Politics

ప్రాంతీయ పార్టీలను అంత‌మొందించేందుకు కాషాయ పార్టీ కుట్ర‌ – TNI నేటి రాజకీయ వార్తలు

ప్రాంతీయ పార్టీలను అంత‌మొందించేందుకు కాషాయ పార్టీ కుట్ర‌  –  TNI  నేటి  రాజకీయ వార్తలు

* బీజేపీ హ‌యాంలో మ‌త విద్వేషాల‌ను వ్యాప్తి చేస్తున్నార‌ని, కాషాయ పాల‌కులు ప్రాంతీయ పార్టీల‌ను అంతం చేసేందుకు ప్ర‌య‌త్నిస్తున్నారని బిహార్ డిప్యూటీ సీఎం తేజ‌స్వి యాద‌వ్ నిప్పులు చెరిగారు. బిహార్ సీఎం నితీష్ కుమార్ బీజేపీతో తెగ‌దెంపులు చేసుకుని మ‌హాకూట‌మితో చేతులు క‌లిపిన అనంత‌రం ఆర్‌జేడీ నేత కాషాయ పార్టీ ల‌క్ష్యంగా విమ‌ర్శ‌లు గుప్పించారు.ప్ర‌స్తుతం దేశానికి ఏది అవస‌ర‌మో బిహార్ అదే చేసింది..దేశానికి తాము ఓ దారి చూపామ‌ని ఆయ‌న అన్నారు. నిరుద్యోగంపైనే త‌మ పోరాట‌మ‌ని, పేద‌లు, యువ‌త ఇబ్బందులు చూసి సీఎం చలించార‌ని, తాము నెల‌రోజుల్లో యువ‌త‌, పేద‌ల‌కు పెద్ద‌సంఖ్య‌లో ఉద్యోగాలు ఇస్తామ‌ని చెప్పారు. గ‌తంలో ఎన్న‌డూ జ‌ర‌గ‌ని త‌ర‌హాలో యువ‌త‌కు ఉపాధి అవ‌కాశాలు క‌ల్పిస్తామ‌ని తెలిపారు.మ‌హాకూట‌మి ప‌టిష్టంగా ఉంద‌ని, విప‌క్షంలో కేవ‌లం కాషాయ పార్టీ ఒక్క‌టే ఉన్న‌ద‌ని ఆర్‌జేడీ నేత పేర్కొన్నారు. ఇక బిహార్ సీఎంగా జేడీ(యూ) నేత నితీష్ కుమార్ బుధ‌వారం ఎనిమిదో సారి ప్ర‌మాణ స్వీకారం చేశారు. నితీష్ కుమార్ బీజేపీ నేతృత్వంలోని ఎన్‌డీఏను వీడి మ‌హాకూట‌మి ప్ర‌భుత్వ ఏర్పాటుకు ఆర్‌జేడీతో చేతులు క‌లిపిన సంగ‌తి తెలిసిందే. నితీష్ కుమార్‌తో పాటు ఆర్‌జేడీ నేత తేజ‌స్వి యాద‌వ్ ఉప‌ముఖ్య‌మంత్రిగా ప్ర‌మాణం చేశారు.

*ఎంపీ గోరంట్ల విషయంలో ఎస్పీ వ్యాఖ్యలు అసంబద్ధం: దేవినేని ఉమ
హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ఆ వీడియో మహిళలను అగౌరవ పర్చేలా ఉండడంతో ఎంపీపై చర్యలు తీసుకోవాలని టీడీపీ, వామపక్షాల నేతలు , మహిళా సంఘాల నాయకురాళ్లు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ప్రెస్‌మీట్‌లో చేసిన వ్యాఖ్యలపై పలువురు విమర్శలు గుప్పిస్తున్నారు. ఎవరూ ఫిర్యాదు చేయనందున గోరంట్ల సెల్ ఫోన్లో ఉన్న అసలు వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపడానికి వీలుపడదని ఎస్పీ చెప్పడంపై టీడీపీ నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ మాధవ్‌ వీడియోను ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా ఎస్పీ ఎలా మీడియా సమావేశం పెడతారని మాజీ మంత్రి దేవినేని ఉమ మహేశ్వర రావు ప్రశ్నిస్తున్నారు. వైసీపీ తన వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు పార్టీ కార్యకర్తలతో చంద్రబాబు ), లోకేశ్‌, టీడీపీ నేతలపై బూతులు తిట్టిస్తున్నారని ఆరోపించారు. తెర వెనక ఉండి వ్యవహారం నడిపిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

