DailyDose

బుగ్గ కొరికాడంటూ ‘భర్త’ పై ‘భార్య’ కేసు – TNI నేటి నేర వార్తలు

బుగ్గ కొరికాడంటూ  ‘భర్త’ పై ‘భార్య’ కేసు – TNI   నేటి నేర వార్తలు

*భార్యా భర్తలకు అలకలు, గొడవలు సాధారణమే. అసలు అలాంటి అలకలు లేని సంసార జీవితం బోరింగ్ కూడా. ఆ అలకలు, గొడవలు చిన్నచిన్నవే అయితే ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ అవి చిలికి చిలికి గాలివానలా మారితే మాత్రం ఇబ్బందులు కలుగుతాయి. అందుకే మొగుడుపెళ్లాల బంధం చాలా సున్నితమైనది. దాంపత్య జీవితంలో ఇద్దరూ సమానంగా ఉంటూ అవసరం వచ్చినప్పుడు ఎవరో ఒకరు తగ్గాలి. అలా చేస్తే వారి జీవితంలో ఇబ్బందులు వచ్చినా సమర్థంగా తట్టుకోగలరని పెద్దలు చెబుతుంటారు. కాగా ప్రస్తుతం ఓ విచిత్ర సంఘటన జరిగింది. ఓ మహిళ తన భర్త బుగ్గ కొరికేశాడంటూ పోలీసులకు ఫిర్యాదు చేసింది. భర్తపై వెంటనే చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేసింది.
బాధితురాలి ఫిర్యాదుతో పోలీసులు బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు.

* హైద‌రాబాద్ న‌గ‌రంలోని మెహిదీప‌ట్నంలో ఘోరం జ‌రిగింది. కింగ్స్ రెస్టారెంట్‌లో బుధ‌వారం మ‌ధ్యాహ్నం రెండు సిలిండ‌ర్లు ఒకేసారి పేలిపోయాయి. దీంతో భారీ శ‌బ్దం వ‌చ్చింది. జ‌నాలు భ‌యంతో ప‌రుగులు తీశారు. రెస్టారెంట్ అంత‌టా మంట‌లు అంటుకున్నాయి. స‌మాచారం అందుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది ఘ‌ట‌నాస్థ‌లికి చేరుకుని మంట‌ల‌ను అదుపు చేశారు. ఫ‌ర్నీచ‌ర్‌తో పాటు వంట సామాగ్రి చెల్లాచెదురుగా ప‌డిపోయాయి. అయితే కింగ్స్ రెస్టారెంట్‌పైనే ఓ కాలేజీ కూడా నిర్వ‌హిస్తున్న‌ట్లు స‌మాచారం.

* దుబాయ్‌ కరెన్సీ ఆశ చూపి రూ. రెండు లక్షలు కాజేసిన దొంగల ముఠాలోని నలుగురు సభ్యులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. చిక్కడపల్లి ఏసీపీ యాదగిరి, ముషీరాబాద్‌ సీఐ జహంగీర్‌యాదవ్‌ తెలిపిన వివరాల ప్రకారం.. తార్నాకకు చెందిన ఆర్‌.చంద్ర హబ్సిగూడలో పాన్‌షాప్‌ నిర్వహిస్తున్నాడు. అతడి వద్దకు ఈ నెల ఒకటిన గుర్తు తెలియని వ్యక్తులు వెళ్లి తమ వద్ద ఉన్న దుబాయ్‌ కరెన్సీ (దీరమ్స్‌)ని నగరంలో మార్చడం తెలియదని, రూ. 500 కరెన్సీ నోటు ఇండియాలో రూ. 900కు సమానమని చెప్పారు. దుబాయ్‌ కరెన్సీని తక్కువ మొత్తానికి ఇస్తామని ఆశ చూపారు. దీంతో చంద్ర వారి ఒప్పందానికి అంగీకరించాడు. ఆ మర్నాడు చంద్రకు ఫోన్‌ చేసిన ఆ వ్యక్తులు తమ వద్ద రూ. 1000 దీరమ్స్‌ ఉన్నాయని, రూ. 3 లక్షలు తీసుకుని రాంనగర్‌ చేపల మార్కెట్‌ వద్దకు రావాలని చెప్పారు. రూ. 2 లక్షలతో వెళ్లిన చంద్ర వద్ద డబ్బు తీసుకుని దీరమ్స్‌ అంటూ వారు ఓ మూటను చంద్రకు ఇచ్చి, తాము వచ్చాక లెక్క చూద్దాం.. వచ్చే వరకూ ఓపెన్‌ చేయవద్దని చెప్పి వెళ్లారు. ఎంతరకూ రాకపోవడంతో చంద్ర ఆ మూటను విప్పగా రౌండ్‌గా చుట్టిన న్యూస్‌పేపర్స్‌ ఉన్నాయి. చంద్ర ముషీరాబాద్‌ పీఎ్‌సలో ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ముంబై, ఢిల్లీ, పశ్చిమబెంగాల్‌ ప్రాంతాలకు చెందిన భాను షేక్‌ (40), కల్పన (28), సనా ఆఫీ్‌షఖాన్‌(26), మహమ్మద్‌ ఆజాద్‌ (35)లను నిందితులుగా గుర్తించి అరెస్ట్‌ చేశారు. మరో నలుగురు పరారీలో ఉన్నారు. రూ. 1.50 లక్షల నగదు, 11 మొబైల్‌ ఫోన్లు, రూ. 50 విలువచేసే రెండు దీరమ్స్‌ను స్వాధీనం చేసుకున్నారు.

