DailyDose

రైతుకు దొరికిన విలువైన వజ్రం – TNI నేటి తాజా వార్తలు

రైతుకు దొరికిన విలువైన వజ్రం – TNI  నేటి  తాజా వార్తలు

* కర్నూలు జిల్లాలో ఓ రైతుకు అదృష్టం వరించింది. టమాటా పైరులో రైతు కుమార్తె కలుపు తీస్తుండగా వజ్రం దొరికొంది. వివరాల్లోకి వెళితే తుగ్గలి మండలం జి.ఎర్రగుడి గ్రామానికి చెందిన ఓ రైతు కుటుంబం పొలంలో కలుపు పనుల్లో నిమగ్నమై ఉంది.ఈ క్రమంలో రైతు కుమార్తెకు 10 క్యారెట్ల బరువైన వజ్రం లభించింది. విషయం తెలుసుకున్న పెరవళి, జొన్నగిరి ప్రాంతానికి చెందిన కొంతమంది వ్యాపారులు రైతును సంప్రదించారు. వ్యాపారులంతా కలిసి దాన్ని రూ.34లక్షలకు కొనుగోలు చేసినట్లు సమాచారం. ఏటా తొలకరి వర్షాల తర్వాత జొన్నగిరి, పగిడిరాయి, జి.ఎర్రగుడి, తుగ్గలి ప్రాంతాల్లోని పొలాల్లో వజ్రాలు లభించడం సాధారణమేనని స్థానికులు చెబుతున్నారు.

* మాల్లారెడ్డి ట్రస్టు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైకుంఠ రథాన్ని బుధవారం మంత్రి మల్లారెడ్డి మేడ్చల్‌ జిల్లా ఘట్‌కేసర్‌ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో జడ్పీ చైర్మన్‌ మలిపెద్ది శరత్‌ చంద్రారెడ్డితో కలిసి ప్రారంభించారు. అనంతరం ఆయన మట్లాడుతూ.. ఘట్‌కేసర్‌ మండల ప్రజలకు సౌకర్యంగా ఉండేందుకు ఈ వాహనాన్ని అందుబాటులోకి తెచ్చినట్లు తెలిపారు.

*అలిపిరి పోలీస్ స్టేషన్ ముందు జనసేన నేతలు నిరసన చేపట్టారు. నిన్న అలిపిరి వద్ద టీటీడీ (TTD) బోర్డు సభ్యుడు లక్ష్మినారాయణకు వ్యతిరేకంగా జనసేన శ్రేణులు నిరసన వ్యక్తం చేశారు. దీంతో అనుమతి లేకుండా ట్రాఫిక్‌కు అంతరాయం కలిగించారంటూ జనసేన నేతలపై పలు సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై నిరసన వ్యక్తం చేస్తూ.. శ్రీవారి ఫోటోతో అలిపిరి పీఎస్ వద్ద టెంకాయలు కొట్టి నిరసన తెలిపారు. రాష్ట్రాన్ని, తిరుమల కొండను నీవే కాపాడుకో గోవిందా.. అంటూ జనసేన నేతలు, కార్యకర్తలు నినాదాలు చేశారు. కొబ్బరికాయలు కొడితే కేసులు పెట్టాలని ఏ రాజ్యాంగంలో లేదన్నారు.

*తిరుమల బాలాజీ న‌గ‌ర్‌లో జ‌రుగుతున్న అభివృద్ధి ప‌నులు, పార్కింగ్ ప్రాంతాల‌ను ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి ఇవాళ అధికారులు, స్థానికుల‌తో క‌లిసి ప‌రిశీలించారు. డ్రైనేజి, పారిశుద్ధ్యం, విద్యుత్ దీపాలు త‌దిత‌ర వాటిని ప‌రిశీలించి అక్కడ ఉన్న కాంక్రీట్ వ్యర్థాల‌ను తొల‌గించాల‌ని సంబంధిత అధికారులను ఆదేశించారు. బాలాజీ నగర్‌లో ప‌చ్చద‌నం పెంపొందించేందుకు చ‌ర్యలు తీసుకోవాల‌ని, ఇనుము త‌దిత‌ర వ్యర్థాల‌ను తిరుప‌తికి త‌ర‌లించాల‌న్నారు.

*మంచిర్యాల జిల్లాలోని ఓ ఫంక్షన్ హాలు లో జరుగుతున్న పెళ్లి తాళి కట్టే సమయంలో ఆగిపోయింది. పెళ్లి కొడుకు తనను ప్రేమించి మరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడని పెళ్లి మండపానికి వచ్చిన ఓ యువతి వివాహాన్ని అడ్డుకుంది. పెళ్ళికొడుకు నిర్వాకంతో కొత్త పెళ్లి కూతురు వివాహాన్ని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. పీటల మీద పెళ్లి ఆగిపోవడంతో ఫంక్షన్ హాల్లో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది.మందమర్రి మండలానికి చెందిన ఓ యువకుడికి, వరంగల్‌కు చెందిన యువతికి పెద్దలు పెళ్లి నిశ్చయించారు. మంచిర్యాల జిల్లా, గద్దె రేగడిలోని ఓ ఫంక్షన్ హాల్లో పెళ్లి జరుగుతుండగా.. ఓ యువతి పెళ్లి మండపానికి వచ్చి తాళికట్టే సమయంలో పెళ్లి కొడుకు తనను ప్రేమ పేరుతో మోసం చేశాడని ఆరోపించింది. ఈ పెళ్లి జరగడానికి వీల్లేదని, తనకు న్యాయం చేయాలని ఆ యువతి అక్కడే బైఠాయించింది. దీంతో అక్కడ గందరగోళం నెలకొంది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన ప్రదేశానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు

*షెడ్యూల్ కులాల (SC) వర్గీకరణ రిజర్వేషన్ల అంశంపై సుప్రీంకోర్టు (Supreme Court) బుధవారం కీలక తీర్పు ఇచ్చింది. వర్గీకరణ అంశం రాష్ట్ర ప్రభుత్వ పరిధిలో లేదని న్యాయస్థానం పేర్కొంది. కేంద్ర ప్రభుత్వం, పార్లమెంట్ మాత్రమే సమస్య పరిష్కరించాలని పేర్కొంటూ ఎస్సీ వర్గీకరణపై ఈ మేరకు తీర్పు ఇచ్చింది. తెలుగు రాష్ట్రాల్లో ఎస్సీ వర్గీకరణకు అనుమతివ్వాలని ఎమ్మార్పీఎస్ (MRPS) పిటిషన్ వేసింది.

* జంగారెడ్డి గూడెం సెబ్ (స్పెషల్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ బ్యూరో) పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ సీఐ శ్రీనివాసరావు, ఎస్ఐ మస్తానయ్య, సెంట్రీ కానిస్టేబుల్ శ్రీహరిలను అధికారులు సస్పెండ్ చేశారు. కొయ్యలగూడెం మండలం పొంగుటూరుకి చెందిన కొల్లూరి దుర్గారావును ఈ నెల 5వ తేదీన సెబ్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా నిన్న ఏలూరులో రైల్వే ట్రాక్‌పై శవమై కనిపించాడు. బెల్లం అమ్ముతున్నాడనే కారణంతో సెబ్ అధికారులు దుర్గారావును అదుపులోకి తీసుకున్నారు. దుర్గారావు మృతికి సెబ్ అధికారులే కారణమంటూ కొయ్యలగూడెం పీయస్ వద్ద బంధువుల ఆందోళన చేశారు. అలాగే సెబ్ అధికారులపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారణ జరిపిన పోలీస్ ఉన్నతాధికారులు ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించారని ముగ్గురిని సస్పెండ్ చేశారు. విచారణాధికారిగా ఏఎస్పీ చక్రవర్తిని నియామించారు

*రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోన్న వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్వీ డియో టేప్‌లను పోలీసులు విజయవాడ ఫోరెన్సిక్‌ సైన్స్‌ ల్యాబ్‌ కు పంపారు. అనంతపురంలో నమోదైన కేసులో ఈ రోజు ఉదయం వీడియో టేప్‌ను విజయవాడ ల్యాబ్‌కు పంపామని ఆఫ్‌ ది రికార్డ్‌గా పోలీసులు చెబుతున్నారు. ఈ విషయాన్ని విజయవాడ ల్యాబ్ వర్గాలు ధృవీకరించాయి. ఈ వ్యవహారంపై ఇప్పటికే అనంతపురం పోలీస్‌ స్టేషన్‌‌లో ఎఫ్‌ఐఆర్ (FIR) నమోదు అయ్యింది.

