DailyDose

TNI – నేటి తాజా వార్తలు

TNI – నేటి  తాజా వార్తలు

* రాజధాని రైతులతో ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందాలు అమలు చేసే వరకు భాజపా పోరాడుతుందని.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు అన్నారు. ‘మనం-మన అమరావతి’ పేరుతో రాజధానిలో పాదయాత్రను చేపట్టారు. రాజధానిలో నిర్మాణాలు చేపట్టాలని.. హైకోర్టు తీర్పు ఇచ్చినా వైకాపా ప్రభుత్వం పట్టించుకుకోవడం లేదని విమర్శించారు

*ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌కు చంద్రబాబు లేఖ
ఏపీ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌కు టీడీపీ అధినేత చంద్రబాబు లేఖ రాశారు. కుప్పం ద్రవిడ వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ జరుగుతుందని ఫిర్యాదు చేశారు. పర్యావరణ విధ్వంసంతో పాటు వన్యప్రాణులు చనిపోతున్నాయని పేర్కొన్నారు. వర్సిటీ భూముల్లో అక్రమ మైనింగ్‌ అడ్డుకుని పర్యావరణాన్ని కాపాడాలని కోరారు. అక్రమ మైనింగ్‌కు ద్రవిడ యూనివర్సిటీ హబ్‌గా మారిందని వెల్లడించారు.వర్సిటీకి చెందిన 1100 ఎకరాల్లో అక్రమ మైనింగ్‌ కొనసాగిస్తున్నారని లేఖలో వివరించారు. బ్లాస్టింగ్‌, అక్రమ రవాణాతో వన్యప్రాణులు చనిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ పక్షి నెమళ్లతో పాటు అరుదైన జంతుజాలం నశిస్తోందని తెలిపారు. ఆహారంలోనూ నాణ్యత లోపించి ఇటీవల వందల మంది అస్వస్థతకు గురయ్యారని తెలిపారు.వైసీపీ ప్రభుత్వ హయాంలో రోజురోజుకు వర్సిటీ ప్రతిష్ట దెబ్బతింటుందని అన్నారు. వర్సిటీలో పరిస్థితులను చక్కదిద్దేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని గవర్నర్‌ను చంద్రబాబు కోరారు.

*ఏపీ విలీన మండలా ల్లో టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు పర్యటన కొనసాగుతోంది. గూండాల గ్రామంలో వరద బాధితుల్ని బాబు పరామర్శించారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ… ప్రజలు ట్రాక్ రికార్డు చూసి నేతల్ని ఎన్నుకోవాలని అన్నారు. దొంగలకి అధికారం ఇస్తే ఏమౌతుందో ప్రజలు ప్రత్యక్షంగా చూస్తున్నారని తెలిపారు. డ్రైవింగ్ రానివాడికి రాష్ట్రాన్ని అప్పగించటంతో ప్రజా జీవితం తలకిందులైందని వ్యాఖ్యానించారు. ఐదు విలీన గ్రామాల సమస్య తాత్కాలికమే అని చెప్పుకొచ్చారు. తెలుగుదేశం అధికారంలోకి రాగానే శాశ్వత పరిష్కారం చూపుతుందని హామీ ఇచ్చారు. ప్రభుత్వం ప్రజల్ని మెప్పించాలి తప్ప ఇబ్బంది పెట్టకూడదన్నారు. పోలవరం ముంపు బాధితులకు రూ.10లక్షలు ఇస్తాననే తప్పుడు హామీ జగన్ రెడ్డి ఎందుకిచ్చారని చంద్రబాబు ప్రశ్నించారు.

*ఆలిండియా అన్నా ద్రవిడ మున్నేట్ర కజగం నుంచి తనను బహిష్కరించడాన్ని సవాల్ చేస్తూ ఓ పన్నీర్‌సెల్వం దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ బాధ్యతను మద్రాస్ హైకోర్టు కు సుప్రీంకోర్టు శుక్రవారం అప్పగించింది. మూడు వారాల్లోగా దీనిపై తీర్పు చెప్పాలని తెలిపింది. పార్టీలో యథాతథ పరిస్థితిని కొనసాగించాలని ఆదేశించింది.