* ప్రముఖ పల్మనాలజిస్ట్ విజయ్‌భాస్కర్‌ కు నాంపల్లికోర్టు పదేళ్ల జైలుశిక్ష విధించింది. 2016లో తన క్లినిక్‌కు వచ్చిన పేషెంట్‌తో విజయ్‌భాస్కర్ అసభ్యంగా ప్రవర్తించాడు. ఇతర పేషెంట్లపై కూడా వైద్యుడు అదే రీతిలో వ్యవహరించాడు. 2016లో గోపాలపురం పోలీసులకు బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు… చార్జ్‌షీట్ దాఖలు చేసి సరైన ఆధారాలు సమర్పించారు. దీంతో వైద్యుడికి నాంపల్లి కోర్టు పదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.5వేల జరిమానా విధించింది.

*అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీలో ఓ మహిళ తన నాలుగు నెలల చిన్నారిని చంపి తానూ ఆత్మహత్యకు పాల్పడింది. పాడేరుకు 15 కిలోమీటర్ల దూరంలోని హుకుంపేట మండలం తడిగిరిలో అరిసెల రాధిక అనే మహిళ.. మంగళవారం సాయంత్రం తన నాలుగు నెలల చిన్నారిని హత్య చేసి ఉరి వేసుకుంది. పొలం పనుల నుంచి సాయంత్రం ఇంటికి వచ్చిన భర్త ఇది చూసి నిర్ఘాంతపోయాడు. కుటుంబ సభ్యులకు, గ్రామ పెద్దలకు సమాచారం అందించాడు. తల్లి రాధికకు కొన్ని రోజులుగా మానసికస్థితి సరిగాలేదని గ్రామస్తులు చెబుతున్నారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు… కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.

*శ్రీ సత్యసాయి జిల్లా గుడిబండ మండలం గుడదహళ్ళిలో విషాదం చోటు చేసుకుంది. నీటికుంటలో పడి అన్నదమ్ములు మృతిచెందారు. గుడదహళ్లికి చెందిన రాజు అనే వ్యక్తికి హరీష్, భరత్ అనే ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు 8, చిన్న కుమారుడు 5వ తరగతి చదువుతున్నారు. మంగళవారం పశువులను మేతకు తీసుకెళ్లిన చిన్నారులు.. పొలంలో ఉన్న నీటి కుంటలో పడి మృతి చెందారు. పిల్లలు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు రాత్రంతా గాలించారు. ఈ ఉదయం కుంట నుంచి మృతదేహాలు బయటికి తేలాయి. విగతజీవులుగా పడి ఉన్న చిన్నారులను చూసి కుటుంబసభ్యులు గుండెలవిసేలా రోదించారు.

*హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వైపు వెళ్తున్న ఓ కారు టైరు పేలడంతో అదుపుతప్పి బోల్తాపడింది. తెలంగాణ నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్ బైపాస్‌ కొత్తపల్లి వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదంలో నలుగురు దుర్మరణం పాలయ్యారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు.తీవ్ర గాయాలపాలైన మరో ముగ్గురిని ఆర్మూర్‌ ఆస్పత్రికి తరలించారు. గాయపడిన వారిలోనూ ఇద్దరు చిన్నారులు ఉన్నారు. కారులో ప్రయాణిస్తున్న వారు హైదరాబాద్‌లోని టోలిచౌకి వాసులుగా భావిస్తున్నారు. ప్రమాదంపై సమాచారం అందుకున్న ముప్కాల్‌ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

