Devotional

ఆగ‌స్టు 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

ఆగ‌స్టు 8 నుంచి తిరుమల శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాలు

శ్రీ వేంకటేశ్వరస్వామి వారి ఆలయంలో వచ్చే నెల 8 నుంచి పవిత్రోత్సవాలు జరుగనున్నాయి. ఈ పవిత్రోత్సవాలు మూడు రోజుల పాటు కొనసాగుతాయి. ఆగ‌స్టు 7న అంకురార్పణంతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయి. ఏడాది పొడవునా ఆలయంలో జరిగే అర్చనలు, ఉత్సవాల్లో యాత్రికుల వల్ల గానీ, సిబ్బంది వల్ల గానీ తెలియక జరిగే కొన్ని దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రాకుండా ఆగమశాస్త్రం ప్రకారం పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. పవిత్రోత్సవాలు తిరుమలలో 15-16 శతాబ్దాల వరకు జరిగినట్టు ఆధారాలున్నాయి. 1962 నుంచి దేవస్థానం ఈ ఉత్సవాలను పునరుద్ధరించింది. ఉత్సవాల్లో భాగంగా మూడు రోజుల పాటు ఆల‌యంలోని సంపంగి ప్రాకారంలో ఉదయం 9 నుంచి 11 గంటల వరకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఆభరణాలతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామి ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శన‌మిస్తారు. ఆగ‌స్టు 8న పవిత్రాల ప్రతిష్ట, ఆగ‌స్టు 9న పవిత్ర సమర్పణ, ఆగస్టు 10న పూర్ణాహుతి కార్యక్రమాలు జరుగుతాయి.
*పవిత్రోత్సవాల్లో ఆర్జితసేవలు రద్దు
ప‌విత్రోత్సవాల్లో ఆగ‌స్టు 7న అంకురార్పణ కార‌ణంగా సహస్రదీపాలంకార సేవను టీటీడీ ర‌ద్ధు చేసింది. అదేవిధంగా, ఆగ‌స్టు 9న అష్టాద‌ళ పాద‌ప‌ద్మారాధ‌న‌తోపాటు ఆగ‌స్టు 8 నుంచి మూడు రోజుల పాటు కల్యాణోత్సవం, ఊంజల్‌సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకార సేవలను ర‌ద్దు చేశారు.
*29 న శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర
తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి ఆలయంలో ఈ నెల 29 న శ్రీ ప్రతివాది భయంకరన్‌ అన్నన్‌ సాత్తుమొర నిర్వహించ‌నున్నారు. ఈ సందర్భంగా ఉదయం తిరుమల నుంచి శ్రీవారి అప్పాపడి ప్రసాదాన్ని తిరుప‌తిలోని శ్రీ లక్ష్మీనారాయణ స్వామి ఆలయం వరకు ఊరేగింపుగా తీసుకొచ్చి సాత్తు మొర నిర్వహిస్తారు. శ్రీ ప్రతివాది భయంకర అన్నన్‌ సంస్కృత పండితులు. తిరుమల శ్రీవారిని మేల్కొలిపే సుప్రభాతంతోపాటు స్తోత్రం, ప్రపత్తి, మంగళాశాసనమును అద్భుతంగా రచించారు. శ్రీ భాష్యం, శ్రీ భాగవతం వంటి మహా గ్రంథాలకు వ్యాఖ్యానం రచించారు. వీరి జన్మ నక్షత్రాన్ని పురస్కరించుకుని ఆరోజున సాత్తుమొర నిర్వహించడం ఆనవాయితీగా వస్తున్నది.

