DailyDose

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు – TNI నేటి తాజా వార్తలు

జగన్ ప్రభుత్వానికి సుప్రీంకోర్టు నోటీసులు – TNI  నేటి  తాజా వార్తలు

* జగన్ ప్రభుత్వాని కి సుప్రీం కోర్టు నోటీసులు జారీ చేసింది. మధ్యవర్తిత్వం కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ పిటిషన్ వేయగా… సీజేఐ ఎన్వీ రమణ ధర్మాసనం పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. అమరావతి మెట్రో పాలిటన్ రీజియన్ డెవలప్‌మెంట్ అథారిటీకి సుప్రీంకోర్టు ధర్మాసనం నోటీసులు జారీ చేసింది. టీడీపీ హయాంలో అమరావతి నిర్మాణం కోసం పోస్టర్ కంపెనీ డిజైన్లు సిద్ధం చేసింది. అయితే అధికారంలోకి రాగానే అమరావతి నిర్మాణాన్ని జగన్‌ పక్కన పెట్టారు. దీంతో తమకు రావాల్సిన నిధుల కోసం నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ నోటీసులు ఇవ్వగా… పోస్టర్ కంపెనీ నోటీసులను జగన్ సర్కార్ పట్టించుకోలేదు. దీంతో నార్మన్ అండ్ పోస్టర్ కంపెనీ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

*కర్నూలు: నగర శివారులోని జాతీయ రహదారిపై వైఎస్ విజయమ్మ వాహనం ఆగిపోయింది. రెండు టైర్లు ఒక్కసారిగా పంచర్‌కావడంతో ఆమె ప్రయాణిస్తున్న కారు రోడ్డుపై నిలిచిపోయింది. అనంతపురం వివాహ కార్యక్రమం ముగించుకుని హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో ఈ ఘటన జరిగింది. కారు రిపేర్ అయ్యే వరకు పోలీస్ బెటాలియన్ గెస్ట్ హౌస్‌ లో విజయమ్మ ఉన్నారు. అనంతరం వైఎస్ రాజశేఖర్ రెడ్డి చిన్న నాటి మిత్రుడు అయ్యపురెడ్డి ఇంటికి వెళ్లి పరామర్శించారు. అంతకుముందు కారు రిపేరు సమాచారం అందుకున్న కర్నూలు 4వ పట్టణ పోలీసులు దగ్గర ఉండి విజయమ్మ కారును పంపించారు.

*వరదల పై అంచనా వేసేందుకు వచ్చిన కేంద్రబృందం అధికారుల తీరు పై జిల్లా టీడీపీ నేతలు అసహనం వ్యక్తం చేశారు. వరద బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ రాజమండ్రి మంజీరా హోటల్‎లో ఉన్నకేంద్ర బృందానికి వినతి పత్రాన్ని ఇచ్చేందుకు టీడీపీ నేతలు చేసిన ప్రయత్నం వృదా అయింది. కనీసం వారిని దగ్గరికి రానివ్వలేదు.. వినతి పత్రాన్ని కూడా స్వీకరించలేదు. దీంతో టీడీపీ నేతలు అసంతృప్తి వ్యక్తం చేశారు. వరద బాధితులను కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు ఆదుకోవాలని మీడియా ద్వారా టీడీపీ నేతలు కోరారు.

*తెలంగాణ లో ఉప్పుడు బియ్యం సేకరణకు కేంద్రం ఆమోదం తెలిపింది. 2021-22 రబీ సీజన్‌లో పండించిన 8లక్షల మెట్రిక్ టన్నుల ఉప్పుడు బియ్యం సేకరణకు సిద్ధంగా ఉన్నట్లు రాష్ట్ర పౌరసరఫరాల శాఖ కమిషనర్‌‌కు కేంద్ర మంత్రిత్వ శాఖ లేఖ రాసింది. గతంలో ఇచ్చిన 6.05లక్షల మెట్రిక్ టన్నులకు అధనంగా బియ్యం సేకరించాలని నిర్ణయించినట్లు కేంద్రం లేఖలో పేర్కొంది. ఇందుకు అనుగుణంగా ఎఫ్‌సీఐ చర్యలు తీసుకుంటుందని వెల్లడింది. ఉప్పుడు బియ్యం విషయంలో కేంద్ర నిర్ణయంపై కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర తో పాటు కేంద్ర ఆహార, ప్రజాపంపిణీ మంత్రి పియూష్ గోయల్‌కు ధన్యవాదాలు తెలుపుతూ కిషన్‌రెడ్డి ప్రకటనను విడుదల చేశారు.
*తెలంగాణ సీఎం కేసీఆర్‌కు వ్యతిరేకంగా చేపట్టిన ప్రచారాన్ని నిలిపివేయాలని.. కేంద్ర ఎన్నికల సంఘం భాజపాను ఆదేశించింది. సాలు దొర‌.. సెలవు దొర.. ప్రచారంపై ఈసీ అభ్యంతరం వ్యక్తం చేసింది. ముఖ్యమంత్రి బొమ్మతోపాటు ఈ నినాదాన్ని కలిపి పోస్టర్లుగా ముద్రించడానికి అనుమతి నిరాకరించింది. సాలు దొర.. సెలవు దొర.. ప్రచారానికి అనుమతి కోరుతూ భారతీయ జనతా పార్టీ నేతలు ఎలక్షన్ కమిషన్ను సంప్రదించారు. ఈ దరఖాస్తును.. మీడియా సర్టిఫికేషన్ కమిటీ తిరస్కరించింది.