* ఈ నెల 5వ తేది నాడు జంగారెడ్డిగూడెం ఎస్సిబి పోలీస్ స్టేషన్ క్రైమ్ నెంబర్ 506/2022లో ఏ.2 ముద్దాయిని అదుపులోకి తీసుకున్నట్లు, 6వ తేదీ నాడు రాత్రి ఒంటిగంటకు దుర్గారావు ఎస్సీబీ పోలీస్ స్టేషన్ నుండి పారి పోయినట్లు సదరు విషయములో విధులలో నిర్లక్ష్యం వహించిన సిబ్బందిపై రాష్ట్ర డిజిపి కె.వి. రాజేంద్రనాథ్ రెడ్డి జంగారెడ్డిగూడెం ఎస్సీబీ పోలీస్ స్టేషన్ ఇంచార్జ్ ఇన్స్పెక్టర్ బి శ్రీనివాసరావు, ఎస్సిబి స్టేషన్ ఇన్చార్జ్ ఏ మస్తానయ్య మరియు సెంట్రీ కానిస్టేబుల్ డి. శ్రీహరిలను ఉద్యోగ నిర్వహణలో నిర్లక్ష్యం వహించిన కారణంగా సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు ఇచ్చినారు. కొల్లూరి దుర్గారావు మంగళవారం నాడు ఏలూరు వద్ద రైలు పట్టాలపై చనిపోయినట్లుగా సమాచారం తెలిసింది. సదరు మొత్తము సంఘటనపై ఏలూరు జిల్లా ఇంఛార్జి స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో అదనపు ఎస్పి & అదనపు ఎస్పీ అడ్మిన్ కె చక్రవర్తి విచారణ అధికారిగా నియమించారని పత్రిక ప్రకటన ద్వారా అధికారులు తెలియజేసారు.

* భార్య ప్రవర్తనను ప్రశ్నించిన భర్త అనుమానాస్పదంగా మరణించిన సంఘటన దేవనహళ్లి పరిధిలో చోటుచేసుకుంది. హెగ్గనహళ్లి వద్ద మంగళవారం ఉదయం హుండై కారుతో పాటు ఒక వ్యక్తి శవం సగం కాలిపోయి లభించింది. దేవనహళ్లి పోలీసులు మృతున్ని యలహంక నివాసి అరిఫ్‌ బాషాగా గుర్తించారు. పోలీసుల ద్వారా విషయం తెలుసుకున్న మృతుడి కుటుంబ సభ్యులు ఘటనాస్థలానికి వచ్చి వివరాలను అందించారు.

* జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని తహబ్‌ క్రాసింగ్‌ వద్ద పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలను భద్రతా పట్టుకున్నాయి.తహబ్‌ క్రాసింగ్‌ సమీపంలో 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీ (మందుపాతర)ని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు..

* నెల్లూరు: జిల్లాలోని మంగుళూరు వద్ద అరేబియా మహాసముద్రంలో ఘోర మరబోటు ప్రమాదం (Boat accident) జరిగింది. సముద్రంలో అలల ఉధృతికి బోటుకి కింది భాగంలో పెద్ద రంధ్రం పడింది. దీన్ని గుర్తించిన మత్స్యకారులు జీపీఎస్ (GPS) సాయంతో తోటి మత్స్యకారులకు సమాచారం అందించారు. వెంటనే తోటి మత్స్యకారులు మరో పడవలో సముద్రంలోకి వెళ్లి 11 మందిని రక్షించారు. కాగా.. దాదాపు రూ.కోటి విలువ చేసే బోటు సముద్రంలోనే మునిగిపోయింది. మత్స్యకారులు అందరూ నెల్లూరు జిల్లా తుమ్మలపెంట, పెదరాముడు పాలెం, ఆదినారాయణ పురం, అల్లూరుకి చెందిన వారే. తృటిలో ఘోర ప్రమాదం నుంచి బయటపడిన మత్స్యకారులు సొంతూళ్లకు చేరుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