1. తిరుమలలో ఘనంగా పల్లవోత్సవం
తిరుమల లో బుధవారం పల్లవోత్సవం ఘనంగా జరిగింది. మైసూరు మహారాజు జయంతిని పురస్కరించుకుని టీటీడీ పల్లవోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ఇందులో భాగంగా బుధవారం సహస్రదీపాలంకార సేవ అనంతరం శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామిని ఊరేగింపుగా కర్ణాటక సత్రానికి వేంచేపు చేశారు. మైసూరు సంస్థానం వారి ఆతిథ్యాన్ని స్వీకరించారు. తర్వాత కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధులు, మైసూరు సంస్థానం ప్రతినిధులు స్వామి, అమ్మవార్లకు ఆహ్వానం పలికి ప్రత్యేక హారతి సమర్పించారు. అలాగే ప్రత్యేక పూజలు నిర్వహించి, నైవేద్యం సమర్పించి భక్తులకు ప్రసాదాల పంపిణీ చేశారు.

2.యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి కి బుధవారం నిత్యవిధి కైంకర్యాలు సంప్రదాయరీతిలో కొనసాగాయి. వేకువజామున సుప్రభాతంతో స్వామిని మేల్కొలిపిన అర్చకులు గర్భాలయంలో కొలువుదీరిన స్వయంభువులను, సువర్ణ ప్రతిష్ఠా అలంకారమూర్తులను పంచామృతాలతో అభిషేకించి తులసీ దళాలతో అర్చనలు జరిపారు. ప్రధానాలయ మొదటి ప్రాకార మండపంలో లక్ష్మీనృసింహుడిని గజవాహన సేవ అనంతరం నిత్యతిరుకల్యాణోత్సవం నిర్వహించారు. ముందుగా విశ్వక్సేనుడిని ఆరాధిస్తూ సుదర్శన నారసింహ హోమ పూజలు నిర్వహించారు. ప్రధానాలయ ముఖమండపంలో సువర్ణ పుష్పార్చనలు, అష్టోత్తరాలు, సాయంత్రం అలంకార వెండి జోడు సేవలు, సహస్రనామార్చన పూజలు కొనసాగాయి. కొండపైన శివాలయంలో రామలింగేశ్వరుడికి నిత్యారాధనలు, కొండకింద గండి చెరువు సమీపంలోని దీక్షాపరుల మండపంలో సత్యనారాయణస్వామి వ్రతపూజలు శైవాగమ పద్ధతిలో కొనసాగాయి. అదేవిధంగా అనుబంధ పాతగుట్ట ఆలయంలోనూ నిత్య పూజలు శాస్త్రోక్తంగా జరిగాయి. పాతగుట్ట దేవాలయంలో కొలువుదీరిన స్వయంభూమూర్తులకు నిజాభిషేకం, నిత్యార్చనలు, నిత్యతిరుకల్యా ణోత్సవాన్ని ఆగమ శాస్త్రరీతిలో వైభవంగా నిర్వహించారు.

3.తిరుమలలో భక్తుడి హత్య కలకలంరేపింది. శ్రీవారి ఆలయం వెనుక గోవింద నిలయం మ్యూజియం వద్ద బుధవారం అర్థరాత్రి ఘటన జరిగినట్లు గుర్తించారు. ఆ తరువాత పోలీసులు సీసీ ఫుటేజ్ పరిశీలించగా నిద్రిస్తున్న అతడిపై బండరాయితో గుర్తు తెలియని వ్యక్తి మోది హత్య చేశాడు. మృతదేహాన్ని తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేశారు.

4. శ్రీవారి హుండీ ఆదాయం రూ. 4.78 కోట్లు
తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. 29 కంపార్ట్‌ మెంట్లలో భక్తులు శ్రీవారి దర్శనానికి వేచి ఉన్నారు. సర్వ దర్శనానికి 12 గంటల సమయం పడుతుందని అధికారులు పేర్కొన్నారు. నిన్న తిరుమల శ్రీవారిని 76,821 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. 34,732 మంది భక్తులు తలనీలాలు సమర్పించుకున్నారని టీటీడీ అధికారులు వెల్లడించారు. భక్తులు సమర్పించుకున్న కానుకల ద్వారా హుండీ ఆదాయం రూ.4.78 కోట్లు వచ్చిందని తెలిపారు.