*ఆంధ్రా షుగర్స్ స్థాపించి 75 ఏళ్లు పూర్తైన సందర్భంగా.. పశ్చిమగోదావరి జిల్లా తణుకులోని సంస్థ ఆవరణలో వ్యవస్థాపక వేడుకలు ఘనంగా నిర్వహించారు. సంస్థలో 40 ఏళ్లకు పైగా పనిచేసిన విశ్రాంత కార్మికులను యాజమాన్యం ఘనంగా సత్కరించి.. నూతన వస్త్రాలు అందజేసింది.

*భద్రాచలం వద్ద గోదావరి ప్రవాహం నిలకడగా కొనసాగుతోంది. గోదావరి ప్రస్తుత నీటిమట్టం 51.50 అడుగులు ఉంది. గోదావరికి 13,43,344 క్యూసెక్కులు వచ్చి చేరుతోంది. భద్రాచలం వద్ద రెండో ప్రమాద హెచ్చరిక కొనసాగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. తెలంగాణ అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారులు కూడా నీట మునిగాయి.

*బారాషహీద్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం నిర్వహించారు. కడప పీఠాధిపతి ఖాజా సయ్యద్ షా ఆరిఫ్ఫల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు, పూజలు నిర్వహించారు. గతంతో పోలిస్తే అతి తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవంలో ఎమ్మెల్యేలు అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి ( పాల్గొన్నారు. రొట్టెల పండుగ కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ‘స్వర్ణాల తీరంలో బారాషహీద్‌ దర్గాలో అమరులైన షహీదులను నమ్మిన వారి కోరికలు తీర్చే దర్గాగా ప్రతి ఏటా గంథమహోత్సవం – రొట్టెల పండుగ ప్రసిద్ధికెక్కింది. దేశం నలుమూలల నుంచేగాక విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో 2015లో దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.

*ప్రముఖ రిటైల్‌ ఆభరణాల సంస్థ జోయాలుక్కాస్‌ 2022 సంవత్సరానికి గాను అత్యుత్తమ బ్రైడల్‌ డైమెండ్‌ జువెలరీ అవార్డును గెలుచుకుంది. దీంతోపాటు అత్యుత్తమ టీవీ క్యాంపెయిన్‌ అవార్డును దక్కించుకుంది. ఇటీవల జరిగిన 17వ రిటైల్‌ జువెలర్‌ ఇండియా అవార్డ్స్‌ 2022 (ఆర్‌జేఐఎ) కార్యక్రమంలో రిటైల్‌ జువెలర్‌ ఇండియా మ్యాగజైన్‌ ఎడిటర్‌ సోమా భట్టా చేతుల మీదుగా జోయాలుక్కాస్‌ మేనేజింగ్‌ డైరెక్టర్‌ అలుక్కాస్‌ వర్ఘీస్‌ జోయ్‌ ఈ అవార్డును అందుకున్నారు.

*బెజ్జూరు మండలంలోని సలుగుపల్లి గ్రామంలో బుధవారం మళ్లీ అతిసార విజృంభించ డంతో పదిమందికి వాంతులు,విరేచనాలు అయ్యాయి. మూడురోజులక్రితం అతిసార ప్రబలడంతో గ్రామంలో ఇప్పటికీ పలువురిని వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తూ వైద్యం అందించడంతో కొంత అదుపులోకి వచ్చింది. ప్రస్తుతం మళ్లీ గ్రామానికిచెందిన మడే అంసుబాయి, కొడితే సింధుజ, కుడుమేత లలిత, కొంగ శ్రీనివాస్‌, ఎనుక గంగారాం, మడే మల్లయ్య, సంజీవ్‌, తలండి రవళి, సడమేక నిహారిక, బండి సుజాతకు వాంతులు విచేరనాలు కావడంతో పీహెచ్‌సీలో వైద్యం అందిస్తు న్నారు.

