DailyDose

భారతీయులను రావద్దంటున్న నేపాల్

భారతీయులను రావద్దంటున్న నేపాల్

భారత్‌లో కరోనా కేసులు పెరుగుతున్న వేళ నేపాల్ ప్రభుత్వం తాజాగా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయులను దేశంలోకి అనుమతించబోమని తాజాగా ప్రకటించింది. ఇటీవల నేపాల్‌కు వచ్చిన నలుగురు భారతీయులకు కరోనా సోకినట్టు తేలడంతో అధికారులు వారిని వెనక్కు పంపిచారు. ఆ వెంటనే ప్రభుత్వం దేశంలోకి భారతీయుల రాకపై నిషేధం విధిస్తూ ఓ ప్రకటన విడుదల చేసింది. కరోనా పాజిటివ్‌గా తేలిన ఆ నలుగురు టూరిస్టులు జులాఘాట్ బోర్డర్ పాయింట్ గుండా నేపాల్‌కు వెళ్లినట్టు సమాచారం. కాగా.. భారత్‌ నుంచి స్వదేశానికి తిరిగొచ్చిన అనేక మంది కరోనా బారినపడ్డారని స్థానిక అధికారులు తెలిపారు. ఇక భారత సరిహద్దుకు సమీపంలో ఉన్న బైతాడీ జిల్లా కరోనా ప్రమాదాన్ని ఎదుర్కొంటోంది. మూడు వారాల క్రితం వరకూ ఒక్క కేసు లేని ఆ జిల్లాలో ఇటీవల కాలంలో ఏకంగా 31 కేసులు బయటపడ్డాయి. ఇదిలా ఉంటే భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసుల సంఖ్య 4,41,74,650కి చేరింది. ఇక నేపాల్‌లోనూ కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. మంగళవారం అక్కడ వెయ్యి పైచిలుకు కేసులు నమోదయ్యాయి. గతఆరునెలల్లో రోజువారి కేసుల సంఖ్య ఈ స్థాయిలో ఉండటం ఇదే ప్రథమమని అక్కడి అధికారులు చెబుతున్నారు.