Movies

ప్రయోగాలు చేస్తేనే ఫలితం వస్తుంది!

ప్రయోగాలు చేస్తేనే ఫలితం వస్తుంది!

రష్మిక… తెలుగులో తిరుగులేని కథానాయికగా చలామణీ అవుతున్నారు. టాప్‌ స్టార్స్‌లో ఆమె ఒకరు. కాల్షీట్లు దొరకడమే కష్టం. అలాంటిది.. ‘సీతారామం’లో ఓ కీలక పాత్ర చేయడానికి ఒప్పుకొన్నారు. అఫ్రిన్‌గా కనిపించారు. ఇటీవల విడుదలైన ‘సీతారామం’ మంచి విజయాన్ని అందుకొంది. రష్మికకూ మంచి పేరు తీసుకొచ్చింది. ‘ఇలాంటి పాత్రలు చేసినప్పుడే కదా.. మనసుకు ఆనందంగా ఉంటుంది’ అంటున్నారామె. ఈ సినిమా గురించి రష్మిక ఇంకా ఏం చెప్పారంటే..
*‘‘హను రాఘవపూడి ఈ కథ చెప్పినప్పుడు చాలా ఆసక్తిగా అనిపించింది. నా పాత్ర చిన్నదిగానే అనిపించొచ్చు. కానీ ఈ కథకు తనే ప్రాణం. ఆ పాత్రలో ఓ ఆర్క్‌ ఉంది. అది నాకు బాగా నచ్చింది. ఈ సినిమా కోసం చిత్రబృందం రెండేళ్లు కష్టపడింది. అందరితో పోలిస్తే.. నా శ్రమ తక్కువే. కానీ.. అందరితో పాటు నాకూ మంచి పేరొచ్చింది’’
*పొగరున్న అమ్మాయిని‘‘అఫ్రిన్‌ లాంటి వైలెంట్‌ పాత్ర ఇప్పటి వరకూ చేయలేదు. అదే నాకు సవాల్‌గా అనిపించింది. అఫ్రిన్‌ కూర్చునే విధానం, మాట్లాడే పద్ధతీ.. అంతా కొత్తగానే ఉంటుంది. పొగరున్న అమ్మాయి పాత్ర ఇది. కచ్చితంగా నాకు కొత్తగా ఉంటుందన్న నమ్మకంతోనే ఒప్పుకొన్నా. నా నమ్మకం ఈరోజు నిజమైంది. నటిగా నాకు ముందు నుంచీ భిన్నమైన పాత్రలు చేయాలనే ఉండేది. కానీ అవకాశాలు ఎప్పుడో గానీ రావు. వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. రాబోతున్న సినిమాల్లోనూ నావి వైవిధ్యమైన పాత్రలే’’
*ఇప్పుడే మొదలెట్టా!‘‘ఎప్పుడూ ప్రయోగాలు చేస్తుండాలి. అప్పుడే మనలోని ప్రతిభ బయటకు వస్తుంది. కంఫర్ట్‌జోన్‌లో సినిమాలు చేస్తున్నప్పుడు బాగానే ఉంటుంది. కానీ కొత్తగా ప్రయత్నించి, విజయం అందుకుంటే అందులో ఓ కిక్‌ ఉంటుంది. ‘సీతారామం’తో అది నాకు దక్కింది. అందుకే కంఫర్ట్‌ జోన్‌ దాటి ఇప్పుడు కొత్త తరహా సినిమాలు చేయడం మొదలెట్టా’’
*నా టైమ్‌ బాగుంది‘‘చారిత్రక నేపథ్యం ఉన్న సినిమాలు చేయాలని ఉంది. నాకు స్పోర్ట్స్‌ డ్రామాలన్నా చాలా ఇష్టం. బయోపిక్‌ కూడా చేయాలని ఉంది. లిస్ట్‌ అయితే చాలా పెద్దది. మరి ఆ అవకాశాలు ఎప్పుడు వస్తాయో చూడాలి. ఇప్పుడు తెలుగుతో పాటు హిందీలోనూ బిజీనే. అక్కడ ఒక్క సినిమా కూడా పూర్తికాకుండానే మూడు కొత్త ఆఫర్లు వచ్చాయి. తెలుగులోనూ అంతే. ‘ఛలో’ చేస్తున్నప్పుడే మరో రెండు అవకాశాలు వచ్చాయి. టైమ్‌ బాగుంటే చాలు.. ఇలానే జరుగుతుంది. నా టైమ్‌ బాగుందిప్పుడు’’.