*తన సెక్యూరిటీ విషయంలో టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ సంచలన ఆరోపణలు చేశారు. తన భద్రతకు భంగం వాటిల్లేలా ప్రభుత్వం కావాలని వ్యవహరిస్తోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నా సెక్యూరిటీ విషయంలో ప్రభుత్వ వైఖరిలో మార్పు లేదు. కీలక విషయాలను ప్రస్తావిస్తున్నానని నన్ను టార్గెట్ చేశారు. నా సెక్యూర్టీకి ఇబ్బందులు కలిగిస్తున్నారని.. ఓ అధికారి నాకు ముందుగానే చెప్పారు. కేసులు పెట్టాలని ప్రయత్నిస్తున్నారు. నా గన్ మెన్లు హైదరాబాదులో ఉండకూడదంటూ మూడు నెలల నుంచి విచిత్ర వాదన లేవనెత్తారు. పొరుగు రాష్ట్రాలకు గన్ మెన్లను ఇచ్చేదే లేదని చెబుతున్నారు. వైసీపీ నేతలు హైదరాబాదులో గన్ మెన్లతో ఉంటున్నారంటే.. దానికి సమాధానం లేదు. గన్ లైసెన్సుకు ఆల్ ఇండియా పర్మిట్ కావాలంటే నాలుగు నెలల నుంచి పెండింగులో పెట్టారు. గన్మెన్లను ఇతర రాష్ట్రాలకు వద్దంటున్నారు.. గన్ లైసెన్సు ఇవ్వడం లేదు.. గన్ మెన్లను మార్చారు. నక్సలైట్లతో ఇబ్బందులు ఎదుర్కొన్న కుటుంబం మాది. నా నియోజకవర్గంలో మాజీ మిలిటెంట్ల కదలికలు పెరిగాయి. పోలీస్ ఇన్ఫార్మర్లుగా పని చేసిన మాజీ నక్సలైట్లు మా నియోజకవర్గంలో తిరుగుతున్నారు. నేను వెలుగులోకి తెస్తున్న విషయాలు.. రాసిన లేఖలు ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతున్నాయేమో..? పోరాటాల్లో పుట్టి పెరిగిన వాడిని.. రాటు తేలిన వాడిని బెదిరింపులకు భయపడను. సెక్యూరిటీని పెంచాలని ఇంటెలెజిన్స్ చీఫ్‌ను అడిగిన మర్నాడే నా గన్‌మెన్లను మార్చారు’’. పయ్యవుల కేశవ్ వ్యాఖ్యలు చేశారు.

*ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పై పీసీసీ చీఫ్ శైలజానాథ్ రెడ్డి ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బుధవారం ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ ఏపీలో (AP) పాలన ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అంతా ఆరాచకమే జరుగుతోందని, సీఎం జగన్ (CM Jagan), ప్రధాని మో కలిసి రాష్ట్రాన్ని నాశనం చేస్తున్నారని విమర్శించారు. ప్రధానికి జగన్ దాసోహం అయిపోయారని, అందుకే ప్రత్యేక హోదా అడగడం లేదన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్‌ను అమ్ముతున్నా… అడగవాల్సిన ముఖ్యమంత్రి, మోదీ కాలు పట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. ఈవీఎంలపై ప్రజలకు అనుమానాలు ఉన్నాయన్నారు. అందుకే 175 స్థానాలు వస్తాయని సీఎం జగన్ అంటున్నారని, ఏపీలో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆరోపించారు. రుషికొండను చూస్తే పాలన ఎలా ఉందో తెలుస్తోందన్నారు. ఎంపీ గోరంట్ల మాధవ్ వీడియోపై జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. ప్రజలందరూ జాగ్రత్తగా ఉండాలని, భవిష్యత్‌లో ఇంకెంత మంది ఇలా దర్శనం ఇస్తారోనని శైలజానాథ్ వ్యాఖ్యానించారు.

* బీసీ, ఎస్సీ, ఎస్టీ సంక్షేమ వసతి గృహాలపై సీఎం జగన్ మోహన్ రెడ్డి బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. ప్రభుత్వ సంక్షేమ హాస్టళ్లలో వసతులపై జగన్ ఆరా తీశారు. అన్ని హాస్టళ్లలో మరుగుదొడ్ల నిర్వహణ కోసం చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. మరుగుదొడ్లను పరిశుభ్రంగా ఉంచేందుకు సిబ్బందిని నియమించాలన్నారు. పిల్లలకు ఇచ్చే ఆహార మెనును మెరుగుపరచాలని సూచించారు. 3 వేల హాస్టళ్లలో అవసరమైన మరమ్మతులు చేయాలని అధికారులను సీఎం జగన్ ఆదేశించారు.

* విప్లవ రచయితల సంఘం నేత పి వరవరరావుకు సుప్రీంకోర్టు బుధవారం రెగ్యులర్ బెయిలు మంజూరు చేసింది. భీమా కొరెగావ్ కేసులో బోంబే హైకోర్టు 2021 ఫిబ్రవరి 22న ఇచ్చిన ఆరు నెలల బెయిలును పర్మనెంట్ బెయిలుగా మార్చింది. అయితే ఈ కేసు విచారణ జరుగుతున్న ట్రయల్ కోర్టు అధికార పరిధిలోని ప్రాంతం నుంచి వెలుపలికి వెళ్ళకూడదని షరతు విధించింది. ఈ స్వేచ్ఛను దుర్వినియోగం చేయరాదని కూడా తెలిపింది. కేసు దర్యాప్తును ఏ విధంగానూ ప్రభావితం చేయరాదని, సాక్షులతో సంప్రదింపులు జరపకూడదని కూడా వివరించింది. ఆయన వయసు 82 సంవత్సరాలు కావడం, అంతేకాకుండా అనారోగ్య పరిస్థితులు ఉండటం వల్ల వైద్యపరమైన కారణాల మేరకు ఈ బెయిలును మంజూరు చేస్తున్నట్లు అత్యున్నత న్యాయస్థానం తెలిపింది. చికిత్సకు సంబంధించిన వివరాలను జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ)కు తెలియజేయాలని వరవరరావును ఆదేశించింది.

*భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం పెరుగుతోంది. నీటిమట్టం 48 అడుగులకు చేరడంతో అధికారులు రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. భద్రాచలం వద్ద గోదావరిలో 12.40 లక్షల క్యూసెక్కుల ప్రవాహం కొనసాగుతోంది. నీటిమట్టం 53 అడుగలకు చేరితే మూడో ప్రమాద హెచ్చరిక జారీ చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. మరోవైపు రాజమహేంద్రవరం వద్ద మళ్లీ గోదావరికి వరద పోటెత్తుతోంది. ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ వద్ద వరద ఉరకలేస్తోంది. బ్యారేజ్ నీటిమట్టం 11.70 అడుగులకు చేరడంతో.. సముద్రంలోకి 9.62 లక్షల క్యూసెక్కులు విడుదల చేస్తున్నారు.

*అనంతపురం జిల్లాలో ఓ చిరుత పులి మృతిచెందింది. ఈ ఘటన సెట్టూరు మండలం మాలేపల్లి సమీపంలో చోటు చేసుకుంది. అటవీ ప్రాంతంలోని రోడ్డుపై విగతజీవిగా పడి ఉంది. నోట్లో నుంచి రక్తం వచ్చిన స్థితిలో పడి ఉండడాన్ని గుర్తించిన గ్రామస్థులు.. వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. పోస్టుమార్టం నిర్వహించి చిరుత మృతికి గల కారణాలు తెలుసుకుంటామని తెలిపారు.

*భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాలు పురస్కరించుకుని ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాల మేరకు.. వనమహోత్సవంలో భాగంగా మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి జిల్లాలోని పడగల్ గ్రామంలోని ఫ్రీడమ్ పార్క్‌లో మొక్కలు నాటారు.దేశానికి స్వాతంత్య్ర సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ‘ఫ్రీడమ్ పార్క్’ లో ఏక కాలంలో 750 మొక్కలు నాటారు. స్వాతంత్య్ర వజ్రోత్సవాల సదర్భంగా ఆగస్టు 15న ప్రతి ఇంటిపై జాతీయ జెండాను ఎగురవేయాలని మంత్రి సూచించారు. దేశం గర్వించేలా వజ్రోత్సవాలు నిర్వహిస్తామన్నారు.

*రాజ్యసభలో బొటాబొటీ మెజార్టీతో నెట్టుకొట్టుకొస్తున్న అధికార బీజేపీకి బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌ రూపంలో మరో ఎదురుదెబ్బ తగిలింది. నితీష్‌ నేతృత్వంలోని జేడీయూ.. ఎన్డీఏ (NDA) నుంచి బయటకు వెళ్లిన విషయం తెలిసిందే. దీంతో పెద్దల సభలో ఎన్డీయే బలం మరింత పడిపోయింది. రాజ్యసభ డిప్యూటీ చైర్‌పర్సన్‌ హరివంశ్‌ సహా జేడీయూకి ఐదుగురు సభ్యులు ఉన్నారు.

