Agriculture

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు

మామిడి తోటల్లో యాజమాన్య పద్ధతులు

చలి కాలంలో చలి తీవ్రత పెరిగే కొద్దీ మామిడి పంటపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. ఎప్పటికప్పుడూ వాటికి తగిన యాజమాన్య పద్ధతులు పాటించాలి. తద్వారా మంచి దిగుబడులు సాధించవచ్చు. చలి తీవ్రత ఎక్కువగా ఉన్నచోట తెల్లవారు 3 గంటల నుంచి 6 గంటల సమయంలో చెట్లకు నీళ్లు వదలాలి. దీనివల్ల చెట్లకు వేడి నీరు అంది వాటి కణుపులలో ఉన్న పిండి పదార్థం పూతగా బయటకు వస్తుంది. దీంతోపాటు చెట్లకు కొద్దిమోతాదులో పొటాషియం ఎరువు ఇవ్వడం ద్వారా కొంతపూత బయటికి వస్తుంది. లేదంటే మార్కెట్‌లో లభ్యమయ్యే (13-0-45) పొటాషియం నైట్రేట్‌ మందును 10 గ్రాములు/లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

పూత రాలడం
ముఖ్యంగా పూత రాలడానికి ముఖ్యమైన మూడు కారణాలున్నాయి. వాటి గురించి జాగ్రత్త వహిస్తే పూత రాలడం తగ్గించుకోవచ్చు.

నీటి హెచ్చు, తగ్గుదల
ఈ సమయంలో నీరు మొక్కకు చాలా అవశ్యమైనది. కిరణజన్య సంయోగ క్రియ ద్వారా తయారు చేసుకున్న పిండిపదార్థం అంతా మొక్క ఆకుల్లోని కణుపుల్లో దాగి ఉంటుంది. అది పిండి పదార్థంగా భవిష్యత్తులో పండుగా తయారుకావాలన్నా నీరు తప్పనిసరిగా అవసరం. కాబట్టి నీరు ప్రధానమైనది.

నీరు తగ్గినప్పుడు
చెట్టుకు ఒకవేళ నీరు తగ్గితే కొత్తగా వచ్చిన పూతలో ధారళమైన పొర ఎండిపోయి పూత పడిపోతుంది.

నీరు ఎక్కువైనప్పుడు
చెట్టుకు నీరు ఎక్కువైతే పూతకు చెట్టుకు మధ్యన ఉన్న ధారళమైన పొరలో నీరు ఎక్కువై జారుడు స్వభావంతో బరువు ఎక్కువై పూత రాలిపోతుంది. కాబట్టి చెట్టుకు నీరు ఎంత అవసరమో అంతే పెట్టాలి. లేదంటే ‘చైన్‌లింక్‌’ మాదిరిగానే ఉన్న పూత, నీటి సముదాయం తక్కువైతే చైన్‌లింక్‌ సాగి సందు ఏర్పడుతుంది. ఎక్కువైతే చైన్‌లింక్‌ ఓవర్‌లాప్‌ అయి బరువు ఎక్కువై పడిపోతుంది. అందుకని నీరు తడి ఆరి తడి పద్ధతుల్లో హెచ్చుతగ్గులు లేకుండా పెట్టుకోవాలి.

పూతను తినే చీడ పురుగులు
సహజంగా రసం పీల్చే పురుగులు, దోమలు, నల్లి వంటివి ఈ సమయంలో పూతను ఆశిస్తాయి. అవి పూతను గోకి తినడం వల్ల కూడా పూత గుత్తులు గుత్తులుగా రాలడానికి అవకాశం ఉన్నది. వీటి నివారణకు ఎసిఫేట్‌@ 1.5 గ్రాములు లేదా ఇమిడా క్లోప్రిడ్‌ @ 0.3 మిల్లీలీటర్లు లేదా ఎసిటామిప్రైడ్‌ @ 0.5 గ్రాములు ఏదో ఒకదానిని నీటి లో కలిపి పిచికారీ చేయాలి. దీనిని గమనించాలంటే పూతపై ఏదో గిచ్చి తిన్న ఆనవాళ్లు గమనించవచ్చు.

