DailyDose

TNI – నేటి తాజా వార్తలు

TNI  – నేటి తాజా వార్తలు

*ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని డ్వాక్రా ఉత్పత్తులను అమెజాన్ ద్వారా అమ్మేందుకు నిర్ణయించారు. రాష్ట్రవ్యాప్తంగా పొదుపు సంఘాల మహిళలు తయారు చేసే ఉత్పత్తులు త్వరలో అమెజాన్‌ ద్వారా డిజిటల్‌ మార్కెట్లోకి రానున్నాయి. వారం క్రితం విజయవాడ వచ్చిన అమెజాన్‌ ప్రతినిధులతో సెర్ప్‌ అధికారులు సమావేశమై చర్చించారు. డ్వాక్రా మహిళలు తయారు చేసే ఉత్పత్తులకు ప్రత్యేక బ్రాండింగ్‌ ద్వారా అమెజాన్‌లో విక్రయించేందుకు ఆ సంస్థ ప్రతినిధులు అంగీకరించారు. అమెజాన్‌లో అందుబాటులో ఉంచిన ఉత్పత్తులను వినియోగదారుడు కొనుగోలు చేస్తే.. వారికి నిర్ణీత గడువులోగా అందించాల్సి ఉంటుంది.
*దేశానికి స్వాతంత్య్రం సిద్ధించి 75 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో తెలంగాణ ప్రభుత్వం స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్నది. ఈ నెల 8న వేడుకలు ప్రారంభం కాగా.. 22 వరకు కొనసాగనున్నాయి. వజ్రోత్సవాల్లో రోజుకో కార్యక్రమాన్ని నిర్వహిస్తుండగా.. ఈ నెల 16న సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం జరుగనున్నది. ఇందులో భాగంగా మంగళవారం ఉదయం 11.30గంటలకు రాష్ట్రవ్యాప్తంగా సామూహిక జాతీయ గీతాలాపన కార్యక్రమం నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు.
*చేతకాని టీఆర్ఎస్ నాయకులు బండి సంజయ్‌పై దాడి చేశారని ఎమ్మెల్యే రాజాసింగ్ మండిపడ్డారు. ఫాల్తూ మినిస్టర్ ఎర్రబెల్లి దయాకరరావు దేనికీ పనికిరాడని విమర్శించారు. బండి సంజయ్‌పై దాడులతో కుట్ర చేస్తే ఆయన అగుతారా? అని ప్రశ్నించారు. పోలీసులకు తెలిసే దాడి జరిగిందని ఎమ్మెల్యే రాజాసింగ్ ఆరోపించారు. తమ ప్రభుత్వం వచ్చాక ఏం జరుగుతుందో పోలీసులు ఆలోచించుకోవాలని డిమాండ్ చేశారు. బీజేపీ ఇదే పని చేస్తే మీ ఎమ్మెల్యేలు తిరగగలరా? అని ఆయన ప్రశ్నించారు.
*స్వతంత్ర భారత వజ్రోత్సవాల్లో భాగంగా తెలంగాణ ప్రభుత్వం 16వ తేదీ (మంగళవారం) ఉదయం 11.30కి సామూహిక జాతీయ గీతాలాపన ) కార్యక్రమం నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా ఒకేసారి జాతీయ గీతాన్నిఆలపిస్తారు. రాష్ట్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయాలు, స్థానిక మున్సిపల్ వార్డులు, ముఖ్యమైన ప్రధాన జంక్షన్లు, ట్రాఫిక్ జంక్షన్లు, పాఠశాలలు, కళాశాలలు, అంగన్‌వాడీ కేంద్రాలు, జైళ్లు, కార్యాలయాలు, మార్కెట్ స్థలాల్లో మైకుల ద్వారా ఈ జాతీయ గీతాలాపన ఉంటుంది. గీతాలాపన సమయంలో ట్రాఫిక్ ను 5 నిమిషాల పాటు నిలిపివేయనున్నారు. సామూహిక గీతాలాపనలో సీఎం కేసీఆర్ పాల్లొంటున్నారు. అబిడ్స్ నెహ్రూ విగ్రహం దగ్గర ఆయన పాల్గొనే అవకాశం ఉంది.
