DailyDose

స్థిరాస్తి లేని ప్రధాని మోదీ

స్థిరాస్తి లేని ప్రధాని మోదీ

ప్రధాని మోదీకి ప్రస్తుతం స్థిరాస్తి లేకుండా పోయింది. గాంధీనగర్‌లో ఉన్న ఒక్క ప్లాటు (నివాస స్థలం)ను కూడా ఆయన విరాళంగా ఇచ్చేశారు. ప్రస్తుతం ఆయన వద్ద ఉన్న చరాస్తుల విలువ రూ.2,23,82,504కి చేరిందని ప్రధాన మంత్రి కార్యాలయం (పీఎంవో) తాజాగా ప్రకటించింది. ఈ ఏడాది మార్చి 31నాటికి ప్రధాని, మరో పది మంది కేంద్ర మంత్రులకు ఉన్న ఆస్తుల వివరాలను తన వెబ్‌సైట్‌లో ఉంచింది. వాటి ప్రకారం నిరుడు మార్చి 31నాటికి రూ.1,97,68,885గా ఉన్న మోదీ చరాస్తుల విలువ.. ప్రస్తుత ఏడాది మార్చి 31నాటికి మరో 26.13 లక్షలు పెరిగింది. ఇందులో ఫిక్స్‌డ్‌ డిపాజిట్‌, బ్యాంకు బ్యాలెన్స్‌, చేతిలో ఉన్న నగదు, జీవిత బీమా పాలసీలు, జాతీయ పొదుపు పత్రాలు, బంగారు ఉంగరాలు ఉన్నాయి.

*స్థిరాస్తుల కాలమ్‌లో ‘లేదు’ అని పేర్కొన్నారు. గాంధీనగర్‌లోని సర్వే నంబరు 410/ఏ సెక్టార్‌-1లో ఉన్న నివాస స్థలాన్ని (14,125.50 చదరపు అడుగులు)లో మరో ముగ్గురితో కలిసి ఆయన గుజరాత్‌ సీఎంగా ఉండగా 2002 అక్టోబరు 25న కొనుగోలు చేశారు. అందులో నలుగురికీ 25ు (3,531.45 చ.అడుగులు) చొప్పున భాగస్వామ్యం ఉంది. అప్పట్లో దాని విలువ రూ.1,30,488. అభివృద్ధి, నిర్మాణానికి రూ.2,47,208 వ్యయం చేశారు. ప్రస్తుతం దాని మార్కెట్‌ విలువ రూ.1.10 కోట్లు. మోదీ తాజాగా తన పావలా వాటాను విరాళంగా ఇచ్చారని పీఎంవో ఓ నోట్‌లో పేర్కొంది. కాగా.. మార్చి 31నాటికి ఆయన చేతిలో ఉన్న నగదు రూ.35,250 మాత్రమే. నిరుడు రూ.36,900 ఉంది. ఆయన బ్యాంకు బ్యాలెన్సు గత ఏడాది రూ.1,52,480 ఉండేది.

*ఇప్పుడు రూ.46,555కి తగ్గిపోయింది. జాతీయ పొదుపు పత్రాల్లో (తపాలా) పెట్టుబడి విలువ రూ.8,93,251 నుంచి రూ.9,05,105కి పెరిగింది. జీవిత బీమా పాలసీల ప్రీమియం చెల్లింపు కూడా 1,50,957 నుంచి రూ.1,89,305కి పెరిగింది. అలాగే ఆయన వద్ద రూ.1,73,063 విలువ చేసే 4 బంగారు ఉంగరాలు(45 గ్రాములు) ఉన్నట్లు ప్రకటనలో పేర్కొన్నారు. బ్యాంకు ఎఫ్‌డీఆర్‌, మల్టీ ఆప్షన్‌ డిపాజిట్‌(ఎంవోడీ) బ్యాలెన్సు గత ఏడాది రూ.1,83,66,966గా ఉండేది. మార్చి 31 నాటికి రూ.2,10,33,226కి పెరిగింది. భార్య ఆస్తుల విలువ కాలమ్‌లో ‘తెలియదు’ అని పేర్కొన్నారు.

*కిషన్‌రెడ్డి కుటుంబ ఆస్తులు.. 15.2 కోట్లుకేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, ఆయన కుటుంబ సభ్యుల ఆస్తుల విలువ రూ.15.2 కోట్లు. ఆయన చరాస్తుల విలువ రూ.1.43 కోట్లు కాగా.. ఆయన భార్య కావ్య చరాస్తుల విలువ రూ.1.85 కోట్లు, కుమార్తె వైష్ణవి చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు, కుమారుడు తన్మయ్‌ చరాస్తుల విలువ రూ.5.51 కోట్లు. కిషన్‌రెడ్డి పేరిట స్థిరాస్తులు లేవు. ఆయన సతీమణి పేరిట రూ.6.35 కోట్లు, కుమారుడి పేరిట 95 లక్షల విలువైన స్థిరాస్తులు ఉన్నాయి. కావ్యకు రూ.75.16 లక్షల అప్పులు ఉండగా.. కుమార్తె పేరిట రూ.84.33 లక్షల అప్పులు ఉన్నాయి. కిషన్‌రెడ్డికి ఒకే వాహనం ఉంది. అదీ రూ.40 వేల విలువైన మారుతి-800 కారు.