NRI-NRT

అక్కడ చదవాలంటే వీసా ఒక్కటే ఉంటే సరిపోదు!

అక్కడ చదవాలంటే వీసా ఒక్కటే ఉంటే సరిపోదు!

విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించాలని.. మంచి ఉద్యోగం సంపాదించి అక్కడే స్థిరపడాలని భారతీయ విద్యార్థులు కలలు కంటూ ఉంటారు. అగ్రరాజ్యం అమెరికా తర్వాత చాలా మంది కెనడాలోని విద్యాలయాల్లో ప్రవేశం పొందేందకు ఆసక్తి చూపిస్తారు. ఈ క్రమంలోనే స్టూడెంట్ వీసాల కోసం దరఖాస్తు చేసుకుంటూ ఉంటారు. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. స్టూడెంట్ వీసా పొందిన వారందరూ కెనడాలో తరగతులకు హాజరు కాలేరు. అంతేకాదు స్టూడెంట్ వీసా విద్యార్థులు అక్కడ నివసించేందుకు అవకాశం కల్పించదు. వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా ఇది నిజం. కెనడా స్టూడెంట్ వీసాకు సంబంధించిన పూర్తి వివరాలను ఓసారి పరిశీలిస్తే..

సాధారణంగా అమెరికా , ఆస్ట్రేలియా , యూకే వంటి దేశాల స్టడీ వీసా లు పొందిన తర్వాత విద్యార్థులు.. ఆయా దేశాలకు వెళ్లి, వారికి సీటు లభించిన విద్యా సంస్థల్లో చేరి తరగతులకు హాజరుకావొచ్చు. కానీ ఇతర దేశాల స్టూడెంట్ వీసాలతో పోల్చినప్పుడు.. కెనడా స్టూడెంట్ వీసా భిన్నంగా ఉంటుంది. ఇది విద్యార్థులు ఆ దేశంలోకి వెళ్లడానికి కేవలం ఎంట్రీ పాస్‌లా మాత్రమే ఉపయోగపడుతుంది. ఈ వీసాపై తరగతులకు హాజరుకావడానికి, అక్కడ నివసించడానికి వీలులేదు. మరి విద్యార్థులు తరగతులకు హాజరుకావలన్నా.. అక్కడ నివాసించాలన్నా ఏం చేయాల్సి ఉంటుందని ఆలోచిస్తున్నారా? అక్కడికే వస్తున్నా.. కెనడా లోని విద్యా సంస్థల్లో ప్రవేశం పొందిన ఏ విదేశీ విద్యార్థి అయినా.. కెనడాలో నివసించాలన్నా.. ప్రవేశం పొందిన కాలేజీలో తరగతులకు హాజరుకావాలన్నా.. స్టూడెంట్ వీసాతోపాటు స్టడీ పర్మిట్‌ ను కలిగి ఉండాలి.

స్టడీ పర్మిట్ కోసం విద్యార్థులు అప్లికేషన్ చేసుకోవాల్సి ఉంటుంది. ఏ కోర్సు చదవాలనుకుంటున్నావ్, ఎందుకు కెనడాలోనే ఆ కోర్సు పూర్తి చేయాలనుకుంటన్నావు, ఆ కోర్సు చదవాలనుకోవడానికి గల కారణలు, కోర్సు కాలపరిమితి, ఉద్యోగ పరిమితులు వంటి వివరాలను దరఖాస్తులో పేర్కొనాల్సి ఉంటుంది. స్టడీ పర్మిట్‌కు ఆమోదం లభించిన తర్వాత ప్రత్యేకంగా స్టూడెంట్ వీసా కోసం దరఖాస్తు చేసుకోవాల్సిన అవసరం లేదు. విజిటర్, ఎలక్ట్రానిక్ ట్రావెల్ ఆథరైజేషన్ ద్వారా కెనడాలో అడుగుపెట్టొచ్చు. ఇలా అక్కడకు వెళ్లిన తర్వాత స్టూడెంట్ డైరెక్ట్ స్ట్రీమ్ (ఎస్‌డీఎస్), నాన్ ఎస్‌డీఎస్ కెటగిరీల ద్వారా స్టూడెంట్ వీసా కోసం అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అయితే కెనడా స్టూడెంట్ వీసాకు సంబంధించిన ముఖ్య విషయం ఏంటంటే.. స్టూడెంట్ వీసా పొందిన విద్యార్థి.. తన భార్య/భర్తను లేదా డిపెండెంట్ చిల్డ్రన్‌ను తనతోపాటు కెనడాకు తీసుకెళ్లొచ్చు. కోర్సు గడువు కాలంలో భర్త/భార్య అక్కడ పని చేసుకోవడానికి వర్క్ పర్మిట్‌ను కూడా పొందొచ్చు. భార్య/భర్త అక్కడ చదువుకోవాలంటే మాత్రం తప్పనిసరిగా వేరొక స్టడీ వీసాను పొందాల్సి ఉంటుంది.