* మునుగోడు ఉప ఎన్నికకు వామపక్షాల నేతలు సన్నద్ధమవుతున్నారు. నియోజకవర్గానికి చెందిన పార్టీ కీలక నేతలతో సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తమ్మినేని వీరభద్రం బుధవారం చౌటుప్పల్‌లో సమావేశమయ్యారు. పార్టీల బలాబలాలపై సమీక్ష నిర్వహించారు. సీపీఐ, సీపీఎం కలిసే ఉపఎన్నిక బరిలో దిగాలని సూత్రప్రాయంగా ఓ అభిప్రాయానికి వచ్చారు. 12న మళ్లీ సమావేశం నిర్వహించాలని నిర్ణయించారు. మునుగోడు నియోజకవర్గం ఏర్పడినప్పటి నుంచి 12సార్లు ఎన్నికలు జరగ్గా 6సార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులు, 5సార్లు సీపీఐ అభ్యర్థులు గెలిచారు. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి ఒకసారి విజయం సాధించారు. ఈ నేపథ్యంలో సీపీఐ నేతలు ఈ ఉపఎన్నికను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు.

* బ్రిటన్‌లో ఉన్నత విద్యను అభ్యసించేందుకు బ్రిటన్‌ ప్రభుత్వం అందించే చీవినింగ్‌ స్కాలర్‌షిప్‌, ఫెలోషి్‌పల కోసం దరఖాస్తు ప్రక్రియ మొదలైంది. అక్టోబర్‌ 12 వరకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులు స్వీకరిస్తామని హైదరాబాద్‌లోని బ్రిటిష్‌ డిప్యూటీ హైకమిషన్‌ కార్యాలయం బుధవారం ప్రకటించింది. బ్రిటన్‌లోని విశ్వవిద్యాలయాల్లో ఏడాది మాస్టర్‌ డిగ్రీతో పాటు 8 నుంచి 12 వారాల వ్యవధిలో పూర్తయ్యే వృత్తి విద్యా కోర్సులు చదివే వారికి ఈ స్కాలర్‌షిప్‌, ఫెలోషి్‌పలు ఇస్తారు. ఈ పథకానికి ఎంపికైన విద్యార్థుల ట్యూషన్‌ ఫీజు, ప్రయాణ, వసతి ఖర్చులను బ్రిటన్‌ ప్రభుత్వమే పూర్తిగా భరిస్తుంది. 1983 నుంచి బ్రిటన్‌ ప్రభుత్వం ఈ చీవినింగ్‌ ఫెలోషి్‌పలను అందజేస్తున్నది. కేంద్ర మంత్రి పీయూష్‌ గోయల్‌, తెలంగాణ పరిశ్రమల శాఖ ముఖ్యకార్యదర్శి జయేష్‌ రంజన్‌ సహా భారత్‌కు చెందిన 3500 మంది స్కాలర్లు ఇప్పటిదాకా ఈ పథకం ద్వారా లబ్ధి పొందారు. ఈ చీవినింగ్‌ పథకానికి సంబంధించిన దరఖాస్తు.
*ల్లగొండ జిల్లాలో యువతిపై ప్రేమికుడి దాడి ఘటనను రాష్ట్ర మహిళా కమిషన్‌ సుమోటోగా విచారణకు స్వీకరించింది. నివేదిక అందజేయాలని కలెక్టర్‌, ఎస్పీని ఆదేశించింది.

*డీజీపీ మహేందర్‌ రెడ్డికి ట్విటర్‌లో ఫాలోవర్ల సంఖ్య 5 లక్షలు దాటింది. పోలీసింగ్‌లో టెక్నాలజీకి అధిక ప్రాధాన్యం ఇస్తున్న డీజీపీ.. సామాజిక మాధ్యమాల్లో ప్రజలకు ఎల్లప్పుడు చేరువలో ఉంటున్నారు. సామాజిక మాధ్యమాల ద్వారా ప్రజల ఫిర్యాదులు, సలహాలు, సూచనల్ని స్వీకరిస్తున్నారు.

*రోజంతా పరిమిత శ్రేణిలో కదలాడిన ప్రామాణిక ఈక్విటీ సూచీలు బుధవారం మిశ్రమంగా ముగిశాయి. బీఎ్‌సఈ సెన్సెక్స్‌ 35.78 పాయింట్లు కోల్పోయి 58,817.29 వద్ద స్థిరపడగా..ఎన్‌ఎ్‌సఈ నిఫ్టీ 9.65 పాయింట్ల లాభంతో 17,534.75 వద్ద క్లోజైంది. ఇంధన, లోహ రంగ షేర్లు పుంజుకున్నప్పటికీ.. ఐటీ, రియల్టీ రంగ షేర్లలో ఇన్వెస్టర్లు లాభాల స్వీకరణకు పాల్పడటం ఇందుకు కారణమైంది. ఆసియా, యూరప్‌ మార్కెట్లలో ట్రెండ్‌ బలహీనంగా ఉండటంతో పాటు అమెరికాలో జూలై ద్రవ్యోల్బణ గణాంకాల విడుదల నేపథ్యంలో ఇన్వెస్టర్లు ముందుజాగ్రత్త ధోరణితో వ్యవహరించారని విశ్లేషకులు పేర్కొన్నారు. కాగా, డాలర్‌తో రూపాయి మారకం విలువ 38 పైసలు లాభపడి 79.25 వద్ద స్థిరపడింది.