*విద్యార్థుల్లో దేశభక్తిని పెంపొందించేందుకే గాంధీ సినిమా ప్రదర్శన : మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి
స్వతంత్య్ర భారత వజ్రోత్సవాలలో భాగంగా నిర్మల్‌ పట్టణంలోని తిరుమ‌ల థియేట‌ర్‌లో ప్రదర్శించిన గాంధీ చలన చిత్రాన్ని విద్యార్థులతో క‌లిసి మంత్రి ఇంద్రకరణ్‌ రెడ్డి వీక్షించారు. విద్యార్థులు, ప్రజల్లో దేశభక్తి నింపేలా థియేటర్లలో గాంధీ సినిమాను ప్రదర్శిస్తున్నామ‌న్నారు.ఈ సినిమాను ప్రతి ఒక్క విద్యార్థి చూసి స్వాతంత్య్ర స్ఫూర్తిని పొందాలనేది సీఎం కేసీఆర్ అభిమతమని తెలిపారు. శాంతి, అహింసతో స్వతంత్య్రం సిద్ధించిందని, శాంతియుత పద్ధతుల్లో హక్కులను సాధించుకోగలమని నేటి పౌరులకు తెలియజెప్పే బాధ్యత మనందరిపై ఉందన్నారు

*కొద్దిరోజులుగా వైసీపీపై వ్యతిరేక ప్రచారం జరుగుతోంది: ధర్మాన
గత కొద్దిరోజులుగా వైసీపీ మీద వ్యతిరేక ప్రచారం చేస్తున్నారని రెవిన్యూ మంత్రి ధర్మాన ప్రసాద రావు అన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ… అనంతపురం జిల్లా ప్రజాప్రతినిధి అంశాన్ని మొత్తం వైస్సార్సీపీ కి అంటగడుతున్నారని మండిపడ్డారు. వైస్సార్సీపీ మహిళలకు కీడు చేస్తుందని ప్రచారం చేస్తోందని ఆరోపించారు. కుయోక్తులతో ఎదుటి పార్టీని పడగొట్టడం చంద్రబాబు నైజమన్నారు. సీఎం జగన్ తన కెబినెట్‌లో ఎన్నడూ లేనంతమంది మహిళలను తీసుకున్నారని తెలిపారు. చంద్రబాబు మహిళా రుణగ్రస్తులను మోసం చేస్తే.. సీఎం జగన్ వచ్చి వాళ్లకి రుణ విముక్తులను చేశారని అన్నారు. దిశా లాంటి చట్టాలను చేసి మహిళలకు రక్షణ కల్పిస్తుంటే అనవసరంగా రాద్ధాంతం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో చెప్పడానికి ఎలాంటి అంశాలు లేకపోవడం వలన ఇలాంటి అనవసర యాగీ చేస్తున్నారని వ్యాఖ్యానించారు. *పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణం: ఉమా
పోలవరం నాశనానికి జగన్‌రెడ్డే కారణమని మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు ఆరోపించారు. బుధవారం టీడీపీ జాతీయ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. కాంట్రాక్టు సంస్థ, జలవనరుల శాఖ సరైన ప్రణాళిక అమలు చేయకపోవడం వల్లే ప్రాజెక్ట్‌ నిర్మాణంలో ఇబ్బందులు తలెత్తుతున్నాయని పేర్కొన్నారు. కేంద్ర జలవనరుల శాఖ, జలసంఘం, ప్రాజెక్ట్‌ అథారిటీ మార్గదర్శకాలను రాష్ట్ర ప్రభుత్వం పాటించలేదని, కేంద్ర సంస్థలు హెచ్చరిస్తున్నా.. జగన్‌రెడ్డి పెడచెవిన పెడుతున్నారని విమర్శించారు. గోదావరి వరదల్లో దిగువ కాఫర్‌ డ్యాం మీదుగా వరద నీరు పోటెత్తి, ప్రధాన డ్యాం నిర్మాణ ప్రాంతాన్ని ముంచెత్తడానికి నిర్మాణ పనులు నెమ్మదిగా జరగడమే కారణమని ఉమా వివరించారు.