*బీజేపీ యువ మోర్చా జిల్లా కమిటీ సభ్యుడు ప్రవీణ్‌ నెట్టారు హత్య కేసును కర్ణాటక ముఖ్యమంత్రి బస్వరాజ్ బొమ్మై నేషనల్ ఇన్వెస్టిగేటివ్ ఏజెన్సీ ఎన్ఐఏ కు అప్పగించారు. హత్యకు కారకులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామమని, కారణమైన సంస్థలనూ వదిలేది లేదని ప్రవీణ్ కుటుంబ సభ్యులను పరామర్శించిన సందర్భంగా సీఎం నిన్న హామీ ఇచ్చారు. అంతే కాదు అవసరమైతే ఉత్తరప్రదేశ్‌లో యోగి ఆదిత్యనాథ్ సర్కారు అవలంభిస్తున్న విధానం తాము కూడా అమలు చేస్తామన్నారు. యూపీలో అల్లర్లకు పాల్పడేవారి ఇళ్లను బుల్డోజర్లతో కూల్చడం యోగి సర్కారు విధానాన్ని పరిస్థితులను బట్టి కర్ణాటకలో కూడా అమలు చేస్తామని బొమ్మై చెప్పారు.

*గాంధీభవన్ ముందు మహిళా కాంగ్రెస్ ఆందోళనకు దిగారు. కేంద్రమంత్రి స్మృతిఇరానీ దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసనకు దిగారు. కుమార్తె ఇష్యూ డైవర్ట్ చేసేందుకే కాంగ్రెస్పై స్మృతిఇరానీ విమర్శలు చేస్తున్నారని మహిళా కాంగ్రెస్ నేతలు ) ఆరోపించారు. రాష్ట్రపతి అంశంలో అధిర్ ఇప్పటికే క్షమాపణ చెప్పారని.. సోనియా గాంధీ క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదని మహిళా కాంగ్రెస్ నేతలు స్పష్టం చేశారు.

*ఏలూరు జిల్లా పెదపాడు మండలం ఏపూరు చెరువులో మట్టి తవ్వకాలపై ఏపీ హైకోర్టు లో శుక్రవారం విచారణ జరిగింది. దెందులూరు ఎమ్మెల్యే అనుచరుల అక్రమ మట్టి తవ్వకాలపై విచారణ జరుగగా… గత విచారణ సమయంలో అక్రమ మట్టి తవ్వకాలపై నివేదిక ఇవ్వాలని మైనింగ్ డీడీని ధర్మాసనం ఆదేశించింది. 14 వేల క్యూబిక్ మీటర్లకు పైగా మట్టి తవ్వకాలు జరిగాయని మైనింగ్ డీడీ నివేదిక ఇచ్చింది. మట్టి తవ్వకాలపై చర్యలు తీసుకోవాలని ఇరిగేషన్ అధికారులకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. మట్టి తవ్వకాలపై ఏం చర్యలు తీసుకున్నారో చెప్పాలని ఆదేశిస్తూ… తదుపరి విచారణను ఆగస్టు 8కి వాయిదా వేసింది.

*హుద్‌హుద్‌ తుఫాన్‌ తర్వాత విశాఖను అభివృద్ధి చేసినట్లే పోలవరం ముంపు మండలాలను బాగుచేస్తానని టీడీపీ (TDP) అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. శుక్రవారం ఏపీ విలీన మండలాల్లో చంద్రబాబు పర్యటన కొనసాగుతోంది. నెల్లిపాక గ్రామంలో వరద బాధితుల్ని పరామర్శించిన చంద్రబాబు అనంతరం మాట్లాడుతూ… జగన్క్రూ రత్వాన్ని ప్రజలు గ్రహించాలన్నారు. పోలవరం పరిహారంపై అసత్యాలు చెప్పిన ఫేక్ ఫెలో జగన్ అని మండిపడ్డారు. ప్రజలు సమస్యలు చెప్పుకోవాలంటే 350 కిలోమీటర్లు పాడేరు వెళ్లేలా చేసిన అసమర్ధ ముఖ్యమంత్రి జగన్ రెడ్డి అంటూ చంద్రబాబు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు.

