Politics

కాషాయం నీడలోకి ‘జయసుధ’

కాషాయం నీడలోకి  ‘జయసుధ’

సినీ నటి, మాజీ ఎమ్మెల్యే జయసుధ బీజేపీలో చేరనున్నా రు. ఈ నెల 21న కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా సమక్షంలో కాషాయ కండువా కప్పుకోనున్నారు. 4 దశాబ్దాలకు పైగా సినీ రంగంలో ఉన్న జయసుధను బీజేపీ లోకి తీసుకొచ్చేందుకు పార్టీ చేరికల కమి టీ చైర్మన్‌ ఈటల రాజేందర్‌ కొంతకాలం నుంచి ప్రయత్నిస్తు న్నారు. మంగళవారం ఆయన జయసుధతో భేటీ అయి బీజేపీలో చేరేలా ఒప్పించినట్టు సమాచారం.

*2009లో ఎమ్మెల్యేగా గెలిచినా..
జయసుధ 2009లో సికింద్రాబాద్‌ నియో జకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేసి.. టీడీపీ అభ్యర్థి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌పై గెలుపొందారు. 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఆమె రాజకీయాలకు దూరమయ్యారు. సికింద్రాబాద్‌ నియోజకవర్గ పరిధిలో ఆమెకు కొంత పట్టు ఉండటం, క్రిస్టియన్‌ మైనా రిటీ వర్గాన్ని ప్రభావితం చేయగలరన్న అంచనాలతో ఆమెను పార్టీలోకి ఆహ్వానించాలని బీజేపీ నిర్ణయించింది. ఈ క్రమంలో ఈటల రాజేందర్‌ ఆమెతో భేటీ అయి చర్చించారు. బీజేపీలో చేరే విషయాన్ని జయసుధ ధ్రువీకరించారు కూడా.

*సినీ, మేధావి వర్గాలపై నజర్‌
తెలంగాణలో ఆపరేషన్‌ ఆకర్ష్‌ను వేగవంతం చేసిన బీజేపీ సినీ ప్రముఖులు, మేధావి వర్గాన్ని టార్గెట్‌ చేసింది. గతంలో బీజేపీతో సంబంధాలున్న సినీనటులు సుమన్, భానుచందర్‌ వంటి వారిని పార్టీ లో క్రియాశీలం చేయాలని భావిస్తోంది. మరోవైపు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లనూ బీజేపీ నేతలు సంప్రదిస్తున్నారు. ఈ క్రమంలో రిటైర్డ్‌ ఐపీఎస్‌ అధికారి, మాజీ డీజీపీ టి.కృష్ణప్రసాద్‌ బీజేపీ తీర్థం పుచ్చు కోనున్నట్టు సమాచారం. ఈ నెల 21న అమిత్‌ షా సమక్షంలో ఆయనతోపాటు పలువురు రిటైర్డ్‌ ఐఏఎస్, ఐపీఎస్‌లు బీజేపీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్టు తెలిసింది. రిటైర్డ్‌ ఐఏఎస్‌ ఆర్‌.వి.చంద్ర వదన్‌ 2019లోనే బీజేపీలో చేరారు. ఇప్పుడు ఆయనను కూడా చురుకుగా పని చేసేలా బాధ్యతలు అప్పగించనున్నట్టు తెలిసింది. ఇక రాష్ట్రంలో ప్రజాసంఘాల మద్దతును కూడా కూడగట్టేందుకు బీజేపీ ప్రయత్నాలు ముమ్మరం చేసింది.