NRI-NRT

అమెరికాలో భారతీయుల హవా

అమెరికాలో భారతీయుల హవా

అమెరికాలో యూనీకార్న్ స్థాయికి చేరిన స్టార్టప్ సంస్థల్లో 55 శాతం.. విదేశాల నుంచి వలసొచ్చిన వారు స్థాపించినవేనని తాజాగా తేలింది. బిలియన్ డాలర్ల మార్కెట్ విలువ కలిగిన అంకుర సంస్థలను యూనీకార్న్ అని పిలుస్తారన్న విషయం తెలిసిందే. అగ్రరాజ్యంలోని 582 యూనీకార్న్ కంపెనీల్లోని 319 సంస్థల వ్యవస్థాపకుల్లో కనీసం ఒక్కరు.. ఇతర దేశాలకు చెందిన వారేనని వెల్లడైంది. వీటిలో అత్యధికం.. భారత సంతతి వారు స్థాపించినవే! నేషనల్ ఫౌండేషన్ ఫర్ అమెరికన్ పాలసీ సర్వే ప్రకారం.. 66 యూనీకార్న్ కంపెనీలను భారత దేశ మూలాలున్న వారే స్థాపించడంతో భారత్ టాప్‌లో నిలిచింది. ఇక.. ఈ జాబితాలో భారత్ తరువాతి స్థానం ఇజ్రాయెల్‌‌కు దక్కింది. అగ్రరాజ్యంలోని 54 యూనీకార్న్ సంస్థలకు ఇజ్రాయెల్‌కు చెందిన వారు వ్యవస్థాపకులుగా ఉన్నారు. అంతేకాకుండా.. 133 యూనీకార్న్ సంస్థల్లో కీలకమైన సీఈఓ, సీటీఓ, వైస్ ప్రెసిడెంట్ వంటి కీలక నాయకత్వ స్థానాల్లో ఉన్నదీ వలసదారులేనని ఈ సర్వే తేల్చింది. వసలదారుల నేతృత్వంలోని ఒక్కో కంపెనీ 859 మందికి ఉద్యోగాలు కల్పించిందట.

ఇక.. అమెరికాలో రెండు, అంతకంటే ఎక్కువ యూనీకార్న్‌ సంస్థలను స్థాపించిన పది మంది వలసదారుల్లో దాదాపు నలుగురు భారత మూలాలున్న వారే. మోహిత్ అరుణ్, అశుతోష్ గార్గ్, అజిత్ సింగ్, జ్యోతి బన్సల్ తలో రెండు సంస్థలు ఏర్పాటు చేశారు. వలసదారులు స్థాపించిన 319 యూనీకార్న్‌ల మొత్తం మార్కెట్ విలువ 1.2 ట్రిలియన్ డాలర్లు. ఇది.. పలు దేశాల స్టాక్ మార్కెట్‌లలో లిస్ట్ అయిన ప్రముఖ సంస్థల విలువ కంటే అధికం. ఇక అమెరికాలో బ్రిటన్ మూలాలనున్న వారు 27 యూనీకార్న్‌లను ఏర్పాటు చేయగా.. కెనడా సంతతి వారు 22, చైనా వారు 21, ఫ్రాన్స్‌కు చెందిన వారు 18 యూనీకార్న్ సంస్థల వ్యవప్థాపకులుగా ఉన్నారు. జర్మనీ సంతతి వారు 15 సంస్థలను, రష్యాకు చెందిన వారు 11 స్టార్టప్‌లు, ఇరాన్ సంతతి వారు 8 యూనీకార్న్‌లను స్థాపించారు.