*కాంగ్రెస్‌ నాయకురాలు ప్రియాంక గాంధీ కరోనా బారినపడ్డారు. ప్రస్తుతం ఆమె ఐసోలేషన్‌లో ఉన్నారు. ఈ విషయాన్ని ప్రియాంక ట్విట్టర్‌ ద్వారా వివరించారు. తన నివాసంలో సెల్ఫ్‌ ఐసోలేషన్‌లో ఉన్నానని, పోట్రోకాల్స్‌ పాటిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, ప్రియాంక గాంధీ కరోనా బారినపడడం ఇది రెండోసారి. ఇంతకు ముందు గత జూన్‌లో మహమ్మారి బారినపడ్డారు.

*ఆంధ్రప్రదేశ్ ఇంజనీరింగ్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఫలితాలు విడుదలయ్యాయి. 92.36 శాతం మంది అభ్యర్థులు ఉత్తీర్ణులయ్యారని అధికారులు వెల్లడించారు. గత నెల 22 న జేఎన్‌టీయూ – కాకినాడ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన ఏపీ ఈసెట్‌ ప్రవేశ పరీక్షను నిర్వహించారు. ఉదయం 18,318 మంది విద్యార్థులకు గాను 17,180 మంది హాజరుకాగా, మధ్యాహ్నం 20,423 మందికిగాను 19,238 మంది పరీక్ష రాశారు. మొత్తంగా 94 శాతం హాజరు నమోదైందన్నారు

*పుదుచ్చేరి ముఖ్యమంత్రి ఎన్‌.రంగస్వామి ఢిల్లీలో మంగళవారం మధ్యాహ్నం ప్రధానమంత్రి నరేంద్రమోదీని కలుసుకున్నారు. రాష్ట్రంలో చేపట్టనున్న పథకాలకు, త్వరలో బడ్జెట్‌ కేటాయింపులకు సంబంధించిన నిధులను విడుదల చేయాలని కోరుతూ ఆయన ప్రధానికి వినతిపత్రం సమర్పించారు. రంగస్వామి ముఖ్యమంత్రి పదవిని చేపట్టిన ఏడాది తర్వాత ఢిల్లీ వెళ్లడం ఇదే ప్రథమం. సోమవారం రాత్రి ఢిల్లీ బయలుదేరి వెళ్లిన రంగస్వామి.. అక్కడే పుదుచ్చేరి భవన్‌లో బసచేశారు. మంగళవారం మధ్యాహ్నం ఆయన ప్రధాని మోదీ ని కలుసుకున్నారు. ఆ తర్వాత కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌, ఆరోగ్యశాఖ మంత్రి మన్‌చుక్‌ మాండవ్యాను కూడా కలుసుకుని రాష్ట్రానికి సంబంధించిన పథకాల అమలుపై చర్చలు జరిపారు.

*స్వతంత్య్ర భారత వజ్రోత్సవాల నేపథ్యంలో జీహెచ్‌ఎంసీ ఫ్రీడమ్‌ పార్కులను అందుబాటులోకి తీసుకువస్తోంది. ద్విసప్తాహ వేడుకల్లో భాగంగా ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టిన సంస్థ.. ఆ పార్కుల్లో ప్లాంటేషన్‌ చేపడుతోంది. నగరంలో నూతనంగా అభివృద్ధి చేస్తోన్న 75 పార్కుల్లో 10,350 మొక్కలను ప్రజాప్రతినిధులు నేడు నాటనున్నారు. ఒక్కో పార్కులో అందుబాటులో ఉన్న విస్తీర్ణాన్ని బట్టి 75, 750, 7500 మొక్కలు నాటాలని అధికారులు నిర్ధేశించారు.

*బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర అల్పపీడనం మంగళవారం నాటికి వాయుగుండంగా మారింది. భువనేశ్వర్‌కు 85 కిలోమీటర్ల దూరాన కేంద్రీకృతమై ఉంది. ఇది బుధవారానికి బలహీనపడి తీవ్ర అల్పపీడనంగా మారుతుందని వాతావరణ శాఖ తెలిపింది. దీని ప్రభావంతో ఉత్తర కోస్తాలో పలుచోట్ల ఈదురుగాలులతో వర్షాలు కురిశాయి. రానున్న 24 గంటల్లో కోస్తాలో పలుచోట్ల, సీమలో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని తెలిపింది.

*విశాఖ నగరంలోని వన్‌టౌన్‌ ప్రాంతంలో గల ఇందిరా ప్రియదర్శిని మునిసిపల్‌ స్టేడియంలో ఈ నెల 14వ తేదీ నుంచి 31వ తేదీ వరకు అగ్నిపథ్‌ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీ నిర్వహిస్తున్నారు. దఖాస్తుదారులకు స్లాట్లు కేటాయించారు.

*ఆదిలాబాద్‌ జిల్లా ఉట్నూర్‌లోని కేజీబీవీలో పదో తర గతి విద్యార్థిని కవిత (15) చనిపోయింది. కవిత అనారోగ్యంతో చనిపోయిందని పాఠశాల సిబ్బంది చెప్తున్నారు. తమ కుమార్తె మృతిపై పూర్తి స్థాయిలో దర్యాప్తు జరపాలని కవిత తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్తతకు దారితీసింది. దంతన్‌పల్లి జెండాగూడకు చెందిన కవిత సోమవారం అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురి కావడంతో.. పాఠశాల సిబ్బంది చికిత్స నిమిత్తం ఆదిలాబాద్‌లోని రిమ్స్‌లో చేర్పించారు. మంగళవారం తెల్లవారుజామున కవిత చనిపోయింది. విద్యార్థిని తల్లిదండ్రులు పాఠశాల సిబ్బందిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనారోగ్యంగా సమాచారం ఎందుకు ఇవ్వలేదని నిలదీశారు. విద్యార్థిని మృతదేహంతో ఐటీడీఏ ఎదుట ఆందోళనకు దిగారు. బాధ్యులైన వారిపై తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఐటీడీఏ పీవో వరుణ్‌రెడ్డి హామీ ఇచ్చారు.

*అనారోగ్యం, వృద్ధాప్యంతో బాధపడుతున్న సీపీఐ(ఎంఎల్‌)జనశక్తి నాయకుడు కూర రాజన్నపై పెట్టిన అక్రమ కేసులు ఎత్తివేయాలని ప్రజాసంఘాల నేతలు ప్రొఫెసర్‌ హరగోపాల్‌, కోదండరామ్‌, పీఎల్‌ విశ్వేశ్వర్‌రావు, చక్రధర్‌రావు, మాధవరావు, కె. నాగయ్య, పాశం యాదగిరి, గడ్డం లక్ష్మణ్‌ ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. రాజన్న ప్రమేయం లేని కేసులో నాన్‌ బెయిలబుల్‌ వారెంట్‌పై 1న హైదరాబాద్‌లో సిరిసిల్ల పోలీసులు అరెస్టు చేశారని ఆరోపించారు. తెలంగాణ ఏర్పడిన తర్వాత కూడా విప్లవ కార్యకర్తలు, ప్రజాసంఘాలపై అక్రమ కేసులు గతంలో మాదిరిగానే కొనసాగుతుండటం విచారకరమని ఆందోళన వ్యక్తంచేశారు.

*చట్టసభల్లో ఓబీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించాలని జాతీయ బీసీ సంక్షేమ సంఘం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టాలని కోరింది. ఈ విషయమై రాజ్యసభ సభ్యుడు ఆర్‌. కృష్ణయ్య, బీసీ సంఘం కన్వీనర్‌ గుజ్జ కృష్ణ నాయకత్వంలో మంగళవారం ఆ సంఘం ప్రతినిధులు ఢిల్లీలోని జంతర్‌ మంతర్‌ వద్ద ధర్నా నిర్వహించారు. వైసీపీ ఎంపీలు బీద మస్తాన్‌ రావు, చింతా అనురాధ, మార్గాని భరత్‌, మాజీ ఎంపీ వి. హనుమంతరావులు ఈ ధర్నాలో పాల్గొని సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా కృష్ణయ్య మాట్లాడుతూ ఆజాద్‌ కా అమృత్‌ మహోత్సవంలో భాగంగా బీసీలకు చట్టసభల్లో రిజర్వేషన్లు ప్రకటించాలని కోరారు. పార్లమెంటులో బీసీ బిల్లు పెట్టే వరకు ఉద్యమాన్ని దేశవ్యాప్తంగా విస్తరింప చేస్తామని చెప్పా

*తిరుమలలో భక్తుల రద్దీ గణనీయంగా పెరిగింది. మంగళవారం 29 కంపార్ట్‌మెంట్‌లు నిండి బయట 2 కిలోమీటర్ల మేర భక్తులు శ్రీవారి దర్శనం కోసం వేచి ఉన్నారు. సర్వదర్శనానికి 14 గంటలు, ప్రత్యేక దర్శనానికి 2 గంటల సమయం పడుతున్నదని టీటీడీ అధికారులు తెలిపారు.