*మహిళ పట్ల అసభ్యంగా ప్రవర్తించి, అత్యాచారయత్నం చేసిన కేసులో దక్కన్‌ హాస్పిటల్‌ ఎండీ డాక్టర్‌ విజయ భాస్కర్‌కు నాంపల్లి 11వ సెషన్‌ కోర్టు 13 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. 11వ సెషన్‌ కోర్టు పీపీ నారాయణ తెలిపిన వివరాల ప్రకారం.. 2016లో డెక్కన్‌ హాస్పిటల్‌కి ఊపిరితిత్తుల సమ స్య ఉందని చికిత్స కోసం వెళ్లిన ఓ మహిళ పట్ల పల్మనాలజిస్ట్‌ డాక్టర్‌ విజయ భాస్కర్‌ అసభ్యంగా, అత్యాచారయత్నానికి పాల్పడ్డాడని సదరు మహిళ రామ్‌గోపాల్‌ పురం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసిన పోలీసులు విజయభాస్కర్‌పై 342/2016 కింద చార్జ్‌ షీట్‌ని కోర్టులో ఫైల్‌ చేశారు. ఆ కేసు (569/2017)లో విచారణ పూర్తిచేసిన 11వ సెషన్‌ జడ్జి జె.కవిత నేరం రుజువైందని 376(2)(e)354 ఐపీసీ ప్రకారం 13 ఏండ్ల జైలు శిక్ష , రూ.5వేలు జరిమానా విధించారు. జరిమానా చెల్లించకపోతే మరో మూడు నెలలు అదనంగా శిక్ష అనుభవించాలని తీర్పు చెప్పారు. అలాగే నిందితుడు కేసును అప్పీల్‌ చేసుకునే అవకాశాన్ని కోర్టు కల్పించింది.

*శ్రీకాకుళం: పట్టణంలో ప్రముఖ వైద్యుడు గూడాన సోమేశ్వరరావు కిడ్నాప్ కలకలం రేగింది. సోమేశ్వరరావును కిడ్నాప్ చేసేందుకు దుండగులు యత్నించగా… డాక్టర్ ప్రతిఘటించారు. వెంటనే స్థానికులు అక్కడకు చేరుకోవడంతో ఇద్దరు కిడ్నాపర్లలో ఒకరు పారిపోగా… మరొకరిని స్థానికులు పట్టుకున్నారు. అనంతరం కిడ్నాప్ చేసేందుకు వచ్చిన వ్యక్తిని పోలీసులకు అప్పగించారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

*శ్రీసత్యసాయి: జిల్లాలోని గుడిబండ మండలం గుడగలో విషాదఘటన చోటుచేసుకుంది. నీటికుంటలో పడి ఇద్దరు చిన్నారులు మృతి చెందారు. పశువులను మేతకోసం తీసుకెళ్లిన సమయంలో ఘటన చోటుచేసుకుంది. గమనించిన స్థానికులు కుటుంబీకులకు సమాచారం అందించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ జరుపుతున్నారు.

*నిజామాబాద్: జిల్లాలోని ముప్కాల్ మండల కేంద్రం వద్ద జాతీయ రహదారి 44పై బుధవారం ఘోర రోడ్డు ప్రమాదం (Road accident) జరిగింది. టైర్ పేలడంతో ఓ కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. హైదరాబాద్ నుంచి నిర్మల్ వెళ్తుండగా ప్రమాదం జరిగింది. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాలను స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కాగా మృతుల వివరాలు తెలియాల్సి ఉంది.

*తహసీల్దార్‌ విజయారెడ్డిపై పెట్రోల్‌ పోసి ఓ వ్యక్తి ఆమెను సజీవ దహనం చేసిన ఘటన గుర్తుందా? అబ్దుల్లాపూర్‌మెట్‌ తహసీల్దార్‌ కార్యాలయంలో 34 నెలల క్రితం జరిగిన ఈ ఘటనలో గాయపడిన బొడిగె నారాయణ గౌడ్‌ అనే రైతు అనారోగ్యంతో మంగళవారం కన్నుమూశారు. గౌరెల్లి గ్రామానికి చెందిన కొర్ర సురేశ్‌ 2019 నవంబర్‌ 4న ఈ దాడి చేయగా.. విజయారెడ్డితోపాటు అటెండర్‌ చంద్రయ్య, డ్రైవర్‌ గురునాథం అక్కడికక్కడే మరణించారు. ఆస్పత్రి పాలైన సురేశ్‌ మూడు రోజుల తర్వాత చనిపోయాడు. సురేశ్‌ తహసీల్దార్‌పై దాడి చేసిన సమయంలో అక్కడే ఉన్న కవాడిపల్లికి చెందిన నారాయణ్‌గౌడ్‌ కాలిన గాయాలతో ఆస్పత్రి పాలయ్యారు. చికిత్స అనంతరం నెల రోజులకు డిశ్చార్జి అయ్యారు. ఆ తర్వాత కొద్దిరోజులు బాగానే ఉన్న నారాయణగౌడ్‌.. అనారోగ్యంతో 15 రోజుల క్రితం తిరిగి ఆస్పత్రిలో చేరారు. పరిస్థితి విషమించడంతో కుటుంబసభ్యులు ఆయన్ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకురాగా మంగళవారం ఉదయం మృతి చెందారు. కాగా, నారాయణ్‌గౌడ్‌ను ఆదుకుంటామని అధికారులు, నేతలు చెప్పారని, కానీ సీఎం సహాయ నిధి నుంచి అప్పట్లో రూ.2లక్షలు మాత్రమే అందాయని వారు తెలిపారు. ఆపై తమను ఎవ్వరూ పట్టించుకోలేదని, నారాయణగౌడ్‌ చికిత్స కోసం రూ.10 లక్షలకు పైగా ఖర్చు చేశామని ఆయన కుటుంబసభ్యులు వాపోయారు.

*పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ముప్పవరపు నందకిషోర్‌ అంత్యక్రియలు మంగళవారం మధ్యాహ్నం స్వగ్రామం పల్నాడు జిల్లా అమరావతి మండలం ఉంగుటూరులో జరిగాయి. తన పొలాన్ని వరద ముంపు నుంచి కాపాడుకునేందుకు నిర్మించుకున్న మట్టికట్టను రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా తొలగించడంతో మనస్తాపం చెంది ఆదివారం ఆయన ఆత్మహత్యకు పాల్పడిన విషయం విదితమే. నందకిషోర్‌ మృతదేహాన్ని గుంటూరు మార్చురీ నుంచి కుటుంబసభ్యులతో పంపించకుండా పోలీసు బందోబస్తుతో గ్రామానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో 14వ మైలు సెంటర్‌లో నందకిషోర్‌ భార్య, ఇద్దరు పిల్లలు, కుటుంబ సభ్యులు, గ్రామస్తులు, టీడీపీ, సీపీఎం నాయకులు వాహనాన్ని నిలుపుదల చేసి ఆందోళన నిర్వహించారు. సుమారు రెండున్నర గంటల పాటు ధర్నా సాగింది. సత్తెనపల్లి డీఎస్పీ విజయభాస్కరరెడ్డి ఘటనా స్థలానికి చేరుకుని జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడి బాధితులకు న్యాయం జరిగేలా చూస్తామని హామీ ఇచ్చారు.

*నిజామాబాద్‌ జిల్లా ముప్కాల్‌లో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం ఉదయం వేగంగా వెళ్తున్న కారు ముక్పాల్‌ వద్ద అదుపుతప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న నలుగురు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను దవాఖానకు తరలించారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా ప్రమాదం జరిగిందని చెప్పారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నారని, మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారని చెప్పారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు.

*తనను ప్రేమించడం లేదన్న కోపంతో ఓ యువకుడు యువతిని కత్తితో పొడిచాడు. ఈ ఘటన నల్లగొండ పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నల్లగొండ పట్టణానికి చెందిన యువతి స్థానిక నాగార్జున డిగ్రీ కళాశాలలో ఫైనల్‌ ఇయర్‌ చదువుతున్నది. అదే కళాశాలలో బీబీఏ రెండో సంవత్సరం చదువుతున్న రోహిత్‌ ఆమెను ప్రేమిస్తున్నానని కొంతకాలంగా వెంటబడుతున్నాడు.

*అనకాపల్లి జిల్లా పరవాడ మండల పరిధిలోని ఏపీఐఐసీ ఇండస్ట్రియల్‌ పార్కులో గల పైరోటెక్‌ పరిశ్రమలో సోమవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదం సంభవించింది. ఈ ఘటనలో బాయిలర్‌ వద్ద పనిచేస్తున్న హెల్పర్‌ తీవ్రంగా గాయపడ్డాడు. మరో ఇద్దరు కార్మికులు ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఈ ఘటనకు సంబంధించిన పోలీసులు, తోటి కార్మికులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. పైరోటెక్‌ పరిశ్రమలో వేస్ట్‌ ప్లాస్టిక్‌ను కరిగించి, తారులో వినియోగించే ఆయిల్‌ను తయారుచేస్తుంటారు. ఈ పరిశ్రమలో అసోం రాష్ట్రానికి చెందిన రహీముద్దీన్‌ బాయిలర్‌ ఆపరేటర్‌గా, నూల్‌ ఉల్‌ ఇస్లాం, హసన్‌మియా హెల్పర్లుగా పనిచేస్తున్నారు. వీరు ముగ్గురూ ఆదివారం రాత్రి విధులకు హాజరయ్యారు. సోమవారం తెల్లవారుజామున 3.45 గంటల ప్రాంతంలో బాయిలర్‌ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.