* ఎస్ఎల్వీ – డి1 సెన్సార్ సమస్య కారణంగానే నిర్దిష్ట కక్ష్యలోకి ఉపగ్రహాలని చేరవేయలేక పోయిందని షార్ డైరెక్టర్ రాజరాజన్ అన్నారు. సెప్టెంబర్, అక్టోబర్ మాసాల్లో జీఎస్ఎల్వీ – మార్క్3 ద్వారా గగన్ యాన్ ప్రయోగాత్మక ప్రయోగం చేపట్టబోతున్నామని తెలిపారు. గగన్ యాన్ మానవ రహిత ప్రయోగాలు జరిపాకనే పూర్తి ప్రయోగం ఉంటుందన్నారు. గగన్ యాన్ ప్రయోగానికి ఇంకా నాలుగు ప్రధాన గ్రౌండ్ టెస్ట్‌లు చేయాల్సి ఉందన్నారు. అలాగే వ్యోమగాములని సురక్షితంగా తీసుకు రావాలని ఇస్రో ప్రయత్నిస్తుందన్నారు. 2023 ఫిబ్రవరి- జూలై మధ్యలో జీఎస్ఎల్వీ మార్క్- 3 ద్వారా చంద్రయాన్ ప్రయోగం ఉంటుందన్నారు. నాలుగు నెలల్లో 4 ప్రయోగాలు లక్ష్యంగా ఇస్రో పనిచేస్తుందన్నారు. 75 ఏళ్ల దేశ చరిత్రలో 81 రాకెట్లు, మరో మూడు ప్రయోగాత్మక ప్రయోగాలు ఇస్రో నిర్వహించిందని ఆయన తెలిపారు.
*జగన్ సర్కారు (AP Govt.) కీలక నిర్ణయం తీసుకుంది. 75వ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్రంలోని వివిధ జైళ్లలో జీవిత ఖైదు అనుభవిస్తున్న ఖైదీలకు క్షమాభిక్ష పెట్టాలని నిర్ణయించింది. దీంతో సత్ప్రవర్తనతో మెలిగిన ఖైదీల వివరాలను జైళ్ల శాఖ అధికారులు ప్రభుత్వానికి పంపారు. జాబితాను ఆమోదించిన ప్రభుత్వం వారిని విడుదల చేయాల్సిందిగా ఉత్తర్వులు జారీ చేసింది. అందులో భాగంగా రాజమండ్రి కేంద్ర కారాగారంలో ఖైదీలకు విముక్తి లభించింది. జీవితఖైదు అనుభవిస్తున్న48 మందితోపాటు, ఇతర శిక్షలు అనుభవిస్తున్న ఏడుగురు, మహిళా ఖైదీలు 11 మందిని మరికొద్ది సేపట్లో జైలు అధికారులు విడుదల చేయనున్నారు.
*వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దంటూనే అమాత్యుల సేవలో టీటీడీ తరిస్తోంది. సాధార‌ణ రోజుల్లో కూడా శ్రీవారిని ద‌ర్శ‌నం కోసం భ‌క్తులు పెద్ద సంఖ్య‌లో వ‌స్తూ ఉంటారు. ఇక నాలుగైదు రోజులు వరుసగా సెల‌వులు వ‌స్తే భ‌క్తుల ర‌ద్దీ గురించి ప్ర‌త్యేకంగా చెప్పాల్సిన ప‌నిలేదు. శ్రీ‌వారి ద‌ర్శ‌నానికి రెండు రోజులు ప‌డుతోంది. రద్దీ వల్ల భక్తులు రావ‌ద్ద‌ని ప‌రోక్షంగా టీటీడీ అధికారులు సూచిస్తూ ఉంటారు. ఈ నిబంధనలు సాదారణ భక్తులకు మాత్రమేనని టీటీడీ మరోసారి నిరూపించారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఈ నెల 21 వరకు విఐపీ బ్రేక్ దర్శనాలను టీటీడీ రద్దు చేసింది. అయినా మంత్రి ఉషశ్రీ చరణ్ ఒత్తిడికి తలొగ్గి 50 బ్రేక్ దర్శనం టికెట్లతో పాటు.. 10 సుప్రభాతం టిక్కెట్లను టీటీడీ జారీ చేసింది. 50 మంది అనుచరులతో ఉషశ్రీచరణ్ శ్రీవారిని దర్శించుకున్నారు. శ్రీవారి భక్తుల కష్టాలను మంత్రి పట్టించుకోలేదు. భక్తులు రోజుల తరబడి క్యూలైన్‌లో వేచి ఉన్నా ఖాతరుచేయలేదు. టీటీడీ అధికారుల తీరుపై భక్తులు మండిపడుతున్నారు.