*ప్రజారోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం పొగాకు ఉత్పత్తులపై హెచ్చరికలను సవరించింది. 2022 డిసెంబరు 1న లేదా ఆ తర్వాత తయారయ్యే, దిగుమతి చేసుకునే లేదా ప్యాకేజ్ అయ్యే పొగాకు ఉత్పత్తుల ప్యాకెట్లపై అక్షరాలు, బొమ్మల రూపంలో కొత్త హెచ్చరికలను ముద్రించాలని ఆదేశించింది. ఈ వివరాలను కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప్రకటించింది.

* రాష్ట్రపతి ద్రౌపతి ముర్ము పై కాంగ్రెస్ ఎంపీ అధీర్ చౌదరి వ్యాఖ్యలకు నిరసనగా నగరంలోని ఖైరతాబాద్‌ పీజేఆర్ సర్కిల్‌లో బీజేపీ వినూత్నరీతిలో నిరసన చేపట్టింది. గిరిజన మహిళలు కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు. రాష్ట్రపతి ముర్ముకు మద్దతుగా గిరిజన మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ద్రౌపది ముర్ముకు, దేశ ప్రజలకు సోనియా గాంధీ క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రపతిని అవమానించడమంటే దేశ ప్రజలను అవమానించటమే అని అన్నారు. ఎంపీ అధీర్ రంజన్ చౌదరికి కాంగ్రెస్ పార్టీ నుంచి సస్పెండ్ చేయాలన్నారు.

*మూసీ ప్రాజెక్టుకు వరద ప్రవాహం తగ్గింది. ప్రాజెక్టులోకి 9,960.60 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు మూడు క్రస్ట్ గేట్లను నాలుగు ఫీట్ల మేర ఎత్తి 6783.67 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. మూసీ పూర్తిస్థాయి నీటిమట్టం 645 అడుగులు. ప్రస్తుతం 637.80 అడుగుల వద్ద నీటిమట్టం ఉన్నది. జలాశయం గరిష్ఠ నీటి నిల్వ సామర్థ్యం 4.46 టీఎంసీలు కాగా, ఇప్పుడు 2.73 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

*తుంగభద్ర జలాశయాని కి వరద ప్రవాహం పెరుగుతోంది. దీంతో అధికారులు జలాశయం 20 గేట్ల ద్వారా నీటి విడుదలను కొనసాగిస్తున్నారు. జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టం 1633 అడుగులు కాగా… ప్రస్తుతం నీటి మట్టం 1632.34 అడుగులకు చేరింది. ఇన్ ఫ్లో 72618 క్యూసెక్కులు, అవుట్ ఫ్లో 90865 క్యూసెక్కులుగా ఉంది. అలాగే పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్ధ్యం 105.788 టీఎంసీలకు గాను… ప్రస్తుతం నీటి నిల్వ సామర్ధ్యం 103.138 టీఎంసీలుగా కొనసాగుతోంది.

*రి౦గు వలల వివాదం ) మళ్లీ తెరమీదకి వచ్చింది. జాలరి ఎ౦డాడ తీరంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. తీరంలో లంగరు వేసి ఉన్న తెప్పలు, వలలను.. గుర్తుతెలియని మత్స్యకారులు తగలబెట్టారు. దీంతో బాధిత మత్స్యకార వర్గం ఆందోళనకు దిగింది. జాలరి ఎ౦డాడలో పోలీసులు భారీగా మోహరించారు.

*జగనన్న విద్యా కానుక కిట్ల పంపిణీలో బయోమెట్రిక్‌కు గ్రామ, వార్డు వలంటీర్ల సహకారం ఇప్పించాలని తెలుగునాడు ఉపాధ్యాయ సంఘం కోరింది. ఈ మేరకు ఆ సంఘం అధ్యక్షుడు మన్నం శ్రీనివాస్‌ గురువారం పాఠశాల విద్య కమిషనర్‌కు లేఖ రాశారు. కిట్లు పంపిణీ చేసిన అనంతరం విద్యార్థులు లేదా వారి తల్లిదండ్రుల బయోమెట్రిక్‌ తీసుకునేందుకు పాఠశాలల్లో సాంకేతిక పరికరాలు అందుబాటులో లేనందున వలంటీర్ల సహకారం ఇచ్చేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు.

*ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ ద్వారా ప్రవేశాలు జరపాలంటూ ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్‌ని సవాల్‌ చేస్తూ అన్‌ ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు దాఖలు చేసిన వ్యాజ్యం గురువారం హైకోర్టులో విచారణకు వచ్చింది. దీనిపై పూర్తి వివరాలు సమర్పించాలని ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి, ఏపీ ఉన్నత విద్యామండలి కార్యదర్శిని ఆదేశించారు. ఈ మేరకు హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్‌ ఎం.గంగారావు గురువారం ఆదేశాలిచ్చారు. డిగ్రీ కళాశాలల్లో 2022- 23కి గాను ఆన్‌లైన్‌ కౌన్సిలింగ్‌ తప్పనిసరి చేస్తూ ఈ నెల 22న ఏపీ ఉన్నత విద్యామండలి ఇచ్చిన నోటిఫికేషన్‌ను సవా ల్‌ చేస్తూ ప్రైవేటు అన్‌ఎయిడెడ్‌ డిగ్రీ కళాశాలల యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. పిటిషనర్ల తరఫు న్యాయవాది మతుకుమిల్లి శ్రీవిజయ్‌ వాదనలు వినిపిస్తూ… ఆన్‌లైన్‌ ద్వారా ప్రవేశాలు కల్పించే ప్రక్రియలో పాల్గొనాలని ప్రైవేటు యాజమాన్యాలను ఒత్తిడి చేయడానికి వీల్లేదన్నారు. ఆ విధంగా వ్యవహరించడం కళాశాలల యాజమాన్యాలకున్న ప్రవేశాలు కల్పించే హక్కును హరించడమేనన్నారు. ప్రభుత్వ నిర్ణయం సుప్రీంకోర్టు తీర్పుకి విరుద్ధమన్నారు. ఉన్నత విద్యాశాఖ తరఫున ప్రభుత్వ న్యాయవాది రఘువీర్‌ వాదనలు వినిపిస్తూ… రెండేళ్లుగా ఆన్‌లైన్‌ విధానంలోనే ప్రవేశాలు చేపడుతున్నామన్నారు. గత ఏడాది కూడా ఇదే తరహా వ్యాజ్యాలు దాఖలవ్వగా… న్యాయస్థానం జోక్యం చేసుకోడానికి నిరాకరించిందన్నారు. ప్రస్తుత విద్యాసంవత్సరానికి ఆన్‌లైన్‌ ప్రవేశాల కోసం ఎన్‌రోల్‌మెంట్‌ ప్రక్రియ ప్రారం భంమైందన్నారు. పూర్తి వివరాలు కోర్టు ముందుంచేందుకు సమయం ఇవ్వాలని కోరారు. పరిగణలోకి తీసుకున్న న్యాయమూర్తి విచారణను ఆగస్టు 1కి వాయిదా వేశారు.

*మూడు, నాలుగు, ఐదు తరగతులను విలీనం చేయడాన్ని తక్షణమే నిలిపేయాలని శాసన మండలి ఫ్లోర్‌ లీడర్‌ విఠపు బాలసుబ్రమణ్యం ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. బడికోసం బస్సు యాత్రలో భాగంగా గురువారం ఎన్టీఆర్‌ జిల్లాల్లోని రామవరప్పాడు, మైలవరంలో విద్యార్థుల తల్లిదండ్రులతో పీడీఎఫ్‌ ఎమ్మెల్సీలు మాట్లాడారు. ఈ సందర్భంగా విఠపు మాట్లాడారు. తల్లిదండ్రుల ఆవేదనను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానన్నారు. ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్ల విద్యార్థులు, వారి తల్లిదండ్రులు మనోవేదనకు గురవుతున్నారన్నారు. కార్యక్రమంలో ఉభయ గోదావరి టీచర్‌ ఎమ్మెల్సీలు ఐ.వి.వెంకటేశ్వర్లు, షేక్‌ షాబ్జి, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాల గ్రాడ్యుయేట్‌ ఎమ్మెల్సీ వై. శ్రీనివాసులు రెడ్డి, యూటీఎఫ్‌ రాష్ట్ర, జిల్లా నాయకులు పాల్గొన్నారు.

