Fashion

రామప్ప చీరలు!

రామప్ప చీరలు!

మగ్గమే ప్రయోగశాలగా, పట్టుపోగులే గాజు నాళికలుగా కమలాపూర్‌ చేనేత సంఘం చేపట్టిన ప్రయోగం.. మంచి ఫలితాన్ని ఇచ్చింది. రామప్ప గుడిలోని రమణీయ శిల్పాలు పట్టుచీరలపై ప్రత్యక్షం అవుతున్నాయి. మగువల అలంకరణలో స్థానం సంపాదిస్తున్నాయి.

చేనేత.. పాతకొత్తల కలబోత. హనుమకొండ జిల్లా కమలాపూర్‌ చేనేత కార్మికులైతే సాక్షాత్తు చేనేత శాస్త్రవేత్తలే. జనం అభిరుచులకు అనుగుణంగా వస్ర్తాలను రూపొందిస్తున్నారు. ఇప్పటికే హిమ్రూ చీరలు, చేనేత జీన్స్‌తో ప్రపంచ ప్రసిద్ధి పొందారు. ఇప్పుడు రామప్ప పట్టు చీరలతో మరోసారి ప్రతిభను చాటారు. కాకతీయ సాంస్కృతిక వైభవానికి గుర్తుగా నిలిచిన రామప్ప గుడికి యునెస్కో గుర్తింపు దక్కింది. ఈ నేపథ్యంలో కమలాపూర్‌ చేనేత కార్మికులు సరికొత్త ఆలోచన చేశారు. రామప్ప శిల్పాల డిజైన్లతో చేనేత చీరలకు ప్రాణం పోయాలని భావించారు. ఆ ప్రతిపాదన తెలంగాణ చేనేత శాఖకు నచ్చింది. స్థానిక నేత కార్మికులకు ప్రత్యేక మగ్గాలపై శిక్షణ ఇచ్చింది. సరికొత్త నైపుణ్యానికి తరాల సృజనను జోడించి.. మగ్గాలపై రామప్ప చీరలను నేస్తున్నారు కమలాపూర్‌ నేతన్నలు. ఇప్పటికే ఐదు చీరలు పూర్తి చేశారు.మరో రెండు చివరిదశలో ఉన్నాయి. ఒక్కో చీరకు ఆకృతి ఇచ్చేందుకు వారంరోజులు పడుతున్నది. నాణ్యతను బట్టి రూ.14 వేల నుంచి రూ.15 వేల వరకూ ధర పలుకుతాయి. తమకూ కావాలంటూ ఇప్పటికే చాలామంది ముందస్తు ఆర్డర్లు ఇస్తున్నారు.

ఇప్పటిది కాదు..
కమలాపూర్‌ చేనేత సహకార సంఘం డబ్భు రెండేండ్ల క్రితం ఏర్పాటైంది. దాదాపు ఐదొందల మంది సభ్యులు ఉన్నారు. చద్దర్లు, తువ్వాళ్లు, లుంగీలు, దస్తీలు, నవార్లు, జంపఖానాలు, దోమతెరలు, పెటీకోట్‌ వస్ర్తాలను నేసేవారు. కాకపోతే మార్కెట్‌లో చేనేతకు డిమాండ్‌ పెరుగుతున్నా.. ఆధునికతకు దూరంగా ఉండటంతో ఆర్థికంగా వెనుకబడిపోయారు. తాజాగా, తెలంగాణ చేనేత శాఖ చొరవతో కొత్త మోడళ్ల తయారీపై దృష్టి పెట్టారు. హిమ్రూ చీరలు, చేనేత జీన్స్‌ తయారు చేశారు. రామప్ప ఆలయం యునెస్కో గుర్తింపు పొందిన నేపథ్యంలో మార్కెట్‌లో డిమాండ్‌ ఉంటుందంటూ టెస్కో చేసిన సూచన మేరకు.. ఇటువైపుగా అడుగులు వేశారు. హిమ్రూ చీరల తయారీలో నైపుణ్యం కనబరిచిన నేత కార్మికులు మామిడి సమ్మయ్య, సబ్బని సునీతలకు రామప్ప పట్టు చీరల తయారీ బాధ్యత అప్పగించారు. అలనాటి శిల్పులకు ప్రతినిధులుగా ఈ ఇద్దరూ.. పట్టువస్ర్తాలపై రామప్ప వైభవానికి ప్రాణం పోస్తున్నారు. కదిలే శిల్పాలను తీర్చిదిద్దుతున్నారు.