శ్రీవారి పవిత్రోత్సవాల సందర్భంగా దర్శనానికి ఆలస్యం అవుతున్నదని పేర్కొన్నారు. కాగా, సోమవారం శ్రీవారిని 74,830 మంది భక్తులు దర్శించుకొన్నారని, హుండీ ఆదాయం రూ. 4.79 కోట్లు వచ్చిందని తెలిపారు. బుధవారం పూర్ణాహూతితో పవిత్రోత్సవాలు ముగుస్తాయని వెల్లడించారు.

*యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంతోపాటు పాతగుట్టలో మంగళవారం మహా పూర్ణాహుతి, పవిత్రమాలధారణలతో అర్చకులు పవిత్రోత్సవాలకు పరిసమాప్తి పలికారు. ఉత్సవమూర్తులను నవ కలశాలతో స్నపన తిరుమంజనం జరిపి దివ్య మనోహరంగా అలంకరించారు. యాగశాలలో స్వామి, అమ్మవార్లను అధిష్ఠింపజేసి పంచసూక్త, మూలమంత్ర హోమ పూజలు, మహాపూర్ణాహుతి పర్వాలను నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మంగళవారం భక్తులు భారీగా తరలివచ్చారు. దర్శనానంతరం స్వామివారి ప్రసాదాన్ని కొనుగోలు చేసేందుకు ప్రసాద విక్రయశాలలో క్యూ కట్టారు. స్వామివారి ఖజానాకు రూ.20,43,083 ఆదాయం సమకూరిందని ఈవో గీత తెలిపారు.

*ఏలూరు జిల్లా ద్వారకా తిరుమల మండలం జి.కొత్తపల్లిలో హత్యకు గురైన వైసీపీ నేత గంజి ప్రసాద్‌ కేసులో ఎనిమిది మంది నిందితులకు మంగళవారం బెయిల్‌ మంజూరైంది. ఈ ఏడాది ఏప్రిల్‌ 30న వర్గపోరులో గంజి ప్రసాద్‌ ను నడిరోడ్డుపై అతి కిరాతకంగా నరికి చంపారు. ఈ కేసులో పది మంది నిందితులను అరెస్ట్‌ చేయగా సోమవారం ఏడో అదనపు జిల్లా న్యాయమూర్తి ఎనిమిది మందికి బెయిల్‌ మంజూరు చేశారు. కాగా తమకు ప్రాణహాని ఉందని, బెయిల్‌పై విడుదలైన వారు గ్రామంలోకి రాకుండా చూడాలని జిల్లా కలెక్టర్‌, ఎస్పీలకు విన్నవించినట్లు హతుడు ప్రసాద్‌ భార్య సత్యవతి తెలిపారు.

*మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలకు అవకాశం కల్పించనున్నట్టు హైదరాబాద్‌ మెట్రో రైల్‌ ఎండీ ఎన్వీఎస్‌ రెడ్డి చెప్పారు. మెట్రో నిర్మాణంలో తన అనుభవాలను ‘మేఘపథం’ పేరుతో ఎన్వీఎస్‌ రెడ్డి కవిత్వీకరించారు. ఈ పుస్తకా న్ని మంగళవారం ఆచార్య ఎన్‌.గోపి, శాంతా బయోటెక్నిక్స్‌ వ్యవస్థాపకుడు కేఐ వరప్రసాదరెడ్డి తదితరులు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వరప్రసాదరెడ్డి మాట్లాడుతూ… హైదరాబాద్‌ మెట్రో కోసం ఎన్వీఎస్‌ రెడ్డి పడిన కష్టాలన్నీ.. వ్యాక్సిన్‌ తయారీ రంగంలో తానూ అనుభవించినట్లు చెప్పారు. ఎన్వీఎస్‌ రెడ్డిని దార్శనికుడిగా కొనియాడారు. ఆచార్య ఎన్‌.గోపి మా ట్లాడుతూ… ఎన్వీఎస్‌ రెడ్డిది భావావేశాలతో తడిసిన కవిత్వంగా అభివర్ణించారు. గేయ రచయిత సుద్దాల అశోక్‌తేజ మాట్లాడుతూ… పక్షి వెన్నెముక నమూనాతో ఆకాశమార్గాన వంతెన నిర్మించిన సాహసి ఎన్వీఎస్‌ రెడ్డి అన్నారు. మెట్రో స్టేషన్లలో పుస్తక ప్రదర్శనలకు వెసులుబా టు కల్పించాలని తెలంగాణ సాహిత్య అకాడమీ అధ్యక్షుడు జూలూరు గౌరీశంకర్‌ కోరగా ఎన్వీఎస్‌ రెడ్డి అంగీకరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ… మెట్రో నిర్మాణ క్రమంలో రాజకీయ, న్యాయ, పరిపాలనా విభాగాల నుంచి అవాంతరాలు ఎదురైనట్టు చెప్పారు.

*విజయవాడ ఎంపీ కేశీనేని శ్రీనివాస్‌ (నాని) పేరిట నకిలీ ఫేస్‌బుక్‌ ఖాతా తెరిచి, అభ్యంతరకర పోస్టులు పెట్టిన వారిపై సైబర్‌ క్రైం పోలీసులకు ఫిర్యాదు అందింది. కేశినేని పేరిట ఫేక్‌ ఫేస్‌బుక్‌ అకౌంట్‌ ప్రారంభించి.. ఆయన పరువు, ప్రతిష్ఠలకు భంగం కలిగించేలా పోస్టులు పెట్టిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ కేశినేని భవన్‌ కార్యాలయ ఇన్‌చార్జ్‌ కిలారు ఫణి ప్రసాద్‌ విజయవాడ సిటీ సైబర్‌ క్రైం పోలీసుస్టేషన్‌ హౌస్‌ ఆఫీసర్‌కు ఫిర్యాదు చేశారు. ఆ వివరాలను మంగళవారం మీడియాక వెల్లడించారు. పొలిటికల్‌ పంచ్‌ పేరిట గుర్తు తెలియని వ్యక్తి ఒకరు ఎంపీ ప్రతిష్టకు భంగం కలిగించేలా సోషల్‌ మీడియాలో పోస్టులు పెట్టాడని, ఆయనపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరారు.

*తెన్‌కాశి జిల్లా కుట్రాలం ఐదు జలాపాతాల్లో స్నానాలకు విధించిన నిషేధం మంగళవారం మధ్యాహ్నం ఎత్తివేయడంతో పర్యాటకులు హర్షం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన కుట్రాలంలో ఉన్న ఐదు జలపాతాల్లో స్నానాలు చేసేందుకు సందర్శకులు ఎంతో ఆసక్తి చూపుతుంటారు. ఇటీవల కురిసిన భారీవర్షాల కారణంగా ఈ జలపాతాల్లో వరద ఉధృతంగా సాగుతుండడంతో పర్యాటకుల స్నానాలకు పోలీసులు నిషేధం విధించారు. వర్షాలు తగ్గుముఖం పట్టిన కారణంగా జలపాతం ఉదృతి కూడా తగ్గింది. దీంతో స్నానాలకు విధించిన నిషేధాన్ని మంగళవారం మధ్యాహ్నం 2 గంటలకు ఎత్తివేశారు. నిషేధం లేకపోవడంతో పర్యాటకులు ఉత్సాహంగా జలపాతాల వద్ద బారులుతీరి స్నానాలు చేస్తూ సందడి చేశారు.

*స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా ఉగ్రవాదులు హింసాత్మక ఘటనలకు పాల్పడే అవకాశమున్నట్లు కేంద్ర ఇంటెలిజెన్స్‌ విభాగం హెచ్చరించటంతో స్థానిక మీనంబాక్కంలోని జాతీయ, అంతర్జాతీయ విమానాశ్రయాల వద్ద ఐదంచెల భద్రత కల్పించారు. సోమవారం రాత్రి నుంచే ఈ భద్రత అమల్లోకి వచ్చింది. విమానాశ్రయ ప్రాంగణంలోకి వచ్చే అన్ని వాహనాలను పోలీసు జాగిలాలు, మెటల్‌ డిటెక్టర్లతో క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే లోపలకి అనుమతిస్తున్నారు. విమానాశ్రయం లోని అన్ని విభాగాల వద్ద సాయుధ దళ పోలీసులు కాపలా కాస్తున్నారు. కేంద్ర పారిశ్రామిక భద్రతాదళం సభ్యులు కూడా పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు చేపడుతున్నారు. విమానాశ్రయం ప్రధాన ప్రాంగణంలోని సందర్శకులను అనుమతించకుండా కట్టుదిట్టం చేశారు. విమానాలకు ఇంధనం నింపే ప్రాంతాల వద్ద అదనపు దళాలతో పటిష్ఠమైన కాపలాను ఏర్పాటు చేశారు.