*చిత్తూరు జిల్లా కుప్పం ద్రవిడ విశ్వవిద్యాలయ భూముల్లో అక్రమ మైనింగ్‌తో పర్యావరణ విధ్వంసం, వన్యప్రాణుల మృతిపై టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు గవర్నర్‌కు ఫిర్యాదు చేశారు. ద్రవిడ వర్సిటీ అక్రమ మైనింగ్‌కు హబ్‌గా మారిందని, ఈ అక్రమాన్ని అడ్డుకుని, పర్యావరణాన్ని కాపాడాలని గురువారం గవర్నర్‌ హరిచందన్‌కు చంద్రబాబు లేఖ రాశారు. 1,100ఎకరాల విశ్వవిద్యాలయ భూముల్లో వైసీపీ నేతలు అక్రమ మైనింగ్‌ కొనసాగిస్తున్నారని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. ఇష్టానుసారంగా బ్లాస్టింగ్‌ చేస్తుండటంతో జాతీయ పక్షి నెమలితో పాటు అనేక వన్యప్రాణాలు చనిపోతున్నాయని తెలిపారు. అక్రమ మైనింగ్‌తో విశ్వవిద్యాలయం ప్రతిష్ఠ దిగజారుతోందని పేర్కొన్నారు. విద్యార్ధులకు అందించే ఆహారంలో కూడా నాణ్యత లోపించి, వందలాది మంది అస్వస్థతకు గురయ్యారని, అందులో కనీసం అంబులెన్స్‌ సౌకర్యం కూడా లేదని, వర్సిటీ ఉద్యోగులకు రెండేళ్లుగా అలవెన్సులు కూడా ఇవ్వలేదని, పేద విద్యార్థులకు హాల్‌ టికెట్లు ఇవ్వకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. వెంటనే జోక్యం చేసుకుని, వర్సిటీ పరిస్థితులను చక్కదిద్దాలని విజ్ఞప్తి చేశారు.

*కొన్ని నెలల్లో జరగాల్సి ఉన్న పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో రెండో చోట్ల టీడీపీ తన అభ్యర్థులను ఖరారు చేసింది. దక్షిణ కోస్తా నియోజకవర్గానికి ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గానికి చెందిన కంచర్ల శ్రీకాంత్‌ను ఎంపిక చేశారు. రాయలసీమ ప్రాంత నియోజకవర్గానికి కడప జిల్లా పులివెందుల నియోజకవర్గానికి చెందిన రాంగోపాల్‌రెడ్డిని అభ్యర్థిగా నిర్ణయించారు. ఉత్తరాంధ్ర స్థానానికి ఇంకా అభ్యర్థిని ఖరారు చేయలేదు. పార్టీ అభ్యర్థిత్వం కోసం విశాఖ నగరానికి చెందిన పట్టాభి, సమైక్యాంధ్ర జేఏసీలో పనిచేసిన యువ నేత కిషోర్‌, ఉద్యోగ సంఘం నేత ఈర్ల శ్రీరాంమూర్తి ప్రయత్నిస్తున్నారు.

*హైదరాబాద్‌-విజయవాడ జాతీయ రహదారి మొత్తాన్ని ఆరు లైన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని కేంద్ర రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ స్పష్టం చేశారు. ఈ మేరకు లోక్‌సభలో కాంగ్రెస్‌ ఎంపీలు కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి, ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అడిగిన ఓ ప్రశ్నకు గురువారం ఆయన లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. ఈ రహదారిపై హైదరాబాద్‌ నుంచి 14 కిలోమీటర్ల వరకు జీహెచ్‌ఎంసీ పరిధిలో ఆరు లైన్ల రోడ్డు ఉందని తెలిపారు. 14 కిమీల నుంచి 40 కిమీల వరకు ఆరు లైన్ల విస్తరణ కాంట్రాక్టును గత నెలలో ఇచ్చామని వెల్లడించారు. అయితే, 40 కి.మీ నుంచి 221 కిమీ వరకు.. అంటే 181.5 కిమీ మేర రహదారిని ఆరు లైన్లకు విస్తరించాల్సిన అవసరం లేదని, ప్రస్తుత ట్రాఫిక్‌కు నాలుగు లైన్ల రోడ్డు సరిపోతుందని స్పష్టం చేశారు.