*రాష్ర్టాన్ని సర్వనాశనం చేసిన ఘనత జగన్‌దే’
నవ్యాంధ్రప్రదేశ్‌ పునర్నిర్మాణం తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని ఆపార్టీ రాష్ట్ర కార్యదర్శి సలగల రాజశేఖర్‌బాబు అన్నారు. బుధవారం మండలంలోని బోడవాడ గ్రామంలోని నిర్వహించిన బాదుడే బాదుడు కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిఽథిగా పాల్గొన్నారు. తొలుత స్థానిక పంచాయతీ కార్యాలయ ప్రాంగణంలో ఉన్న ఎన్టీఆర్‌ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈసందర్భంగా రాజశేఖర్‌బాబు మాట్లాడుతూ ప్రజల సొమ్మును దోచుకుని అధికారంలోకి వచ్చి ప్రజలను ఇబ్బందులు పెడుతున్న జగన్‌మోహన్‌రెడ్డిని రాష్ట్రం నుంచి తరిమికొట్టాల్సిన సమయం ఆసన్నమైందన్నారు. ఎన్నికల సమయంలో అమలు కానీ హామీలను గుప్పించి ప్రజలను నిలువునా మోసం చేశారని విమర్శించారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందన్నారు. జగన్‌ పరిపాలనలో అన్నదాతలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారన్నారు. నిరుపేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరం అవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో అభివృద్ధి పథంలో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ నేడు తిరోగమన స్థితికి చేరిందన్నారు. అనంతరం ఇంటింటికి తిరుగుతూ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజలకు వివరిస్తూ పన్నుల రూపంలో ప్రజలను బాదుతున్న తీరుపై కరపత్రాలను పంపిణీ చేశారు. ఈకార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు షేక్‌ షంషుద్దీన్‌, గ్రామ సర్పంచ్‌ కూనంనేని బాపూజీ, అప్పలనేని నరేంద్ర, గోరంట్ల రామకృష్ణ, కన్నెగంటి సాంబయ్య, తెలుగుయువత అధ్యక్షుడు షేక్‌ ఫారూక్‌, ప్రధాన కార్యదర్శి నాగరాజు, శివ, శ్రీరాం సుబ్బారావు, మామిడిపాక హరిప్రసాద్‌, చింపయ్య, దొరబాబు, రమేష్‌, జీవన్‌, షేక్‌ హస్సేన్‌, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.

*తప్పుచేసిన వారిని క్షమించే ప్రసక్తే లేదు: కారుమూరి
తప్పుచేసిన వారిని జగన్‌ ప్రభుత్వం క్షమించే ప్రసక్తే లేదని మంత్రి కారుమూరి నాగేశ్వరరావు అన్నారు. వేంకటేశ్వర స్వామి దర్శనార్థం గురువారం తిరుమలకు వచ్చిన ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘ఎంపీ గోరంట్ల మాధవ్‌ వీడియో వాస్తవమైతే మా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అందులో సందేహం లేదు. వైసీపీని ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశంతోనే మాధవ్‌పై ఆరోపణలు చేస్తున్నారు. ఆ వీడియోపై పూర్తిస్థాయిలో విచారణ జరుగుతుంది. గోరంట్ల మాధవ్‌పై గతంలో ఉన్న అత్యాచారయత్నం కేసు కోర్టులో ఉంది, నిజమే అయితే చట్టం తనపని తాను చేస్తుంది’’ అని మంత్రి అన్నారు.

