Fashion

శ్రావ‌ణ మాసంలో సంప్ర‌దాయంగా క‌నిపించాలంటే లంగావోణీ వేయాల్సిందే

శ్రావ‌ణ మాసంలో సంప్ర‌దాయంగా క‌నిపించాలంటే లంగావోణీ వేయాల్సిందే

శ్రావణం వచ్చేస్తున్నది. నెలంతా వ్రతాలు, నోములు, పూజలే. మామూలు సమయాల్లో ఎలాంటి దుస్తులు ధరించినా ఫర్వాలేదు. శ్రావణమాసంలో మాత్రం సంప్రదాయంగా కనిపించాలని ఉవ్విళ్లూరుతారు. లంగావోణీలనే ఎంచుకుంటారు.

చెక్స్‌ జతగా..
రంగురంగుల పట్టీల డిజైన్‌ ఎప్పుడూ ప్రత్యేకమే. చిలుకపచ్చ రంగుకు దొండపండులాంటి ఎరుపును జోడించిన పట్టు ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన లెహంగా ఇది. కంచిపట్టు బార్డర్‌కు నప్పేలా అదే ఫ్యాబ్రిక్‌తో బ్లౌజ్‌ ఇచ్చారు. చేతులకు బుట్టాలు నిండుగా ఉన్నాయి. లెహంగా బార్డర్‌నే చేతులకూ జోడించారు. రెండు రంగులూ ప్రతిబింబించేలా గ్రీన్‌ కలర్‌ జార్జెట్‌ దుపట్టా ఇచ్చి, ఎర్రని బార్డర్‌ జతచేశారు. నిండుగా కనిపించాలనుకునే అమ్మాయిలకు చక్కని ఎంపిక.

పెద్దంచుతో ..
పర్పుల్‌ కలర్‌ రా సిల్క్‌ ఫ్యాబ్రిక్‌తో డిజైన్‌ చేసిన లెహంగా ఇది. గేరా మొత్తం మగ్గం వర్క్‌తో చిన్నచిన్న బుటీస్‌ జోడించి, పదిహేను ఇంచుల పింక్‌ కలర్‌ పెద్దంచు జతచేశారు. బార్డర్‌ కలర్‌లోనే రా సిల్క్‌ బ్లౌజ్‌ ఇచ్చి చేతులకు మగ్గం వర్క్‌ చేశారు. రౌండ్‌నెక్‌ డిజైన్‌ చేసి, బార్డర్‌ వర్క్‌ ఎంచుకున్నారు. చిలుకపచ్చ రంగు జార్జెట్‌ దుపట్టాకు పర్పుల్‌ కలర్‌ బార్డర్‌ బావుంది. బార్డర్‌ హైలైట్‌ అయ్యేలా గోల్డ్‌ కలర్‌ కట్‌వర్క్‌ జతచేశారు.