హార్మోన్ల ప్రభావం
సహజంగా హార్మోన్ల ప్రభావం వల్ల రాలిన పూత గుత్తులు గుత్తులుగా రాలిపోతుంది. వాటి రాలిన పూతను పట్టుకొని చూస్తే ఎలాంటి కొరికిన, గిచ్చిన ఆనవాళ్లు లేకుండా తాజాగా, ధారళమైన పొర దగ్గర గోధుమరంగులో మారి సమానంగా పూత ఊడి ఉంటుంది. అటువంటప్పుడు మనం పూత రాలింది గమనించి ఇది హార్మోన్ల ప్రభావం అని గుర్తించాలి. దీని నివారణకు మార్కెట్‌లో లభించే ప్లానోఫిక్స్‌ (NAA -నాఫ్తలిక్‌ ఎసిటిక్‌ ఆమ్లం)ను 4 లీటర్ల నీటిలో 1 మి.లీ.ను కలిపి పిచికారీ చేయాలి. లేదా 10 లీటర్ల నీటిలో 2.5 మి.లీ. కలిపి వాడవచ్చు. లేదంటే 100 లీటర్ల నీటిలో 2,4-D 1 గ్రాము చొప్పున కలిపి పిచికారీ చేసుకోవచ్చు.

బూడిద తెగులు
ఇది చలి, మంచు ఉన్న ప్రదేశాల్లో చాలా ఎక్కువగా వస్తుంది. ఇది అని గమనించడానికి తెల్లని పిండి వంటి పదార్థం ఆకులపైన పేరుకొనిపోయి ఉంటుంది. దీని నివారణకు డైనో క్యాప్‌ @ 1 మి.లీ. / 1 లీటరు నీరు లేదా మెకోబ్యూటానిల్‌ @1 గ్రాము/ 1 లీటరు నీరు లేదా అజాక్సీస్ట్రోబిన్‌ @ 0.7 మి.లీ./ 1 లీటరు నీరు వీటలో ఏదో ఒకదానిని మాత్రమే పిచికారీ చేయాలి. ఒకవేళ ఇలా ఒకసారి చేసిన తర్వాత కూడా ఇంకా ఉధృతి తగ్గకపోతే 10 నుంచి 15 రోజుల తర్వాత మళ్లా ఒకసారి పిచికారీ చేయాలి.

మసి మంగు
ఇది ఆకులపైన నల్లటి పొర వలె కనబడుతుంది. దీనిని చేతితో తుడిచినా పోదు. ఆకుపైన గట్టిగా అంటుకొని ఉంటుంది. దీనికి కారణం రసం పీల్చే పురుగులు, తేనె మంచు పురుగులు, పిండి నల్లి వంటిని విసర్జించి అతుక్కుపోతాయి. క్రమేపీ కిరణజన్య సంయోగక్రియ జరుగక, పిందెలు ఏర్పడక లేదా ఏర్పడి పిందెలు లావు కాకుం డా రాలిపోతాయి. దీని నివారణకు మార్కెట్‌లో దొరికే 2 కిలోల గంజి పొడిని, 4-5 లీటర్ల నీటిలో కలుపుకొని దానిని ఉడికించి కుతకుతమని పొంగు వచ్చినపుపడు తీయాలి. ఆ మిశ్రమాన్ని 100 లీటర్ల నీటిలో పోసుకొని బాగా కలుపాలి. తర్వాత అది చెట్టంతా తడిచేటట్టుగా మొత్తం కొట్టాలి. అది ఆకులపైన తెల్లగా అంటుకుంటుంది. కనీసం 3-4 రోజుల వరకు ఆగి ఆ వెంటనే కొంచెం గోరు వెచ్చని నీరు గాని లేదా మామూలు నీరు గాని ఆకులపై మంచిగా తడిచే విధంగా కొట్టాలి. దీనివల్ల ఆకులపైన పేరుకుపోయిన ఆ మసి మంగు అంతా పూర్తిగా నివారించబడుతుంది. దీనిద్వారా కిరణజన్య సంయోగ క్రియ మంచిగా జరిగి చెట్లు ఆరోగ్యంగా ఉంటాయి.