*ఒరిజినల్‌ కాదని పోలీసులు తేల్చేశారు: మాధవ్‌
‘ఆ వీడియో అసలుదే అని నిర్ధారించలేం. అలాగని… నకిలీదని చెప్పలేం. సోర్స్‌ (ఒరిజినల్‌) వీడియో దొరికితేనే అందులో ఉన్నది మాధవో, కాదో చెప్పగలం’…ఎంపీ గోరంట్ల మాధవ్‌ ‘డర్టీ పిక్చర్‌’పై అనంతపురం ఎస్పీ చేసిన ప్రకటన సారాంశం ఇది! కానీ… ఎంపీ మాత్రం తనకు క్లీన్‌ చిట్‌ వచ్చేసినట్లుగా చెప్పుకొంటున్నారు. ‘అది ఒరిజినల్‌ కాదని పోలీసులు చెప్పారు’ అంటూ సొంత భాష్యం చెప్పుకొన్నారు. ఏమీ లేని వీడియోను పట్టుకుని తనపై దుష్ప్రచారం చేశారని వాపోయారు. బుధవారం సాయంత్రం అనంతపురం జిల్లా ఎస్పీ ప్రెస్‌మీట్‌ పూర్తికాగానే.. ఢిల్లీలో ఉన్న మాధవ్‌ మీడియా ముందుకు వచ్చారు. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబును రాయడానికి వీల్లేని భాషలో దూషించారు. ‘కమ్మ నా కొడుకులు’ అంటూ ఆ సామాజిక వర్గాన్ని తిట్టారు. తాను ఒకే వైఖరితో ఉన్నానని, 100 శాతం ఫేక్‌ వీడియో తయారు చేశారనే చెబుతున్నానని, కడిగిన ముత్యంలా బయటికి వస్తానన్న విశ్వాసం ఉందని తెలిపారు. తానేమీ టెన్షన్‌ పడలేదని, ఎక్కడా ఇబ్బందులకు గురికాలేదని, మామూలేగానే ఉన్నానని.. పార్లమెంటుకు కూడా వెళ్లానని చెప్పారు.

*మాధవ్‌ కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా?: అచ్చెన్న
వైసీపీ ఎంపీ మాధవ్‌ అసభ్య వీడియో విషయంలో ఏపీ పోలీసులు తలుచుకుంటే ఈ విషయాన్ని తేల్చడం సులభమేనని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. బుధవారం ట్విటర్‌లో ఆయన స్పందించారు. ‘‘నిజాన్ని తేల్చడం కష్టం అంటే కేసును సీబీఐకి ఇవ్వండి. ఆ దమ్ముందా? మీ వల్ల కాకపోతే కనీసం అదైనా చేయండి. తాడేపల్లి ప్యాలెస్‌ నుంచి వచ్చిన ఆదేశాల మేరకు అనంతపురం ఎస్పీ నిజాన్ని దాచే ప్రయత్నం చేశారు. ఎంపీ మాధవ్‌ను కాపాడే ప్రయత్నం చేస్తున్నారు’’ అని అచ్చెన్న ఆరోపించారు. కాగా, ఫోరెన్సిక్‌ ల్యాబ్‌కు పంపకుండా అది ఒరిజనల్‌ వీడియో కాదని ఎస్పీ ఎలా చెపుతారంటూ తెలుగు మహిళ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు గుంటుపల్లి శ్రీదేవి ప్రశ్నించారు. మాధవ్‌ను సస్పెండ్‌ చేస్తే ప్రజల్లోకి వైసీపీపై తప్పుడు సంకేతాలు వెళ్తాయనే సజ్జల ద్వారా ఎస్పీతో తప్పుడు ప్రకటన చేయించారని తెలుగు యువత రాష్ట్ర అధ్యక్షుడు శ్రీరామ్‌ చినబాబు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవినాయుడు విమర్శించారు. సత్యాన్ని ప్రభుత్వమే సమాధి చేస్తోందని టీడీపీ పొలిట్‌ బ్యూరో సభ్యుడు కాల్వ శ్రీనివాసులు మండిపడ్డారు

*15 లక్షల ఇళ్లపై జాతీయ జెండా రెపరెపలు: సోము వీర్రాజు
ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ్‌ లో భాగంగా రాష్ట్రంలో పదిహేను లక్షల మంది బీజేపీ నేతలు, కార్యకర్తల ఇళ్లపై జాతీయ జెండాలు ఎగురవేయడానికి ‘ఇంటింటికీ జెండా’ కార్యక్రమం చేపట్టిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు పేర్కొన్నారు. లాసన్స్‌ బే కాలనీలోని పార్టీ కార్యాలయం నుంచి బుధవారం ఉదయం ర్యాలీని ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ నెల 13 నుంచి 15వ తేదీ వరకు జాతీయ జెండాలను ఎగురవేస్తామన్నారు. ప్రజల్లో జాతీయ భావం పెంచడానికి ఈ కార్యక్రమం దోహదపడుతుందన్నారు. దేశంలో మొత్తం 20 కోట్ల ఇళ్లపై బీజేపీ నేతలు, కార్యకర్తలు జాతీయ జెండా ను ఎగురవేస్తారని సోము వీర్రాజు పిలుపునిచ్చారు.

