటనే మాంద్యంలోకి వెళ్లే సూచనలు కనిపిస్తున్నాయి.

*చైనాలోనూ ఆర్థిక కష్టాలు
చైనాలోనూ ఆర్థిక సంక్షోభం ముదురుతున్న సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ కొన్ని రాష్ట్రాల్లో బ్యాంకులు డిపాజిటర్లకు ఏప్రిల్‌ నుంచి చెల్లింపులు నిలిపివేశాయి. కారణమేమిటో చెప్పకుండా కొద్దిగా ఓపిక పట్టాలని స్థానిక ప్రభుత్వాలు ప్రజల్ని కోరాయి. దీంతో చైనాలోని పలు నగరాల్లో వేల సంఖ్యలో ప్రజలు బ్యాంకుల్ని చుట్టుముట్టారు. మా డిపాజిట్లు ఇస్తారా? చస్తారా? అని బ్యాంకుల్ని ముట్టడిస్తున్నారు. వీరి ఆందోళనలు తట్టుకోలేక స్థానిక ప్రభుత్వాలు సైన్యం సాయం కోరాయి. నిరసనకారుల్ని చెదరగొట్టేందుకు కొన్ని చోట్ల సైన్యం యుద్ధ ట్యాంకుల్ని రంగంలోకి దించింది. దీన్నిబట్టి చైనా బ్యాంకింగ్‌ రంగం పెద్ద సంక్షోభాన్నే ఎదుర్కొంటోందని భావిస్తున్నారు. ఇంత జరుగుతున్నా చైనా ప్రభుత్వం మాత్రం అధికారికంగా నోరు విప్పడం లేదు.