Politics

ముగిసిన సోనియా విచారణ.. మళ్లీ సోమవారం విచారణకు..

ముగిసిన సోనియా విచారణ.. మళ్లీ సోమవారం విచారణకు..

నేషనల్ హెరాల్డ్ అవినీతి కేసులో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ ని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరక్టరేట్ అధికారులు సుమారు మూడు గంటల పాటు ప్రశ్నించారు. తదుపరి విచారణకు ఆమె సోమవారం మరోసారి రావాల్సి ఉంటుందని ఈడీ అధికారులు తెలిపారు. ఈ ఉదయం 11 గంటలకు సోనియా ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి చేరుకున్నారు. సోనియా వెంట ఆమె తనయుడు రాహుల్ గాంధీ , కుమార్తె ప్రియాంక గాంధీ వాద్రా ఈడీ కార్యాలయానికి వచ్చారు. సోనియా ఇటీవలే కోవిడ్ నుంచి కోలుకున్నారు. కోవిడ్ నెగెటివ్ సర్టిఫికెట్ కూడా సోనియా అందజేసినట్లు తెలిసింది. కోవిడ్ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటుండటంతో సోనియా వెంట ప్రియాంకను కూడా ఈడీ భవనంలోకి అనుమతించారు. అయితే ప్రియాంకను సోనియాను ప్రశ్నించిన గదిలోకి మాత్రం అనుమతించలేదు. మనీ లాండరింగ్‌ నిరోధక చట్టం(పీఎంఎల్‌ఏ)లోని క్రిమినల్‌ సెక్షన్ల కింద సోనియా వాంగ్మూలాలను ఈడీ అధికారులు నమోదు చేశారు. నేషనల్‌ హెరాల్డ్‌ పత్రికలో సోనియా, రాహుల్‌ల షేర్లు, ఆర్థిక లావాదేవీలు, వీరి పాత్రలకు సంబంధించి ప్రశ్నించారు.

మరోవైపు సోనియా ఈడీ అధికారుల ఎదుట హాజరైనందుకు కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది. రాహుల్ గాంధీ ఈడీ ఎదుట హాజరైనప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ దేశవ్యాప్తంగా ఆందోళనలు నిర్వహించింది.
కాంగ్రెస్ పార్టీకి నేషనల్ హెరాల్డ్ పత్రిక బకాయి ఉన్న 90.25 కోట్ల రూపాయలను వసూలు చేసుకునే హక్కును పొందేందుకు కేవలం 50 లక్షల రూపాయల చెల్లింపుతో యంగ్ ఇండియన్ ప్రైవేట్ లిమిటెడ్ ద్వారా నేరపూరితమైన కుట్ర పన్నారని ఎంపీ సుబ్రహ్మణ్య స్వామి గతంలో ఆరోపించారు. సోనియా, రాహుల్ నేషనల్ హెరాల్డ్ ఆస్తుల్ని ఆయాచితంగా పొందారని కూడా స్వామి గతంలో ఆరోపించారు.