మచ్చతెగులు
అక్కడక్కడ ఆకులపైన, లేత కొమ్మలపైన గోధుమ రంగు మచ్చలు కనిపిస్తుంటాయి. వాటి నివారణకు కార్బండిజమ్‌ @ 1 గ్రాము/ 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి.

పిండినల్లి
కొంచెం కాయలు గోలిసైజులో రాగానే అక్కడక్కడ పిండి వంటి పురుగులు గుత్తులు గుత్తులుగా కనిపిస్తాయి. ఇటువంటి పరిస్థితిని మనం పిండినల్లిగా గుర్తించాలి. దీని నివారణకు వేపనూనె 5 మి.లీ. లేదా డ్రైక్లోరోవాస్‌ 1 మి.లీ. లేదా ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ.లేదా ఎసిఫేట్‌ 1.5 గ్రాములు లేదా ఇమిడా క్లోప్రిడ్‌ 0.3 మి.లీ. లీటరు నీటిలో ఏదో ఒకదానిని కలిపి పిచికారీ చేయాలి.

నోట్‌: తప్పనిసరిగాపై ఏ మందు వాడిని వేపనూనె వాడటం మంచిది. ఎందుకంటే పిండి పురుగులు గుత్తులు గుత్తులుగా ఉండి మందుకొడితే పైన ఉన్నవి మాత్రమే చనిపోతాయి. కిందివి చనిపోవు.ఎక్కడైనా వేప నూనె కలిపేటప్పుడు నూనె నీటిలో కరుగదు. కాబట్టి కొద్ది మోతాదులో సర్ఫుపొడిని కాని లేదా సబ్బు నీటిని మొదలు నీటిలో నూనెను కరిగించిన తర్వాతనే క్రిమిసంహారక మందులను వాడాలి. లేకపోతే నూనె నీటిలో కరుగదు. దానిలో పొడి మందులు పోస్తే ఉండలుగా అత్తుకుంటాయి. రైతులు పిచికారీ చేసేటప్పుడు నాజిల్‌కు నూనె అతుక్కుపోతుంది.

ఎర్రనల్లి
అక్కడక్కడ ఆకుల అడుగుభాగంలో గోకి తిన్నట్లుగా గుత్తులు గుత్తులుగా ఉంటాయి. క్రమేపీ గోకి తిన్న తర్వాత ఆ రసంపైన సూర్యరశ్మి పడితే పుండు మానిన మాదిరిగానే గట్టిగా ఒక పదార్థం చేరుతుంది. దానివల్ల కాయ గట్టిపడి రాతి మంగు మాదిరిగా తయారవుతుంది.దీని నివారణకు ఫిప్రొనిల్‌ 2 మి.లీ. లేదా స్పైరోమెసిఫిన్‌ 1 మి.లీ.లేదా ప్రొపర్‌గైట్‌ 1. మి.లీ. 1 లీటరు నీటిలో కలిపి పిచికారీ చేయాలి. ఉధృతి ఎక్కువగా ఉంటే మందు మార్చి మళ్లీ 10 రోజుల తర్వాత పిచికారీ చేయాలి.

ఆకు తినే పురుగు/ గొంగళి పురుగు
ప్రధానంగా బత్తాయి, నిమ్మ పంటల్లో ఉంటుంది. దీనివల్ల ఆకు కత్తిరించబడుతాయి. అక్కడక్కడ ఆకులపైన నల్లటి ముద్దలను విసర్జిస్తుంది. దీని నివారణకు ప్రొఫినోఫాస్‌ 2 మి.లీ లేదా డైక్లోరోవాస్‌ 1.5 మి.లీ. లేదా ఇమామెక్టిన్‌ బెంజోయేట్‌ 0.5 గ్రాములు 1 లీటరు నీటిలో ఏదో ఒకదానిని పిచికారీ చేయాలి.పై జాగ్రత్తలు పాటించినట్లయితే రైతులు మంచి దిగుబడులు సాధించడానికి అవకాశమున్నది. రైతులకు తెలియక పురుగు మందులు, పోషకాలు కలిపి కొడుతున్నారు. అలా కొట్టకూడదు. పై మందులు తప్పనిసరిగా సూచించిన మోతాదులోనే వాడటం మంచిది.