*అప్పుల బాధ తాళలేక నంద్యాల జిల్లాలో సోమవారం ఓ రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఆళ్లగడ్డ ఎంవీ నగర్‌కు చెందిన నరేష్‌ (31) తనకున్న మూడు ఎకరాల్లో మూడేళ్లుగా సీడు పత్తి సాగు చేస్తున్నాడు. దిగుబడులు రాక.. పెట్టుబడుల కోసం చేసిన రూ.10 లక్షల అప్పు తీర్చలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకున్నాడు. మృతుని భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పట్టణ ఎస్‌ఐ తిమ్మయ్య తెలిపారు.

*హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ నగ్న వీడియో కాల్‌ వ్యవహారంలో ఆయన పక్కన తన ఫొటో పెట్టి, దుష్ప్రచారం చేస్తున్నారంటూ అనితారెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు శ్రీసత్యసాయి జిల్లా గాండ్లపెంట ఎస్‌ఐ మల్లికార్జునరెడ్డి సోమవారం తెలిపారు. అనితారెడ్డి ఆదివారం ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. ఆ మేరకు అబ్దుల్‌ కరీమ్‌, వేణు, బొప్పూరి రమణ, చందు, నవీన్‌ కుమార్‌పై కేసు నమోదు చేశామన్నారు. నిందితుల్లో అబ్దుల్‌ కుమార్‌ మంగళగిరి వాసిగా పోలీసులు గుర్తించారు. మిగతా నలుగురు ఏ ప్రాంతం వారన్న దానిపై విచారణ చేస్తున్నారు.

*అసలే వర్షం.. బురద కొట్టుకుని లారీకి వెనుక రేడియం స్టిక్కర్లు, లైట్లు కనిపించకపోవడం.. దానికితోడు అతివేగం.. ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురి ప్రాణాలను బలితీసుకున్నాయి. ముందువెళ్తున్న సిమెంట్‌ లారీని.. వెనుకనుంచి వేగంగా దూసుకొచ్చిన కారు బలంగా ఢీకొట్టి లారీ కిందకు దూసుకెళ్లడంతో ఐదుగురు అక్కడికక్కడే మృతిచెందిన దుర్ఘటన ప్రకాశం జిల్లా కంభం రైల్వేగేటు సమీపంలో సోమవారం తెల్లవారుజామున జరిగింది. మృతులంతా పల్నాడు జిల్లా వాసులుగా గుర్తించారు. పోలీసుల కథనం ప్రకారం.. పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం శిరిగిరిపాడు గ్రామానికి చెందిన ఓ కుటుంబమంతా రెండు కార్లలో తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి బయల్దేరింది. అనంతపురం-అమరావతి జాతీయ రహదారిపై సోమవారం తెల్లవారుజామున 2 గంటల ప్రాంతంలో చిన్నగా వర్షం పడుతుండగా.. ప్రకాశం జిల్లా కంభం రైల్వేగేటు సమీపంలో వేగంగా దూసుకొచ్చిన ఓ కారు ముందు వెళ్తున్న సిమెంట్‌ లారీని బలంగా ఢీకొట్టింది.ఈ ప్రమాదంలో కారు లారీ కిందకు చొచ్చుకుపోవడంతో అందులో ఉన్న ఐదుగురు ఇరుక్కుపోయి మృతిచెందారు. ప్రమాదంలో కారు నడుపుతున్న జూలకంటి నాగిరెడ్డి (22), తాతయ్య, అమ్మమ్మలు చిలకల హనిమిరెడ్డి (70), ఆదిలక్ష్మీ (62), చిన్న అమ్మమ్మలు భూమిరెడ్డి గురవమ్మ (60), పల్లె అనంతరామమ్మ (55) మృతిచెందారు. నాగిరెడ్డి లండన్‌లో ఎంఎస్‌ చదువుతున్నారు. ప్రమాద విషయం తెలుసుకున్న కంభం పోలీసులు ఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాలను స్థానిక వైద్యశాలకు తరలించారు.

