NRI-NRT

కెనడాలో.. నివాసం కోరుకునే వారికి శుభవార్త

కెనడాలో.. నివాసం కోరుకునే వారికి  శుభవార్త

కెనడాలో శాశ్వత నివాసం కలలు కంటున్నవారికి చక్కటి సమయం ఆసన్నమైంది. కెనడాలొ మొత్తం 10 లక్షల ఉద్యోగావకాశాలు ఉన్నాయి. మే 2021 తర్వాత ఏకంగా 3 లక్షల ఖాళీలు ఏర్పడ్డాయని అక్కడి గణాంకాలు చెబుతున్నాయి. అనేక పరిశ్రమల్లో కార్మికుల కొరతతోపాటు నిపుణులు అవసరం కూడా ఏర్పడిందని కెనడా లేబర్ ఫోర్స్ సర్వే ‘మే నెల రిపోర్ట్’ పేర్కొంది. కెనడా శ్రామికశక్తి సగటు వయసు గణనీయంగా పెరగడం, రిటైర్మెంట్‌ వయసు కంటే ముందే పదవీ విరమణ చేస్తుండడంతో భారీ సంఖ్యలో ఖాళ్లీలు ఏర్పడడానికి కారణమైంది. ఈ కారణంగానే కెనడాకు ఇమ్మిగ్రేషన్ డిమాండ్ పెరిగిందని లేబర్ ఫోర్స్ సర్వే పేర్కొంది. జాబ్ వేకెన్సీ రేటు ఎక్కువగా ఉందని, ఈ దశాబ్దంలో ఏకంగా 90 లక్షల మందిపైగా వృద్ధులు రిటైర్మెంట్ అవుతారని అంచనా వేసింది.

*కెనడాలోని రాష్ట్రాల రిపోర్టుల ప్రకారం.. ఇదివరకెప్పుడూ లేనివిధంగా పెద్దమొత్తంలో ఖాళ్లీలు ఏర్పడ్డాయి. అల్బర్టా, ఒంటారియో రాష్ట్రాల్లో నిరుద్యోగుల సంఖ్య గణనీయంగా తగ్గడంతో అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఏప్రిల్ నెల డేటా ప్రకారం ఒక్కో పోస్టుకి 1.1 మంది నిరుద్యోగులు పోటీపడ్డారు. అంతకుముందు నెల మార్చిలో 1.2 మంది, ఏడాది ఆరంభంలో 2.4 మంది చొప్పున ఉద్యోగాలకు పోటీపడ్డారు. న్యూఫౌండ్‌లాండ్, లాబ్రాడర్ రాష్ట్రాల్లో ఒక్కో పోస్టుకు నలుగురు పోటీపడుతున్నట్టు అంచనాగా ఉంది. ప్రొఫెసినల్, సైంటిఫిక్, టెక్నికల్ సర్వీసెస్, ట్రాన్స్‌పోర్టేషన్, వేర్‌హౌసింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్, స్పోర్ట్స్, రియల్ ఎస్టేట్ వంటి రంగాల్లో రికార్డ్ స్థాయిలో ఖాళ్లీలు ఉన్నాయి. ఏప్రిల్ డేటా ప్రకారం.. నిర్మాణరంగంలో ఏకంగా 89,900పైగా ఉద్యోగావకాశాలున్నాయి. గతేడాదితో పోల్చితే ఈ రంగంలో ఖాళ్లీల సంఖ్య 45 శాతం మేర పెరిగినట్టు గణాంకాలు చెబుతున్నాయి. నోవా స్కాటియా, మనిటోబా రాష్ట్రాల్లో లాడ్జింగ్, ఫుడ్ సర్వీసెస్ రంగాల్లో లక్షకుపైగా ఉద్యోగాలున్నాయి.

*ఖాళ్లీల భర్తీలో ఇమ్మిగ్రెంట్లకు కూడా ఎక్కువ అవకాశాలు ఇచ్చేందుకు వీలుగా కెనడా ప్రభుత్వం సన్నద్ధమవుతోందని సమాచారం. గతంలో ఎప్పుడూలేని విధంగా 2022లో 4.3 లక్షల మంది ఇమ్మిగ్రెంట్లకు స్వాగతం పలకాలనుకుంటోందని పలు రిపోర్టులు చెబుతున్నాయి. 2024 నాటికి మరో 4.5 లక్షలకు ఇమ్మిగ్రెంట్లను అనుమతించాలనుకుంటోంది. ఇందుకు అనుగుణంగా చర్యలు తీసుకుంటోందని సీఐసీ న్యూస్ రిపోర్ట్ పేర్కొంది. దీంతో నిరుద్యోగం తక్కువగా ఉండి, అపార ఉద్యోగావకాశాలు ఉన్న దేశాల్లో ఇమ్మిగ్రెంట్లకు మెరుగైన అవకాశాలు ఉంటాయి. కాబట్టి కెనడాలో భారీ సంఖ్యలో ఖాళ్లీగా ఉన్న ఉద్యోగాలు అక్కడ స్థిరపడాలనుకుంటున్నవారికి ఇది సువర్ణావకాశంగా భావించాలని ఇమ్మిగ్రెంట్ నిపుణులు చెబుతున్నారు.