*కరోనా మహమ్మారి నేపథ్యంలో దేశీయ విమానయాన చార్జీలపై విధించిన కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు ఆగస్టు 31వ తేదీ నుంచి తొలగిస్తున్నట్టు పౌర విమానయాన శాఖ ఒక ప్రకటనలో తెలిపింది. 27 నెలల విరామం అనంతరం తాజా పరిస్థితిని సమీక్షించి తాము ఈ నిర్ణయం తీసుకున్నట్టు పేర్కొంది. కరోనా మహమ్మారి విజృంభించిన నేపథ్యంలో విధించిన రెండు నెలల లాక్‌డౌన్‌ ముగిసిన అనంతరం విమాన సర్వీసులను 2020 మే 25న పునరుద్ధరించిన సమయంలో విమానయాన ధరలపై కనిష్ఠ, గరిష్ఠ పరిమితులు విధించారు. ఆ నిర్ణయం ప్రకారం 40 నిమిషాల కన్నా తక్కువ ప్రయాణ దూరం ఉండే ప్రాంతాలకు కనిష్ఠ ధర రూ.2,900, గరిష్ఠ ధర రూ.8,800 మించి వసూలు చేయరాదని ఆ శాఖ ప్రకటించింది. ఆర్థికంగా బలహీన వర్గాలను కాపాడేందుకు ధరలపై కనిష్ఠ పరిమితి, అధిక ధరల నుంచి కాపాడేందుకు గరిష్ఠ పరిమితి ఉపయోగపడ్డాయి.

*లండన్‌కు చెందిన క్వాలిటీ ఇంజనీరింగ్‌ కంపెనీ క్వాలిటెస్ట్‌.. హైదరాబాద్‌కు చెందిన జెన్‌క్యూ కంపెనీని సొంతం చేసుకుంది. జెన్‌క్యూ సాఫ్ట్‌వేర్‌ టెస్టింగ్‌ సేవలను అందిస్తోంది. కంపెనీలో 600 మందికి పైగా ఇంజనీర్లు ఉన్నారు. బ్యాంకింగ్‌, హెల్త్‌కేర్‌, రిటైల్‌ తదితర రంగాల్లోని కంపెనీలు జెన్‌క్యూకు ఖాతాదారులుగా ఉన్నాయి. భారత్‌లో భౌగోళికంగా విస్తరించడానికే కాక.. ఫిజిటల్‌, అనలిటిక్స్‌, బ్లాక్‌ చెయిన్‌, డెవప్స్‌ వంటి భవిష్యత్‌ తరం టెక్నాలజీల్లోని జెన్‌క్యూ సామర్థ్యాలు క్వాలిటెస్ట్‌ సామర్థ్యాలను పెంచుతాయని క్వాలిటెస్ట్‌ సీఈఓ అన్బు ముప్పిదతి తెలిపారు. కంపెనీ వృద్ధికి దోహదం చేస్తుందన్నారు. క్వాలిటె్‌స్టలో భాగం కావడం సంతోషంగా ఉందని జెన్‌క్యూ సీఈఓ మురళి బొల్లు తెలిపారు.

*హెయిల్‌ సెలూన్లకు ఉచిత విద్యుత్‌ అందించేందుకు ప్రభుత్వం రూ. 25 కోట్లు మంజూరు చేసింది. ఈ మేరకు బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. నాయిబ్రాహ్మణ కో-ఆపరేటీవ్‌ సొసైటీస్‌ ఫెడరేషన్‌ లిమిటెడ్‌కు ఈ నిధులు మంజూరు చేశారు.

*‘రైతు నేస్తం’ 18వ వార్షికోత్సవం సందర్భంగా సెప్టెంబరులో ఇచ్చే 2022 పురస్కారాల కోసం ఈ నెల 31లోగా దరఖాస్తులు పంపాలని రైతునేస్తం ఫౌండేషన్‌ చైర్మన్‌ యడ్లపల్లి వేంకటేశ్వరరావు కోరారు. వ్యవసాయ, అనుబంధ రంగాలతో పాటు అగ్రి ఇన్నోవేషన్‌లో విశేష సేవలందించిన అధికారులు, శాస్త్రవేత్తలు, అభ్యుదయ రైతులు, ప్రింట్‌, ఎలక్ర్టానిక్‌ మీడియా అగ్రి జర్నలిస్టులు ఇందుకు అర్హులని పేర్కొన్నారు. రైతునేస్తం వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్‌ చేసుకున్న దరఖాస్తును రైతునేస్తం చిరునామాకు పంపాలని ఆయన బుధవారం ఓ ప్రకటనలో కోరారు.