* బెంగళూరు పరప్పన అగ్రహార జైలు లోని ఖైదీలు కొరియర్ల ద్వారా పార్శిళ్లు తెప్పించుకోవాలంటే ముందస్తుగా జైలు సూపరింటెండెంట్‌ అనుమతిని పొందాల్సి ఉంటుంది. ఈ మేరకు జైలు ఉన్నతాధికారులు మంగళవారం ప్రత్యేక ఉత్తర్వులు జారీ చేశారు. అనుమతులు లేకుండా వచ్చే ఎలాంటి పార్శిళ్లను స్వీకరించవద్దని సిబ్బందికి ఆదేశాలు జారీ చేశారు. కొంతమంది ఖైదీలు పార్శిళ్ల ద్వారా మాదకద్రవ్యాలు, ఇతర నిషేధిత వస్తువులను దర్జాగా తెప్పించుకుంటున్నట్లు ఇటీవలి పరిశీలన సమయంలో గుర్తించారు. పార్శిల్లో ఏమేమి తెప్పించుకుంటున్నదీ ఖైదీలు ముందుగా జై అధికారులకు తెలియజేయాల్సి ఉంటుంది. అనంతరం సదరు పార్శిల్‌ను అధికారుల సమక్షంలోనే తెరచిచూసి ఆపై ఖైదీలకు అందజేస్తారు. ఈ నియమాలను ఉల్లంఘించే ఖైదీలు, జైలు సిబ్బందిపై తగినచర్యలు ఉంటాయని మంగళవారం విడుద ల చేసిన ప్రకటనలో ఆ శాఖ పేర్కొంది.

*టీడీపీ గంజి చీరంజీవి రాజీనామా చేశారు. టీడీపీ అధికార ప్రతినిధి పదవికి, పార్టీ సభ్యతనికి రాజీనామా చేస్తున్నట్లు చిరంజీవి తెలిపారు. టీడీపీలో మున్సిపల్ చైర్మన్‌గా, 2014లో ఎమ్మెల్యే అభ్యర్ధిగా అవకాశం కల్పించినందుకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలుగుదేశం పార్టీలో బీసీగా ఉన్న తనను రాజకీయంగా ఇబ్బంది పెట్టారన్నారు. 2014లో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని ఆరోపించారు. పదవులు కోసం, పరపతి కోసం టీడీపీకి రాజీనామా చేయడం లేదని… సొంత పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేక రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. టీడీపీ వాళ్ళే తన రాజకీయ జీవితం నాశనం చేశారన్నారు. చివరి నిమిషం వరకు మంగళగిరి ఎమ్మెల్యే సీటు తనదే అని చెప్పి మోసం చేశారని తెలిపారు. టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి అనే పదవి ఇచ్చి… మంగళగిరి ప్రజలకు దూరం చేశారన్నారు. చేనేత, బీసీగా ఉన్న తనను అణగదొక్కారని మండిపడ్డారు.

*తుంగభద్ర నిండుకుండలా తొణకిసలాడుతుంది. జలాశయంలోకి వరద నీరు ఉధృతంగా చేరుతుంది. జలాశయ పరివాహక ప్రాంతాల్లో ఎడతెరపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాల కు వరద ఉధృతి పెరుగుతూ వస్తోంది. జలాశయంలోకి దాదాపు లక్షా 40వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ముందు జాగ్రత్త చర్యగా అధికారులు జలాశయానికి ఉన్న 33 గేట్లు తెరచి లక్షా 40 వేల క్యూసెక్కుల నీటిని నదికి వదిలారు. 25 గేట్లు మూడన్నర అడుగులు, 8 గేట్లను ఒకటిన్నర అడుగు ఎత్తి నీటిని నదికి మళ్లించారు. జలాశయం నీటి నిలువ సామర్థ్యం 105.788 టింసీలు కాగా ప్రస్తుతం 102.014 టీఎంసీల నీరు నిల్వ ఉంది. నది పక్కన ఉన్న గ్రామాలను అధికారులు అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రదేశాలకు తరలించారు. నదిపై నిర్మించిన వంతెనపై నీరు ప్రవహిస్తుండటంతో ప్రయాణికుల రాకపోకలు సాగించరాదని ఆంక్షలు విధించారు.

*మైలవరంలో ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్‌ కు సమస్యలు స్వాగతం చెబుతున్నాయి. గడప గడపకు మన ప్రభుత్వంలో ఎమ్మెల్యేకు నారాయణ నగర్ కు చెందిన ప్రజలు తమ సమస్యలను ఏకరువు పెడుతున్నారు. ముగ్గురు కొడుకులు ఉండి రెండు సార్లు ఇళ్ల స్థలం కోసం అప్లై చేస్తే వచ్చిన స్థలాన్ని కొందరు నాయకులు తీయించి వేశారని ఎమ్మెల్యే (YCP MLA) ముందు సయాద్ సీలార్ అనే వ్యక్తి వాపోయాడు. ఏళ్ల తరబడి రోడ్డు లేక ఇబ్బందులు పడుతున్నామని, పంచాయతీ నీరు రాక మంచి నీటి కోసం నానా పాట్లు పడుతున్నామని తల్లి, కొడుకులు తెలిపారు. అయితే సమస్యలు చెప్పే వారిని ఎమ్మెల్యే వసంత కోపగించుకుంటున్నారు. ‘‘నేను మాట్లాడాకే మీరు మాట్లాడాలని, పథకాలు వస్తున్నాయా లేదా’’ అంటూ ఎమ్మెల్యే సమాధానం దాట వేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఫోటో దిగి వెళ్ళిపోయాక పలువురు మహిళలు తిట్టుకునే పరిస్థితి నెలకొంది.

*భారీ వర్షాల కారణంగా గోదావరి వరద ఉధృతి ఎక్కువగా ఉంది. దీంతో అధికారులు దవళేశ్వరం వద్ద మొదటి ప్రమాద హెచ్చరికను జారీ చేశారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో 10.27 లక్షల క్యూసెక్కులుగా కొనసాగుతోంది. గోదావరి ఉధృతి నేపథ్యంలో ఏపీ వివపత్తుల సంస్థ అధికారులను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తోంది. అత్యవసర సహయం, సమాచారం కోసం 24 గంటలు అందుబాటులో స్టేట్ కంట్రోల్ రూమ్ నెంబర్లు (1070, 18004250101, 08632377118) సంప్రదించాలని తెలిపారు. గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల సంస్థ ఎండీ డా.బి.ఆర్.అంబేద్కర్ సూచించారు.

*కాకినాడ జేఎన్టీయూకే ఆధ్వర్యంలో నిర్వహించిన ఏపీఈసెట్‌ 2022 ఫలితాలను బుధవారం విడుదల చేయనున్నట్టు కన్వీనర్‌ ప్రొఫెసర్‌ ఎ.కృష్ణమోహన్‌ తెలిపారు. ఫలితాలను www.cets.apsche.ap. gov.in/ecet వెబ్‌సైట్‌లో చూసుకోవచ్చని, ర్యాంక్‌ కార్డులను కూడా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని ఆయన సూచించారు.

*2021-22 విద్యా సంవత్సరానికి సంబంధించి కాం్యపస్‌ ప్లేస్‌మెంట్లలో ఐఐటీ మద్రాస్‌ రికార్డు సృష్టించింది. రెండు దశల్లో నిర్వహించిన ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో 380 కంపెనీలు పాల్గొని 1,199 ఉద్యోగాలను విద్యార్థులకు ఆఫర్‌ చేశాయి. దీనికితోడు మరో 231 మందికి ప్రీ ప్లేస్‌మెంట్‌ ఆఫర్లు అందడంతో ఈసారి మొత్తం ఉద్యోగాల సంఖ్య 1,430కి చేరింది. 2018-19 విద్యా సంవత్సరంలో నమోదైన 1,151 జాబ్‌ ఆఫర్లతో పోలిస్తే ఇది చాలా ఎక్కువ. ఈ డ్రైవ్‌లో విద్యార్థులు అందుకున్న సగటు వేతనం రూ.21.48 లక్షలు కాగా, ఒక విద్యార్థికి అత్యధికంగా రూ.1.98 కోట్ల (2,50,000 డాలర్లు) ప్యాకేజీ లభించిందని ఐఐటీ మద్రాస్‌ వర్గాలు ఓ ప్రకటనలో తెలిపాయి. ఈసారి 14 అంతర్జాతీయ కంపెనీల నుంచి 45 మందికి విదేశాల్లో ఉద్యోగాలు దక్కడం కూడా ఒక రికార్డే. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌ రెండు దశలలో కలిపి 199 మంది విద్యార్థులకు 131 స్టార్‌అప్‌ కంపెనీలు ఉద్యోగాలు ఇచ్చాయి. ఎంబీఏ విద్యార్థులు మొత్తం 61 మందికీ ఉద్యోగాలు లభించడంతో మేనేజ్‌మెంట్‌ విభాగంలో ఐఐటీ మద్రాస్‌ నూరుశాతం ప్లేస్‌మెంట్‌ సాధించింది. ప్లేస్‌మెంట్‌ డ్రైవ్‌లో రిజిస్టర్‌ చేసుకున్న 80శాతం మంది విద్యార్థులకు ఉన్నతోద్యోగాలు లభించినట్లు ప్లేస్‌మెంట్స్‌ అడ్వయిజర్‌ ప్రొఫెసర్‌ సీఎస్‌ శంకర్‌రామ్‌ పేర్కొన్నారు.