**ముస్లిం యోధులను విస్మరించిన సర్కార్‌: షబ్బీర్‌
స్వతంత్య్ర వజ్రోత్సవాల్లో తెలంగాణ ప్రభుత్వం ఉద్దేశ్యపూర్వకంగా ముస్లిం మైనారిటీ వర్గం నేతలను విస్మరించిందని కాంగ్రెస్‌ నాయకుడు మహ్మద్‌ అలీ షబ్బీర్‌ విమర్శించారు. ఈ మేరకు సీఎం కేసీఆర్‌కి ఆయన బహిరంగ లేఖ రాశారు. ముస్లింలపై సీఎం కేసీఆర్‌కి ఉన్న వివక్ష, ద్వేషం దీంతో స్పష్టమైందన్నారు.

*ప్రతీ టీడీపీ కార్యకర్త ఇంటిపై.. జాతీయ పతాకం ఎగరేయాలి: బక్కని
భారత స్వాతంత్య్ర వజ్రోత్సవాల సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన విధంగా ప్రతి టీడీపీ కార్యకర్త ఇంటిపై జాతీయ పతాకం ఎగురవేయాలని తెలంగాణ టీడీపీ అధ్యక్షుడు బక్కని నర్సింహు లు పిలుపునిచ్చారు. ‘‘హర్‌ ఘర్‌ తిరంగా’’ కార్యక్రమం జయప్రదం చేయాలని పేర్కొన్నారు. టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబునాయుడు.. ఆగస్టు 13, 14,15 తేదీల్లో ప్రతి టీడీపీ కార్యకర్త, నాయకుల ఇళ్లపై జాతీయ జెండా ఎగరేయాలని స్పష్టం చేసినట్లు బక్కని పేర్కొన్నారు.

*అవినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలి: రాజాసింగ్అ
వినీతికి పాల్పడిన నేతలు ఈడీ దాడులకు సిద్ధంగా ఉండాలని బీజేపీ శాసనసభాపక్షనేత రాజాసింగ్ (Raja Singh) హెచ్చరించారు. బుధవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ టీఆర్ఎస్ (TRS)లో చాలా మంది ఏక్నాథ్ షిండేలు ఉన్నారని తెలిపారు. అవినీతికి పాల్పడ్డారు కాబట్టే ఈడీ కేసుల గురించి.. టీఆర్ఎస్ నేతలు పదే పదే మాట్లాడుతున్నారని అన్నారు. సీఎం కేసీఆర్ (CM KCR), మంత్రి కేటీఆర్ (KTR) పట్ల టీఆర్ఎస్ నేతలు అసంతృప్తితో ఉన్నారని తెలిపారు. మునుగోడు ఉపఎన్నికల్లో బీజేపీ సత్తా చూపిస్తామని ప్రకటించారు. ఈనెల 21న కేంద్రమంత్రి అమిత్ షా సభలో బీజేపీలోకి భారీగా చేరికలుంటాయని రాజాసింగ్ వెల్లడించారు.

*జెండా కోసం పేదల తిండి లాక్కుంటారా?: వరుణ్‌గాంధీ
జాతీయ జెండా కోసం పేదల తిండి లాక్కోవద్దని బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ కేంద్రాన్ని విమర్శించారు. రేషన్ షాప్ కోసం వెళ్లిన తమతో బలవంతంగా రూ.20 వసూలు చేసి జాతీయ జెండా కొనిపించారని పలువురు వ్యక్తులు ఆరోపించిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ అవుతోంది. దీనిపై పిలిభిత్ ఎంపీ వరుణ్ గాంధీ ఘాటుగా స్పందించారు. 75 సంవత్సరాల స్వాతంత్ర్య వేడుకలు పేదలకు భారంతా మారితే అంతకంటే దురదృష్టం ఉండదని ఆయన అన్నారు. ”జాతీయ జెండా కొంటేగానీ రేషన్ ఇవ్వమంటూ బలవంతం చేస్తున్నారు. జాతీయ పతాకం ప్రతి ఒక్కరి గుండెల్లో నిలిచిపోయి ఉంటుంది. పేదల తిండి గింజలు లాక్కొని త్రివర్ణ పతాకం ధరలు వసూలు చేస్తుండటం సిగ్గుచేటు” అని ఆయన వ్యాఖ్యానించారు.