*విశాఖ రుషికొండపై పర్యాటకశాఖ చేపడుతున్న నిర్మాణాలు అనుమతులకు లోబడి జరుగుతున్నాయా?లేదా అనే వ్యవహారంపై ధర్మాసనం విచారణ జరుపుతున్న ఈ దశలో ఆ ప్రాంతంలో పర్యటించాల్సిన అవసరం ఏముందని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణను హైకోర్టు ప్రశ్నించింది. నిర్మాణాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించాలంటే ముందుగా కాంట్రాక్టర్‌ అనుమతి తీసుకోవాలని పిటిషనర్‌కు స్పష్టం చేసింది. దీనిపై వివరాలు సమర్పించాలని ప్రతివాదులుగా ఉన్న పర్యాటకశాఖ, హోంశాఖ ముఖ్యకార్యదర్శులు, విశాఖ పోలీస్‌ కమిషనర్‌, ఏపీ పర్యాటకాభివృద్ధి కార్పోరేషన్‌ సీఎండీకి నోటీసులు జారీ చేసింది.

*గీతం 42వ వ్యవస్థాపక దినోత్స వం సందర్భంగా సామాజిక కార్యకర్త, నోబుల్‌ శాంతి బహుమతి గ్రహీత కైలాస్‌ సత్యార్థికి వర్సిటీ ఫౌండేషన్‌ అవార్డు అందజేయనున్నట్టు వైస్‌చాన్సలర్‌ ప్రొఫెసర్‌ దయానంద సిద్ధపట్టం తెలిపారు. వర్సిటీలో ఈ నెల 13వ తేదీన జరిగే వ్యవస్థాపక దినోత్సవంలో ఆయనకు అవార్డుతోపాటు రూ.10 లక్షలను గీతం అధ్యక్షుడు ఎం.శ్రీభరత్‌ చేతులు మీదుగా అందజేయనున్నట్టు తెలిపారు.

* పశ్చిమ బెంగాల్‌ పరిసరాల్లో బుధవారం ఉపరితల ఆవర్తనం ఆవరించింది. ఇది బలపడి ఈ నెల 13కల్లా ఉత్తర బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడనుంది. ఆ తరువాత 24 గంటల్లో బలపడి పశ్చిమ వాయువ్యంగా పయనించనుంది. కాగా, కోస్తాలో రుతుపవనాలు చురుగ్గా కొనసాగుతున్నందున వర్షాలు కురుస్తున్నాయి. గురువారం కోస్తాలో పలుచోట్ల, రాయలసీమలో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నెల 13, 14 తేదీల్లో కోస్తాలో అక్కడక్కడా భారీవర్షాలు కురవనున్నాయని పేర్కొంది.

*ఇస్రో ప్రతిష్ఠాత్మకంగా చేపడుతున్న మానవ సహిత అంతరిక్ష ప్రాజెక్ట్‌ గగన్‌యాన్‌లో కీలక ముందడుగు పడింది. ఈ మిషన్‌ కోసం రూపొందిస్తున్న క్రూ ఎస్కేప్‌ సిస్టమ్‌ (సీఈఎ్‌స)కు సంబంధించిన లో ఆల్టిట్యూడ్‌ ఎస్కేప్‌ మోటార్‌ (ఎల్‌ఈఎం) పరీక్ష విజయవంతమైంది. శ్రీహరికోటలో బుధవారం ఈ పరీక్ష నిర్వహించినట్టు ఇస్రో వెల్లడించింది. క్రూ ఎస్కేప్‌ మిషన్‌.. ఏదైనా సంఘటన జరిగినప్పుడు గగన్‌యాన్‌ మిషన్‌లోని క్రూ మాడ్యూల్‌ను వేరు చేస్తుంది. దీంతో వ్యోమగాములు సురక్షితంగా బయటపడతారని బెంగళూరులోని ఇస్రో ప్రధాన కార్యాలయం తెలిపింది.

*గోదావరి వరద నెమ్మదిగా పెరుగుతోంది. బుధవారం ఉదయం 5 గంటలకు భద్రాచలం వద్ద 45.3 అడుగుల నీటి మట్టం నమోదైంది. సాయంత్రం 4 గంటలకు 50.5 అడుగులకు చేరుకున్నది. కాగా తెలంగాణ అధికారులు మాత్రం 55 అడుగుల వరకు గోదావరి నీటి మట్టం చేరుకునే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఇది ఇలా ఉండగా గోదావరి వరద కారణంగా ఇప్పటికే ఏలూరు జిల్లా కుక్కునూరు-దాచారం మధ్య రాకపోకలు నిలిచిపోగా పెరిగిన గోదావరితో సీతారామనగరం, ముత్యాలమ్మపాడు వెళ్లే రహదారి కూడా నీట మునిగాయి. అధికారులు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చేపల వేటకు వెళ్లవద్దని హెచ్చరిస్తున్నారు.

