Devotional

శబరిమలకు పోటెత్తిన భక్తులు- TNI ఆధ్యాత్మికం

శబరిమలకు పోటెత్తిన భక్తులు- TNI  ఆధ్యాత్మికం

1..మలయాళ నూతన సంవత్సరాది.. చింగమ్ నెల ప్రారంభం సందర్భంగా ప్రఖ్యాత పుణ్యక్షేత్రమైన శబరిమలలోని అయ్యప్పస్వామి ఆలయానికి బుధవారం భారీగా భక్తులు తరలివచ్చారు. ఉదయానికే వేల సంఖ్యలో భక్తులు శబరిమల కొండపైకి చేరుకున్నారు. అయ్యప్ప స్వామి శరణుఘోషతో భక్తుల పారవశ్యం మధ్య ప్రధాన పూజారి ఎన్.పరమేశ్వరన్ నంబూద్రి గర్భగుడి తలుపులు తెరిచారు. దీపాలు వెలిగించి.. స్వామివారికి పూజలు నిర్వహించారు. ప్రత్యేక ‘లక్షార్చన’ పూజలు జరిపినట్లు ట్రావెన్కోర్ దేవస్థానం బోర్డు తెలిపింది. ఈమేరకు ఐదు రోజుల పాటు ( ఆగస్టు 21 వరకు ) దేవాలయాన్ని తెరిచి ఉంచుతారు. అనంతరం ఓనమ్ సందర్భంగా సెప్టెంబరు 6 న మళ్లీ ఆలయాన్ని తెరిచి .. 10వ తేదీన మూసివేస్తారని దేవస్థానం తెలిపింది. స్వామివారిని దర్శించుకోవాలనుకునే భక్తులు ముందస్తుగా పేర్లు నమోదు చేసుకోవాలని కోరింది.

2. టీటీడీ ఫొటో ఎగ్జిబిషన్ ను ప్రారంభించిన ఈవో
నెల్లూరులోని శ్రీ వేంకటేశ్వర వైభవోత్సవాల్లో టీటీడీ ప్రజా సంబంధాల విభాగం ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ ను టీటీడీఈవో ఎవి.ధర్మారెడ్డి, రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు పబ్లికేషన్ స్టాల్, పంచగవ్య ఉత్పత్తుల స్టాళ్లను, గోపూజ జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించారు. ఫొటో ఎగ్జిబిషన్లో గోవు మహత్యం, గోపూజ విశిష్టత, సప్తగోప్రదక్షిణశాల, గోసంరక్షణశాలలో దేశవాళీ ఆవుల పెంపకంపై ప్రదర్శించిన ఫొటోలను పరిశీలించారు.గో ఆధారిత వ్యవసాయ ఉత్పత్తులతో శ్రీవారికి నైవేద్యం, గత ఐదు దశాబ్దాల్లో శ్రీవారి దర్శనానికి పెరుగుతున్న భక్తుల సంఖ్య, శ్రీవారి సేవ, నవనీత సేవ, విద్యుత్ కార్లు, లడ్డూ ప్రసాదం, పవిత్ర ఉద్యానవనాలు, అగరబత్తు ల తయారీ, పంచగవ్య ఉత్పత్తుల తయారీ, శ్రీవారి పుష్ప ప్రసాదం ఫొటో ఫ్రేమ్స్ తదితరాల ఫ్లెక్సీలు పరిశీ లించారు . శ్రీవారి వైభవాన్ని తెలిపేలా ముద్రించిన ఆధ్యాత్మిక పుస్తకాలను టీటీడీ పుస్తక విక్రయశాలలో అందుబాటులో ఉంచారు.‘నమామి గోవింద’ పేరుతో విడుదల చేసిన పంచగవ్య ఉత్పత్తులు, డ్రైఫ్లవర్ టెక్నాలజీతో తయారు చేసిన ఫొటో ఫ్రేమ్స్ భక్తులకు విక్రయించేందుకు అందుబాటులో ఉంచారు. అనంతరం నమూనా ఆలయంలో నిర్వహించిన శ్రీవారి సహస్రదీపాలంకరణ సేవలో ఈవో పాల్గొన్నారు.

3. తిరుమలలో మంత్రి రోజా హంగామా.. అనుచరులకు వీఐపీ దర్శనం
తిరుమలలో స్వామివారి చెంత ఆంధ్రప్రదేశ్‌కు చెందిన పలువురు మంత్రులు వ్యవహరిస్తున్న తీరుపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీటీడీ నిబంధనలు కాదని ,తాము మంత్రులమని, తాము చెప్పిందే వేదమనే భావనతో ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. ఇవాళ ఏపీ క్రీడలు, టూరిజం శాఖ మంత్రి రోజా మరోసారి తిరుమల ఆలయంలో అనుచరులతో కలిసి హంగామా చేశారు.వరుస సెలవుల కారణంగా సామాన్య భక్తులకు స్వామివారి దర్శనం కోసం టీటీడీ పాలకవర్గం ఈనెల 21 వరకు అన్ని బ్రేక్‌ దర్శనాలను రద్దు చేసింది. వీఐపీల సిఫార్సులను, దర్శనాలను రద్దు చేసింది. ఈ నిబంధనలను పక్కను పెట్టిన మంత్రి రోజా అధికారులపై ఒత్తిడిలు చేసి 50 మంది అనుచరులకు చేసి బ్రేక్‌ దర్శనం కల్పించింది. దీంతో దాదాపు గంటకు పైగా భక్తులు ఇబ్బందులు పడ్డారు.ఆమె మూడు రోజుల్లో రెండుసార్లు వీఐపీ దర్శనం చేసుకోవడంతో భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇటీవల మరో ఏపీ మంత్రి మంత్రి ఉషా శ్రీచరణ్‌ కూడా ఇదేరీతిన వ్యవహరించిన విషయం తెలిసిందే.