*22 మంది సివిల్‌ అడిషనల్‌ ఎస్పీలకు నాన్‌ కేడర్‌ ఎస్పీలుగా పదోన్నతులు కల్పిస్తూ హోంశాఖ ఉత్తర్వులు జారీచేసింది. ఏఎస్పీలు బి.లక్ష్మీనారాయణ, కె.ఎం.మహేశ్వరరాజు, ఎ.సురే్‌షబాబు, కె.శ్రీనివాసరావు, ఎస్‌.శ్రీధర్‌, కె.తిరుమలేశ్వరరెడ్డి, ఎం.సత్తిబాబు, ఎస్వీ మాధవ్‌రెడ్డి, జె.రామ్మోహన్‌రావు, ఎన్‌.శ్రీదేవిరావు, ఇ.అశోక్‌కుమార్‌, ఎ.రమాదేవి, కె.జి.వి. సరిత, కె.ఆనంద్‌రెడ్డి, కె.చక్రవర్తి, కె.ఈశ్వరరావు, కె.చౌడేశ్వరి, ఇ.సుప్రజ, కె.వి. శ్రీనివాసరావు, కె.లావణ్యలక్ష్మి, డి.హైమావతి, కె.లతా మాధురిలను పదోన్నతుల ప్యానెల్‌లో చేరుస్తూ ముఖ్యకార్యదర్శి హరీ్‌షకుమార్‌ గుప్తా ఉత్తర్వులు జారీచేశారు. *ఆంధ్రప్రదేశ్‌ విభజన చట్టం ప్రకారం రాష్ట్రంలో కేంద్రం ఏర్పాటు చేస్తున్న వివిధ సంస్థలు, చేపడుతున్న ప్రాజెక్టులపై ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు సమీక్షించారు. గురువారం పార్లమెంటు భవనంలో కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రి పీయూష్‌ గోయల్‌, కేంద్ర పెట్రోలియం, సహజ వాయువు మంత్రి హర్దీప్‌ సింగ్‌ పురి, కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌రెడ్డితో ఉపరాష్ట్రపతి వేర్వేరుగా సమావేశమై ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించిన వివిధ పథకాల అమలు తీరును చర్చించారు. పీయూష్‌ గోయల్‌తో జరిగిన సమావేశంలో జాతీయ పారిశ్రామిక కారిడార్‌ పథకంలో భాగంగా చేపడుతున్న విశాఖపట్టణం – చెన్నై పారిశ్రామిక కారిడార్‌ (వీసీఐసీ) పురోగతి గురించి అడిగి తెలుసుకున్నారు.

*సర్కారు తలచుకుంటే ఏదైనా చేయగలదు. రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటుకు ముందే ఆర్‌డీవోను కూడా నియమించగలదు. రేపల్లె రెవెన్యూ డివిజన్‌ విషయంలో ఇదే చేసింది. బాపట్ల జిల్లాలో కొత్తగా రేపల్లె రెవెన్యూ డివిజన్‌ను ఏర్పాటు చేస్తూ మే 17న రాష్ట్ర ప్రభుత్వం ప్రాథమిక నోటిఫికేషన్‌ జారీచేసింది. 30 రోజుల్లోగా దానిపై అభ్యంతరాలు, సూచనలు కోరింది. వాటిని పరిగణలోకి తీసుకొని తుది నోటిఫికేషన్‌ ఇవ్వాల్సి ఉంది. ఇప్పటివరకు ఫైనల్‌ నోటిఫికేషన్‌ ఇవ్వలేదు. కానీ, సర్కారు మాత్రం ప్రాథమిక నోటిఫికేషన్‌ను పరిగణలోకి తీసుకొనే రేపల్లె డివిజన్‌కు ఆర్‌డీవోగా జే పార్థసారథిని నియమిస్తూ బుధవారం రాత్రి ఉత్తర్వులు (జీవో-1490) జారీచేసింది. ఇటు రెవెన్యూ, అధికార వర్గాల్లో ఇది చర్చనీయాంశమైంది. ఫైనల్‌ నోటిఫికేషన్‌ వచ్చిందా? రాలేదా అన్నది చూసుకోకుండానే అధికారులకు పోస్టింగ్‌లు ఇచ్చేస్తున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఆర్‌డీవోకు పోస్టింగ్‌ ఇచ్చినా వెంటనే ఆయన పనిచేయడానికి ఆఫీసు ఏర్పాటు కాలేదు. సిబ్బంది లేరు. అవన్నీ తుది నోటిఫికేషన్‌ తర్వాతే అందుబాటులోకి వస్తాయి. ఎలాగూ ప్రాథమిక నోటిఫికేషన్‌ ఇచ్చాం కాబట్టి అధికారిని నియమించేస్తే ఓ పనైపోతుంది కదా అని భావించే ఈ నియామకం చేసినట్లుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ శాఖను సంప్రదించకుండానే ఆర్‌డీవో నియామకం జరిగినట్లు తెలుస్తోంది.

*టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు భద్రాద్రి శ్రీ సీతారామ చంద్ర స్వామి వారిని శుక్రవారం ఉదయం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఆలయ అర్చకులు, ఆలయ ఈఓ శివాజీ (Shivaji) ఆలయ మర్యాదలతో ఘనంగా స్వాగతం పలికారు. నాడు సమైక్య రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి హోదాలో శ్రీ సీతారాముల కల్యాణానికి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. దాదాపు 19 సంవత్సరాల తర్వాత టీడీపీ అధినేత ఈరోజు భద్రాద్రి రామయ్యను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామాలయంలోని శ్రీలక్ష్మీ తాయారు అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. వేద పండతులతో చంద్రబాబు వేదాశీర్వచనం పొందారు. అనంతరం స్వామివారి జ్ఞాపిక, స్వామి వారి లడ్డు ప్రసాదాలను చంద్రబాబుకు ఆలయ ఈఓ అందజేశారు.
*వరంగల్ జిల్లా(Warangal dist)లో కరోనా డేంజర్ బెల్స్ మోగిస్తోంది. నెలరోజుల వ్యవధిలో నలుగురు మరణించగా.. వారంలో 313 కేసులు నమోదయ్యాయి. రోజుకు పదుల సంఖ్యలో కేసులు పెరుగుతున్నాయి. డెత్ రేట్ పెరగడంతో ఆందోళన పెరుగుతోంది. మరోవైపు సీజనల్ వ్యాధులు విజృంభిస్తున్నాయి. డెంగ్యూతో ఒకరు మృతి చెందగా.. ఎంజీఎంకు రోగులు క్యూకడుతున్నారు.

* బీజేపీ వైపు అడుగులు వేస్తున్న ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి వ్యవహారానికి కాంగ్రెస్‌ అధిష్ఠానం పెద్దగా ప్రాధాన్యం ఇవ్వడం లేదని ఆ పార్టీ వర్గాలు తెలిపాయి. రాజగోపాల్‌రెడ్డి కొంత కాలంగా సొంత పార్టీపైనే వ్యాఖ్యలు చేస్తుండడం, బీజేపీలో చేరుతారన్న ప్రచారం నేపథ్యంలో ఢిల్లీలో పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌, రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి మాణిక్కం ఠాగూర్‌తో రేవంత్‌రెడ్డి, భట్టి విక్రమార్క, ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి సుదీర్ఘంగా చర్చలు జరిపిన సంగతి తెలిసిందే. రాజగోపాల్‌పై చర్యలు తీసుకునే విషయంలో మల్లగుల్లాలు పడుతున్నట్లు తెలిసింది.

*ప్రభుత్వ అప్పులపై వాస్తవాలు తెలుసుకో… అంటూ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌కు రాష్ట్ర ప్రణాళిక సంఘం వైస్‌ చైర్మన్‌ బోయినపల్లి వినోద్‌కుమార్‌ హితవు పలికారు. అప్పులు తెస్తూ రాష్ట్రాన్ని సీఎం కేసీఆర్‌ నాశనం చేశారని, పుట్టబోయే బిడ్డపై కూడా రూ.లక్షన్నర అప్పు చేశారంటూ సంజయ్‌ ఆరోపించడంపై వినోద్‌ స్పందించారు. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన ఆర్‌బీఐ నివేదిక ప్రకారం దేశవ్యాప్తంగా ఎక్కువ అప్పులున్న 10 రాష్ట్రాల్లో తెలంగాణ లేదని వివరించారు.