*మైలవరంలో 75వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల ను ఘనంగా నిర్వహించారు. వివిధ స్వచ్చంద సంస్థలు, విద్యాసంస్థలు ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేపట్టారు. ఎమ్మెల్యే వసంత వెంకట కృష్ణ ప్రసాద్ జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. 100 అడుగుల జాతీయ జెండాను విద్యార్థులు ప్రదర్శించారు. స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న పలువురు మహానుభావుల వేషాధారణలో విద్యార్థులు అందగా ముస్తాబయ్యారు. మూడు వేల మంది విద్యార్థులు ర్యాలీలో పాల్గొన్నారు.
*రాష్ట్రంలో స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. అనంతరం ప్రత్యేకంగా అలంకరించిన వాహనంలో పరేడ్ ప్రదర్శనను సీఎం జగన్ తిలకించారు. వాహనంలో సీఎంతో పాటు సీఎస్ సమీర్ శర్మ, డీజీపీ రాజేంద్ర నాథ్ రెడ్డి ఉన్నారు. స్వాతంత్ర దినోత్సవం వేడుకల్లో 12 కంటిజెంట్స్ పరేడ్ నిర్వహించారు. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో 10 బ్యాండ్స్ ప్రదర్శన చేయనున్నారు. మరోవైపు ప్రదర్శన కోసం వివిధ శాఖల శకటాలను అధికారులు సిద్ధం చేశారు. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా సోమవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో గవర్నర్ బిశ్విభూషన్ హరిచందన్ తేనేటు విందు ఇవ్వనున్నారు. ఈ ఎట్ హోమ్‌ కార్యక్రమానికి ముఖ్యమంత్రి జగన్ హాజరుకానున్నారు.
*తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. నేడు కంపార్టుమెంట్లన్నీ నిండిపోయి.. క్యూ లైన్ వెలుపలికి భక్తులు వచ్చారు. శ్రీవారి సర్వ దర్శనానికి 36 గంటల సమయం పడుతోంది. ఆదివారం తిరుమల శ్రీవారిని దర్శించుకున్న 92,328 మంది భక్తులు దర్శించుకుని మొక్కులు చెల్లించుకున్నారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.36 కోట్లు వచ్చినట్టు తిరుమల తిరుపతి దేవస్థానం తెలిపింది. 52,969 మంది భక్తులు స్వామివారికి తలనీలాలు సమర్పించారు.
*రిజిస్ర్టేషన్‌ అండ్‌ స్టాంప్స్‌ విభాగం సబ్‌ రిజిస్ర్టార్ల అసోసియేషన్‌ రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలను విశాఖపట్నం ఆంధ్ర విశ్వవిద్యాలయం కన్వెన్షన్‌ సెంటర్‌లో ఆదివారం నిర్వహించారు. అధ్యక్షుడిగా గుంటూరు జిల్లా నల్లపాడు సబ్‌ రిజిస్ర్టార్‌ ఎ.గోపాల్‌, ప్రధాన కార్యదర్శిగా విజయవాడ గుణదల సబ్‌ రిజిస్ర్టార్‌ ఎం.కృష్ణప్రసాద్‌, కోశాధికారిగా విశాఖ జిల్లా ఆనందపురం సబ్‌ రిజిస్ర్టార్‌ ఎన్‌.ఆనంద్‌కుమార్‌, ఉపాధ్యక్షుడిగా ఎండీ అజీజుల్లా, ఉప కార్యదర్శిగా డీవీ నారాయణ ఎన్నికయ్యారు.
*కాంగ్రెస్ పార్టీ వీడి చరిత్రహీనులుగా మారొద్దని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి కోరారు. పార్టీ ఫిరాయింపులకు తెలంగాణను కేసీఆర్ ప్రయోగశాలగా మార్చారని విమర్శించారు. మునుగోడులో సర్పంచులు, ఎంపీటీసీలను కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. కోవిడ్ కారణంగా మునుగోడు లో పర్యటించలేకపోతున్నానని, ఈనెల 20వ తేదీ నుంచి మునుగోడు‌లోనే ఉంటానన్నారు. కాంగ్రెస్ కార్యకర్తలు ఎవరు పార్టీ మారొద్దని కోరారు. సంవత్సరం ఓపిక పడితే.. కాంగ్రెస్‌దే అధికారమన్నారు. మునుగోడు ఉప ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ను దిశానిర్దేశం చేస్తుందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు బుద్ధి చెప్పాల్సిన టైం వచ్చింది.