*నెల్లూరు: జిల్లాలోని మేకపాటి గౌతమ్‌రెడ్డి పెన్నా బ్యారేజీ పనుల్లో విషాదం చోటుచేసుకుంది. సంగంలోని బ్యారేజీ దగ్గర గేటు ఏర్పాటు చేస్తుండగా ప్రమాదం జరిగింది. 13 టన్నుల గేటు పడి బిహార్‌కు చెందిన కార్మికుడు జయలాల్ మృతి చెందాడు. బ్యారేజీ నిర్వాహకుల సమాచారంతో సంఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.

*పాలస్తీనా ఇస్లామిక్‌ జిహాద్‌ (పీఐజే) ఉగ్రవాదుల లక్ష్యంగా ఇజ్రాయెల్‌ చేసిన వైమానిక దాడుల్లో 51 మంది మరణించారని ఇజ్రాయెల్‌ డిఫెన్స్‌ ఫోర్సెస్‌ (ఐడీఎఫ్‌) సోమవారం వెల్లడించింది. 3 రోజులపాటు కొనసాగిన దాడుల్లో గాజాకు చెందిన మిలిటెంట్లు 24 మంది చనిపోయారని, మిగిలినవారు సాధారణ పౌరులని తెలిపింది. ఉగ్రవాదుల ప్రతిదాడుల్లో అధికంగా గురితప్పడంతో ఎక్కువమంది పాలస్తీనా పౌరులు చనిపోయారని ఐడీఎఫ్‌ అధికార ప్రతినిధి రాన్‌ కొవాచ్‌ పేర్కొన్నారు.

*ఎస్సై పరీక్ష సరిగా రాయలేదంటూ ఓ యువతి బలవన్మరణానికి పాల్పడింది. భిక్కనూర్ మండలం జంగంపల్లి గ్రామ చెరువులో దూకి పంచశీల(20) అనే యువతి ఆత్మహత్య చేసుకుంది. డిగ్రీ పూర్తి చేసిన పంచశీల హైదరాబాద్‌లో ఉంటూ మూడు రోజుల క్రితం నిర్వహించిన ఎస్సై ప్రాథమిక పరీక్ష రాసింది. అయితే పరీక్ష సరిగా రాయలేనని మనస్థాపంతో యువతి ప్రాణాలు తీసుకుంది. మృతురాలు మద్నూర్ మండలం కోరేగావ్ గ్రామం వాసురాలిగా గుర్తించారు. సమాచారం అందిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

*భర్తతో జరిగిన చిన్నపాటి ఘర్షణతో క్షణికావేశానికి లోనైన ఓ ఇల్లాలు చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆరాంఘర్‌ చౌరస్తాలోని లక్ష్మీనారాయణ విల్లాలో సోమవారం రాత్రి జరిగింది. ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన సిద్దు సింగ్‌, స్వప్నసింగ్‌ దంపతులు లక్ష్మీనారాయణ విల్లా్‌సలో నివాసముంటున్నారు. వీరికి ఇద్దరు సంతానం. వీరి వద్ద సిద్దు సింగ్‌ తల్లిదండ్రులతో పాటు సోదరి కూడా ఉంటుంది. మంగళవారం ఉద యం స్వప్న సింగ్‌ ఉత్తర్‌ప్రదేశ్‌లోని కాశీ వెళ్లాల్సి ఉంది. అందుకోసం సిద్దు సింగ్‌ రైలు టికెట్‌ కూడా బుక్‌ చేశాడు. భార్యను కాశీలో వదిలి తిరిగి హైదరాబాద్‌ రావాలనుకున్నాడు. ఈ విషయమై సోమవారం రాత్రి భార్యాభర్తల మధ్య చర్చ జరిగింది. తనను వదిలి వెంటనే హైదరాబాద్‌ ఎందుకొస్తావని స్వప్నసింగ్‌ భర్తను ప్రశ్నించగా తనకు పనులున్నాయని అతడు చెప్పాడు. డబ్బులు ఇవ్వమని స్వప్నసింగ్‌ అడగ్గా తిరిగి హైదరాబాద్‌ వస్తావు కదా…. డబ్బులెందుకని సిద్దు సింగ్‌ ప్రశ్నించాడు. ఇద్దరి మధ్య గొడవ జరిగింది. ఆ తర్వాత సిద్దుసింగ్‌ పనిమీద బయటకు వెళ్లాడు. ఇంట్లోని తన గదిలోకి వెళ్లిన స్వప్నసింగ్‌ గడియ పెట్టుకుని చున్నీతో ఫ్యాన్‌కు ఉరేసుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబసభ్యులు తలు పు పగులగొట్టి చూడగా స్వప్నసింగ్‌ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించింది. సిద్దుసింగ్‌ సమాచారంతో రాజేంద్రనగర్‌ ఎస్‌ఐ ఇంద్రసేనారె డ్డి సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించాడు. కేసు దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు.