* తిరుమల శ్రీవారి ఆలయంలో మూడురోజుల పాటు జరిగిన పవిత్రోత్సవాలు బుధవారం రాత్రి పూర్ణాహుతితో ముగిశాయి.ఉదయం 7 నుంచి 9 గంటల వరకు యాగశాలలో రుత్వికులు హోమాలు నిర్వహించారు. తర్వాత శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఉత్సవమూర్తులకు స్నపన తిరుమంజనం జరిగింది. సాయంత్రం 4 నుంచి 6 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి ఆలయ నాలుగు మాడవీధుల్లో ఊరేగి భక్తులకు దర్శనమిచ్చారు. రాత్రి 7 గంటలకు యాగశాలలో పూర్ణాహుతి నిర్వహించారు. తర్వాత శ్రీవారి ఉత్సవమూర్తులు విమాన ప్రదక్షిణంగా వెళ్లి ఆలయ ప్రవేశం చేయడంతో పవిత్రోత్సవాలు ముగిశాయి. జీయర్‌స్వాములు, టీటీడీ ఈవో ధర్మారెడ్డి, డిప్యూటీ ఈవో రమేష్‌బాబు తదితరులు పాల్గొన్నారు.

*శ్రీశైలం జలాశయానికి బుధవారం వరద ప్రవాహం భారీగా నమోదయింది. దీంతో డ్యాం అధికారులు పది క్రస్టు గేట్లను పది అడుగుల మేర ఎత్తి 2,77,540 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. జలాశయం పూర్తిస్థాయి నీటిమట్టం 885 అడుగులు. ప్రస్తుతం 884.40 అడుగులు నీరు ఉంది. పూర్తి స్థాయి నీటి నిల్వ సామర్థ్యం 215.807 టీఎంసీలకుగాను ప్రస్తుతం 213.4011 టీఎంసీలుగా నమోదయింది. జూరాల నుంచి 221,143 క్యూసెక్కులు, సుంకేసుల నుంచి 1,56,766 క్యూసెక్కులు కలిపి జలాశయానికి మొత్తం 3,77,909 క్యూసెక్కుల వరద నీరు వస్తోంది. ఆంధ్రప్రదేశ్‌ విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ద్వారా విద్యుత్‌ ఉత్పత్తి చేస్తూ 30,091 క్యూసెక్కులు, తెలంగాణ ద్వారా 2,77,540 క్యూసెక్కులు మొత్తంగా 339,415 క్యూసెక్కుల నీటిని దిగువ నాగార్జున సాగర్‌ కు వదులుతున్నారు.

*కాంగ్రెస్‌ పార్టీలో కరోనా కలకలం రేపుతోంది. రాజ్యసభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున్‌ ఖర్గేకు మంగళవారం కరోనా సోకగా.. ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా గాంధీ వాద్రా తాజాగా కొవిడ్‌ బారి న పడ్డారు. లక్షణాలు కనిపించ డంతో పరీక్షలు చేయించుకోగా.. బుధవారం పాజిటివ్‌గా తేలిందని ప్రియాంక ట్విటర్లో వెల్లడించారు. కొవిడ్‌ నిబంధనలను అనుసరించి హోమ్‌ ఐసొలేషన్‌లోకి వెళ్లినట్టు పేర్కొన్నారు. ప్రియాంకకు కరోనా సోకడం ఇది రెండో సారి. గత ఏడాది జూన్‌లో ఆమె తొలిసారిగా కరోనా బారిన పడ్డారు. అలాగే, కాంగ్రెస్‌పార్టీ కమ్యూనికేషన్‌ విభాగం చీఫ్‌ పవన్‌ ఖేరా, పార్టీ ఎంపీ అభిషేక్‌ మను సింఘ్వీ కూడా తాజాగా వైరస్‌ బారిన పడ్డారు. కాగా.. కాంగ్రెస్‌ పార్టీ మాజీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీ.. బుధవారం జరగాల్సిన తన రాజస్థాన్‌ పర్యటనను రద్దు చేసుకున్నారు. సోదరి ప్రియాంక సహా పార్టీలో పలువురు నేతలకు కరోనా సోకడంతో.. ముందుజాగ్రత్త చర్యగా ఆయన ఈ నిర్ణయం తీసుకున్నారని పార్టీ వర్గాలు తెలిపాయి.

*మునుగోడులో టీఆర్‌ఎస్‌ జెండా ఎగరడం ఖాయమని విద్యుత్తుశాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి పేర్కొన్నారు. మునుగోడును అభివృద్ధి చేయడంలో రాజగోపాల్‌రెడ్డి పూర్తిగా విఫలమయ్యారని ఆరోపించారు. తన స్వార్థం కోసమే ఉప ఎన్నిక తెచ్చారని మండిపడ్డారు. బుధవారం మునుగోడు ప్రజాప్రతినిధులతో కలిసి ప్రగతిభవన్‌ ప్రాంగణంలో మీడియాతో మాట్లాడారు. ప్రజలు అభివృద్ధి, సంక్షేమం కావాలని కోరుకొంటుంటే రాజగోపాల్‌రెడ్డి మాత్రం కమీషన్లు, కాంట్రాక్టర్ల కోసం పదవిని బీజేపీకి తాకట్టుపెట్టారని ఫైర్‌ అయ్యారు. తన స్వార్థం కోసం నియోజకవర్గాన్ని విడిచిపెట్టిన రాజగోపాల్‌కు గుణపాఠం చెప్పేందుకు మునుగోడు ప్రజలు ఎదురుచూస్తున్నారని తెలిపారు

