Sports

హైదరాబాద్‌లో భారత్‌–ఆస్ట్రేలియా టి20

హైదరాబాద్‌లో భారత్‌–ఆస్ట్రేలియా టి20

సొంత గడ్డపై భారత జట్టు ఆస్ట్రేలియా, దక్షిణాఫ్రికాలతో పరిమిత ఓవర్ల సిరీస్‌లలో తలపడనుంది. ఆస్ట్రేలియాతో ముందుగా 3 టి20 మ్యాచ్‌లు ఆడే టీమిండియా… ఆ తర్వాత సఫారీ టీమ్‌తో 3 టి20లు, 3 వన్డేలు ఆడుతుంది. దీనికి సంబంధించిన షెడ్యూల్‌ను బీసీసీఐ దాదాపుగా ఖరారు చేసింది. చాలా కాలం తర్వాత హైదరాబాద్‌లోని రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ స్టేడియంకు మరో మ్యాచ్‌ నిర్వహణ అవకాశం లభించింది.

భారత్, ఆస్ట్రేలియా మధ్య మూడో టి20 సెప్టెంబర్‌ 25న ఉప్పల్‌లో జరుగుతుంది. 2019 డిసెంబర్‌ 6న ఇక్కడ చివరి మ్యాచ్‌ (భారత్‌–విండీస్‌ టి20) జరిగింది. సిరీస్‌లోని తొలి రెండు మ్యాచ్‌లు సెప్టెంబర్‌ 20, 23 తేదీల్లో మొహాలి, నాగ్‌పూర్‌లలో జరుగుతాయి. దక్షిణాఫ్రికాతో సెప్టెంబర్‌ 28, అక్టోబర్‌ 1, 3 న జరిగే 3 టి20లకు వేదికలుగా త్రివేండ్రం, గువహటి, ఇండోర్‌ ఖరారయ్యాయి. దక్షిణాఫ్రికాతోనే జరిగే 3 వన్డేలకు అక్టోబర్‌ 6, 9, 11 తేదీల్లో రాంచీ, లక్నో, న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వనున్నాయి.

యూఏఈలోనే ఆసియా కప్‌
ఆగస్టు 27నుంచి సెప్టెంబర్‌ 11 వరకు జరిగే ఆసియా కప్‌ వేదికను శ్రీలంకనుంచి తరలించారు. ఈ టోర్నీ ఇప్పుడు యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఈఏ)లో జరగనుంది. ఈ విషయాన్ని బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్‌ గంగూలీ నిర్ధారించారు. తమ దేశంలో నెలకొన్న రాజకీయ, ఆర్థిక సంక్షోభం నేపథ్యంలో ఆసియా కప్‌ను నిర్వహించలేమని శ్రీలంక బోర్డు చేతులెత్తేయడంతో ప్రత్యామ్నాయ వేదికను చూడక తప్పలేదు. ఆసియా కప్‌ జరిగే సీజన్‌లో ఉండే వాతావరణ పరిస్థితిని బట్టి చూస్తే ఒక్క యూఏఈలోనే వర్షాలు పడే అవకాశం లేదు కాబట్టి దానినే ఖాయం చేశామని గంగూలీ స్పష్టం చేశారు.