*రాఖీల దుకాణంలో అర్ధరాత్రి దుండగులు చొరబడి పెద్దఎత్తున రాఖీలను ఎత్తుకెళ్లిన ఘటన సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం… సుల్తాన్‌బజార్‌ పీఎస్‌ పరిధిలోని బిగ్‌బజార్‌ పక్కన రామారావునగర్‌కు చెందిన శక్తిసంతోష్‌ అనే వ్యక్తి రాఖీల షాపు నిర్వహిస్తున్నాడు. రాఖీల పండగ సమీపంలో రెండు రోజుల క్రితం పెద్దఎత్తున రాఖీలు కొనుగోలు చేసి ఫుట్‌పాత్‌పై ఉన్న తన షాపులో ఉంచాడు. సోమవారం అర్ధరాత్రి రెండు గంటలకు షాపు వద్ద ఉన్న శక్తిసంతోష్‌ అనంతరం అక్కడి నుంచి సమీపంలోని తన ఇంటికి వెళ్లాడు. ఉదయం వచ్చేసరికి షాపులో ఉన్న దాదాపు లక్ష రూపాయల విలువ చేసే రాఖీలు కనిపించలేదు. వెంటనే సుల్తాన్‌బజార్‌ పీఎ్‌సలో పిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ ఫుటేజీల ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.

*రాయదుర్గం పీఎస్ పరిధిలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ట్రాన్స్ జెండర్ మృతి చెందారు. మిత్రుడితో కలిసి ద్విచక్ర వాహనంపై ట్రాన్స్ జెండర్ సుధాకర్ అలియాస్ మౌనిక(24) ఖాజాగుడా వైపు వెళ్తున్నారు. ESCI గేటు వద్ద బైక్ అదుపు తప్పడంతో మౌనిక కింద పడ్డారు. తీవ్ర గాయాలపాలైన మౌనికను వెంటనే స్థానిక ప్రైవేట్ హాస్పిటల్‌కు తరలించారు.

*భార్య బుగ్గ కొరికి గాయపర్చిన భర్తపై కృష్ణా జిల్లా పెనమలూరు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కానూరు కేసీపీ కాలనీకి చెందిన తాళ్లపూడి స్రవంతి, రాంబాబులు భార్యాభర్తలు. భర్త కాపలాదారుగా పని చేస్తుంటాడు. ఇతను మద్యానికి బానిసై భార్యను వేధింపులకు గురి చేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం మద్యం తాగి వచ్చి భార్యతో వివాదానికి దిగాడు. భార్య మందలించడంతో ఆగ్రహం చెందిన ఇతను ఆమెపై దాడి చేసి బుగ్గ కొరికేశాడు. చికిత్స పొందిన అనంతరం ఆమె సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేయగా.. భర్త రాంబాబుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

*నిజామాబాద్‌ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ముప్కాల్‌ మండలం కొత్తపల్లి జాతీయ రహదారిపై ఇండికా కారు టైర్‌పేలి గాల్లోకి ఎగిరి పల్టీలు కొట్టింది. ఈ ప్రమాదంలో ఘటనాస్థలిలోనే నలుగురు మృతి చెందారు. ప్రమాద సమయంలో కారులో ఏడుగురు ఉన్నట్లు తెలుస్తోంది. తీవ్రంగా గాయపడిని మరో ముగ్గురిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి నిర్మల్‌ వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది. మృతుల్లో ఇద్దరు చిన్నారులు ఉన్నారు. బాధితులంతా హైదరాబాద్‌లోని టోలీచౌక్‌ వాసులుగా గుర్తించారు.

*జమ్ముకశ్మీర్‌లో భారీ ఉగ్రకుట్రను భద్రతా దళాలు భగ్నం చేశాయి. స్వాతంత్య్ర దినోత్వ వేడుకలు సమీపిస్తున్న వేళ పుల్వామాలోని (Pulwama) తహబ్‌ క్రాసింగ్‌ వద్ద పెద్దమొత్తంలో పేలుడు పదార్ధాలను భద్రతా పట్టుకున్నాయి. తహబ్‌ క్రాసింగ్‌ సమీపంలో 25 నుంచి 30 కిలోల బరువున్న ఐఈడీ (మందుపాతర)ని జవాన్లు స్వాధీనం చేసుకున్నారు. వాటిని నిర్మానుష్య ప్రదేశంలో అధికారులు పేల్చివేశారు.