*మూలధన విలువ ఆధారిత ఆస్తిపన్ను విధించేందుకు వీలు కల్పిస్తూ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన గెజిట్‌ , తదనంతరం జారీ చేసిన జీవో 198ని సవాల్‌ చేస్తూ గ్రేటర్‌ విశాఖ రెసిడెంట్‌ కాలనీ అసోసియేషన్‌ ఫెడరేషన్‌ జనరల్‌ సెక్రటరీ పిట్టా నారాయణమూర్తి, విశాఖపట్నం అపార్ట్‌మెంట్‌ రెసిడెంట్‌ వెల్ఫేర్‌ అసోసియేషన్‌ జనరల్‌ సెక్రటరీ బి.భవానీ గణేశ్‌ వేర్వేరుగా హైకోర్టును ఆశ్రయించారు. సోమవారం ఆ వ్యాజ్యాలు హైకోర్టులో న్యాయమూర్తి జస్టిస్‌ ఎ.వి.శేషసాయి, జస్టిస్‌ ఊటుకూరి శ్రీనివా్‌సతో కూడిన ధర్మాసనం ఎదుట విచారణకు వచ్చాయి. పిటిషనర్‌ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. ఆస్తిపన్ను చెల్లించేవారి నుంచి జీవీఎంసీ కమిషనర్‌ రూ.కొట్లలో లైబ్రరీ ఫీజువసూలు చేసి, అందులో కొంతసొమ్మును మాత్రమే విశాఖ గ్రంథాలయ సంస్థకు జమచేశారన్నారు. మిగిలిన సొమ్మును పన్నుచెల్లింపుదారులకు తిరిగిచ్చేలా ఆదేశాలివ్వాలని కోరారు.

*సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ, వినియోగాన్ని నిషేధిస్తూ గత ఏడాది ఆగస్టు 12న కేంద్ర పర్యావరణ, అటవీ మంత్రిత్వశాఖ తీసుకొచ్చిన నిబంధనలు, తదనుగుణంగా ఏపీ కాలుష్య నియంత్రణ మండలి (పీసీబీ) ప్రొసీడింగ్స్‌పై గుంటూరు, పల్నాడు, తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు చెందిన ప్లాస్టిక్‌ ఉత్పత్తుల తయారీ పరిశ్రమ యాజమాన్యాలు హైకోర్టును ఆశ్రయించాయి. ఈ వ్యాజ్యాలు సోమవారం విచారణకు రాగా పిటిషనర్ల తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాస్‌ వాదనలు వినిపించారు. నిషేధాన్ని అమలు చేస్తే కోట్లు ఖర్చు చేసి పరిశ్రమలు ఏర్పాటు చేసిన యాజమాన్యాలు తీవ్రంగా నష్టపోతాయన్నారు.

*రాష్ట్రంలో ఫ్యామిలీ డాక్టర్‌ విధానాన్ని అమల్లోకి తీసుకొస్తున్నామని, దేశ చరిత్రలోనే ఇది సరికొత్త విప్లవమని ఆరోగ్యశాఖ మంత్రి విడదల రజిని అన్నారు. ఆరోగ్యశాఖపై సోమవారం ఆమె సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. పేద ప్రజలందరికీ ఆధునిక వైద్యాన్ని ఉచితంగా అందించే దిశగా కృషి చేస్తున్నామన్నారు. గ్రామ గ్రామాన వైఎ్‌సఆర్‌ విలేజ్‌ క్లినిక్‌లు నిర్మిస్తున్నామని, రూ.1,500 కోట్లతో 1,032 విలేజ్‌ క్లినిక్‌ల నిర్మాణం చేపట్టామని చెప్పారు. ఈ భవనాల నిర్మాణ పనులు ఎట్టి పరిస్థితుల్లోనూ ఈ ఏడాది చివరికల్లా పూర్తి కావాలని ఆదేశించారు.

* పోలవరం ప్రాజెక్టు జల విద్యుత్కేంద్రం నిర్మాణంలో కీలకమైన 12 టర్బైన్ల అమరికకు అవసరమైన కాంక్రీట్‌ పనులను సోమవారం ఏపీ జెన్‌కో ఎస్‌ఈ శేషారెడ్డి ప్రారంభించారు. ఒక్కో టర్బైన్‌కు 3,500 మెట్రిక్‌ క్యూబ్‌ల చొప్పున, 12టర్బైన్‌లకు 42వేల మెట్రిక్‌ క్యూబ్‌ల కాంక్రీట్‌ వినియోగిస్తారని ఎస్‌ఈ తెలిపారు. మేఘా చీఫ్‌ జనరల్‌ మేనేజర్‌ ముద్దుకృష్ణ, డీజీఎంలు రాజేష్‌కుమార్‌, క్రాంతికుమార్‌, సీనియర్‌ మేనేజర్‌ మురళి పాల్గొన్నారు.

*మొహర్రం మానవాళి యొక్క అన్ని ధర్మాలకు మిన్నగా త్యాగ స్ఫూర్తిని సూచిస్తుందని గవర్నర్‌ విశ్వభూషణ్‌ హరిచందన్‌ అభిప్రాయపడ్డారు. నిజమైన విశ్వాసమనే బలిపీఠం వద్ద తన జీవితాన్ని త్యాగం చేసిన పవిత్ర ప్రవక్త మనవడు హజ్రత్‌ ఇమామ్‌ హుస్సేన్‌ యొక్క బలిదానం జ్ఞాపకార్థమే మొహర్రం అని గుర్తుచేశారు. మంచితనం, త్యాగాల స్మరణే మొహర్రంకు నిజమైన అర్థం, ఇస్లాం ప్రధాన సూత్రమైన మానవతావాదాన్ని మూర్తీభవించే ముహర్రం స్ఫూర్తిని ప్రతి ఒక్కరం అనుకరిద్దామని గవర్నర్‌ పిలుపునిచ్చారు. మొహర్రం మనందరిలో ఎల్లప్పుడూ శాంతిని పెంపొందించుకోవాలని, సోదరభావం, ఐక్యత సందేశాన్ని వ్యాప్తి చేయాలని గుర్తుచేస్తుందని పేర్కొన్నారు.

*ఆదివాసీ ప్రాంతాల్లో ఇతరులు తిష్టవేసి వారి హక్కులను కొల్లగొడుతున్నారు. దీనిపై అడవిబిడ్డలు మొత్తుకున్నా పట్టించుకునే దిక్కులేదు. ఏజెన్సీ ఏరియాలో కూడా ఒకటిన్నర సెంట్లు బయటి వారికి పట్టాలిస్తామని ముఖ్యమంత్రి జగన్‌ ప్రకటన చేయడంపై గిరిజనులు మండిపడుతున్నారు. పోలవరం ప్రాజెక్టు కింద నిర్వాసితుల పరిస్థితి దయనీయంగా మారింది. అధికారుల తాత్సారంతో గిరిజన హక్కుల ఉల్లంఘన జరిగిందని, వారికి ఇస్తామన్న రూ.10 లక్షల పరిహారం ఉత్తర్వులకే పరిమితమైందని జాతీ య ఎస్టీ కమిషన్‌ తీవ్రంగా తప్పుబట్టినా, ఉపశమనం కల్పించిన పరిస్థితులు లేవు. అభివృద్ధి, పారిశ్రామిక ప్రాజెక్టుల పేరిట ఆదివాసుల గ్రామాలు ఖాళీ అవుతున్నాయి.

*రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు 68,020 మంది జీపీఎఫ్‌ ఖాతాల్లో జమ అయిన డీఏ బకాయిల నుంచి రూ.413.73 కోట్లను విత్‌ డ్రా చేశారని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ పార్లమెంటుకు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు తెలియకుండా, వారి అనుమతిలేకుండా, వారి జీపీఎఫ్‌ ఖాతాల నుంచి సొమ్మును 2021, 22 సంవత్సరాల్లో వైసీపీ ప్రభుత్వం విత్‌ డ్రా చేసిందా అని టీడీపీ ఎంపీ కేశినేని నాని సోమవారం లోక్‌సభలో ప్రశ్నోత్తరాల సమయం అడిగారు. దీనికి కేంద్రమంత్రి పై సమాధానమిచ్చారు.

