Movies

ఆ రోజులు పోయాయి

ఆ రోజులు పోయాయి

హీరోల స్టార్‌డమ్‌ ఆధారంగా సినిమాలు ప్లాన్‌ చేసుకునే రోజులు పోయాయని అంటున్నది బాలీవుడ్‌ తార కరీనా కపూర్‌. బలమైన కథ లేకుంటే స్టార్‌ హీరోలు కూడా కొత్త వాళ్లతో సమానమే అయ్యారన్నది ఆమె మాట. కరోనా తెచ్చిన పాండమిక్‌, ఓటీటీల ప్రభావమే చిత్ర పరిశ్రమలో వచ్చిన ఈ మార్పునకు కారణమంటున్నదీ నాయిక. తాజాగా ‘లాల్‌ సింగ్‌ చడ్డా’ అనే చిత్రంలో ఆమిర్‌ఖాన్‌ సరసన నటించింది కరీనా. ఈ సినిమా త్వరలో విడుదలకు సిద్ధమవుతున్నది. కరీనా మాట్లాడుతూ….‘ఇవాళ పెద్ద హీరోల స్టార్‌ డమ్‌ కనుమరుగు అవుతున్న పరిస్థితి కనిపిస్తున్నది. బాక్సాఫీస్‌ దగ్గర కొత్త హీరో అయినా, స్టార్‌ హీరో అయినా ఒకటే. బలమైన కథ లేకుంటే ఎవరి సినిమాకు గ్యారెంటీ ఉండటం లేదు. ఏ సినిమాతో అయినా ఓ 50 కోట్ల రూపాయల ఓపెనింగ్స్‌ రాబట్టే స్టార్‌ ఇప్పుడెవరూ లేరు. అందుకే హీరోల స్టార్‌ డమ్‌ ఆధారంగా సినిమాల ప్లానింగ్‌ ఆపేయాలి. మంచి కథలు ఎంపిక చేసుకోవడం, కొత్త కాన్సెప్ట్‌లతో సినిమా చేయడం అలవాటు చేసుకోవాలి. ఓటీటీల ప్రభావంతో ప్రేక్షకుల అభిరుచి మారింది. భావోద్వేగాలతో ఆకట్టుకుంటేనే ఆ సినిమా కోసం థియేటర్‌కు వస్తున్నారు’ అని చెప్పింది