*దేశంలో హెచ్‌ఐవీ కేసులు క్రమేపీ తగ్గుముఖం పడుతుండగా కర్ణాటక పరిస్థితి ఒకింత ఆందోళన కలిగిస్తోందని ఆరోగ్యశాఖ అధికారులు వెల్లడించారు. దేశంలో 51వేల మంది చిన్నారులతో సహా 24.01 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులు ఉండగా మహారాష్ట్ర అగ్రస్థానంలోనూ, ఆంధ్రప్రదేశ్‌ ) ద్వితీయ స్థానంలోనూ ఉన్నాయి. కర్ణాటక 2.76 లక్షల మంది హెచ్‌ఐవీ బాధితులతో మూడోస్థానంలో ఉందని అధికారులు వెల్లడించారు. 2021లో ఈ ప్రత్యేక సమీక్ష జరిపినట్టు పార్లమెంటు లో ఇటీవల స్వయంగా కేంద్ర ఆరోగ్యశాఖ వివరణ ఇచ్చిన సంగతి విదితమే. రాష్ట్ర ఎయిడ్స్‌ ప్రివెన్షన్‌ సొసైటీ నాలుగేళ్లుగా ప్రతి ఏటా ఎయిడ్స్‌ పరీక్షలు నిరంతరంగా జరుపుతూనే వస్తోంది. ప్రస్తుత ఏడాది 4.32 లక్షలమందికి పరీక్షలు నిర్వహించగా వీరిలో 2,131 మందిలో ఎయిడ్స్‌ లక్షణాలు కనిపించినట్టు అధికారులు అంటున్నారు. రాష్ట్రంలో 2017-18లో 18,862 మందికి, 2018-19లో 18,171 మందికి ఎయిడ్స్‌ సోకింది. 2019-20లో 15,685 మందికి, 2020-21లో 9,520 మందికి, 2021-22లో 10,632 మందికి ఎయిడ్స్‌ సోకినట్టు ఆరోగ్యశాఖ గణాంకాల ద్వారా తెలుస్తోంది. ప్రత్యేకించి ఉత్తర కర్ణాటక ప్రాంతంలోని జిల్లాల్లో ఎయిడ్స్‌ కేసులు అధికంగా బయటపడుతుండడంతో అప్రమత్తంగా ఉండాల్సిందిగా జిల్లా ఆరోగ్యశాఖను ఆదేశించినట్టు అధికారులు పేర్కొన్నారు.

*రాష్ట్ర ప్రజలందిరికీ టీడీపీ జాతీయ ప్రధానకార్యదర్శి లోకష్ రాఖీ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ‘‘సొంత అక్కాచెల్లెళ్లు లేని నాకు ఆడ‌ప‌డుచులంతా సొంత సోద‌రీమ‌ణులే అని అన్నారు. మీ అంద‌రికీ అన్న‌లా అండ‌గా..త‌మ్ముడిలా తోడుగా ఉంటాను. మీరు చూపించే అనురాగ‌మే నాకు ర‌క్ష‌. రాఖీ పండ‌గ ముందు రోజే మంగ‌ళ‌గిరిలో నా సోద‌రీమ‌ణులు త‌మ కాళ్ల‌పై తాము నిల‌బ‌డేందుకు స్త్రీశ‌క్తి పేరుతో శిక్ష‌ణ ఇప్పించి, కుట్టుమిష‌న్లు ఉచితంగా అంద‌జేయ‌డం చాలా సంతోషంగా ఉంది’’ అని లోకేష్ అన్నారు.

*తిరుపతి: నగరంలోని విద్యానికేతన్లో సాయినాథుని విగ్రహ ప్రతిష్టాపన కార్యక్రమం ఘనంగా జరిగింది. దక్షిణ భారతదేశంలోనే అతిపెద్ద సాయిబాబా ఆలయాన్ని నటుడు, పద్మశ్రీ మోహన్ బాబు నిర్మించారు. విగ్రహ ప్రతిష్టాపన సందర్భంగా రెండ్రోజులపాటు ఆలయంలో యాగం నిర్వహణ జరుగనుంది. సాయినాథుని విగ్రహ ప్రతిష్టకు పలువురు ప్రముఖులు హాజరయ్యారు.