*శ్రీశైలం జలాశయానికి వరద ప్రవాహం భారీగా కొనసాగుతోంది. జూరాల నుంచి 41,465 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,08,756 క్యూసెక్కులు మొత్తం 1,50,221 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. సోమవారం అధికారులు డ్యాం ఒక గేటును పది అడుగుల మేర ఎత్తి 27,937 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.

*జాతీయ స్థాయిలో నేషనల్‌ టెస్టింగ్‌ ఏజన్సీ (ఎన్‌టీఏ) ప్రకటించిన జేఈఈ మెయిన్స్‌ ఫలితాల్లో భాష్యం ఐఐటి జేఈఈ అకాడమి విద్యార్థులు సత్తా చాటారని సంస్థల చైర్మన్‌ భాష్యం రామకృష్ణ వెల్లడించారు. ర్యాంకులు సాఽధించిన విద్యార్థులను ఆయన సోమవారం గుంటూరు మెయిన్‌ క్యాంప్‌సలో అభినందించారు. ఆర్‌.శ్రీచరణ్‌సింగ్‌ జాతీయ స్థాయిలో 1, పి.వెంకటశివరావు 22, ఎం.యశ్వంత్‌కుమార్‌రెడ్ది 43, జి.రుషిబాబు 49, కె.హితేష్‌ 62, కె.నవనీత్‌ 74, బి.సాయిపవన్‌రెడ్డి 81వ ర్యాంకులు సాధించారని తెలిపారు. తమ విద్యార్థులు 100లోపు 12, 200లోపు 23, 500లోపు 40, 1000లోపు 59 ర్యాంకులతో జేఈఈ అడ్వాన్స్‌లో 72.46 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు.

*గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ (YSRCP) నాయకులకు నిరసన సెగ తగిలింది. ఆదోనిలోని ఇందిరానగర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డి (Sai Prasada Reddy), మాజీ ఎంపీ బుట్టా రేణుక (Butta Renuka) పాల్గొన్నారు. ప్రభుత్వం సంక్షేమ పథకాల గురించి వైసీపీ నాయకులు వివరిస్తుండగా.. అర్హులైన వారికి కూడా ‘అమ్మ ఒడి’ డబ్బులు పడలేదని సుశీలమ్మ అనే మహిళ బుట్టా రేణుకను ప్రశ్నించారు. రోడ్లు, మురుగుకాలువలు నిర్మించాలని వేడుకున్నా.. ఎందుకు పట్టించుకోరని ఎమ్మెల్యే సాయి ప్రసాద్ రెడ్డిని ఎస్సీ కాలనీ మహిళలు నిలదీశారు.

*ఎంపీ గోరంట్ల మాధవ్ వ్యవహారంపై జిల్లా కురుబ సంఘం స్పందించింది. మాధవ్ వ్యవహారంలో కమ్మ-కురుబల మధ్య చిచ్చుపెట్టే ప్రయత్నం జరుగుతోందన్నారు. అటువంటి ప్రయత్నాలను తిప్పికొట్టాలని కురుబ సంఘం పేర్కొంది. గ్రామాల్లో రెండు కులాలు సోదర భావంతో మెలుగుతారని, అటువంటి వాతావరణాన్ని పాడుచేసే ప్రయత్నాలకు కురుబ సోదరులు సహకరించద్దన్నారు. అన్ని పార్టీల్లోనూ మన కులస్తులు వివిధ హోదాల్లో ఉన్నారని, కురుబ సోదరులు సంయమనం పాటించాలన్నారు.

*బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడిగా జాజుల శ్రీనివాస్‌ గౌడ్‌ ఎన్నికయ్యారు. ఢిల్లీలోని కాన్‌స్ట్టిట్యూషన్‌ క్లబ్‌లో సోమవారం జరిగిన బీసీ సంక్షేమ సంఘం జాతీయ కార్యవర్గ సమావేశంలో జాజులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీ బీసీ సంక్షేమ సంఘం అధ్యక్షుడు కేసన శంకరరావు జాజుల పేరు ప్రతిపాదించగా సమావేశంలో పాల్గొన్న 18 రాష్ట్రాలకు చెందిన బీసీ సంఘాల ప్రతినిధులు శ్రీనివా్‌సకు మద్దతు పలికారు. బీసీ సంక్షేమ సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శిగా కుమ్మరి క్రాంతికుమార్‌ యాదవ్‌ ఎన్నికయ్యారు.

*టీఆర్‌ఎ్‌సలో విపరీతమైన అసమ్మతి ఉందని, త్వరలోనే అది పేలడం ఖాయమని బీజేపీ మధ్యప్రదేశ్‌ ఇన్‌చార్జి పి.మురళీధర్‌రావు అన్నారు. కేంద్రంపై తప్పుడు ప్రచారం చేయడం ద్వారానే వచ్చే ఎన్నికల్లో గెలుస్తానని కేసీఆర్‌ నమ్ముతున్నారని, తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే లేనిపోని విమర్శలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. తనపై కూడా ఈడీ దాడులు జరిగే అవకాశం ఉందని భావిస్తున్న కేసీఆర్‌.. గోబెల్స్‌ ప్రచారానికి తెర తీశారని ఆరోపించారు.

*అడవుల పెంపకం, వ్యవసాయ రంగాలకు పవర్‌ టూల్స్‌ తయారుచేసే ఎస్‌టీఐహెచ్‌ఎల్‌ కంపెనీ పూణెలోని చకాన్‌లో కొత్త కార్యాలయం ప్రారంభించింది. కంపెనీ మార్కెటింగ్‌, సేల్స్‌ విభాగం ఎగ్జిక్యూటివ్‌ బోర్డు సభ్యుడు నార్బర్ట్‌ పిక్‌ ఈ కార్యాలయం ప్రారంభించిన అనంతరం మాట్లాడుతూ భారతదేశం తమకు కీలక మార్కెట్‌ అని, ఈ మార్కెట్‌పై తమ కట్టుబాటుకు పూణెలో కార్యాలయం ఏర్పాటు నిదర్శనమని అన్నారు. ఈ ప్రయాణంలో భాగస్వాములవుతున్నందుకు తాము గర్విస్తున్నామని కంపెనీ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పరింద్‌ ప్రభు దేశాయ్‌ చెబుతూ వ్యవసాయ ఉపకరణాల్లో విప్లవాన్ని మరింత ముందుకు నడపడానికి తాము ఎప్పుడూ కట్టుబడి ఉంటామని తెలిపారు.

*జేఈఈ మెయిన్‌లో తమ విద్యార్థులు సత్తా చాటారని శ్రీచైతన్య విద్యాసంస్థల అకడమిక్‌ డైరెక్టర్‌ సుష్మ తెలిపారు. ఓపెన్‌ క్యాటగిరిలో పదిలోపు 4, వంద లోపు 22, వెయ్యిలోపు 601 ర్యాంకులు సాధించారని సోమవారం మీడియాతో పేర్కొన్నారు. ఓబీసీ క్యాటగిరిలో హిమవంశీ ఆలిండియా ఫస్ట్‌ ర్యాంకు సాధించారని, ఓపెన్‌ క్యాటగిరిలో మృణాల్‌ గార్గ్‌ 5, రవికిషోర్‌ 6, హిమవంశీ 7, జలజాక్షి 9వ ర్యాంకు సాధించారని ఆమె తెలిపారు. విద్యార్థులను అభినందించారు.
*తెలుగు వర్సిటీలోని ఆడిటోరియంలో సోమవారం అమృతలత-అపురూప అవార్డుల ప్రదానోత్సవం ఘనంగా జరిగింది. ప్రముఖ నవలా రచయిత్రి డా.పరిమళా సోమేశ్వర్‌కు అమృతలత అవార్డు ప్రదానం చేశారు. అపరూప అవార్డులను పద్య రచనలో మంథా భానుమతి, సాహితీ విమర్శలో వాడ్రేవు వీరలక్ష్మీదేవి, బాలసాహిత్యంలో మంజులూరి కృష్ణకుమారి, కవిత్వంలో ఘంటసాల నిర్మల, సినీ, సంగీత సాహిత్య విశ్లేషణలో డా.రొంపిచర్ల భార్గవి, కధా రచనలో కోట్ల వనజాత, నృత్యంలో అనుపమ కైలాష్‌, సామాజిక సేవలో సాయిపద్మ, రంగస్థలంలో సురభి ప్రభావతి, కర్ణాటక సంగీతంలో సంగీత కళ, రాజ్యలక్ష్మికి ప్రదానం చేశారు. ముఖ్య అతిథిగా హాజరైన శాంతా బయోటెక్‌ అధినేత, పద్మభూషణ్‌ డా.కేఐ.వరప్రసాద్‌రెడ్డి మాట్లాడుతూ ప్రతిభను గుర్తించి గౌరవించడం అభినందనీయమని అన్నారు.

