Politics

కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్‌

కేరళ సీఎం పినరయి విజయన్‌కు కోర్టు షాక్‌

కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్‌కు షాక్‌ ఇచ్చింది స్థానిక కోర్టు. ఎల్డీఎఫ్‌ కన్వీనర్‌ ఈపీ జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది ఇద్దరిపైనా ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాలని పోలీసులను బుధవారం ఆదేశించింది తిరువనంతపురం కోర్టు.

ఇండిగో విమానంలో కాంగ్రెస్‌ నేతలతో జరిగిన తోపులాటకు సంబంధించి.. జయరాజన్‌పై ఎలాంటి చర్యలు అవసరం లేదని, తీసుకోబోమని అసెంబ్లీ సాక్షిగా సీఎం పినరయి విజయన్‌ ప్రకటించారు. ఈ ప్రకటన ఇచ్చిన మరుసటి రోజే .. ఎల్డీఎఫ్‌ ప్రభుత్వానికి ఝలక్‌ ఇచ్చింది కోర్టు. ఈ వ్యవహారానికి సంబంధించి బెయిల్‌ మీద బయటకు వచ్చిన యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు ఇద్దరు.. జయరాజన్‌పై ఫిర్యాదు చేస్తున్నా పోలీసులు పట్టించుకోవడం లేదంటూ కోర్టును ఆశ్రయించారు.

ఈ క్రమంలో బుధవారం విచారణ సందర్భంగా తిరువనంతపురం జ్యూడీషియల్‌ ఫస్ట్‌ క్లాస్‌ మెజిస్ట్రేట్‌ కోర్టు జయరాజన్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేయాల్సిందేనని వలియాథుర పోలీసులను ఆదేశించింది. జయరాజన్‌తో పాటు సీఎం వ్యక్తిగత సిబ్బంది అనిల్‌ కుమార్‌, సునీష్‌లను కూడా ఎఫ్‌ఐఆర్‌లో చేర్చాలని, బాధితులు పేర్కొంటున్నట్లు కుట్రపూరిత నేరం.. హత్యాయత్నం కింద నేరారోపణలు నమోదు చేయాలని పోలీసులకు న్యాయస్థానం స్పష్టం చేసింది.

జూన్‌ 13వ తేదీన.. ఇండిగో విమానంలో సీఎం పినరయి విజయన్‌ సమక్షంలోనే నిరసన చేపట్టారు యూత్‌ కాంగ్రెస్‌ కార్యకర్తలు. సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. అయితే ఆ సమయంలో జయరాజన్‌, సీఎం సిబ్బంది తమ కార్యకర్తలపై దాడి చేశారన్నది కాంగ్రెస్‌ వాదన. నిరసనల వ్యవహారానికి సంబంధించి హత్యాయత్నం నేరం కింద ఇద్దరు కార్యకర్తలతో పాటు సూత్రధారిగా అనుమానిస్తూ మాజీ ఎమ్మెల్యే శబరినాథన్‌ను పోలీసులు అరెస్ట్‌ చేశారు. సరైన ఆధారాలు లేవంటూ వాళ్లకు బెయిల్‌ మంజూరు చేసింది కోర్టు.

ఇదిలా ఉంటే కోర్టు ఆదేశాలపై ఈపీ జయరాజన్‌ స్పందించారు. కోర్టులన్నాక ఇలాంటి ఆదేశాలు ఇస్తాయని, వాటిని తీవ్రంగా పరిగణించాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారాయన. మరోవైపు జయరాజన్‌తో పాటు ఇద్దరు కాంగ్రెస్‌ కార్యకర్తలపై నిషేధం విధించింది ఇండిగో. ఈ బ్యాన్‌పై స్పందించిన జయరాజన్‌.. జీవితంలో తానుగానీ, తన కుటుంబంగానీ ఇండిగో ఫ్లైట్‌ ఎక్కబోమంటూ శపథం చేశారు. అంతేకాదు ఈ మధ్యే రైలులో ప్రయాణించి ఆ ఫొటోలను సోషల్‌ మీడియాలో వదిలారు కూడా. అయితే జయరాజన్‌పై నిషేధం ప్రకటించిన కొన్నాళ్లకే.. ఇండిగోకు చెందిన ఓ బస్సును ఫిట్‌నెస్‌ లేదంటూ అధికారులు సీజ్‌ చేయడం విశేషం.