*గోదావరి వరద క్రమంగా పెరుగుతోంది. దాంతో బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లా లోని లంక గ్రామాలకు వరద నీరు ప్రవేశిస్తోంది. పి.గన్నవరం నియోజకవర్గంలో వరద ఉధృతి పెరుగుతోంది. దీంతో గౌతమి, వశిష్ట, వైనతేయ నదులు పోటెత్తుతున్నాయి. అయినవిల్లి, పి.గన్నవరం, మామిడికుదురు మండలాల్లో లంకప్రాంతాల్లో గోదావరి వరద ప్రభావం అధికంగా ఉంది. కనకాయిలంక కాజ్ వేపై వరద నీటి ఉధృతితో బోట్లపై ప్రజలు రాకపోకలు సాగిస్తున్నారు. అయినవిల్లి లంక కాజ్ వే పైకి వరద నీరు చేరింది. దీంతో నాలుగు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిపోయాయి. అయినవిల్లి లంక‌ కాజ్ వే దగ్గర బోట్లు ఏర్పాటు చేయలేదని గ్రామస్థుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వరద తీవ్రత పెరుగుతుండడంతో కోటిపల్లి-ముక్తే శ్వరం రేవులో పంటు ప్రయాణాలు నిలిపివేశారు. దీంతో ఆయా లంక గ్రామాలకు రవాణా సౌకర్యాలు నిలిచిపోయాయి. అల్లవరం మండలం బోడసకుర్రు పల్లిపాలెంలోకి వరద నీరు చేరుతోంది. గురువారం ఉదయానికి వరద ప్రవాహం మరింత పెరిగింది. ధవళేశ్వరం వద్ద నెల రోజుల వ్యవధిలో రెండోసారి మొదటి ప్రమాద హెచ్చరిక జారీ చేశారు. ఎగువ నుంచి వచ్చి చేరుతున్న ప్రవాహంతో ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది.

*బారాషహీద్ దర్గాలో ఘనంగా గంధమహోత్సవం నిర్వహించారు. కడప పీఠాధిపతి ఖాజా సయ్యద్ షా ఆరిఫ్ఫల్లా దర్గాలో ప్రత్యేక ప్రార్ధనలు, పూజలు నిర్వహించారు. గతంతో పోలిస్తే అతి తక్కువ సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. ఉత్సవంలో ఎమ్మెల్యేలు అనిల్కుమార్, కోటంరెడ్డి శ్రీధర్రెడ్డి పాల్గొన్నారు. రొట్టెల పండుగ కు నాలుగు శతాబ్దాలకుపైగా చరిత్ర ఉంది. ‘స్వర్ణాల తీరంలో బారాషహీద్‌ దర్గాలో అమరులైన షహీదులను నమ్మిన వారి కోరికలు తీర్చే దర్గాగా ప్రతి ఏటా గంథమహోత్సవం – రొట్టెల పండుగ ప్రసిద్ధికెక్కింది. దేశం నలుమూలల నుంచేగాక విదేశాల నుంచి సైతం భక్తులు తరలివచ్చి మొక్కులు తీర్చుకోవడంతో 2015లో దీనిని రాష్ట్ర పండుగగా ప్రభుత్వం ప్రకటించింది.
*భారత జాతీయ ఉద్యమమే తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ప్రేరణగా నిలిచిందని, ఆ ఉద్యమ స్ఫూర్తితోనే ప్రస్తుత సీఎం కేసీఆర్ ఆనాడు ఉద్యమ రథసారథిగా తెలంగాణను సాధించారని పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.మహబూబాబాద్ జిల్లా తొర్రూరు పట్టణంలో మంత్రి ఫ్రీడం రన్‌లో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. తొర్రూర్ లోని అంబేద్కర్ చౌరస్తా వద్ద అంబేద్కర్ విగ్రహానికి పూలమాలవేసి పుష్పాంజలి ఘటించారు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్డు లో ఏర్పాటు చేసిన భారీ జాతీయ పతాకం తరహాలో తొర్రూరు జెడ్పీ పాఠశాలలో ఏర్పాటు చేయనున్న భారీ జాతీయ పతాక కార్యక్రమానికి మంత్రి శంకుస్థాపన చేశారు.

*స్వాతంత్య్రం అంటే ఒక్క రోజు చేసుకునే వేడుక కాదని మంత్రి నిరంజన్ రెడ్డి అన్నారు. భారత స్వాతంత్య్ర సంగ్రామంలో ఎలాంటి పాత్రలేని వారు, బ్రిటిష్ పాలకులకు తొత్తులుగా వ్యవహరించిన వారు నేడు ఈ దేశానికి ప్రభువులుగా ఉన్నారని విమర్శించారు. స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా వనపర్తిలో నిర్వహించిన ఫ్రీడమ్‌ రన్‌లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. స్వాతంత్య్రం కోసం నేతాజీ సుభాష్ చంద్రబోస్ ఆజాద్ హింద్ ఫౌజ్‌ను ఏర్పాటు చేశారు, భగత్ సింగ్ ఉరికంబానికి సిద్ధమయ్యారు.. ఇలా దేశంలో ఒక్కోచోట ఒక్కోవిధంగా ప్రజలను స్వాతంత్య్ర సంగ్రామం వైపు కదిలించారని చెప్పారు. ఎవరు ఏ దారిని ఎంచుకున్నప్పటికీ అందరి లక్ష్యం భారతమాత సంకెళ్లను తెంచడంకోసమేనని వెల్లడించారు. ఆ రోజు మన పెద్దలు స్వాతంత్య్రం కోసం పోరాడకపోయి ఉంటే మన పరిస్థితి ఏంటో అర్ధం చేసుకోవాలన్నారు.