*ఇంటర్‌ విద్య కమిషరేట్‌లో అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఏడీ)గా పనిచేస్తున్న పీఎం ప్రసన్నలతపై సస్పెన్షన్‌ వేటు పడింది. నిబంధనలకు విరుద్ధంగా కారుణ్య నియామకం కోటాలో జూనియర్‌ అసిస్టెంట్‌గా ఉద్యోగంలోకి చేరిన ఆమెను సస్పెండ్‌ చేస్తూ ఇంటర్‌ విద్య కమిషనర్‌ సయ్యద్‌ ఉమర్‌ జలీల్‌ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు.

*ఆటలు ముగిశాయి. వేడుకలు అంబరాన్నంటాయి. మిరుమిట్లు గొలిపే బాణాసంచా వెలుగులు స్టేడియంపై విరజిమ్మాయి. అంగరంగ వైభవంగా మొదలైన బర్మింగ్‌హామ్‌ కామన్వెల్త్‌ గేమ్స్‌ ఆట్టహాసంగా ముగిశాయి. భయపెట్టే కోవిడ్‌ కేసులు లేకుండా ముచ్చటపరిచే రికార్డులతో అలరించిన ఆటల షోకు భారత కాలమానం ప్రకారం మంగళవారం తెల్లవారుజామున తెరపడింది. 72 దేశాలకు చెందిన 4500 పైచిలుకు అథ్లెట్లు తమ ప్రదర్శనతో కామన్వెల్త్‌కు కొత్త శోభ తెచ్చారు.బ్రిటన్‌ యువరాజు ప్రిన్స్‌ ఎడ్వర్డ్‌ మాట్లాడుతూ బర్మింగ్‌హామ్‌ ఆటలకు తెరపడిందని లాంఛనంగా ప్రకటించారు. 2026 ఆతిథ్య వేదిక విక్టోరియా (ఆస్ట్రేలియా)లో కలుద్దామని అన్నారు. భారతీయ భాంగ్రా స్టేడియాన్ని ఊపేసింది. భారత సంతతికి చెందిన సుప్రసిద్ధ గేయరచయిత, గాయకుడు ‘అపాచి ఇండియన్‌’గా ఖ్యాతి పొందిన స్టీవెన్‌ కపూర్‌ ‘భాంగ్రా’ పాటలను హుషారెత్తించే గళంతో పాడాడు. ముగింపు వేడుకల్లో భారత బృందానికి తెలంగాణ స్టార్‌ బాక్సర్‌ నిఖత్‌ , టేబుల్‌ టెన్నిస్‌ స్టార్‌ శరత్‌ కమల్‌ పతాకధారులుగా వ్యవహరించారు.

** పంద్రాగస్టు నేపథ్యంలో ఇంటెలిజెన్స్‌ బ్యూరో హెచ్చరించింది. దీంతో తెలంగాణ పోలీసులు అప్రమత్తమయ్యారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నేపథ్యంలో ఉగ్రవాదులు నగరంలో అల్లర్లు సృష్టించే అవకాశం ఉందని, దాడులకు పాల్పడే అవకాశం ఉందని ఐబీ హెచ్చరించింది. ఢిల్లీతో పాటు కీలక నగరాలను పాకిస్తాన్‌ప్రేరేపిత ఉగ్రవాద సంస్థలు లక్ష్యంగా చేసుకునే అవకాశం ఉందని కేంద్ర నిఘా వర్గాలు హెచ్చరించాయి. హైదరాబాద్‌లోని పర్యాటక ప్రాంతాలు, వీవీఐపీలు ఉండే ప్రదేశాల్లో హై అలర్ట్‌ ప్రకటించారు. శంషాబాద్‌ ఎయిర్‌పోర్టు, రైల్వేస్టేషన్లు, బస్‌స్టేషన్లు, రద్దీ ప్రదేశాల్లో నిఘా పెంచనున్నారు.

*శ్రీశైలం ప్రాజెక్టుకు వరద పోటెత్తుతున్నది. కృష్ణా పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న భారీ వర్షాలతో జలాశయానికి భారీగా వరదనీరు వస్తున్నది. ప్రాజెక్టులోకి 2,69,716 క్యూసెక్కుల వరద వస్తున్నది. దీంతో అధికారులు ఎనిమిది గేట్లు ఎత్తి 2,52,969 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులకు ప్రస్తుతం 884.50 అడుగులకు చేరింది. జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలకు ప్రస్తుతం 212.91 టీఎంసీల నీరున్నది.

*దేశంలో కొత్తగా 16,047 కరోనా కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసులు 4,41,90,697కు చేరాయి. ఇందులో 4,35,35,610 మంది బాధితులు కరోనా నుంచి కోలుకోగా 5,26,826 మంది మృతిచెందారు. మరో 1,28,261 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. ఇక గత 24 గంటల్లో 19,539 మంది బాధితులో వైరస్‌నుంచి బయటపడగా, 54 మంది మృతిచెందారు.రోజువారీ పాజిటివిటీ రేటు 4.94 శాతంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం కేసుల్లో 0.29 శాతం కేసులు యాక్టివ్‌గా ఉన్నాయని, రికవరీ రేటు 98.52 శాతం, మరణాలు 1.19 శాతంగా ఉన్నాయని తెలిపింది. దేశంలో ఇప్పటివరకు 207.03 కోట్ల కరోనా వ్యాక్సిన్‌ డోసులను పంపిణీ చేశామని ప్రకటించింది.

*వాయు‌గుండం ముప్పు తప్పింది. దీంతో వర్షాల తీవ్రత కూడా తగ్గింది. ఈ నెల 13 వరకు పలు‌చోట్ల తేలి‌క‌పాటి వర్షాలు మాత్రమే కురు‌స్తా‌యని హైద‌రా‌బాద్‌ వాతా‌వ‌రణ కేంద్రం తెలి‌పింది. ఒడిశా తీర ప్రాంతంలో భువ‌నే‌శ్వర్‌కు ఉత్తర ఆగ్నేయ దిశలో 70 కిలో‌మీ‌టర్ల దూరంలో ఏర్పడిన వాయు‌గుండం బుధ‌వారం బల‌హీ‌న‌పడి అల్పపీ‌డ‌నంగా మారి ఛత్తీ‌స్‌‌గఢ్‌ పరి‌సర ప్రాంతాల్లో కేంద్రీ‌కృ‌త‌మయ్యే అవ‌కాశం ఉన్నట్టు పేర్కొ‌న్నది. రుతు‌ప‌వ‌నాల ద్రోణి నలియా, అహ్మదా‌బాద్‌, ఇండోర్‌, రాయ‌గఢ్‌ మీదుగా కోస్తా ఒడిశా వద్ద ఉన్న వాయు‌గుండం వరకు వ్యాపించి ఉన్నదని వెల్లడించింది.

*వరుస సెలవులు తిరుమలపై ప్రభావం చూపుతోంది. ఈ నెల 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవులు వచ్చాయి. దీంతో అధికసంఖ్యలో భక్తులు తిరుమలకు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు. ఆగస్టు 11 నుంచి 15వ తేదీ వరకు వరుస సెలవుల కారణంగా తిరుమలకు అధికసంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని తితిదే అంచనా వేస్తోంది. భక్తులు ప్రణాళిక బద్ధంగా దర్శనం, వసతిని ముందుగానే బుక్‌ చేసుకుని తిరుమలకు రావాలని కోరుతోంది. అధిక రద్దీ దృష్ట్యా ముఖ్యంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమల యాత్ర వాయిదా వేసుకోవాలని తితిదే అధికారులు సూచిస్తున్నారు.వేసవి రద్దీ తగ్గినప్పటికీ, వారాంతం రద్దీతో పాటు వరుస సెలవులు ఆగస్టు 19 వరకు ఉన్నాయి. పైగా తమిళులకు పవిత్రమైన పెరటాసి మాసం సెప్టెంబరు 18న ప్రారంభమై అక్టోబరు 17న ముగుస్తుంది. ఈ మధ్య కాలంలో తిరుమలకు యాత్రీకుల రద్దీ అనూహ్యంగా పెరిగే అవకాశం ఉంది. ఈ కారణంగా వృద్ధులు, చిన్న పిల్లల తల్లిదండ్రులు, వికలాంగులు తిరుమలకు పెరటాసి మాసం అనంతరం రావాలని తితిదే విజ్ఞప్తి చేసింది. అధిక రద్దీ ఉన్న రోజుల్లో యాత్రికులను వారి నిర్దేశిత సమయాల్లో మాత్రమే దర్శనానికి అనుమతించడం జరుగుతుందని తెలిపింది. యాత్రికులు శ్రీవారి దర్శనం కోసం తమ వంతు వచ్చే వరకు కంపార్ట్‌మెంట్లలో, క్యూ లైన్లలో చాలా గంటలు వేచి ఉండటానికి సంసిద్ధత, ఓపికతో రావాలని తితిదే ఒక ప్రకటనలో తెలిపింది.