*స్వాతంత్య్ర దినోత్సవం రోజునే ఓ కుటుంబంలో విషాదం నెలకొంది. భారీ వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ముగ్గురు పిల్లలు సహా భార్యాభర్తలు ప్రాణాలు కోల్పోయారు. ఈ విషాద సంఘటన ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్‌ కంకెర్‌ జిల్లాలో సోమవారం జరిగింది. పఖంజోర్‌ ప్రాంతం, ఇర్పానార్‌ గ్రామంలో సోమవారం తెల్లవారుజామున ఈ ప్రమాదం జరిగినట్లు జిల్లా ఎస్పీ శలభ్‌ సిన్హా తెలిపారు. గోడ కూలిపోయిన సమయంలో బాధితులు ఇంట్లో నిద్రిస్తున్నారని వెల్లడించారు.
*ఏపీలోని గుంటూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఆగిఉన్న లారీని కారు ఢీకొన్న ఘటనలో ముగ్గురు మృతి చెందారు. విజయవాడ నుంచి చిలకలూరిపేటకు వెళ్తుండగా ప్రత్తిపాడు మండలం తుమ్మలపాలెం వద్ద కారు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదంలో మరొకరు తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతులు ఎవరనేది వివరాలను సేకరిస్తున్నారు.
*భార‌త్ 76వ స్వాతంత్య్ర దినోత్స‌వాన్ని ఇవాళ జ‌రుపుకుంటున్న విష‌యం తెలిసిందే. ఈ నేప‌థ్యంలో ర‌ష్యా అధ్య‌క్షుడు వ్లాదిమిర్ పుతిన్ కంగ్రాట్స్ తెలిపారు. రాష్ట్ర‌ప‌తి ముర్ము, ప్ర‌ధాని మోదీని ఉద్దేశిస్తూ ఆయ‌న ఒక ప్ర‌క‌ట‌న జారీ చేశారు. భార‌త్‌, ర‌ష్యా మ‌ధ్య బంధం ప్ర‌త్యేక‌మైంద‌ని, త‌మ మ‌ధ్య వ్యూహాత్మ‌క భాగ‌స్వామ్యం ఉన్న‌ట్లు ఆయ‌న తెలిపారు. ఆర్థిక‌, సామాజిక‌, సాంకేతిక రంగాల్లో భార‌త్ ఎంతో అభివృద్ధి సాధించింద‌ని, ప్ర‌పంచ స్థాయిలో భార‌త్ నిలిచింద‌ని, అంత‌ర్జాతీయ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డంలో భార‌త్ కీల‌క పాత్ర పోషిస్తోంద‌ని పుతిన్ తెలిపారు.
* రిల‌య‌న్స్ సంస్థ ఓన‌ర్ ముఖేశ్ అంబానీకి బెదిరింపు ఫోన్ కాల్స్ వ‌స్తున్నాయి. ఆ కేసులో ఒక‌ర్ని అరెస్టు చేశారు. చంపేస్తామంటూ ఫోన్స్ చేస్తున్నార‌ని ఇవాళ ముంబై పోలీసుల‌కు రిల‌య‌న్స్ ఫౌండేష‌న్ హాస్పిట‌ల్ ఫిర్యాదు న‌మోదు చేసింది. ముఖేశ్ అంబానీతో పాటు ఆయ‌న ఫ్యామిలీని హ‌త‌మారుస్తామంటూ బెదిరింపు కాల్స్ వ‌చ్చిన‌ట్లు తెలిపారు. రిల‌య‌న్స్ హాస్పిట‌ల్‌కు మూడుసార్లు ఆ కాల్స్ వ‌చ్చాయ‌ని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేప‌థ్యంలో ముంబై పోలీసులు కేసు బుక్ చేశారు. ద‌ర్యాప్తును ప్రారంభించారు. ఈ కేసులో ఓ వ్య‌క్తిని అరెస్టు చేశారు. ఆ వ్య‌క్తిని అఫ్జ‌ల్‌గా గుర్తించారు. అత‌నే బెదిరింపు కాల్స్ చేసిన‌ట్లు భావిస్తున్నారు.