*రాష్ట్ర ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తోన్న పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ ప్రారంభానికి ముహుర్తం ఖరారైంది. రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఆగస్టు 4న ఈ సెంటర్‌ను ప్రారంభిస్తారని మంత్రి వేముల ప్రశాంత్‌ రెడ్డి ఓ ప్రకటనలో వెల్లడించారు. పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ నిర్మాణ పనులను రాష్ట్ర రోడ్డు, భవనాల శాఖ మంత్రి ప్రశాంత్‌ రెడ్డి గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా అక్కడి సిబ్బందితో వివిధ అంశాలపై చర్చించారు. డీజీపీ మహేందర్‌ రెడ్డి, ఆర్‌ అండ్‌ బీ ఈఎన్సీ ఐ.గణపతిరెడ్డి, నగర సీపీ సీవీ ఆనంద్‌, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ కౌశిక్‌రెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.

*గత యాసంగి సీజన్‌ కాకుండా… అంతకుముందు రెండు సీజన్లకు సంబంధించిన బియ్యం బకాయిలు తీర్చటానికి కేంద్ర ప్రభుత్వం రాష్ట్రానికి డెడ్‌లైన్‌ విధించింది. 2020-21 యాసంగి బియ్యంతోపాటు, 2021-22 వానాకాలం బియ్యాన్ని వచ్చే నెల (ఆగస్టు) 31 తేదీలోగా ఎఫ్‌సీఐకి అప్పగించాలని రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌కు గురువారం లేఖ రాసింది. దీంతో ఆ రెండు సీజన్లకు సంబంధించిన ‘సీఎంఆర్‌’ (మిల్లింగ్‌ చేసిన రైస్‌) అనుమతుల కోసం ఎదురుచూస్తున్న రాష్ట్ర ప్రభుత్వానికి, రైస్‌ మిల్లర్లకు ఊరట లభించింది. అయితే గత యాసంగి సీజన్‌కు సంబంధించిన ధాన్యం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. 2020-21 యాసంగి సీజన్‌లో రాష్ట్ర ప్రభుత్వం 92.34 లక్షల మెట్రిక్‌ టన్నుల వరి ధాన్యాన్ని రైతుల నుంచి కొనుగోలుచేసిన విషయం తెలిసిందే

*ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సహకారంతో 104 కోట్లతో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు కేంద్రమంత్రి నరేంద్ర సింగ్ తోమర్ తెలిపారు. రాజ్యసభలో ఎంపీ విజయసాయిరెడ్డి అడిగిన ప్రశ్నకు ఆయన రాతపూర్వకంగా జవాబిచ్చారు. తూర్పుగోదావరి గుంటూరు, కృష్ణా, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, పశ్చిమ గోదావరి జిల్లాల్లో 5 లక్షల 31 వేల హెక్టార్లు పామ్‌ ఆయిల్‌ సాగుకు అనువుగా ఉన్నట్లు తెలిపారు. దేశంలో పామ్‌ ఆయిల్‌ సాగు అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం 62 కోట్ల రూపాయలు కేటాయించగా అందులో రాష్ట్ర ప్రభుత్వం 41 లక్షలు తన వాటాగా భరించాల్సి ఉందని అన్నారు. పామ్‌ ఆయిల్ సాగును పెద్ద ఎత్తున విస్తరించి క్రూడ్ పాం ఆయిల్ ఉత్పత్తిని పెంచడం ద్వారా వంట నూనెల దిగుమతులను తగ్గించడమే ఈ మిషన్ లక్ష్యమని మంత్రి చెప్పారు. ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఆయిల్ పామ్‌ రీసెర్చ్ గణాంకాల ప్రకారం దేశంలో 28 లక్షల హెక్టార్లలో పామ్‌ ఆయిల్ సాగును అభివృద్ధి చేయనున్నట్లు తోమర్ చెప్పారు.